సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలోని కోటిమందికి వివిధ రకాల సేవలందించాల్సిన బల్దియాలో ఉన్నతాధికారుల నిష్క్రియాపరత్వంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. డిప్యుటేషన్ల నుంచి వివిధ అంశాల్లో పట్టింపు లేకపోవడంతో కొందరు ఆడింది ఆటగా సాగుతోంది. డిప్యుటేషన్లు ముగిసినా బల్దియా నుంచి వెళ్లని వారితోపాటు.. ఎవరు ఎక్కడ ఏంచేసినా చెల్లుతుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.
బాధ్యతల వికేంద్రీకరణ పేరిట జోన్ల అధికారులకు పూర్తిస్థాయి అధికారాలివ్వడంతో అధికార వికేంద్రీకరణ బదులు అవినీతి వికేంద్రీకరణ జరుగుతోంది. కఠిన చర్యలు లేకపోవడంతో మహిళలను వేధించేవారి ఆగడాలకు అడ్డేలేకుండాపోయింది. జాయింట్ కమిషనర్ల పోస్టుల పేరిట కొందరిని ఖాళీగా కూర్చోబెట్టి జీతాలిస్తున్నారు.
అయిదేళ్ల డిప్యుటేషన్ ముగిసినా మాతృశాఖకు వెళ్లకుండా.. పొడిగింపును కమిషనర్ అడ్డుకున్నా.. మరోమార్గంలో తిష్టవేసేందుకు కొందరు అధికారులు పావులు కదుపుతున్నారు. ఇలా.. చెబుతూపోతే.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో..
కదలరు.. వదలరు..
► ఇటీవల ఒకరి డిప్యుటేషన్ అయిదేళ్ల కాలం ముగిసిపోయింది. తిరిగి పొడిగింపునకు ప్రయత్నించారు. కమిషనర్ నిక్కచ్చిగానే ససేమిరా కాదన్నారు. కానీ.. మరో మార్గంలో జీహెచ్‌ఎంసీలోనే మరో విభాగం నుంచి సదరు అధికారి డిప్యుటేషన్ కోసం ఒక అడిషనల్ కమిషనర్, విభాగాధిపతి, మరికొందరు ప్రయత్నాలు చేసి సఫలమయ్యారంటే ఏమనుకోవాలి? కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు.. సదరు పోస్టులో మరొకరిని అప్పటికే ప్రభుత్వం నియమించడంతో ఆ అంకానికి తాత్కాలికంగా తెరపడినా.. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.
► మరో విభాగంలోని ఓ అధికారి అయిదేళ్ల డిప్యుటేషన్ ముగిసినా ఇంకా కొనసాగుతున్నారు. పై పెచ్చు పొడిగింపు వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిసింది. కేవలం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. సదరు ఫైల్ కదలదు. వీరు కదలరు. అయినా పట్టించుకున్నవారే లేరు.
సారు.. చాలా బిజీ..
► ఇక దోమల విభాగం తీరే ప్రత్యేకం. ఫాగింగ్ మెషిన్లు, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మస్కూట్స్ పేరిట జరుగుతున్న దోపిడీకి అంతేలేకుండాపోయింది. ఈ విభాగంలో ‘కలెక్షన్’ చేసి పెట్టేవారికి రెండు జోన్ల బాధ్యతలు అప్పగిస్తుంటారనేది అంతా తెలిసిన విషయమే.
► ఇక జోనల్‌స్థాయిలోని అధికారులు జోన్లను తమ రాజ్యాలుగా భావిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రజలకు సేవ కోసం ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తే.. వారు ఎవరికీ ఫోన్లు ఎత్తరు. ‘సారు చాలా బిజీ’ అనే అర్థంలో స్వీయ సందేశంతో ఆటోమేటిక్ మెసేజ్‌లు మాత్రం వెళ్తాయి.
► ఇక వీరి పర్యవేక్షణలో పనిచేసే వారు సైతం తామూ తక్కువేమీ తీసిపోలేదన్నట్లు..డిప్యూటీ కమిషనర్లయినా, వైద్యాధికారులైనా, ఇంజినీర్లయినా, మరొకరయినా సరే జోన్లు, సర్కిళ్లలో ఉండరు. ప్రజలెవరైనా తమ సమస్యల కోసం అక్కడకు వెళ్తే సీట్లలో ఉండరు. ఫీల్డ్ అంటారు. లేకుంటే హెడ్డాఫీసుకు వెళ్లారంటారు. కానీ ఎక్కడా ఉండరు. మరి ఎక్కడుంటారో తెలియదు. జోనల్ పెద్దసారుకు అనుకూలంగా ఉంటే చాలు.. ఎక్కడున్నా పనిచేసినట్లే. గదిలో కునుకు తీస్తున్నా బాగా పనిచేసినట్లే లెక్క. పైవారితో ‘లెక్క’ సరిగ్గా ఉంటే అంతా భేషే!
► వికేంద్రీకరణ పేరిట అధికారాలతోపాటు జీతాలు, బిల్లుల చెల్లింపులు, తదితరమైనవన్నీ జోన్లలోనే జరుగుతున్నాయి. పనుల తనిఖీలు, పర్యవేక్షణలు చేసే పెద్దసారుతో సవ్యంగా ఉంటే చాలు. ప్రధాన కార్యాలయం అలంకార ప్రాయం. బల్దియా బాస్ నామ్‌కే వాస్తే అన్న అభిప్రాయం బలంగా నెలకొంది.
గోడు వెళ్లబోసుకున్న బాధితురాలు..
► కొంతకాలం క్రితం ఓ డిప్యూటీ కమిషనర్ మహిళలతో కలిసిన ఫొటోలు వైరల్ కావడంతో అతడికి స్థానచలనం కలిగించారు. డిప్యూటీ కమిషనర్ కాస్తా జాయింట్ కమిషనర్‌గా మారారు. అంతే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
► ఓ స్టాటిస్టికల్ ఆఫీసర్.. మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌ను వేధిస్తున్న విషయం తెలిసినా.. సంబంధిత విభాగం ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. పైగా తప్పుచేసిన వారిని రక్షించే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు మేయర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంటే కానీ విషయం బయటకు రాలేదు.
ఏళ్లకేళ్లుగా పొడిగింపు..
► బల్దియాలోకి ఒకసారి వస్తే.. పాతుకుపోతారనే ప్రచారం ఉంది. లక్ష డబుల్‌బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు అవసరమని దాదాపు 250 మంది ఇంజినీర్లను ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్నారు. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం పది శాతం పనుల కోసం మళ్లీ అంతమంది పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నారు. వారిలో చాలామంది బల్దియాలోని వారికి ఏదో రకంగా దగ్గరివారే. అందుకే పని చేయకున్నా, పని లేకున్నా జీతం వస్తోంది. అలా ఏళ్లకేళ్లు పొడిగింపునిస్తుంటారు.
► కమిషనర్ స్వీయనిర్ణయాలు తీసుకోక, బల్దియాలో పాత కాపులైన ఒకరిద్దరు అధికారులు చెప్పిందే వేదమన్నట్లు నడుచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. సచివాలయం స్థాయిలోని ఉన్నతాధికారులకు, సంబంధిత మంత్రులకు వారు దగ్గరవడమే కారణమని బల్దియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment