Crop rotation
-
రైతు లాభాలకు పంట మార్పిడి ఊతం!
వ్యవసాయం ఆశల జూదమంటారు. సకాలంలో వానలు కురవకపోవడం మొదలుకొని వాతావరణ మార్పులు, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత.. ఇలా రకరకాల కారణాలు రైతును దెబ్బతీయవచ్చు. అయితే ఇవేవీ రైతు నియంత్రణలో ఉన్న అంశాలు కావు. కానీ.. రైతులు తమ చేతుల్లో ఉన్నవీ సక్రమంగా చేసుకోకపోవడంతో కూడా నష్టపోతున్నాడని అంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ జి.పద్మజ. పైగా ఈ విషయం గురించి తెలియని వారు ఉండరని, ఆచరణలో పెట్టకపోవడం వల్ల రైతులు కనీసం 25 శాతం పంట దిగుబడిని నష్టపోతున్నాడని చెబుతున్నారు. ఏంటా విషయం. దిగుబడి నాలుగో వంతు పెరిగే మార్గమేది? ఒక్క ముక్కలో చెప్పాలంటే... పంట మార్పిడి!అంతేనా అని అనుకోకండి.. రైతు ఆదాయాన్ని పెంచుకునేందుకు పంట మార్పిడి అద్భుతమైన సాధనం. పైగా రసాయనిక ఎరువుల ధాటికి నానాటికీ తీసికట్టుగా మారుతున్న నేల సారానికి టానిక్గానూ పనిచేస్తుంది ఇది. దురదృష్టం ఏమిటంటే.. ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ మన మన రైతన్నలు పంట మార్పిడిని సీరియస్‌గా తీసుకోవడం లేదని అంటున్నారు డాక్టర్ జి.పద్మజ. ఈ నేపథ్యంలో అసలు పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను ఇంకోసారి తరచి చూద్దాం...భూసారం, దిగుబడులు పెరుగుతాయి..వరి, మొక్కజొన్న, పత్తి వంటి వాణిజ్య పంటలు మట్టిలోని పోషకాలను తగ్గిస్తూంటాయి. దీనివల్ల ఏటికేడాదీ దిగుబడి కూడా తగ్గుతూంటుంది. అయితే.. పంటలను మార్చి మార్చి వేసుకోవడం అది కూడా మట్టిలో నత్రజనిని చేర్చగల వాటిని వేసుకోవడం ద్వారా పోషకాలను మళ్లీ భర్తీ చేసుకోవచ్చు. తద్వారా నేల సారం పెరుగుతుంది. దిగుబడులు కూడా ఎక్కువవుతాయి. ఉదాహరణకు.. వేరుశనగ, పప్పుధాన్యాల పంటలు మట్టిలో నత్రజనిని పెంచుతాయి. ఫలితంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు నేల నుంచే తగినంత నత్రజని అందుతుంది. కృత్రిమంగా అందించాల్సిన అవసరం తగ్గుతుంది కూడా. పంట మార్పిడి చేసుకోవడం వల్ల దిగుబడి సుమారు 25 శాతం వరకూ పెరుగుతుందని పరిశోధనలు చెబుతూండగా.. వరి, మొక్కజొన్న, కాయధాన్యాల విషయంలో ఈ పెరుగుదల 20 శాతమని ఇప్పటికే స్పష్టమైంది. మార్పిడులు ఇలా...వరి వేసిన తరువాత మినుములు లేదా నువ్వుల్లాంటి నూనెగింజల సాగు చేయడం మేలు. దీనివల్ల నేలలో నత్రజని మోతాదు పెరగడమే కాకుండా.. చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. మొక్కజొన్న పంటను వేరుశనగ లేదా కాయగూర పంటలతో మార్పిడి చేసుకోవడం మేలు. ఒకవేళ ప్రధాన పంటగా వేరు శనగ వేస్తూంటే.. తరువాతి పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. ఇది నేలలో సేంద్రీయ పదార్థం మోతాదులను కూడా పెంచుతుంది. పత్తి పంటకు మార్పిడిగా పెసలు వేస్తే చీడపీడల బెడద తగ్గుతుంది. నేలలో నత్రజని మోతాదు ఎక్కువ అవుతుంది. ప్రధాన పంటల సాగు తరువాత కాయధాన్యాలను సాగు చేయడం.. వ్యర్థాలను మళ్లీ నేలలో కలిపేస్తే మేలు కలిగించే సూక్ష్మజీవులు కూడా ఎక్కువవుతాయి. వేర్వేరు పంటల సాగు వల్ల రైతు ఆదాయమూ పెరుగుతుంది. రైతుకు ఎంతవరకూ లాభం...?పంట మార్పిడిని తగు విధంగా అమలు చేస్తే రైతు ఆదాయం 15 నుంచి 20 శాతం ఎక్కువ అవుతుంది. ఒక సంవత్సరంలో వేర్వేరు పంటలు సాగు చేస్తారు కాబట్టి మార్కెట్ రిస్క్ తక్కువ అవుతుంది. పైగా ఎక్కువ డిమాండ్ ఉన్న, ఆదాయం అందించే కూరగాయల్లాంటివి సాగు చేసుకునే వీలేర్పడుతుంది. పైగా పంట మార్పిడి వల్ల నేలలో నత్రజని మోతాదు ఎక్కువై ఇన్పుట్ ఖర్చులు 10 - 15 శాతం వరకూ తగ్గుతాయి. అంటే రసాయన ఎరువులు, క్రిమి, కీటకనాశినుల వాడకం తగ్గుతుందని అర్థం. పంటలు మార్చి మార్చి సాగు చేయడం వల్ల చీడపీడలకు అవకాశాలూ తగ్గుతాయి. ఒకే రకమైన పంట సాగు చేస్తూంటే చీడపీడలు కూడా వాటికి అలవాటు పడిపోతాయి కాబట్టి సమస్య ఎక్కువవుతుంది. ఉదాహరణకు వరికి సోకే కాండం తొలుచు పురుగు కాయధాన్యాల మొక్కలపై జీవించలేదు. వరి తరువాత ఈ కాయధాన్యాల సాగు చేస్తే సహజసిద్ధంగా చీడపీడల సమస్య తగ్గిపోతుంది. దేశంలో వ్యవసాయంపైనే ఆధారపడిన అరవైశాతం గ్రామీణుల జీవనోపాధి అవకాశాలను పెంచేందుకు, ఆహార భద్రతకు పంట మార్పిడి అన్నది ఎంతో ఉపయోగపడుతుంది. భూసారం, దిగుబడులు పెంచే పంటమార్పిడి గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమయ్యేందుకు తద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు కారణమవుతుంది. ఆసక్తి లేదు ఎందుకు?తెలుగు రాష్ట్రాల్లో రైతులు పంటమార్పిడిపై అంతగా ఆసక్తి చూపకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. మొదటిది పంట మార్పిడి వల్ల వచ్చే ప్రయోజనాలపై అవగాహన లేకపోవడమైతే.. రెండోది పంట మార్పిడి ప్రయోజనాలపై తగిన ప్రచారం లేకపోవడం. వ్యవసాయ, హార్టికల్చర్ విస్తరణాధికారులు ఇతర బాధ్యతలు నిర్వర్తించరావడం వల్ల వారు రైతులకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు. ఇక మూడో కారణం మార్కెట్, ఆర్థిక పరిమితులు. పంటల మార్పిడి వల్ల వేర్వేరు పంటల విత్తనాలు, ఎరువులు, కొన్నిసార్లు వ్యవసాయ పరికరాల అవసరమూ ఏర్పడుతుంది. ఇవి రైతులపై కొంత ఆర్థిక భారం మోపే అవకాశం ఉంటుంది. పైగా అన్ని రకాల పంటలకు మద్దతు ధర లభించని నేపథ్యంలో రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపడం లేదు. చివరగా.. ఒకే రకమైన పంటలు వేయడం (మోనోక్రాపింగ్) అనే సంప్రదాయానికి రైతులు గుడ్ బై చెప్పాలి. రిస్క్ తక్కువన్న అంచనాతో అప్పటివరకూ ఇతరులు పాటిస్తున్న పద్ధతులను గుడ్డిగా అనుసరించడం వల్ల పంట మార్పిడికి ధైర్యం చేయలేకపోతున్నారు. గ్రామస్థులంతా మూకుమ్మడిగా పంట మార్పిడి తీర్మానం చేసుకుని ఆచరిస్తే బహుళ ప్రయోజనాలు కలుగుతాయి.చేయాల్సింది ఇది...రైతులందరూ పంట మార్పిడిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది. అలాగే పైలెట్ ప్రోగ్రామ్‌తోపాటు డెమాన్స్ట్రేషన్ల ద్వారా వ్యవసాయ అధికారులు పంట మార్పిడి లాభాలు రైతుకు అర్థమయ్యేలా వివరించాలి. సీజన్‌ను బట్టి మారిపోయే పంటలకు తగ్గట్టుగా నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాయధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు నూనెగింజల పంటల విత్తనాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా.. మద్దతు ధరలు దక్కేలా చూడటం. మార్కెట్ ఒడిదుడుకులను వీలైనంత మేరకు తగ్గించడం ద్వారా రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపేలా చేయాలి. చివరగా..విధానపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా పంటల మార్పిడి అనేది దేశంలో లక్షలాది రైతు కుటుంబాల ఆదాయాన్ని పెంచే, ఆహార భద్రత కల్పించే సాధనంగా మారుతుంది!తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి పంటల సాగు ఎక్కువ. ఒక్క తెలంగాణలోనే సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి పండిస్తూండగా వార్షిక దిగుబడి కోటీ అరవై లక్షల టన్నుల వరకూ ఉంది. అలాగే తెలంగాణలో మొక్కజొన్న సాగు 28 లక్షల ఎకరాల్లోనూ, వేరుశనగ దాదాపు అరవై వేల ఎకరాల్లోనూ సాగులో ఉంది. రైతులందరూ పంట మార్పిడి చేపట్టడం ద్వారా దిగుబడులు పెరగడంతోపాటు సాగునీటిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. -
మద్దతు ధరతోనే వైవిధ్యం సాధ్యం
అవసరానికి మించి ఎరువులను వాడడం వల్ల నేలలోని పోషకాలు క్షీణిస్తున్నాయి. వృద్ధులైన వాళ్లు ప్రమాదకరమైన స్టెరాయిడ్లపై బతుకుతున్నట్లు ఉందిప్పుడు నేల పరిస్థితి. దేశంలో హరిత విప్లవం మొదలైన రాష్ట్రాల్లో రైతులు పంట మార్పిడి పద్ధతిని వదిలేశారు. ఈ పద్ధతి నేల, నీరు, ఎరువులను సమతుల పద్ధతిలో ఉపయోగించుకునేందుకు ఉద్దేశించినది. దాన్ని వదిలి, వరి లేదా గోధుమ పంటలకే పరిమితమయ్యారు. వైవిధ్యభరితమైన ఇతర పంటలను సాగు చేయకపోతే రసాయన ఎరువులు, నీటిపై మరింత ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితులు వస్తాయి. రైతులు మారాలంటే వారి పంటలకు కనీస మద్దతు ధర లభించాలి. రసాయనిక ఎరువులకు దీటుగా దిగుబడి ఇవ్వగల సమర్థమైన సహజ ఎరువుల ఉత్పత్తికి ప్రాధాన్యమివ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పీఎం–ప్రణామ్ పేరుతో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయం కోసం ప్రత్యామ్నాయ పోషకాల వాడకాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. పర్యావరణానికి హాని కలిగిస్తున్న రసాయన ఎరు వుల స్థానంలో సేంద్రీయ, జీవ సంబంధిత ఎరువులను వాడే మంచి ఉద్దేశంతో మొదలైందీ పథకం. అవసరానికి మించి ఎరువులను వాడటం వల్ల నేలలోని పోషకాలు క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం హరిత విప్లవం మొదలైన పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే తీవ్రంగా ఉండటం గమనార్హం. వృద్ధులైన వాళ్లు ప్రమాదకరమైన స్టెరాయిడ్లపై బతుకుతున్నట్లు ఉందిప్పుడు ఈ రాష్ట్రాల్లోని నేల పరిస్థితి. పని జరుగుతూంటుంది కానీ, నేల డొల్లగా మారిపోతూ ఉంటుంది. నేల సామర్థ్యం, పంట దిగుబడులు క్రమేపీ తగ్గిపోతాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ నేల పరిస్థితి ఇలాగే ఉందనడంలో సందేహం ఏమీ లేదు. ప్రమాదకరమైన రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ, జీవ సంబంధిత ఎరువులను వాడేందుకు ప్రభుత్వం పీఎం–ప్రణామ్ పథకాన్ని ప్రారంభించడం ఆహ్వానిందగ్గ పరిణామమే. కానీ, అమ లుకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. మొదటిది, ఈ పథకానికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం. ప్రస్తుతం రైతులకు అందించే ఎరువుల సబ్సిడీలోంచే ఈ పథకానికి కావాల్సిన మొత్తాలను సర్దుకోవాలి. ఇందుకు తగ్గట్టుగా సహజసిద్ధమైన ఎరువు లను వాడేలా రైతులను ప్రోత్సహించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని కేంద్రం ఆశిస్తోంది. ఇలా మిగిల్చిన ఎరువుల సబ్సిడీ మొత్తంలో యాభై శాతాన్ని కేంద్రం రాష్ట్రాలకు అందివ్వనుంది. ఈ మొత్తాలతో సహజ ఎరువులపై అవగాహన పెంచడం, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేపట్టాలి. రాష్ట్రాలకు ఈ మార్పును సమర్థంగా అమలుచేయగల సత్తా ఉందా? భారీ స్థాయిలో సహజ ఎరువులు వాడేలా చేయగలదా? అలాంటి సూచనలు ఇప్పటికైతే ఏమీ కనిపించలేదు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్’ గత ఏడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం, సహజ ఎరువుల రంగం పూర్తిగా నిరక్ష్యానికి గురైంది. నియంత్రణల్లేవు. అసంఘటితంగా ఉంది. కేంద్రం సహజ ఎరువులను ప్రోత్సహించేందుకు అందిస్తున్న నిధులు చాలావరకూ మురిగిపోతున్నాయి. సహజ ఎరువుల ఉత్పత్తి కూడా తక్కువగా ఉంది. పైగా ఉత్పత్తి అవుతున్న వాటి నాణ్యత కూడా నాసిగా ఉంది. చాలా రాష్ట్రాల్లో తగిన పరిశోధనాశాలలూ లేవు. ప్రాంతీయ స్థాయిలోని ఆర్గానిక్ ఫార్మింగ్ లాబొరేటరీలను కూడా 2019–20 సంవత్సరంలో వాటి సామర్థ్యంలో మూడో వంతు మాత్రమే వినియోగించుకున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. బయో ఫర్టిలైజర్ నమూనాల పరీక్షలు ఏటికేడాదీ పెరగాల్సింది పోయి తగ్గిపోతున్నాయి. 2013–14లో ఏడాదికి 654 నమూనాలు పరీక్షిస్తే, 2019–20లో ఈ సంఖ్య 483కు పడిపోయింది. అదే సమయంలో ఈ పరీక్షలను తట్టుకుని వాడకానికి సిద్ధమైన ఎరువుల శాతం ఒకటి నుంచి 44 శాతం కావడం గమనార్హం. అంటే నకిలీ బయో ఫర్టిలైజర్లు పెరిగిపోయాయన్నమాట. పీఎం – ప్రమాణ్ పథకం మొత్తం రైతులు సహజ ఎరువుల వాడకానికి మొగ్గు చూపుతారన్న అంచనాపై మొదలైంది. లాభాలు లేని పక్షంలో రైతులు వీటి వాడకానికి ఎందుకు మొగ్గు చూపుతారన్న ప్రశ్నకు సమాధానం లేదు. సహజ ఎరువుల వాడకం వల్ల మట్టి ఆరోగ్యం పెరగాలి. సాగు, పంట ఖర్చులు తగ్గాలి. దిగుబడులు పెర గాలి. తద్వారా ఆదాయమూ ఎక్కువ కావాలి. ఇప్పటివరకూ ఒక స్థాయి జీవనశైలిని అలవర్చుకున్న రైతులు ఇప్పుడు తక్కువ ఆదాయం, దిగుబడి వస్తుందంటే సహజ ఎరువులవైపు మళ్లే అవకాశా లుండవు. అందుకే ప్రభుత్వం సహజ ఎరువుల లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. ఉత్పత్తి, సరఫరాల సామర్థ్యాలను కూడా పెంచు కోవాలి. రసాయనిక ఎరువులకు దీటుగా దిగుబడి ఇవ్వగల సమర్థ మైన, నాణ్యమైన సహజ ఎరువుల ఉత్పత్తికి ప్రాధాన్యమివ్వాలి. ఇవన్నీ చేసినప్పటికీ నేల సారాన్ని పెంచేందుకు, పునరుజ్జీవింప చేసేందుకు పీఎం – ప్రణామ్ సరిపోదు. ఎందుకంటే దేశంలో మట్టి సారం అంతగా దిగజారిపోయింది. రసాయనిక ఎరువుల వాడకంతో పాటు, అతిగా సాగు చేయడమూ దీనికి కారణం. దేశంలో హరిత విప్లవం మొదలైన రాష్ట్రాల్లో రైతులు పంట మార్పిడి పద్ధతిని ఎప్పుడో వదిలేశారు. ఈ పంట మార్పిడి పద్ధతి నేల, నీరు, ఎరువులను సమతుల పద్ధతిలో ఉపయోగించుకునేందుకు ఉద్దేశించినది. దాన్ని వదిలే సుకుని వరి లేదా గోధుమ పంటలకు మాత్రమే పరిమితమయ్యారు! అప్పట్లో ప్రభుత్వానికి ఈ రెండు ధాన్యాల అవసరం ఎక్కువగా ఉండింది కాబట్టి ఆ పంటలు ఎక్కువ పండించేలా రైతులను ప్రోత్సహించింది. మొక్కజొన్న, చిరుధాన్యాలతో పోలిస్తే ఈ రెండు పంటలకూ నీటి అవసరం చాలా ఎక్కువ. వరి, గోధుమలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమంటే నదీ, భూగర్భ జలాలను అతిగా వాడుకోవడమే. దీనివల్ల నీటి లవణత కూడా పెరిగి పోషకాలు తగ్గి పోతాయి. అంటే ఈ సమస్య మూలం వరి, గోధుమల సాగులోనే ఉందన్నమాట. నైట్రోజన్ , ఫాస్పరస్, పొటాషియం, సేంద్రీయ కర్బనం, జింక్, ఐరన్ , మాంగనీస్ వంటి పోషకాలన్నీ కూడా తుడిచి పెట్టుకుపోతున్నాయి. రైతులు వరి, గోధుమ పంటల సాగును తగ్గించుకుని వైవిధ్యభరితమైన ఇతర పంటలను సాగు చేయకపోతే రసాయన ఎరువులు, నీటిపై వారు మరింత ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితులు వస్తాయి. రైతులు మారాలంటే వారి పంటలకు కనీస మద్దతు ధర లభించాలి. ఏడు రకాల ధాన్యాలు, ఐదు పప్పులు, ఏడు నూనె గింజలు, నాలుగు వాణిజ్యం పంటలకు కేంద్రం ఏటా కనీస ధరను నిర్ణయిస్తూంటుంది. ఈ పంటలన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేయనవసరం లేనప్పటికీ వాటికి కనీస మద్దతు ధరను నిర్ణయించడం అవసరం. హరియాణాలో ఇటీవల పొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు ఆందోళనకు దిగారు. కేంద్రం క్వింటాల్‌కు రూ.6,400 కనీస మద్దతు ధర నిర్ణయించినా, ప్రైవేట్ వ్యాపారులు రూ.4,200కు మించి చెల్లించడం లేదన్నది రైతుల ఆరోపణ. ఇంకోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలు కొనుగోలు చేయడం నిలిపివేసింది. ఈ విషయమై రైతులు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర ప్రభుత్వం పొద్దుతిరుగుడు పంటను క్వింటాల్‌కు రూ.4,800 ధర చెల్లించేందుకు ఒప్పుకుంది. కనీస మద్దతు ధరకు, ఈ మొత్తానికి ఉన్న తేడాను తగ్గించేందుకు ప్రతి క్వింటాల్‌కు అదనంగా ఇంకో వెయ్యి రూపాయలు చెల్లించేందుకు సరేనంది. అయినప్పటికీ ఈ మొత్తం కనీస మద్దతు ధర కంటే ఆరు వందల రూపాయలు తక్కువగా ఉండటం గమనార్హం. రైతులు దీనికీ ఒప్పుకోకుండా చండీగఢ్ –ఢిల్లీ రోడ్డుపై ధర్నాకు దిగారు. ఆఖరుకు ప్రభుత్వం ధర ఇంకో రెండు వందల రూపాయలు పెంచింది. ఈ విషయంలో రైతులను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వారు తమ పొలాల్లో వేర్వేరు పంటలు వేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. పొద్దు తిరుగుడు పంటనే తీసుకుంటే, 2018–19లో కేవలం 9,440 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతూండగా, 2020–21కి ఇది 12,290 హెక్టా ర్లకు పెరిగింది. ఆ తరువాతి సంవత్సరం 13,020 హెక్టార్లకు, 2022– 23 నాటికి 14,160 హెక్టార్లకు పెరగడం గమనార్హం. ప్రభుత్వం కనీస మద్దతు ధరను రైతులకు ఆకర్షణీయంగా ప్రకటించగలిగితే పొద్దుతిరు గుడు సాగు మరింత ఎక్కువగా జరిగేందుకు అవకాశముంది. అలాగే మొక్కజొన్న, చిరుధాన్యాల సాగు కూడా ఊపందుకుంటుంది. అరుణ్ సిన్హా వ్యాసకర్త ‘ఎగైనెస్ట్ ద ఫ్యూ: స్ట్రగుల్స్ ఆఫ్ ఇండియాస్ రూరల్పూర్’ గ్రంథ రచయిత (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
200 ఏళ్ల క్రితమే మారు పంటలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండొందల ఏళ్ల కిందటే రైతులు అద్భుతంగా ప్రత్యామ్నాయ పంటల పద్ధతి పాటించారు. భూసారాన్ని పరిరక్షించుకునేందుకు పంట మార్పిడి విధానం అనుసరించారు. నీరు పొదుపుగా వాడుకునే ప్రాంతాల్లో ఈ ప్రత్యామ్నాయ పంటలకు మరింత ప్రాధాన్యమిచ్చారు. అప్పట్లో 8 నాగళ్లుంటే మోతుబరి రైతు అనేవారు. ఆ కాలంలో అదో స్టేటస్ సింబల్. ఆ సమయంలో మణుగు వరి విత్తనాల సాగుకు రూ.6 ఖర్చయ్యేది. అప్పట్లో వ్యవసాయంలో మార్పులు జరుగుతున్న తీరుపై అధ్యయనం చేసిన బ్రిటిష్ పరిశోధకుడు డాక్టర్ ఎ. వాకర్ వివరించారు. ‘స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆన్ సర్కార్ ఆఫ్ వరంగల్’ పేరుతో మద్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్ మేగజైన్లో ఇవన్నీ ప్రచురితమయ్యాయి. దీన్ని పుదుచ్చేరి–కంచి–మామునివర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీజీ స్టడీస్ అండ్ రీసెర్చ్ హిస్టరీ విభాగాధిపతి రామచంద్రారెడ్డి సేకరించి భద్రపరిచారు. నీరున్నా.. లేకున్నా.. తెలంగాణ ప్రాంతంలో వరే ప్రధాన పంట. నీటి లభ్యత బాగున్న ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా వరి సాగుకు మొగ్గు చూపేవారు. అయినా అటు వరి వేస్తూనే తదుపరి కాలానికి భూసారాన్ని పరిరక్షించుకునేందుకు పంట మార్పిడి విధానాన్ని అనుసరించారని బ్రిటిష్ పరిశోధకుడి అధ్యయనంలో తేలింది. తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో అటు వానలు, ఇటు చెరువులే ప్రధాన నీటి వనరు. ఫలితంగా నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలకు మరింత ప్రాధాన్యం ఉండేది. రెండు శతాబ్దాల క్రితమే ఈ తీరు కనిపించింది. వరి సాగులో ఇబ్బందులు, పరిమితుల వల్ల కూడా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించటం విశేషం. వెరసి ఇటు వరి, అటు ఇతర ప్రత్యామ్నాయ పంటలు కలిసి ఈ ప్రాంత పంట సాగులో ప్రత్యేకత తీసుకొచ్చాయి. పంట మార్పిడి ఇలా.. రాష్ట్రంలో రకరకాల స్వభావాలున్న నేలలున్నాయి. వీటి సారాన్ని కాపాడుకునే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో పంట మార్పిడి విధానం అనుసరించారు. నీటి లభ్యత కూడా దీనికి మరో ప్రధాన కారణమైంది. ఎర్ర నేలల్లో మొదటి సంవత్సరం పచ్చ జొన్నలు వేసేవారు. రెండో సంవత్సరం ఆముదం, పెసర, పత్తి పండించేవారు. మూడో సంవత్సరం పచ్చ జొన్నలు లేదా ఇతర చిరు ధాన్యాలు సాగు చేసేవారు. ఆ తర్వాతి కాలంలో మళ్లీ ఈ సైకిల్ మొదలు. ఇలా ఏడెనిమిదేళ్లు కొనసాగించేవారు. ఇక నల్ల నేలల్లో తొలి సంవత్సరం రబీ పంటగా తెల్ల జొన్నలు లేదా నల్ల పెసర్లు వేసేవారు. రెండో ఏడాది పునాస పంటగా చిరు ధాన్యాలు, పచ్చ జొన్న పండించేవారు. మూడో సంవత్సరం రబీలో ఆముదం, పెసర్లు, పత్తి సాగు చేసేవారు. నాలుగో ఏడాది పునాసగా పచ్చ, ఎర్ర జొన్న, కందులు లాంటివి వేసేవారు. కమలాపూర్ లాంటి కొన్ని ప్రాంతాల్లో తమలపాకు, బెల్లంకొండ ప్రాంతంలో చెరుకు బాగా సాగయ్యేది. ప్రత్యామ్నాయ పంటలుగా పచ్చ, ఎర్ర, తెల్ల, నల్ల జొన్నలు, సజ్జలు, కొర్రలు, బూర సామలు, పొట్ట సామలు, అరికెలు, వరికెలు, గోధుమ, మొక్కజొన్న, పెసర్లు, బొబ్బర్లు, అనుములు, ఉలువలు, కందులు, శనగలు వేసేవారు. రూ.20 మిగిలితే మంచి దిగుబడి నాగళ్ల సంఖ్య ప్రకారం అప్పట్లో రైతు స్థాయిని నిర్ధారించేవారు. 2 నాగళ్లుంటే సాధారణ రైతు అనేవారు. రెండో నాగళిని కూడా సమకూర్చుకోకపోతే పేద రైతుగా పేర్కొనేవారు. 4 నాగళ్లుంటే పెద్ద రైతుగా భావించేవారు. జమీందారులు, దొరలు, పట్వారీలు, పోలీసు, మాలీ పటేళ్లు లాంటి కొందరికి 8 నాగళ్లుండేవి. వీరిని ధనిక రైతులనేవారు. 8 నాగళ్లుండటాన్ని స్టేటస్ సింబల్‌గా భావించేవారు. రెండు జతల నాగళ్లకు రూ.100, జత ఎడ్లు సమకూర్చుకోవాలంటే రూ. 50 ఖర్చయ్యేది. సాగులో రూ.20 మిగిలితే మంచి దిగుబడిగా భావించేవారు. ఈ భరోసా వరి ద్వారానే వచ్చేదని బ్రిటిష్ పరిశోధకుడు పేర్కొన్నారు. రూ.60 నుంచి రూ.80 వస్తే ధనిక రైతుగా గుర్తింపు దక్కేది. ఓ మణుగు (దాదాపు 38 కిలోలు) వరి విత్తనాల సాగు ఖర్చు ఇలా.. ♦మొత్తం వ్యయం రూ.6 ♦ఇందులో విత్తనాల ఖర్చు రూ.2, మహిళా కూలీల వ్యయం 14 అణాలు, నీటిని పెట్టేందుకు ఖర్చు 8 అణాలు, పంట కోత సమయంలో మొత్తం వ్యయం 2 రూపాయల 8 అణాలు, ఇతర ఖర్చులు 2 అణాలు. ♦ఈ పరిమాణంలో సాగు చేస్తే సాధారణ పరిస్థితుల్లో దిగుబడి విలువ 8 రూపాయల 8 అణాలు. అంటే మిగులు 2 రూపాయల 8 అణాలు -
పంట మార్పిడి మంచిదే..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో రబీ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఏటా వేసిన పంటలనే మళ్లీ వేస్తూ నష్టపోతున్నారు. పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడల వ్యాప్తి ఎక్కువై దిగుబడి తగ్గుతోంది. పంట మార్పిడితో ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి.మోహన్‌దాస్ వివరించారు. పంట మార్పిడి అవలంబిస్తే చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. పంట మార్పిడిపై చాలామంది రైతులకు అవగాహన లేదు. ఏళ్ల తరబడిగా వేసిన పంటనే వేస్తూ.. ఒకరిని చూసి మరొకరు పంటలో మార్పు లేకుండా సాగు చేయడం జిల్లాలో అధికంగా కనిపిస్తోంది. ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా వస్తుంది. పంట మార్పు మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి అవుతుంది. చీడపీడలు దూరమవుతాయి. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు. శిలీంధ్ర వ్యాధులను దూరం చేయవచ్చు. బీజాలు, వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. సూచనలు జొన్న పంట సాగు చేసిన పొలంలో మిరప వేయొద్దు. వేరుశనగ సాగు చేసిన తర్వాత మళ్లీ అదే పంట వేసుకోరాదు. దీనివల్ల ఎర్రగొంగళి పురుగు, శనగపచ్చ పురుగు ఆశించివచ్చు. వేరుశనగ తర్వాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు. నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాటా, ఉలువ, మినుము, పెసర పంటలు వేస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి. అందుకు వాటిని పంట మార్పిడి చేయరాదు. జాగ్రత్తలు పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో శనగ, బబ్బెర, మినుము, ఉలువలు, పెసర పంటలు వేయడంతో నేలను కప్పి ఉంచుతాయి. కలుపు మొక్కలను నివారించవచ్చు. లెగ్యూమ్ జాతి(పప్పు దినుసులు) పైర్లను వేయడం వల్ల రైజోబియం బుడిపెలు ఏర్పడుతాయి. ఇవి గాలిలోని నత్రజనిని భూమిలో స్థిరీకరించి నేల సారవంతంగా చేస్తాయి. ఈ జాతి పంటలను పచ్చిరొట్టె ఎరువులుగా వాడుకోవచ్చు. పత్తి పైరును మినుము, పెసర వంటి పంటలతో మార్పిడి చేసకోవడంతో తెల్లదోమ ఉధృతి తగ్గించుకోవచ్చు. వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలు పండించాలి. దీనివల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని తగ్గించవచ్చు. పసుపు తర్వాత వరి, జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి. దీనివల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది. వరిపైరు తర్వాత పప్పుధాన్యాల పైర్లను గానీ, నూనె గింజల పైర్లను గానీ పండించడం వల్ల వరి పంటను ఆశించే టుంగ్రోవైరస్, దోమపోటులను సమర్థంగా నివారించుకోవచ్చు. పెసర గానీ పశుగ్రాసంగా జొన్నగానీ సాగు చేస్తే తర్వాత వేరుశనగ, సోయాబీన్ పంటలు వేసుకోవాలి. రైతులు పాటించాల్సింది.. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి. వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి. బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. -
సోకిందా... గోవిందా!
దొండసాగు లాభాలు తెచ్చిపెడుతోంది. దీంతో రావులపాలెం పరిసర ప్రాంతాల్లో రైతులు ఈ సాగును సుమారు 600 ఎకరాల్లో చేపట్టారు. అయితే విరామం లేకుండా ఈ సాగు చేయడంతో వైరస్ వ్యాపించి పంట మొత్తం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. రూ. లక్షలు పెట్టుబడి పెట్టిన రైతన్నలు ఈ పంటను ఎలా కాపాడుకోవాలోనని ఆందోళన చెందుతున్నాడు. పంట చేతికొచ్చే సమయానికి వైరస్ సోకి, కాయల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని లోలోపల కుమిలిపోతున్నారు. అయితే మార్కెట్లో ధర బాగుందని... విరామం లేకుండా దొండసాగు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఉద్యానశాఖాధికారులు చెబుతున్నారు. ఒక సారి పంట వేసిన తర్వాత పదేపదే అదే పంటను వేస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనికి పంట మార్పిడియే సరైన మందని సూచిస్తున్నారు. దొండసాగులో యాజమాన్యపద్ధతులు, వైరస్ బారిన పడకుండా పంటను ఎలా కాపాడుకోవాలి? తదితర విషయాలను వివరిస్తున్నారు కొత్తపేట ఉద్యానవనశాఖాధికారిణి ఎం.బబిత(83329 90547). ఆ సూచనలు ఆమె మాటల్లోనే... - రావులపాలెం ►దొండసాగును పీడిస్తున్న వైరస్ ►ఒక్కసారి సోకితే చాలు ఆపడం కష్టమే ►దిగుబడిపై తీవ్ర ప్రభావం ►పంట మార్పిడే సరైన మందు అంటున్న ఉద్యానశాఖాధికారులు ఏళ్ల తరబడి ఒకే పొలంలో దొండ సాగు చేస్తే సాగు మొదటిలో వ్యాపించిన వైరస్, ఇతర శిలీంధ్రాలు, ధాతువులు అదే నేలలో ఉండిపోయి బలం పుంజుకుంటాయి. దీంతో అవి తదుపరి పంటపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ వైరస్ తాలూకూ అవశేషాలు నశించడానికి మందులు పెద్దగా పని చేయవు. అందుకే పంటమార్పిడి చేయాలి. దీని వల్ల సాగు సమయంలో దొండపై ప్రభావం చూపే వైరస్, ఇతర శిలీంధ్ర అవశేషాలకు పోషణ అందవు. దొండ సాగుపై ఎరువుల యాజమాన్య పద్ధతులు కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఏడాది పొడవునా దొండసాగు చేపట్టవచ్చు. దొండ విత్తనం చూపుడు వేలు లావు ఉన్న కొమ్మలు నాలుగు కనుపులు ఉన్నవి రెండు చొప్పున ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల లోతులో నాటాలి. నాటే సమయంలో విత్తన శుద్ధికి కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరమ్ ఒకసారి అరగంట విరామం అనంతరం ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ఒకసారి కలిపి శుద్ధి చేయాలి. విత్తే ముందు ఎకరాకు ఆరు - ఎనిమిది టన్నుల పశువుల ఎరువు, 32 - 40 కిలోల భాస్వరం, 16 - 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను గుంటలలో వేయాలి. నత్రజని 32- 40 కిలోలు రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజుల్లో ఒకసారి, పూత పిందె దశలో ఒకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువును వేయకూడదు. ఎరువును వేసిన వెంటనే నీరు పెట్టాలి. కలుపు నివారణకు ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 మీ.లీ 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 24 నుంచి 48 గంటల లోపు పిచికారీ చేయాలి. మొక్కలు రెండు - నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపువ్వులు ఎక్కువగా పూచి పంట దిగుబడి బాగా ఉంటుంది. దొండకు వచ్చే తెగుళ్లు, సస్యరక్షణ చర్యలు ► వైరస్ నివారణకు కచ్చితంగా పంట మార్పిడి చే యాలి. పండు ఈగ(ఫ్రూట్‌ఫ్లై) సమస్యకు మిథైక్యూజనాల్, వెనిగర్, పంచదారద్రవం పది మిల్లీలీటర్లు చొప్పున కలిపి ఎకరానికి పది ఎరలు పెట్టాలి. ►కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి దుక్కిలో వేసుకోవడం వల్ల తెగులు రాకుండా ముందుగా నివారించవచ్చు. ► బూడిద తెగులు నివారణకు డైనోక్యాప్ ఒక మిల్లీలీటరు, ఒక లీటరు నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. నులుపురుగులు ఉన్న చోట కార్భోసల్ఫాన్ మూడు గ్రాము కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ► ఆకుల ఈనెల మధ్య చారలు ఏర్పడి, పెలుసుగా మారి గిడసబారిపోయి పూత, పిందె ఆగిపోతే అది వెర్రి తెగులుగా గుర్తించాలి. ఈ తెగులు సోకిన మొక్కలను నాశనం చేయాలి. ఈ తెగులు వ్యాపిస్తే బరక పురుగులను నివారించడానికి రెండు మిల్లీ లీటర్ల డైమిథాయేట్ లేదా మిథైల్ డెమటాన్ కలిపి పిచికారీ చేయాలి. ► వేరు కుళ్లు తెగులు ఉన్నట్టయితే తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా పండిపోయి ఆకులు వాడిపోతాయి. దీని నివారణకు బొర్డోమిశ్రమం ఒక శాతం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు లీటరు నీటికి మూడు గ్రాముల కలిపి ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిచేలా పోయాలి. దీనిని పది రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు చేయాలి. ► ఆఖరి దుక్కిలో వేపపండి 250 కిలోలు ఎకరాకు వేసి కలియదున్నాలి. పంట వేసిన తరువాత ట్రైకోడెర్మా విరిడి కల్చర్‌ను భూమిలో పాదుల దగ్గర వేయాలి. ► ‘తీగ’ పంటలపై గంధకం సంబంధిత పురుగు, తెగులు మందులు వాడకూడదు. -
పంట మార్పిడిపై రైతుల దృష్టి
యాచారం: ఆలస్యంగా కురిసిన వర్షాల కారణంగా రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించారు. అదునలో వర్షాలు కురిస్తే పత్తి పంట సాగు చేద్దామనుకున్న రైతులు.. దిగుబడి తగ్గుతుందేమోనని ఇతర పంటల సాగుపై అసక్తి చూపుతున్నారు. మండలంలో ఈ ఏడాది 1,500 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేయడానికి రైతులు పొలాలను సిద్ధం చేసుకున్నారు. కానీ అదనులో వర్షాలు కురవకపోవడంతో పంట మార్పిడి వైపు మళ్లారు. ఈసారి పత్తి 400 హెక్టార్ల వరకు కూడ సాగు చేయలేదు. రెండు రోజుల క్రితం ఓ మోస్తరు వర్షాలతో మండలంలోని పలు గ్రామాల్లో రైతులు విత్తనాలు విత్తే పనిలో నిమగ్నమయ్యారు. ఈ రెండు రోజుల్లోనే 700 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న విత్తుకోవడం గమనార్హం. వర్షాలు సకాలంలో కురిసే అవకాశం లేని విషయం పసిగట్టిన వ్యవసాయాధికారులు అవసరమైన మొక్కజొన్న విత్తనాలు నిల్వలు సిద్ధంగా ఉంచారు. మండలంలో ఇప్పటివరకు 13.3 టన్నుల మొక్కజొన్న విత్తనాలు విక్రయించారు. అదనులో కురవని వర్షాల కారణంగా రైతులు మొక్కజొన్న సాగుపై దృష్టి సారిస్తున్న దృష్ట్యా మళ్లీ మూడు టన్నుల విత్తనాలు సిద్ధంగా ఉంచారు. 100 రోజుల్లోనే పంట చేతికి.. ప్రస్తుతం మొక్కజొన్న సాగు చేస్తే వంద రోజుల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉంది. దీంతో అప్పుడప్పుడు కురిసే వర్షాలతోనైనా మొక్కజొన్న పంట పండే అవకాశముంది. కానీ పత్తి పంట ఆలస్యంగా విత్తితే పెట్టుబడులు పెరిగిపోవడమే కాకుండా.. పంటపై చీడపీడలు సోకడంతో పాటు దిగుబడి కూడా గణనీయంగా తగ్గుతుందని రైతుల్లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో వారు మొదట మొక్కజొన్న, రెండో దశలో ఆముదం, కందులు తదితర పంటలపై దృష్టి పెట్టారు. మండలంలో ఇప్పటికే 900 ఎకరాల వరకు మొక్కజొన్న సాగు అయింది. పంటమార్పిడితో రైతులు సాగు విస్తీర్ణం పెంచితే మొక్కజొన్న రెండు వేల ఎకరాలకు పైగా దాటే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఆయా గ్రామాల్లో 400 హెక్టార్లలో ఆముదం, కంది పంటలు సాగు చేశారు. 200 ఎకరాలకు పైగా వరి పంట సాగులో ఉంది. బీపీటీ తూకాలు పోసిన రైతులు సంమృద్ధిగా వర్షాలు కురిస్తే తప్ప కరిగెట్లు దున్ని నాట్లేయలేమని అంటున్నారు. కొన్ని గ్రామాల్లో పత్తి విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుకున్న రైతులు దిగుబడి తగ్గుతుందని తెలిసినా పత్తినే సాగు చేస్తున్నారు. ఈసారి అత్యధికంగా మొక్కజొన్న సాగయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా బీమా సౌకర్యాం కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని కోరుతున్నారు.