రెవె‘న్యూ’ తప్పులు..! | Mistakes in pass books | Sakshi
Sakshi News home page

రెవె‘న్యూ’ తప్పులు..!

Published Thu, Jul 19 2018 2:05 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Mistakes in pass books - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఆదిలాబాద్‌అర్బన్‌ : భూముల రికార్డుల్లో ఉన్న రెవె‘న్యూ’ తప్పులు బయటపడ్డాయి. కింది స్థాయి అధికారులు చేసిన తప్పుల వల్ల రైతులు ఇబ్బందులు పడడంతో రెవెన్యూ తప్పుల దిద్దుబాటుపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం అమలులో భాగంగా భూ రికార్డుల్లో జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. క్షేత్ర స్థాయిలోనే ఈ తప్పులు అధికంగా జరగడంతో ఇప్పటికీ కొంతమంది రైతులకు పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కులు అందలేదు.

గత నెల రోజుల నుంచి రెవెన్యూ యంత్రాంగం కొత్త పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను సరి చేస్తోంది. అయినా ఇంకా పూర్తి స్థాయిలో దిద్దుబాటు కాలేదు. రికార్డుల్లో భూముల వివరాలు సరిగ్గా లేక తమకు వచ్చిన పాస్‌బుక్‌ల్లో తప్పులున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇది లా ఉండగా, భూ ప్రక్షాళన తర్వాత కూడా భూ వివరాల్లో తప్పులు ఉండడంతో కొత్త పాసుపుస్తకాలు, చెక్కులు  రాని రైతులు చాలామంది ఉన్నారని సమాచారం. పట్టాపాసు పుస్తకాల్లో పేర్లు మొదలుకొని సర్వే నంబర్, ఖాతా నంబర్, చిరునామాలు, ఉన్న భూమి ఎంత..? అనే వివరాలు భూ రికార్డుల్లో సరిగా   లేకపోవడంతో పట్టాదార్లకు కొత్త పాసు పుస్తకాలు అందడం లేదని తెలుస్తోంది. 

రెవెన్యూ  తప్పులు ఇలా.. 

జిల్లాలో మొత్తం 18 మండలాల్లో 509 రెవెన్యూ గ్రామాలున్నాయి. జిల్లాకు మొత్తం 1,07,379 పట్టా పాసుపుస్తకాలు వచ్చాయి. ఇందులో 6,884 పాసు పుస్తకాలు వివిధ కారణాలతో పంపిణీ కాకుండా నిలిచిపోయాయి. ఇలా నిలిచిపోయిన 5,836 పాస్‌పుస్తకాల్లో తప్పులున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 154 పాసుపుస్తకాల్లో సర్వేనంబర్లు తప్పుగా ఉండగా, 893 పాస్‌బుక్‌లు డబుల్‌ సర్వే నంబర్లతో తప్పుగా ఉన్నాయి.

164 బుక్కుల్లో పట్టాదారులు తప్పుగా ఉండగా, మరో 64 పాసుపుస్తకాల్లోనే తప్పులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా పాసుపుస్తకాల్లో వివిధ రకాల తప్పులున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పంపిణీ కాకుండా నిలిచిపోయిన పాసు పుస్తకాల్లోని తప్పులను సరి చేస్తున్నారు.

దీంతోపాటు పంపిణీ చేసిన పాసుపుస్తకాల్లో సైతం తప్పులుంటే అధికారులు వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 1540 పాసు పుస్తకాలు తహసీల్దార్ల వద్దకు సరి చేసుకునేందుకు వచ్చాయని సమాచారం. తప్పులను సరి చేసి ప్రింటింగ్‌ పూర్తయి కొత్త పాసు పుస్తకాలు రావాలంటే కొంత సమయం పడుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. 

ప్రక్షాళన అనంతరం కూడా.. 

భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం కూడా భూ రికార్డుల్లో చాలా తప్పులు ఉన్నాయని, వాటిని సరి చేసేందుకు అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని గతంలో హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం గతేడాదిలో వంద రోజులపాటు భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. వీఆర్‌ఏ స్థాయి నుంచి తహసీల్దార్, ఆర్డీవో, జేసీ స్థాయి అధికారుల వరకు పాల్గొని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి భూ సమస్యలు లేకుండా రికార్డులను ప్రక్షాళన చేశారు.

ఇందులో వివాదాలు, సమస్యలు గల భూములను పక్కన(పార్ట్‌–బీలో)పెట్టగా, తప్పులున్న భూ రికార్డులను సరి చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేశారు. దీంతో ఏ భూములకు సమస్యలున్నాయి.. ఏ భూములకు సమస్యలు లేవో స్పష్టంగా లెక్కేసుకుంది రెవెన్యూ యంత్రాంగం.

భూ రికార్డుల ప్రక్షాళనతో కొలిక్కి వచ్చిన సమస్యలు లేని భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. ఆ వివరాల ప్రకారం ఎంత మంది రైతులకు కొత్త పాసు పుస్తకాలు, చెక్కులు ఇయ్యాలో భావించి గత నెలలో కొత్త పాసు పుస్తకాలను ప్రభుత్వం జిల్లాకు పంపించింది. అలా వచ్చిన కొత్త పాసు పుస్తకాల్లో సైతం తప్పులుండడం, భూ రికార్డుల శుద్ధీకరణ తర్వాత కూడా పేర్లు, ఫొటోలు తప్పులుగా ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సరి చేయాలని రైతులు కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement