ఎప్పుడూ తాళమే..
► అందుబాటులో లేని వ్యవసాయ అధికారులు
► రైతులకు అందని సమాచారం
► సిబ్బంది లేకపోవడంతోనే సమస్య అంటున్న ఏవో
ఆదిలాబాద్‌రూరల్: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుంటే.. వ్యవసాయ మండల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు! అది మరెక్కడో కాదు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న ఆదిలాబాద్ రూరల్, మావల మండలాలకు సంబంధించిన మండల వ్యవసాయ శాఖ కార్యాలయ దుస్థితి.
సిబ్బంది ఉన్న లేకున్నా ఎప్పుడూ ఈ కార్యాలయానికి తాళమే వేసి ఉంటుందని రైతులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయం పరిస్థితి ఇలా ఉంటే మారుమూల మండల కేంద్రాల్లో ఈ శాఖ కార్యాలయాల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఇట్టే అర్థమవుతోందని రైతులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కరువైంది. ఏదీ ఏమైనా అధికారులు స్పందించి సీజన్‌లో రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరతున్నారు.
అందుబాటులో లేని సిబ్బంది
పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న ఆయా మండలాల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా మండలాలకు సంబంధించి ఏవోతోపాటు ఏడుగురు ఏఈవోల పోస్టులు మంజూరు ఉన్నాయి. రెగ్యులర్ సిబ్బంది వివిధ కారణాలతో సెలవులపై ఉన్నారని, రైతు సమగ్ర సర్వేతో ఇతరులను డెప్యూటేషన్‌పై తీసుకున్నట్లు ఏవో అష్రఫ్ వివరిస్తున్నారు.
కాగా, గతకొన్ని రోజుల నుంచి చిరు జల్లులు కురవడంతో అధికారుల సలహాతో సాగు చేద్దామంటే అటు గ్రామాల్లో, ఇటూ కార్యాలయానికి వస్తే తాళం వేసి ఉంటుందని పలువురు రైతులు వాపోతున్నారు. కేవలం సమగ్ర సర్వే సాకుతో అధికారులు అందుబాటులో ఉండడం లేదు. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహా మేరకు సాగు చేయాలని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సభలు ఏర్పాటు చేసి చెబుతుంటే తెలుసుకుందామని కార్యాలయానికి వెళ్తే సిబ్బంది అందుబాటులో లేక వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి.
ఈ విషయంపై ఏవో అష్రఫ్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో వివరణ కోరగా తమ కార్యాలయంలో కనీసం విద్యుత్ సరఫరా లేదని, కంప్యూటర్ కూడా లేదన్నారు. ఉన్న ఏఈవోలు వివిధ కారణాలతో సెలవుపై వెళ్లారు. కింది స్థాయి సిబ్బంది చేయాల్సిన పని కూడా తానే చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. సమగ్ర సర్వే కొనసాగుతుండటంతో ఇద్దరిని డెప్యూటేషన్‌పై, మరో ముగ్గురు కాంటాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఏఈవోతో పనులు చేసుకుంటున్నాని పేర్కొన్నారు. సర్వే వల్ల ఏఈవోలు లేకపోవడంతో తానే స్వయన గ్రామాలకు వెళ్లి సర్వే చేస్తున్నానని పేర్కొన్నారు.