నియంత్రిత సాగుతో ‘కౌలు’ కష్టాలు | Regulated Agriculture Problems For Tenant Farmers | Sakshi
Sakshi News home page

నియంత్రిత సాగుతో ‘కౌలు’ కష్టాలు

Published Wed, Jun 10 2020 9:31 AM | Last Updated on Wed, Jun 10 2020 9:31 AM

Regulated Agriculture Problems For Tenant Farmers - Sakshi

బజార్‌హత్నూర్‌(బోథ్‌) : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్ర భుత్వం వారి సంక్షేమం కోసం ఎలాంటి పథకాలు ప్రవేశ పెట్టడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయంకూడా వారికి వర్తించదు. కనీసం రుణ అర్హత కార్డులు కూడా లేక కౌలు రైతులు అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలతో పంట నష్టపోతే పరిహారం భూయజమానికే వస్తుంది. దీంతో కౌలు రైతు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాడు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం తీసుకురావడంతో కౌలు రైతు కష్టాలు మరింత పెరగనున్నాయి. 

కౌలు రైతుకు కొత్త చిక్కులు
ప్రభుత్వం చెప్పే నియంత్రిత సాగుతో కౌలు రైతులకు కొత్త చిక్కులు రాబోతున్నాయి. ఇప్పటివరకు కౌలు రైతులు వేలకు వేలు చెల్లించి కౌలుకు తీసుకున్న భూమిలో తమకు నచ్చిన, గిట్టుబాటు అయ్యే పంటలు వేసేవారు. కాని ఇక నుంచి భూమి యజమాని చెప్పిన పంటలే వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే రైతుబంధు రాదనే భయంతో కౌలుకు భూమిని యజమానులు ఇవ్వరు. భూమి యజమాని చెప్పిన విధంగానే అయిష్టంగా సాగు చేసే పరిస్థితి ఏర్పడింది.

నిరాశలో కౌలు రైతు 
ప్రభుత్వం సూచించిన పంటలు వేయకపోతే రైతుబంధు రాదని, మద్దతు ధర ఇవ్వమని తేల్చి చెప్పింది. దీంతో భూ యజమానులు తప్పకుండా ప్రభుత్వం సూచించిన పంటలు పండించాలి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 69వేల మంది కౌలు రైతులు ఉన్నారు. ఒక్కొక రైతు కనీసం 2 నుంచి 10 ఎకరాలు కౌలుకు తీసుకుంటారు. వీరు ఎక్కువగా పత్తి, వరి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తారు. అయితే ప్రభుత్వం నియంత్రిత సాగు విధానంలో భాగంగా కొన్ని పంటలను సూచించింది. దీంతో ఆ పంటలు సాగు చేస్తేనే భూ యజమానులు తమ భూమిని కౌలుకు ఇచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం అందించే రైతుబంధు కోసం కౌలు రైతులు తప్పక యజమాని చెప్పే పంటలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వ్యవసాయంపై ఆధారపడిన కౌలు రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒకవేళ భూ యజమానుల సూచన మేరకు పంటలు వేసి నష్టపోతే నష్టపరిహారం కూడా భూ యజమానులకే తప్ప తమకు అందదని వారు వాపోతున్నారు. పంట దిగుబడులు రాకపోతే కౌలు రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంది.

ఆదుకోని ప్రభుత్వాలు
కౌలు రైతులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. కౌలు రైతులను గుర్తించి వారికి రుణ అర్హత కార్డులు ఇవ్వాల్సి ఉండగా జిల్లాలో ఎక్కడ కూడా అలాంటి దాఖలాలు కానరావడం లేదు. బ్యాంకు రుణం పొందాలంటే కౌలు రైతుకు భూ యజమాని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ హామీ పత్రం ఇస్తే ఏం జరుగుతుందో అనే భయంతో పట్టేదారులు వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగా కౌలు రైతులు పెట్టుబడుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. గత మూడేళ్లలో కౌలు ధరలు నాలుగింతలు పెరిగాయి.

మూడేళ్ల కింద పత్తి సాగు కోసం ఎకరం చేను రూ.8వేల లోపు ఉండగా ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లా తాంసీ, తలమడుగు, జైనాథ్, బేల, గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, బోథ్, ఇచ్చోడ మండలాల్లో రూ.15వేలు దాటింది. ఎరువులు పురుగు మందులు, విత్తనాల ధరలు, కూలీల ఖర్చులు రెట్టింపయ్యాయి. పెరిగిన ధరలకు తోడు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక ప్రతి ఏటా కౌలు రైతులు కష్టాల్లో చిక్కుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి రుణ అర్హత కార్డులను ఇవ్వడంతో పాటు పెట్టుబడి సాయం రూ.5వేలు కౌలు రైతులకే అందించాలని కోరుతున్నారు.

మొక్కజొన్న వేస్తే కౌలుకు ఇవ్వరట
బలన్‌పూర్‌ శివారులో రూ.80 వేలకు 7 ఎకరాల చేను కౌలుకు తీసుకున్నా. 4 ఎకరాల్లో పత్తి పంట, 3 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేయాలనుకున్నాను. కాని మొక్కజొన్న పంట వేస్తే భూ యజమాని కౌలుకు ఇవ్వనంటున్నాడు. గత సంవత్సరం మొక్కజొన్న పంట వేసి లబ్ధిపొందాను. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి సాధించాను. కాని ఇప్పుడు నాకు నచ్చిన పంట వేయలేకపోతున్నాను. ప్రభుత్వం నియంత్రిత సాగువిధానం ఎత్తివేయాలి.
–తాండ్ర శ్రీనివాస్, బజార్‌హత్నూర్‌ 

రైతుబంధు లింకు తొలగించాలి
రైతుల అభిప్రాయం తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో రైతులు, కౌలు రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటలను రైతుబంధుకు లింకు పెట్టకుండా పంటలపై రైతుకు స్వేచ్ఛనివ్వాలి. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం రూ. 5వేలను కౌలురైతులకు కూడా ఇవ్వాలి. ప్రకృతి వైపరిత్యాల వల్ల నష్టపోతే నష్టపరిహారం కౌలు రైతులకు ఇవ్వాలి. 
–సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్‌ వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement