ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో రబీ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఏటా వేసిన పంటలనే మళ్లీ వేస్తూ నష్టపోతున్నారు. పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడల వ్యాప్తి ఎక్కువై దిగుబడి తగ్గుతోంది. పంట మార్పిడితో ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి.మోహన్‌దాస్ వివరించారు. పంట మార్పిడి అవలంబిస్తే చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. పంట మార్పిడిపై చాలామంది రైతులకు అవగాహన లేదు.
ఏళ్ల తరబడిగా వేసిన పంటనే వేస్తూ.. ఒకరిని చూసి మరొకరు పంటలో మార్పు లేకుండా సాగు చేయడం జిల్లాలో అధికంగా కనిపిస్తోంది. ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా వస్తుంది. పంట మార్పు మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి అవుతుంది. చీడపీడలు దూరమవుతాయి.
ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు. శిలీంధ్ర వ్యాధులను దూరం చేయవచ్చు. బీజాలు, వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది.
సూచనలు
జొన్న పంట సాగు చేసిన పొలంలో మిరప వేయొద్దు.
వేరుశనగ సాగు చేసిన తర్వాత మళ్లీ అదే పంట వేసుకోరాదు. దీనివల్ల ఎర్రగొంగళి పురుగు, శనగపచ్చ పురుగు ఆశించివచ్చు.
వేరుశనగ తర్వాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు.
నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాటా, ఉలువ, మినుము, పెసర పంటలు వేస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి. అందుకు వాటిని పంట మార్పిడి చేయరాదు.
జాగ్రత్తలు
పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి.
ఇందులో శనగ, బబ్బెర, మినుము, ఉలువలు, పెసర పంటలు వేయడంతో నేలను కప్పి ఉంచుతాయి. కలుపు మొక్కలను నివారించవచ్చు.
లెగ్యూమ్ జాతి(పప్పు దినుసులు) పైర్లను వేయడం వల్ల రైజోబియం బుడిపెలు ఏర్పడుతాయి. ఇవి గాలిలోని నత్రజనిని భూమిలో స్థిరీకరించి నేల సారవంతంగా చేస్తాయి. ఈ జాతి పంటలను పచ్చిరొట్టె ఎరువులుగా వాడుకోవచ్చు.
పత్తి పైరును మినుము, పెసర వంటి పంటలతో మార్పిడి చేసకోవడంతో తెల్లదోమ ఉధృతి తగ్గించుకోవచ్చు.
వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలు పండించాలి. దీనివల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని తగ్గించవచ్చు.
పసుపు తర్వాత వరి, జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి. దీనివల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది.
వరిపైరు తర్వాత పప్పుధాన్యాల పైర్లను గానీ, నూనె గింజల పైర్లను గానీ పండించడం వల్ల వరి పంటను ఆశించే టుంగ్రోవైరస్, దోమపోటులను సమర్థంగా నివారించుకోవచ్చు.
పెసర గానీ పశుగ్రాసంగా జొన్నగానీ సాగు చేస్తే తర్వాత వేరుశనగ, సోయాబీన్ పంటలు వేసుకోవాలి.
రైతులు పాటించాల్సింది..
భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి.
తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి.
వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి.
బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి.
పంట మార్పిడి మంచిదే..
Published Fri, Oct 3 2014 1:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement