ఈ ఫొటోలోని మహిళ బుర్జుగడ్డతండా వాసి లక్ష్మి.. ఈమె ఇంటికి సంబంధించి గత ఏడాది రూ.899 ఆస్తి పన్ను చెల్లించారు. ఈ ఏడాది రూ.5,371 ఆస్తి పన్ను చెల్లించాలని ఐదు రోజుల కిందట పంచాయతీ నుంచి నోటీసులు వచ్చాయి. ఒకే సారి ఆస్తి పన్ను ఇష్టానుసారంగా పెంచితే ఎలా..? వ్యవసాయం చేసుకునే మేము ఇంత ఎక్కువ మొత్తంలో ఆస్తి పన్ను ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఈమె ఒక్కరిదే కాదు.. రెండు తండాల్లోని అందరికీ ఎదురవుతోన్న సమస్య.
అధికారుల అత్యుత్యాహం.. పాలకుల అనాలోచిత చర్యలతో తండా ప్రజలకు ఆస్తి పన్ను భారంగా మారింది. ఇళ్లకు సంబంధించిన ఆస్తి పన్నును ఒకేసారి ఐదు వంతులకు పెంచడంతో గిరిజనులు ఆందోళనకు చెందుతున్నారు. మండల పరిధిలోని పెద్దషాపూర్‌తండా పంచాయతీ, అనుబంధ గ్రామం బుర్జుగడ్డతండాలో 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నులను భారీగా పెంచేశారు.
గతేడాది రూ.5,32,264 ఉండగా.. ఈ ఏడాదికి రూ.9,01,351 డిమాండ్ నమోదు చేసి ఇంటి యజమానులకు వారం రోజుల నుంచి డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న స్థానికులు పన్ను మొత్తాన్ని చూసి షాక్ తింటున్నారు. పంచాయతీ పరిధిలోని రెండు తండాల్లో 312ఇళ్లు ఉండగా.. సుమారు 1,100 మంది జనాభా నివసిస్తున్నారు. వీరిలో చాలా వరకు వ్యవసాయం, రోజూ కూలీ పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇది వరకు రూ.1000 ఉన్న ఆస్తి పన్ను ఇప్పుడు ఏకంగా రూ.5వేలు దాటిపోయింది. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి పన్నులు వసూలు చేయరని, గిరిజన తండాల్లో రూ.వేలకు వేలు ఆస్తి పన్నులకు డిమాండ్ నోటీసులు పంపించడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్తి పన్ను మదింపు విధానం
ఆస్తి పన్ను మదింపును పంచాయతీ పాలక వర్గం తీర్మాణం మేరకు ధర నిర్ణయించాల్సి ఉంటుంది. ఖాళీ స్థలానికి చదరపు గజం, నిర్మాణానికి చదరపు అడుగుల మేరకు కొలతలు తీసుకుని పన్ను మదింపు చేయాలి. గజానికి రూ.1500 చొప్పున వంద గజాల ఖాళీ స్థలం విలువ రూ.1,50,000 అవుతుంది. ఇందులో ఆర్‌సీసీ ఇంటి నిర్మాణం ఉంటే 900 చదరపు అడుగుల విస్తీర్ణం అవుతుంది. దీంతో ఇంటి విలువ చదరపు అడుగుకు రూ.1250గా లెక్కిస్తే రూ.11,25,000గా నిర్ధారించాలి. ఖాళీ స్థలం, నిర్మాణం విలువలను కూడితే మొత్తం రూ.12,75,000 ఆస్థి విలువ అవుతుంది. దీనికి రూ.0.12 పైసల నుంచి ఒక రూపాయి వరకు ఆస్తి పన్ను మదింపు చేయవచ్చు. రూ.0.12 పైసలుగా వంద గజాల ఇంటికి ఆస్తి పన్ను రూ.1530లు కాగా.. దీనికి 8 శాతం గ్రంథాలయం ఫీజు రూ.122 జత చేసి ఆస్తి పన్ను మదింపు చేపట్టాలి.
ఏళ్ల నాటి ఇళ్లకు కొత్తగా మదింపు
కొత్తగా నిర్మించే ఇళ్లకు పైన సూచించిన విధంగా ఆస్తి పన్ను మదింపు చేయాల్సి ఉంటుంది. గతంలో నిర్మించిన ఇళ్లకు చాలా వరకు గ్రామాల్లో ఆస్తి పన్ను తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రతి ఏటా ఐదు శాతం పెంచుతూ పన్ను వసూలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం సుమారు 20ఏళ్ల కిందట నిర్మించిన ఇళ్లకు కొత్తగా అసెస్‌మెంట్ చేస్తూ ఆస్తి పన్ను మదింపు చేశారు. పైగా ఇటీవల నిర్మించిన ఇళ్ల కంటే కూడా ఏళ్ల నాటి ఇళ్లకు ఎక్కువ మొత్తంలో ఆస్తి పన్ను డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి.
చదవండి: Radhe Shyam Shooting: గండికోటలో ‘రాధేశ్యామ్’ షూటింగ్.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment