Prevention of pests
-
కలబంద ద్రావణంతో పంటలకు మేలు
ప్రకృతి నేర్పిన పాఠాలను ఆకళింపు చేసుకొని ప్రకృతి/సేంద్రియ సేద్యాన్ని ఔపోశన పట్టి, నేర్చుకున్న విషయాలను పదుగురు రైతులకు తెలియజెపుతూ చక్కని దిగుబడులు రాబడుతున్నారు మహిళా రైతు అప్పన్నగారి యశోదమ్మ. కలబంద వంటి అనేక మొక్కల ద్రావణాలతో ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలం చిన్ననర్సుపల్లె గ్రామానికి చెందిన యశోదమ్మ స్వతహాగా రైతు. పెట్టుబడిలేని ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విభాగంలో క్లస్టర్ రిసోర్సు పర్సన్‌గా పనిచేస్తున్నారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, పత్తి, టమాటా, వంగ, బెండ, మిరప, సొర, బీర తదితర కూరగాయ పంటలు, మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటలను ఆశించే పలు రకాల పురుగులు, తెగుళ్ల నివారణకు కలబంద ద్రావణం చక్కటి పరిష్కార మార్గమని ఆమె అనుభవపూర్వకంగా చెబుతున్నారు. కలబంద ద్రావణం తయారీ ఇలా.. 2 కిలోల కలబంద ఆకులను దంచి పెట్టుకోవాలి. అలాగే, పావు కిలో కుంకుడు కాయలను పొడి చేయాలి. 5 లీటర్ల ఆవు మూత్రాన్ని, 5 కిలోల ఆవు పేడను సేకరించాలి. వీటిలో ఆవుపేడ తప్ప మిగతా అన్నిటినీ 200 లీటర్ల నీరుపట్టే డ్రమ్ములో వేసి.. తర్వాత ఎంతపడుతుందో అంత నీరు పోయాలి. ఆవు పేడను ఒక పలుచటి గొనె సంచిలో మూటకట్టి నీళ్ల డ్రమ్ములో వేలాడదీయాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద కర్రతో కలియతిప్పాలి. వారం రోజులకు బాగా మురిగితే కలబంద ద్రావణం తయారవుతుంది. ద్రావణం పిచికారీ చేసే సమయంలో 20 లీటర్ల పిచికారీ డ్రమ్ములో 200 మిల్లీ లీటర్ల ద్రావణంతోపాటు 150 గ్రాముల పసుపు పొడి, 150 గ్రాముల రాళ్ల సున్నం వేసి మిగిలిన భాగం నీరు పోసుకొని.. పంట లేత ౖపైరు నుంచి మొగ్గ దశ వరకు ఏ పంటపై అయినా పిచికారీ చేసుకోవచ్చు. పూత సమయంలో పిచికారీ వద్దు పైరు మొలక దశలో 20 లీటర్ల నీటికి 150 మిల్లీ లీటర్లు, పూత దశకంటే ముందు 20 లీటర్ల నీటికి 200 మిల్లీ లీటర్లు, పిందె సమయంలో 20 లీటర్ల నీటికి 300 లీటర్ల ద్రావణాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పూత విచ్చుకున్న సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ ద్రావణం పిచికారీ చేయవద్దని ఆమె హెచ్చరిస్తున్నారు. పచ్చపురుగు, తెల్లదోమ, రెక్కల పురుగులు, ముఖ్యంగా వరిలో పొడ తెగులు, దోమపోటు, ఉల్లికోడు తెగుళ్లను ఈ ద్రావణం నివారిస్తుంది. మిత్ర పురుగుల సంతతి పెరుగుతుంది.. పంటకు మేలు చేసే మిత్ర పురుగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ ద్రావణం మిత్ర పురుగులను ఆకర్షిస్తుంది. కందిరీగలు, తూనీగలు, తేనెటీగలు ఇతర మిత్ర పురుగులు పైరు పైకి వచ్చి చేరతాయి. పంటలో పూత నిలబడేలా దోహదపడుతుంది. íపిందె రాలడం తగ్గుతుంది. టమాటా పంట మూడు నెలలు ముగియగానే పాత మొక్క కింద మళ్లీ కొత్తగా చిగుర్లు వచ్చి యధావిధిగా పంటను ఇస్తుంది. రసాయనిక పురుగు మందులు వాడిన పంటలకంటే అధిక దిగుబడి వస్తుందని యశోదమ్మ(88979 31488) ధీమాగా చెబుతున్నారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, వ్యవసాయం, వైఎస్సార్ జిల్లా కలబంద ద్రావణం -
పంట మార్పిడి మంచిదే..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో రబీ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఏటా వేసిన పంటలనే మళ్లీ వేస్తూ నష్టపోతున్నారు. పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడల వ్యాప్తి ఎక్కువై దిగుబడి తగ్గుతోంది. పంట మార్పిడితో ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి.మోహన్‌దాస్ వివరించారు. పంట మార్పిడి అవలంబిస్తే చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. పంట మార్పిడిపై చాలామంది రైతులకు అవగాహన లేదు. ఏళ్ల తరబడిగా వేసిన పంటనే వేస్తూ.. ఒకరిని చూసి మరొకరు పంటలో మార్పు లేకుండా సాగు చేయడం జిల్లాలో అధికంగా కనిపిస్తోంది. ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా వస్తుంది. పంట మార్పు మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి అవుతుంది. చీడపీడలు దూరమవుతాయి. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు. శిలీంధ్ర వ్యాధులను దూరం చేయవచ్చు. బీజాలు, వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. సూచనలు జొన్న పంట సాగు చేసిన పొలంలో మిరప వేయొద్దు. వేరుశనగ సాగు చేసిన తర్వాత మళ్లీ అదే పంట వేసుకోరాదు. దీనివల్ల ఎర్రగొంగళి పురుగు, శనగపచ్చ పురుగు ఆశించివచ్చు. వేరుశనగ తర్వాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు. నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాటా, ఉలువ, మినుము, పెసర పంటలు వేస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి. అందుకు వాటిని పంట మార్పిడి చేయరాదు. జాగ్రత్తలు పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో శనగ, బబ్బెర, మినుము, ఉలువలు, పెసర పంటలు వేయడంతో నేలను కప్పి ఉంచుతాయి. కలుపు మొక్కలను నివారించవచ్చు. లెగ్యూమ్ జాతి(పప్పు దినుసులు) పైర్లను వేయడం వల్ల రైజోబియం బుడిపెలు ఏర్పడుతాయి. ఇవి గాలిలోని నత్రజనిని భూమిలో స్థిరీకరించి నేల సారవంతంగా చేస్తాయి. ఈ జాతి పంటలను పచ్చిరొట్టె ఎరువులుగా వాడుకోవచ్చు. పత్తి పైరును మినుము, పెసర వంటి పంటలతో మార్పిడి చేసకోవడంతో తెల్లదోమ ఉధృతి తగ్గించుకోవచ్చు. వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలు పండించాలి. దీనివల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని తగ్గించవచ్చు. పసుపు తర్వాత వరి, జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి. దీనివల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది. వరిపైరు తర్వాత పప్పుధాన్యాల పైర్లను గానీ, నూనె గింజల పైర్లను గానీ పండించడం వల్ల వరి పంటను ఆశించే టుంగ్రోవైరస్, దోమపోటులను సమర్థంగా నివారించుకోవచ్చు. పెసర గానీ పశుగ్రాసంగా జొన్నగానీ సాగు చేస్తే తర్వాత వేరుశనగ, సోయాబీన్ పంటలు వేసుకోవాలి. రైతులు పాటించాల్సింది.. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి. వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి. బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి.