భీంపూర్ మండలంలోని అందర్‌బంద్‌లో రైతులకు అవగాహన కల్పిస్తున్న తాంసి ఏవో రవీందర్
ఇచ్చోడ(బోథ్): అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడే జిల్లాలో ఆదిలాబాద్ మొదటిస్థానంలో ఉంది. జిల్లాలో 80 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏటా వానాకాలం, యాసంగి సీజన్‌లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అలాంటి రైతులకు ఆధునిక వ్యవసాయం, పంటల మార్పిడి, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, సాగులో మెలకువలు, సాగులో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ అధికారుల పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉన్నాయి.
డీఏవో కూడా ఇన్‌చార్జీనే..
ఆదిలాబాద్‌లో పనిచేసిన జిల్లా వ్యవసాయ అధికారి ఆశకుమారి డిప్యూటేషన్‌పై మెదక్ జిల్లాకు వెళ్లింది. ఆమె స్థానంలో ప్రభుత్వం మళ్లీ డీఏవోను నియమించలేదు. దీంతో ఆదిలాబాద్ ఏడీఏ, మార్క్‌ఫెడ్ డీఎంగా అదనపు బాధ్యతలు చూస్తున్న పుల్లయ్యను ఇన్‌చార్జి డీఏవోగా నియమించారు.
కొత్త మండలాలకు మంజూరు కాని పోస్టులు
ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలు ఏర్పాటు చేసింది. జిల్లాలో సిరికొండ, గాదిగూడ, భీంపూర్, మావల, ఆదిలాబాద్ అర్బన్ మండలాలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సైలను నియమించిన ప్రభుత్వం వ్యవసాయ అధికారులను నియమించడం మరిచింది. దీంతో ఆరు మండలాలకు ఆరేళ్లుగా ఇన్‌చార్జి వ్యవసాయ అధికారులే కొనసాగుతున్నారు.
18 మండలాలకు 11 మందే ఏవోలు
జిల్లాలోని 18 మండలాల్లో కేవలం 11 మంది ఏవోలే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగితా ఏడు మండలాల్లో ఇన్‌చార్జి వ్యవసాయ అధికారులే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొన్నేళ్లుగా రెగ్యులర్ ఏవోలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని బేల, ఇంద్రవెల్లి, తలమడుగు, సిరికొండ, భీంపూర్, మావల, గాదిగూడ మండలాల్లో ఇన్‌చార్జి వ్యవసాయ అధికారులే విధులు నిర్వర్తిస్తున్నారు. బేల మండల ఏవోగా పనిచేసిన రమేశ్‌ను కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేయగా, ఏడాది కాలంగా బోథ్ ఏవో విశ్వామిత్ర బేల ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు.
తలమడుగు ఏవో రమణను సర్వీసు నుంచి తొలగించడంతో నార్నూర్–2 ఏవో మహేందర్ తలమడుగు ఏవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లి ఏవో కైలాస్ నాలుగేళ్ల కిత్రం ఇచ్చోడకు బదిలీపై రావడంతో ఉట్నూర్ ఏవో గణేశ్ ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తున్నారు. నూతనంగా ఏర్పాటైన గాదిగూడకు టెక్నికల్ ఏవో జాడి దివ్య, సిరికొండకు ఇచ్చోడ ఏవో కైలాస్, భీంపూర్‌కు తాంసి ఏవో రవీందర్, మావలకు ఆదిలాబాద్ అర్బన్ ఏవో రవీందర్ ఇన్‌చార్జి ఏవోలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నార్నూర్, జైనథ్ మండలాలకు ఇద్దరు ఏవోలు ఉండాల్సి ఉండగా ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. (క్లిక్: కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు!?)
ప్రభుత్వానికి నివేదించాం
కొత్తగా ఏర్పడిన మండలాలకు ప్రభుత్వం ఏవోలను నియమించలేదు. దీంతో పాత మండలాల ఏవోలకు అదనపు బాధ్యతలు అప్పగించాం. కొన్ని మండలాల్లో ఏవోలు బదిలీపై వెళ్లడంతో అక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వారి స్థానాలను భర్తీ చేయడానికి ప్రభుత్వానికి నివేదిక అందజేశాం.
– పుల్లయ్య, ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment