Rabi cultivation
-
ముందస్తు రబీకి ముమ్మర కసరత్తు
సాక్షి, అమరావతి: ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80% సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు రబీ కోసం సిద్ధమవుతున్న రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాపై దృష్టి సారించింది. ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా సరి్టఫై చేసిన నాణ్యమైన విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలుత సెప్టెంబర్ 15వ తేదీ నుంచి శనగ విత్తనాలు, అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత మిగిలిన విత్తనాలు పంపిణీ చేయనున్నారు. వచ్చే రబీలో 57.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగును వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా 20.5 లక్షల ఎకరాల్లో వరి, 10.92 లక్షల ఎకరాల్లో శనగ, 8.25 లక్షల ఎకరాల్లో మినుము, 5.37 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.57 లక్షల ఎకరాల్లో జొన్నలు సాగవుతాయని అంచనా వేశారు. ఆ మేరకు విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు దూరంగా ఉన్న రైతులు ముందస్తు రబీకి సిద్ధమవుతుండడంతో అందుకు తగినట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 3.98 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం రబీ 2022–23లో 2,83,672 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయగా రైతులు 1,78,818 లక్షల క్వింటాళ్ల విత్తనాలను తీసుకున్నారు. రానున్న రబీ సీజన్ కోసం 3.98 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేస్తోంది. గత రబీలో 1,26,656 క్వింటాళ్ల శనగ విత్తనాలను సిద్ధం చేయగా, 1.15 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులు తీసుకున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌కు దూరంగా ఉన్న రైతులు ముందస్తు రబీలో శనగ సాగుకు మొగ్గు చూపుతుండడంతో ఈసారి 3.40 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత సాగయ్యే పంటలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఇండెంట్ మేరకు 36,121 క్వింటాళ్ల వరి, 14,163 క్వింటాళ్ల మినుము, 4,353 క్వింటాళ్ల పెసలు, 2,064 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 727 క్వింటాళ్ల వేరుశనగ, 502 క్వింటాళ్ల చిరుధాన్యాలు, 142 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరమని గుర్తించి ఈ మేరకు వాటి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 15 నుంచి నమోదు, పంపిణీ ఏటా అక్టోబర్ 1 నుంచి రైతుల వివరాలు నమోదుచేసుకుని, 15 నుంచి పంపిణీ మొదలుపెడతారు. కానీ ఈసారి సెప్టెంబర్ 15 నుంచే విత్తన పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. తొలుత శనగ విత్తనాలను, తర్వాత వరితో సహా మిగిలిన వాటిని స్థానిక డిమాండ్‌ను బట్టి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన విత్తనాలతో పాటు ప్రైవేటు కంపెనీల నుంచి సేకరించే విత్తనాలను సైతం అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌లో పరీక్షించి సర్టిఫై చేసిన తర్వాత ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచనున్నారు. పంపిణీకి రబీ విత్తనాలు సిద్ధం ముందస్తు రబీకి సిద్ధమవుతున్న రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఒక్క రైతు కూడా ఇబ్బందిపడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం. 3.98 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశాం. వీటిలో 3.40 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలను పొజిషన్ చేస్తున్నాం. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధిసంస్థ -
జోరుగా రబీ సాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాగు జోరందుకుంటోంది. నిర్దేశించిన లక్ష్యంలో మూడోవంతు విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. మాండూస్ తుపాను ప్రభావం ఈ పంటలపై స్వల్పంగా చూపింది. రాయలసీమలోని మూడు జిల్లాల్లో కొంతమేర పంటలు దెబ్బతినగా, ఆ మేరకు ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో రెండోసారి విత్తుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు.. రబీ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువుల నిల్వలు ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచారు. అనంతపురంలో 70 శాతం సాగు రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.29 లక్షల ఎకరాలు. 2020–21లో రికార్డు స్థాయిలో 62 లక్షల ఎకరాల్లో సాగవగా, 2021–22లో 56.27 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 58లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది ఇదే సమయానికి 18 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాది ఇప్పటివరకు 19.53 లక్షల ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 70 శాతం మేర రబీ పంటలు సాగవగా, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 60 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో 50 శాతం మేర పంటలు సాగయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ పనులు ఊపందుకున్నాయి. ఈసారి వరి సాగు లక్ష్యం 20.77 లక్షల ఎకరాలు రబీలో వరి సాధారణ విస్తీర్ణం 19.72 లక్షల ఎకరాలు. గత సీజన్లో 19.52 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాది 20.77లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 3.07లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గతేడాది ఇదే సమయానికి 1.9 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అపరాలు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. 11.75 లక్షల ఎకరాల్లో అపరాల సాగు ఇక ముతక ధాన్యాలు 8.02 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో సాగైంది. వీటిలో 1.65 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 82 వేల ఎకరాల్లో జొన్నలు సాగయ్యాయి. అపరాల విషయానికొస్తే.. ఈ ఏడాది 23.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 10.85 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వీటిలో ప్రధానంగా 7.56 లక్షల ఎకరాల్లో శనగలు, 3.07 లక్షల ఎకరాల్లో మినుములు సాగయ్యాయి. అలాగే, నూనె గింజల సాగు లక్ష్యం 3.67లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.25 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వీటిలో ప్రధానంగా 1.05 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. ఇతర పంటల విషయానికొస్తే పొగాకు సాగు లక్ష్యం 1.75 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 87 వేల ఎకరాల్లో సాగైంది. సమృద్ధిగా ఎరువుల నిల్వలు రబీ సీజన్‌కు కేంద్రం 22.69 లక్షల టన్నుల ఎరువులు కేటాయించింది. ప్రారంభ నిల్వ 7.29 లక్షల టన్నులుండగా, గడిచిన 45 రోజుల్లో 7.82 లక్షల టన్నులను కేంద్రం సరఫరా చేసింది. డిసెంబర్ 15 నాటికి 7.94 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నెలకు 3.34 లక్షల టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 7.17లక్షల టన్నుల ఎరువుల నిల్వలున్నాయి. కేటాయింపు ప్రకారం డిసెంబర్ నెలకు మరో 3.95 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. -
పంటకు పులకింత.. రైతుకు నిశ్చింత
సాక్షి, అమరావతి: గతంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు దొరక్క రైతులు పడరాని పాట్లు పడేవారు. బ్లాక్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయడమే కాదు.. పంటకాలంలో విలువైన సమయాన్నీ వృథా చేసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఎరువుల కొరత అనే మాట ఎక్కడా వినిపించడం లేదు. ఎరువుల అందుబాటు విషయంలో రైతాంగం నిశి్చంతగా ఉంటోంది. సీజన్ ప్రారంభానికి ముందే అవసరమైన నిల్వలను సిద్ధం చేస్తుండడంతో ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తడం లేదు. ప్రస్తుత రబీ సీజనే ఇందుకు నిదర్శనం. ఈ రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ఎరువుల నిల్వలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీంతో రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరమే రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలే ఇందుకు కారణమంటూ రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రబీ కోసం ఎరువుల నిల్వలు ఇలా.. ఏటా రాష్ట్రంలో 35 లక్షల టన్నుల ఎరువుల వాడకం జరుగుతుంది. నిజానికి ఖరీఫ్ కంటే రబీ సీజన్లోనే ఎరువుల వాడకం ఎక్కువ. రబీ సీజన్‌కు సంబంధించి 22.60 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఎరువులు అవసరమవుతాయని అంచనా. అయితే ఈసారి రబీ సీజన్ ప్రారంభానికి ముందు 7,50,260 మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల నిల్వలున్నాయి. ఈ సీజన్ కోసం రాష్ట్రానికి మార్చి 15వ తేదీ వరకు 20,94,044 మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించింది. ఆ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 బఫర్ గిడ్డంగులు, 154 హబ్‌లలో 28,44,304 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు సిద్ధం చేయగా.. గడిచిన ఐదు నెలల్లో 21,81,737 మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల అమ్మకాలు జరిగాయి. మిగిలిన 6,62,567 మెట్రిక్ టన్నులకు అదనంగా కంపెనీల నుంచి మరో 30,004 మెట్రిక్ టన్నుల మేరకు సేకరించారు. దీంతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 6,92,572 మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా 3,11,375 ఎం.టీ.ల యూరియా, 30,865 ఎం.టీ.ల డీఏపీ, 63,971 ఎం.టీ.ల ఎంఓపీ, 59,469 ఎం.టీ.ల ఎస్ఎస్పీ, 2,22,037 ఎం.టీ.ల కాంప్లెక్స్, 195 ఎం.టీ.ల అమ్మోనియా సల్ఫేట్, 4,659 ఎం.టీ.ల సిటీ కాంపోస్ట్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రబీ సీజన్‌కు సంబంధించి మార్క్‌ఫెడ్ వద్ద 6,16,324 ఎం.టీ.ల నిల్వలుండగా, ఇప్పటివరకు 5,46,536 మెట్రిక్ టన్నుల మేరకు అమ్మకాలు జరిపారు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద డీఎపీ 6,245 ఎం.టీ.లు, ఏపీకే 2,366 టన్నులు, యూరియా 61,161 టన్నులు కలపి 69,772 ఎం.టీ.ల నిల్వలున్నాయి. వీటిని పాత ధరలకే విక్రయిస్తున్నారు. అదే సమయంలో రబీ సీజన్లో ఆర్బీకేల్లో 1,00,125 మెట్రిక్ టన్నుల ఎరువులను నిల్వ చేయగా, ఇప్పటివరకు 19,900 మెట్రిక్ టన్నులను రైతులు కొనుగోలు చేశారు. రికార్డు స్థాయిలో రబీ సాగు ప్రస్తుత రబీ సీజన్లో ఎరువుల కొరత లేకపోవడంతోపాటు అన్ని విధాలా అనుకూల పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యాయి. సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 56.19 లక్షల హెక్టార్లు కాగా, ఈ ఏడాది 58.92 లక్షల హెక్టార్లలో రబీ సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 59.06 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. 21.75 లక్షల హెక్టార్లలో వరి, 23.74 లక్షల హెక్టార్లలో అపరాలు, 3.55 లక్షల హెక్టార్లలో ఆయిల్‌సీడ్స్, 2.67 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు సాగయ్యాయి. ఇంత ఈజీగా ఎరువులు దొరుకుతాయనుకోలేదు.. నేను 15 ఎకరాలు కౌలుకు తీసుకుని రబీలో వరిసాగు చేశా. గతంలో ఎరువుల కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లం. మండల కేంద్రానికి, కొన్ని సందర్భాల్లో విజయవాడకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. మొట్టమొదటిసారి మా ఊళ్లోనే కావాల్సినన్ని ఎరువులుంచారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రంలో 15 బస్తాల యూరియా, 5 బస్తాల డీఏపీ తీసుకున్నా. ఇంత ఈజీగా ఎరువులు దొరుకుతాయని కలలో కూడా ఊహించలేదు. సకాలంలో ఎరువులు వేయడంతో పంట ఏపుగా పెరిగింది. – కలపాల ఇసాక్, కాటూరు, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా రాష్ట్ర ప్రభుత్వ కృషితో ఎరువుల కొరత లేదు.. రబీ సీజన్లో ఏ దశలోనూ ఎరువుల కొరత తలెత్తలేదు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా సీజన్ ముందుగానే కేంద్రం మన రాష్ట్రానికి అవసరమైన ఎరువులను కేటాయించింది. ఆర్బీకేల్లోనూ అందుబాటులో ఉంచడంతో ఎక్కడా ఎరువులకోసం రైతులు ఇబ్బంది పడలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలను పాత ధరలకే విక్రయిస్తున్నారు. –హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
రబీ జోరు.. రైతన్న హుషారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాగు జోరుగా సాగుతోంది. రెండో ఏడాది కూడా రెండో పంటకు సాగు నీరివ్వడం.. సాగు సేవలన్నీ ముంగిటకు చేరడం.. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి తోడు నాణ్యమైన విత్తనాలు, సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉండటంతో రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో దాళ్వా (రబీ) సాగు చేపట్టారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్–డిసెంబర్ మధ్య 296 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 370.3 మిల్లీమీటర్లు నమోదైంది. విజయనగరం, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. మిగిలిన 9 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవడంతో జలాశయాలు, కుంటలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. అందుబాటులో నాణ్యమైన విత్తనాలు రబీలో 3,19,987 క్వింటాళ్ల విత్తనాల సరఫరాకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయగా.. రైతు భరోసా కేంద్రాల ద్వారా 2,06,731 మంది రైతులకు రూ.35.56 కోట్ల సబ్సిడీతో కూడిన 1,64,408 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశారు. ఖరీఫ్ పంట చివరి దశకు చేరిన సమయంలో నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు 1,03,129 క్వింటాళ్ల విత్తనాలిచ్చేందుకు ఏర్పాట్లు చేయగా, ఇప్పటివరకు 39,481 మందికి రూ.23.28 కోట్ల సబ్సిడీపై 49,854 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశారు. ఈ సీజన్లో సాగు లక్ష్యం 58.92 లక్షల ఎకరాలుగా నిర్దేశించగా.. ఇప్పటివరకు 39.10 లక్షల ఎకరాల్లో ఇప్పటికే సాగు మొదలైంది. రెండేళ్ల కంటే మిన్నగా వరి ప్రస్తుత రబీలో వరి సాగు లక్ష్యం 19.79 లక్షల ఎకరాలు కాగా.. జనవరి రెండో వారానికి 12.60 లక్షల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉంది. అయితే, ఇప్పటికే 13.19 లక్షల ఎకరాల్లో (105 శాతం) నాట్లు పడ్డాయి. గతేడాది ఇదే సమయానికి 11.61 లక్షల ఎకరాలు, 2019లో 11.54 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. కాగా సజ్జ, జొన్న, రాగి, మొక్కజొన్న, ఇతర చిరు ధాన్యాల సాగు విస్తీర్ణం 8.91 లక్షల ఎకరాలు కాగా, జనవరి రెండో వారానికి 6.33 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 4.10 లక్షల ఎకరాలు (65 శాతం) సాగులోకి వచ్చాయి. మినుము సాగులోనూ మిన్న రబీలో అపరాల సాగు లక్ష్యం 24.06 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 18.29 లక్షల ఎకరాల్లో (81శాతం) సాగు మొదలైంది. ప్రధానంగా పప్పుశనగ 9.95 లక్షల ఎకరాలకు గాను.. 8.83 లక్షల ఎకరాల్లోను, మినుములు 9.55 లక్షల ఎకరాలకు గాను 7.06 లక్షల ఎకరాల్లోను సాగు మొదలైంది. గతేడాది ఇదే సమయానికి మినుము 6.47 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ ఏడాది పెసలు 3.16 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించగా.. 1.49లక్షల ఎకరాల్లో ఇప్పటికే మొదలైంది. నూనె గింజల సాగు లక్ష్యం 3.73 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1.65 లక్షల ఎకరాల్లో(76 శాతం) సాగులోకి వచ్చాయి. వేరుశనగ 2.28 లక్షల ఎకరాలకు గాను.. 1.31 లక్షల ఎకరాల్లో ఇప్పటికే సాగు మొదలైంది. పొగాకు 1.69 లక్షల ఎకరాలకు గాను 1.09 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. సీజన్ ముగిసే నాటికి మొత్తం పంటలు లక్ష్యాన్ని అధిగమించే సూచనలు కన్పిస్తున్నాయి. రబీ సీజన్లో 22.64 లక్షల టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. సీజన్ ఆరంభంలోనే 10,53,880 టన్నులు అందుబాటులోకి వచ్చాయి. లక్ష్యం దిశగా.. రాష్ట్రంలో రబీ సాగు లక్ష్యం దిశగా పయనిస్తోంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువుల్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం. వరుసగా రెండో ఏడాది కూడా రెండో పంటకు సాగునీరివ్వడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో సాగు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారానికే నిర్దేశించిన లక్ష్యం మేరకు పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేస్తున్నాం – హెచ్.అరుణ్‌కుమార్,కమిషనర్, వ్యవసాయ శాఖ -
పుష్కలంగా వర్షాలు.. రబీకి ఢోకా లేదు..
సాక్షి, అమరావతిబ్యూరో: రబీలో సాగు ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో పుష్కలంగా వర్షాలు కురవడంతో పాటు, నాగార్జునసాగర్ రిజర్వాయర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి ఇప్పటికీ వరద వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు సముద్రంలోకి నీరు పెద్దఎత్తున విడుదల చేస్తున్నారు. దీంతో పశి్చమ డెల్టా, నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో పంటలకు రబీలో ఢోకా ఉండదని రైతులు భావిస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. రబీలో సాధారణ సాగు 4,88,130 ఎకరాలు కాగా, ఈఏడాది రబీలో 5,80,587.5 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 92,457.5 ఎకరాల్లో అదనంగా పంటలు సాగు కానున్నాయి. గత ఏడాది రబీలో పంటలు 4,83,327.5 ఎకరాల్లో మాత్రమే సాగు అయ్యాయి. పెరగనున్న ప్రధాన పంటల సాగు విస్తీర్ణం జిల్లాలో ప్రధానంగా రబీలో జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర పంటలు సాగవుతాయి. ఈ ఏడాది ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉండటం వల్ల వరి సాధారణ సాగు 45,150 ఎకరాలు కాగా, 75 వేల ఎకరాల్లో వరి పంట సాగు అవుతోందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. శనగ పంటల ఉత్పత్తులకు సంబంధించి గోదాముల్లో భారీగా నిల్వలు ఉండటంతో ఈ ఏడాది శనగ పంట సాగు విస్తీర్ణం తగ్గుతోందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఈ నెల 1వ తేదీన మద్దతు ధరలను ప్రకటించింది. మొక్క జొన్న పంట క్వింటా రూ.1850, జొన్న (మనుషులు తినేవి) క్వింటా రూ.2,620, జొన్నలు (పశువుల దాణా రకం) క్వింటా రూ.1850, పెసలు క్వింటా రూ.7,196, మినుములు క్వింటా రూ.6వేలు, శనగలు క్వింటా రూ.5,100, వేరుశనగ క్వింటా రూ.5,275గా ఇప్పటికే ప్రకటించింది. దీంతో రైతులకు పూర్తి భరోసా ఏర్పడింది. రబీలో పంటల సాగు పెరగనుంది ఈ ఏడాది రబీలో పంటల సాగు పెరుగుతోందని భావిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి మద్దతు ధరలను ప్రకటించింది. రబీలో సబ్సిడీ కింద శనగ పంట విత్తనాలు సరఫరా చేస్తాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాం. – విజయభారతి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు -
9.50 లక్షల ఎకరాల్లో గోదా‘వరి’!
సాక్షి, అమరావతి: గోదావరి పరవళ్లు డెల్టా రైతుల్లో ఆనందోత్సాహాలను నింపుతున్నాయి. నదిలో సహజసిద్ధ ప్రవాహం పెరగడంతోపాటు సీలేరు, డొంకరాయి జలాశయాల్లో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నందున ఈ ఏడాది గోదావరి డెల్టాలో రబీ పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జలవనరులశాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. గోదావరిలో సహజ సిద్ధ ప్రవాహం రూపంలో 46.5 టీఎంసీలతోపాటు సీలేరు, డొంకరాయి జలాశయాల్లో రాష్ట్ర వాటా కింద మరో 46.5 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. ఇందులో తాగునీటి అవసరాల కింద 7 టీఎంసీలతోపాటు ప్రవాహ, ఆవిరి నష్టాలుగా మరో మూడు టీఎంసీలు పోయినా 83 టీఎంసీలతో గోదావరి డెల్టాలో రబీ పంటలకు పుష్కలంగా నీటిని అందించవచ్చని చెబుతున్నారు. నాడు నాలుగేళ్లు కష్టాలే.. 2014 నుంచి 2018 వరకు రబీలో పంటల సాగు డెల్టాలో సవాల్‌గా మారింది. వర్షాలు సరిగా లేక గోదావరిలో నీటి లభ్యత తగ్గడం, సీలేరు, డొంకరాయి జలాశయాల్లో నీటి నిల్వలను సమర్థంగా వినియోగించుకోకపోవడం వల్ల నీటి కొరత ఏర్పడింది. ఫలితంగా రబీలో సాగు చేసిన పంటలు లక్షల ఎకరాల్లో ఎండిపోయాయి. గతంలో నీటి కొరతను ఆసరాగా చేసుకుని డ్రెయిన్లు, మురుగునీటి కాలువల నుంచి తోడి పంటలకు సరఫరా చేసినట్లు రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. 9.50 లక్షల ఎకరాలు సాగుకు సిద్ధం గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ పంట నూర్పిళ్లు పూర్తయ్యాయి. రబీలో సాగుకు ఈనెల 1 నుంచే అధికారులు నీటిని విడుదల చేస్తు న్నారు. ఉభయ గోదావరిలో విస్తరించిన డెల్టాలో 10,13,161 ఎకరాలకుగానూ 9.50 లక్షల ఎకరాల్లో ఈసారి రబీ పంటలు సాగు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ధవళేశ్వరం.. కళకళ - గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి బుధవారం 9,091 క్యూసెక్కుల ప్రవాహం రాగా డెల్టాకు 5,100 క్యూసెక్కులు విడుదల చేసి 3,991 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలారు. గతేడాది ఇదే రోజు ధవళేశ్వరం బ్యారేజీలో ప్రవాహం 7,452 క్యూసెక్కులే కావడం గమనార్హం. - ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు నుంచి గోదావరిలోకి ఇప్పటికీ సహజసిద్ధ ప్రవాహం కొనసాగుతోంది. - గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం వల్ల డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో సహజసిద్ధ ప్రవాహం ద్వారా 46.5 టీఎంసీలు లభిస్తాయని అధికారుల అంచనా. - సీలేరు, డొంకరాయి జలాశయాల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉంది. ఇందులో ఏపీ జెన్కో (ఆంధ్రప్రదేశ్ జలవిద్యుదుత్పత్తి సంస్థ) వాటా ద్వారా రాష్ట్రానికి మరో 46.5 టీఎంసీలు లభిస్తాయి. - ఈ ఏడాది గోదావరిలో నీటి లభ్యత పెరగడం, రాష్ట్ర ప్రభుత్వం నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేస్తున్న నేపథ్యంలో రబీలో సాగుకు ఎలాంటి ఇబ్బంది లేదని గోదావరి డెల్టా సీఈ శ్రీధర్ ‘సాక్షి’కి చెప్పారు. -
రబీకి సై..
అమలాపురం: చిన్నచిన్న ఇబ్బందులు మినహా.. ఖరీఫ్ సాగు దాదాపు ఆశాజనకంగానే ముగియడంతో.. రైతులు ఇక రబీ సాగు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అన్నపూర్ణగా పేరొందిన గోదావరి డెల్టాలో రబీ సాగు ఆదివారం ఆరంభం కానుంది. ఈ ఏడాది సమృద్ధిగా సాగు నీరు ఉంటుందని అధికారులు ప్రకటించడంతో రైతులు సాగుపై ఆశలు పెంచుకున్నారు. ప్రస్తుతం గోదావరిలో సహజ జలాలు తగ్గడం అధికారులకు కాస్త ఆందోళన కలిగిస్తున్నా.. సీలేరు జలాలు కూడా తోడు కానుండడంతో రబీ సాగుకు ఢోకా ఉండదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రబీ సాగుకు వీలుగా అధికారులు గోదావరి డెల్టా కాలువలకు ఆదివారం నుంచి నీటి విడుదల పెంచనున్నారు. తూర్పు డెల్టాకు ఎక్కువగా, మధ్య డెల్టాలో కోతలు పూర్తి కానందున వారం రోజుల పాటు తక్కువగా నీరందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తూర్పు డెల్టాలో ఇప్పటికే బోర్ల మీద కొంతమంది రైతులు రబీ నారుమడులు పోసుకున్నారు. ఇక్కడ వెదజల్లు సాగుకు అనుగుణంగా ఎక్కువ మంది రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రెండు డెల్టాలతో పాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) పరిధిలో మొత్తం 4,36,533 ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. మొత్తం సాగు కాలంలో కనీసం 90 టీఎంసీల నీరు అవసరమన్నది అధికారుల అంచనా. ఇందులో సీలేరు పవర్ జనరేషన్, బైపాస్ పద్ధతిలో 47 టీఎంసీలు, సహజ జలాలు 46 టీఎంసీలు వస్తాయని లెక్కలు కట్టారు. మొత్తం 93 టీఎంసీల నీరు వస్తున్నందున సాగుకు ఢోకా ఉండదని భావించారు. ఈ ఉద్దేశంతోనే రబీ మొత్తం ఆయకట్టుకు గత నెల 7న కాకినాడలో జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్‌లో మంచి దిగుబడులు పొందిన రైతులు.. రబీలో కూడా అదే ఫలితాన్ని సాధిస్తే ఈ ఏడాది వ్యవసాయంలో లాభాలు చూసే అవకాశముంటుందన్న ఆశతో ఉన్నారు. డెల్టాలో రబీసాగుకు సిద్ధమవుతున్న సమయంలో గోదావరిలో సహజ జలాల తగ్గుదల రైతులను, అధికారులను ఆలోచనలో పడవేస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం ఆరు గంటల సమయానికి ఇన్‌ఫ్లో 8,221 క్యూసెక్కులు మాత్రమే. ఇదే సమయంలో పట్టిసీమ 12 పంపుల ద్వారా కృష్ణా డెల్టాకు 4,250 క్యూసెక్కుల నీటిని తోడారు. అంటే మొత్తం ఇన్‌ఫ్లో 12,471 క్యూసెక్కులన్న మాట. ఇందులో సీలేరు పవర్ జనరేషన్ ద్వారా 3,384 క్యూసెక్కులు వస్తోంది. దీనిని మినహాయిస్తే 9,087 క్యూసెక్కులు మాత్రమే గోదావరి సహజ జలాలు రావడం గమనార్హం. వచ్చిన నీటిలో ప్రస్తుతం తూర్పు డెల్టాకు 400, మధ్య డెల్టాకు 800, పశ్చిమ డెల్టాకు 2,500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 4,573 క్యూసెక్కుల మిగులు జలాలు వదులుతున్నారు. గోదావరి సహజ జలాలు 10 వేల క్యూసెక్కుల కన్నా తక్కువగా ఉండడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే వీటి రాక రెట్టింపు ఉంది. గత ఏడాది డిసెంబర్ రెండు, మూడు తేదీల్లో సహజ జలాలు 4,167 క్యూసెక్కులు మాత్రమే కావడం గమనార్హం. ఇది డిసెంబర్ 8 నాటికి సున్నాకు పడిపోయింది. తరువాత కొంతమేర పెరిగినా ఆశించిన స్థాయిలో సహజ జలాలు రాలేదు. అప్పటితో పోల్చుకుంటే ఈ ఏడాది నీటి రాక ఆశాజనకంగా ఉండడం అధికారుల్లో ధీమాను పెంచుతోంది. అయితే రైతులు నిర్ణీత షెడ్యూలు ప్రకారం సాగు పూర్తి చేస్తే మంచిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ మొదటి వారానికి పూర్తి చేయాలని కోరుతున్నారు. ముందస్తు సాగు చేయాలి.. సహజ జలాలు తగ్గుతున్నా సాగుకు పూర్తిగా నీరు ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. కానీ రైతులు ముందుగా సాగు చేసుకోవడం అన్నివిధాలుగా మంచిది. మధ్య డెల్టాలో కోతలు ఆలస్యమయ్యే అవకాశమున్నందున మరో వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయలేం. ఇక్కడ ఖరీఫ్ ఆలస్యమైనా రబీకి రైతులు సన్నాహాలు చేసుకోవాలి. డిసెంబర్ నెలాఖరుకు నాట్లు పూర్తి చేసుకోవాలి. – ఎన్.కృష్ణారావు, ఎస్ఈ, గోదావరి ఇరిగేషన్ సర్కిల్, ధవళేశ్వరం -
పుంజుకోని వరి నాట్లు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రబీ వరి సాగు నిరాశాజనకంగా మారింది. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, చెరువులు, బావులు, బోర్లలో నీటివనరులు అడుగంటడంతో నాట్లు పుంజుకోవడంలేదు. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 37,500 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు. గతేడాది రబీలో వరి సాగు గణనీయంగా జరిగినా, ఈసారి పరిస్థితి దారుణంగా ఉందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రబీ పంటల సాగుపై వ్యవసాయశాఖ బుధవారం ఒక నివేదికను సర్కారుకు పంపించింది. ఆ నివేదిక ప్రకారం రబీ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 8.20 లక్షల (25%) ఎకరాల్లోనే సాగయ్యాయి. అందులో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.80 లక్షల (44%) ఎకరాల్లో సాగైంది. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.70 లక్షల (87%) ఎకరాల్లో వేశారు. ఇక వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.57 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.22 లక్షల (63%) ఎకరాల్లో సాగైంది. 18 జిల్లాల్లో వర్షాభావం... రాష్ట్రంలో రబీ సీజన్ మొదలైన అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కరువు ఛాయలు నెలకొన్నాయని వ్యవసాయశాఖ తెలిపింది. అక్టోబర్‌లో 83 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, నవంబర్‌లో ఏకంగా 95 శాతం లోటు రికార్డు అయింది. ఇక డిసెంబర్లో ఇప్పటివరకు 81 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు వేసిన అంచనా ప్రకారం రాష్ట్రంలోని 18 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 13 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి చేస్తుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నిర్మల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ దాడి అధికంగా ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. ఇక ఖరీఫ్‌లో వరి కోతలు కొనసాగుతున్నాయి. కంది ఇప్పుడే కోత దశకు చేరింది. జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్లన్నీ చేతికొచ్చాయి. ఇక పత్తి తీత చివరి దశకు చేరుకుంది. మిరప రెండో తీత దశలో ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. -
సిరిధాన్యాలను ఇప్పుడైనా విత్తుకోవచ్చు!
ఆరోగ్య సిరులను అందించే సిరిధాన్య పంటలను వర్షాకాలంలో నీటి వసతి లేని బంజరు భూముల్లోనూ సాగు చేయవచ్చని, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుంటే ఈ కాలంలో కూడా నిశ్చింతగా సాగు చేసుకోవచ్చని అటవీ వ్యవసాయ నిపుణుడు, స్వతంత్ర ఆహార – ఆరోగ్య నిపుణుడు డా. ఖాదర్ వలి(మైసూర్) తెలిపారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ధ్యానహిత హైస్కూల్లో జరిగిన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. కొర్రలు, సామలు, ఊదలు, అండుకొర్రలు, అరికలను అనుదినం ప్రధాన ఆహారంగా తింటూ కషాయాలు తాగుతూ వేలాది మంది సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటున్నారని.. ఈ దశలో రైతులు ఈ సిరిధాన్యాలను విరివిగా సాగు చేయటం అవసరమని ఆయన అన్నారు. అయితే, ఎప్పుడు విత్తుకున్నా.. కోత సమయంలో వర్షాలు లేకుండా ఉండేలా జాగ్రత్తపడాలన్నారు. పొలంలో స్ప్రింక్లర్లు ఉండి, కోత కోసిన పనలు వర్షానికి తడవకుండా దాచుకోవడానికి తగినంత పెద్ద గోదామును సమకూర్చుకోగలిగిన రైతులు ఏ కాలంలోనైనా సిరిధాన్యాలను సాగు చేయవచ్చన్నారు. అండుకొర్రలు 70–80 రోజుల పంటైతే అరికలు 6 నెలల పంట. ఫిబ్రవరిలోగానే అన్ని పంటలూ చేతికి వచ్చేలా, అందుకు తగిన పంటలను మాత్రమే వేసుకోవాలన్నారు. 5 ఎకరాలున్న రైతు ప్రతి ఎకరంలోని 75 సెంట్లలో ఒక రకం సిరిధాన్యం సాగు చేస్తూ.. మిగతా 25 సెంట్లలో పప్పుధాన్యాలు, నువ్వు, కుసుమ వంటి నూనెగింజ పంటలతోపాటు బంతి, ఆముదం మొక్కలను సాళ్లు సాళ్లుగా విత్తుకోవాలన్నారు. అప్పుడు ఆ 5 ఎకరాల్లో 5 రకాల సిరిధాన్యాలతోపాటు మధ్యలో ఇతర పంటలు వేసుకోవాలన్నారు. స్ప్రింక్లర్లతో వారానికో తడి చాలు.. వారానికోసారి 25–30 నిమిషాల పాటు సాయంత్ర వేళలో స్ప్రింక్లర్లతో నీటిని చల్లుకునే అవకాశం కల్పించుకోగలిగిన రైతులు ప్రస్తుత రబీ పంట కాలంలో కూడా సిరిధాన్యాలను నిశ్చింతగా సాగు చేసుకోవచ్చని డా. ఖాదర్ అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడనవసరం లేదన్నారు. పశ్చిమ కనుమల్లో నుంచి తెచ్చిన కోటానుకోట్ల జాతుల సూక్ష్మజీవ రాశితో కూడిన ‘అటవీ చైతన్య’ ద్రావణాన్ని సాయంత్ర వేళలో పంట భూమిపై పిచికారీ చేస్తే సిరిధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనెగింజలను ఒకే పొలంలో పక్కపక్కనే సాళ్లుగా విత్తుకొని సాగు చేసుకోవచ్చని తెలిపారు. బంజరు భూమినీ సారవంతం చేయొచ్చు రాళ్లతో నిండిన బంజరు భూమిపై అయినా వారానికోసారి సాయంత్ర వేళలో అటవీ చైతన్యాన్ని పిచికారీ చేస్తే 3 నెలల్లోనే ఆ భూమి సారవంతంగా పంటల సాగుకు అనుగుణంగా మారుతుందన్నారు. ఎండ తగలని సాయంత్ర సమయాల్లోనే అటవీ చైతన్య ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. ఇందులోని సూక్ష్మజీవ రాశి భూమి లోపలికి చొచ్చుకువెళ్లి భూమిని సారవంతం చేస్తాయన్నారు. తాను మైసూరు దగ్గరలో 8 ఎకరాల బంజరు భూమిని తీసుకొని ఈ పద్ధతుల్లో అనేక ఏళ్లుగా సిరిధాన్యాలు, ఇతర పంటలు పండిస్తున్నామని, ఎవరైనా సందర్శించవచ్చన్నారు. అటవీ చైతన్యం లీటరు తీసుకున్న రైతు 21 రోజులకోసారి తిరిగి తయారు చేసుకుంటూ జీవితాంతం వాడుకోవచ్చని, ఇతర రైతులకూ పంపిణీ చేయవచ్చన్నారు. పావు కేజీ సిరిధాన్యాల పిండి, 50 గ్రాముల బెల్లం/తాటి బెల్లంతో పాటు ఒక లీటరు అటవీ చైతన్య ద్రావణాన్ని 20 లీటర్ల నీటి కుండలో కలిపి.. వారం రోజులు పులియబెడితే.. అటవీ చైతన్యం తయారవుతుంది. పందులను పారదోలే సరిహద్దు పంటగా అరిక అరికల పంటను పొలం చుట్టూ 15 అడుగుల వెడల్పున సరిహద్దు పంటగా వేసుకుంటే.. అడవి పందుల నుంచే కాకుండా ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చని డా. ఖాదర్ తెలిపారు. అరిక ఆకుల నుంచి వెలువడే ప్రత్యేక వాసనలు జంతువులను పంట పొలాల దరి చేరకుండా చూస్తాయన్నారు. అందుబాటులో అటవీ చైతన్య ద్రావణం రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ధ్యానహిత హైస్కూల్ ఆవరణలో రైతులకు అటవీ చైతన్య ద్రావణాన్ని లీటరు చొప్పున డా. ఖాదర్ పంపిణీ చేశారు. అటవీ చైతన్యం కోసం షాబాద్ ధ్యానహితకు చెందిన దత్తా శంకర్(86398 96343)ను లేదా మైసూరుకు చెందిన అటవీ కృషి నిపుణుడు బాలన్ కృష్ణన్(97405 31358)ను సంప్రదించవచ్చు. రైతుకు అటవీ చైతన్య ద్రావణం సీసాను అందజేస్తున్న డా. ఖాదర్ వలి -
తెలంగాణకు 24.. ఏపీకి 9..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలంలో లభ్యతగా ఉన్న 33 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 24 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 9 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇరురాష్ట్రాల సాగునీటి అవసరాల దృష్ట్యా ఈ నెలాఖరు వరకు ఈ నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చింది. నాగార్జున సాగర్ వద్ద కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో శుక్రవారం జలసౌధలో కమిటీ సమావేశమైంది. బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధరరావు, వెంకటేశ్వరరావు, నాగార్జున సాగర్ సీఈ ఎస్.సునీల్, కర్నూలు సీఈ నారాయణ రెడ్డి, అంతర్రాష్ట్ర జలవనరుల సీఈ నరసింహారావు పాల్గొన్నారు. 60 టీఎంసీలు వాడుకోలేదు: ఏపీ భేటీ సందర్భంగా తొలుత ఏపీ తన అవసరాలను పేర్కొంది. జనవరి 10న జరిగిన కృష్ణా బోర్డు కమిటీ సమావేశంలో తమకు కేటాయించిన 60 టీఎంసీలను ఇంకా పూర్తిగా వాడుకోనేలేదని, అందులో మిగిలిన కోటాతో కలిపి తమకు 30.38 టీఎంసీల నీటి అవసరాలు ఉన్నాయని ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. తమకు కేటాయించిన 60 టీఎంసీలకు మించి వాడుకున్నామని బోర్డు సభ్య కార్యదర్శి లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. సాగర్ ఎడమ కాల్వకు ఫిబ్రవరి 26 వరకు 16.728 టీఎంసీలు ఏపీ వాడుకున్నట్లు లేఖలో పేర్కొన్నారని, నిజానికి ఏపీ సరిహద్దు వద్ద కేవలం 7.49 టీఎంసీలు మాత్రమే చేరిందని తెలిపారు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా నీటి కోటా పూర్తయిందనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాగర్ కుడి కాల్వకు 10.66 టీఎంసీలు, ఎడమ కాల్వకు 7.72 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 8 టీఎంసీలు, హంద్రీనివాకు 4 టీఎంసీలు అవసరమని, ఆ మేరకు కేటాయింపులు జరపాలని కోరారు. మార్చి చివరికి 515 అడుగులు.. మార్చి 20 వరకు సాగర్ మట్టం 520 అడుగులు ఉండేలా రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. మార్చి చివరికి 515 అడుగుల నీటిమట్టం ఉండేలా ఒప్పందం కుదిరింది. ఇందుకు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను సాగర్‌కు విడుదల చేసేందుకు ఏపీ అంగీకరించింది. ఇరురాష్ట్రాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ తర్వాత రెండు ప్రాజెక్టుల్లోనూ కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లి నీటిని తీసుకోవాలని నిర్ణయించాయి. రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు సంబంధించి ఏప్రిల్‌లో మళ్లీ ఉత్తర్వులు జారీ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. లభ్యత నీరంతా మాకే: తెలంగాణ అయితే ఏపీ ప్రతిపాదనలపై తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తింది. ఇప్పటికే అదనంగా 2 టీఎంసీలకు మించి వినియోగం చేసిందని, వాటా పూర్తయిందని బోర్డు చెబుతున్నా, హంద్రీనివా ద్వారా నిరంతరం నీటిని తీసుకుంటూనే ఉంటోందని స్పష్టం చేసింది. ప్రస్తుత లభ్యత నీరంతా తెలంగాణకే దక్కుతాయని పేర్కొంది. వచ్చే ఆగస్టు వరకు తెలంగాణకు 46 టీఎంసీల అవసరం ఉన్నట్టు బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం రబీ పంటకు నీరు అందించాల్సి ఉందని వివరించింది. అయితే ఏపీ సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని బోర్డు సూచించడంతో మొత్తం కనీస నీటి మట్టాలకు ఎగువన లభ్యతగా ఉన్న 33 టీఎంసీల్లో 9 టీఎంసీలు ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించింది. దీనికి ఏపీ కూడా సానుకూలత వ్యక్తం చేసింది. -
రబీకి కష్టం.. పర్యాటకానికి పట్టం
సాక్షి, విజయవాడ : రబీ సాగు కోసం కృష్ణాడెల్టా రైతులకు నీరు ఇవ్వని ప్రభుత్వం పర్యాటక రంగం కోసం కృష్ణానదిలో కావాల్సిన మేర నిల్వచేయిస్తోంది. నాగార్జునసాగర్, పులి చింతల నుంచి నీటిని తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిని నిండుకుండలా మార్చుతోంది. ఎయిర్ షో, నేవీ మేళాతోపాటు ఉమెన్ పార్లమెంట్ వంటి జాతీయస్థాయి కార్యక్రమాలకు వచ్చే సందర్శకులను ఆకట్టుకునేం దుకు బ్యారేజీ ఎగువన పూర్తి స్థాయి నీటి నిల్వ చేస్తున్నారు. ఒక వైపు నీటి కోసం కృష్ణాడెల్టా రైతులు ఎదుర్కొం టున్న కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం, పర్యాటక కార్యక్రమాలకు మాత్రం పెద్దపీట వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ రిజర్వాయర్‌లో 3.071 టీఎం సీలు నిల్వ చేయొచ్చు. గత ఏడాది ఇదే సమాయానికి కేవలం 2.21 టీఎంసీలు మాత్రమే బ్యారేజీలో ఉంది. ప్రస్తుతం 2.72 టీఎంసీల నీటితో బ్యారేజీ ఎగువైపు కృష్ణానది తొణికిసలాడుతోంది. మరో ఒకటి రెండురోజుల్లో నీటి నిల్వ మూడు టీఎంసీలకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఫిబ్రవరిలో బ్యారేజీలో 3 టీఎంసీల నీరు ఉండేది. రాష్ట్ర విభజన తరువాత ఫిబ్రవరి మొదటి వారం నుంచే నీటినిల్వలు తగ్గించడం ప్రారంభిస్తున్నారు. పుష్కరాల సమయంలో నదీతీరాన్ని అభివృద్ధి చేశారు. వారాంతపు, జాతీయస్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తూ తీరాన్ని పర్యాటకకేంద్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో బ్యారేజీ ఎగువన సాధ్యమైనంత ఎక్కువ రోజులు పూర్తిస్థాయి నీటి నిల్వలను ఉంచాలని అధికారులకు ఆదేశాలు అందాయని సమాచారం. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు కంటే ప్రకాశం బ్యారేజీలోనే ఎక్కువ నీరు నిల్వ ఉండటం గమనార్హం. సాగర్ నుంచి ఆరు టీఎంసీలు... పులిచింతల్లో రెండు టీఎంసీలు... పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 2.14 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఈ నీటి నుంచి రోజుకు మూడు నాలుగు వేల క్యూసెక్కుల చొప్పున ప్రకాశం బ్యారేజీలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నీటి మట్టం 3.071 టీఎంసీలకు చేరేవరకు నీటిని వదులుతూనే ఉంటారు. పులిచింతల్లో నీటి మట్టం పెంచుకునేందుకు నాగార్జునసాగర్ నుంచి 6 టీఎంసీల నీటిని వదలాలని ఇటీవల ఇరిగేషన్ ఇంజినీర్లు కృష్ణాడెల్టా వాటర్ బోర్డు అధికారులను కోరారు. ఈ మేరకు సాగర్ నుంచి రోజుకు ఐదారువేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ నీటిని పులిచింతలలో నిల్వ చేసి, వేసవిలో తాగునీటికి వదులుతారు. బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి నిల్వ ప్రకాశం బ్యారేజీలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేస్తున్నాం. ఇందుకు పులిచింతల నుంచి నీరు తీసుకుంటున్నాం. జిల్లాలోని చెరువుల్లో 65 శాతం నీటి నిల్వ లు ఉన్నాయని సమాచారం ఉంది. చిన్నచిన్న చెరువుల్లో నీరు తగ్గి ప్రజలు ఇబ్బంది పడితే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తాం. మార్చి ఆఖరులోనే కాల్వ లకు నీటిని వదులుతాం. రబీకి నీరు ఇవ్వలేమని ముందే చెప్పాం. పర్యాటకం కోసం కాకుండా గ్రామస్తుల తాగునీటి కోసం బ్యారేజీ రిజర్వాయర్‌లో నిల్వ చేస్తున్నాం. – సుగుణాకరరావు, ఎస్ఈ -
రబీ జోష్.. సాగు భేష్..!
• 12.08 లక్షలకు 9.26 లక్షల హెక్టార్లలో పంటలు • పప్పుధాన్యాల సాగుకు పెరిగిన ప్రాధాన్యం • 142 శాతంగా పప్పుధాన్యాల సాగు • ఆరు జిల్లాల్లో 100 నుంచి 127 శాతం.. • రాష్ట్రంలో సగటున 77 శాతం పంటల సాగు సాక్షి, కరీంనగర్: కాలం కలసిరావడంతో ఈసారి రబీసాగు మంచి జోష్‌లో ఉంది. రెండు మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా సాగు జోరందుకుంది. తెలంగాణలో 31 జిల్లాల్లో ఇప్పటికే సగటున 77 శాతానికి చేరింది. మొత్తంగా పారిశ్రామిక ప్రాంతమైన మేడ్చల్‌ను మినహాయిస్తే ఐదు జిల్లాల్లో 25 నుంచి 50 శాతం, 11 జిల్లాల్లో 51 నుంచి 75 శాతం, ఏడు జిల్లాల్లో 76 నుంచి 100 శాతం కాగా, ఆరు జిల్లాల్లో 100 నుంచి 127 శాతానికి సాగు పెరిగింది. పంటల సాగుపై వ్యవసాయశాఖ అంచనాలతో పోలిస్తే ఆరుతడి పంటలు ఎక్కువగా వేశారు. కందు లు, శనగ, పెసర, మినుముల సాగు 100 నుంచి 127% కాగా, మొక్కజొన్న, వేరుశనగ 76% నుంచి 100% అయ్యింది. తర్వాతి స్థానంలో వరి, జొన్న, మిర్చి, పొగాకు, ఆ తర్వాత గోధుమ, రాగులు, ఉల్లి, పొద్దుతిరుగుడు పంటలు సాగయ్యాయి. పప్పుధాన్యాలకు పెరిగిన ప్రాధాన్యం రాష్ట్రంలో మొత్తంగా చూస్తే వ్యవసాయశాఖ అంచనాలను మించి పప్పుధాన్యాల సాగు కు రైతులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వరి, గోధుమ, జొన్న, సజ్జలు, మొక్కజొన్న తదితర ముతక ధాన్యాలు 2.10 లక్షల హెక్టార్లలో సాగవుతాయని అంచనా వేయగా.. 1.61 లక్షల హెక్టార్ల (77శాతం) లో వేశారు. కందులు, శనగ, పెసర, మినుములు తదితర పప్పుధాన్యాలు 1.27 లçక్షల హెక్టార్ల సాగు అంచనాకు 1.79 లక్షల హెక్టార్ల (142 శాతం)లో సాగు చేశారు. ఇందులో కందులు 154 శాతం, శనగలు 158, పెసర 124 శాతం వేశారు. మిర్చి సాగు 118% కాగా, వేరుశనగ 95%గా నమోదయ్యింది. మొత్తంగా నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ తదితర నూనెగింజలు 1.95 లక్షల హెక్టార్లలో సాగవుతాయనుకుంటే, 1.57 లక్షల హెక్టా ర్లతో 81 శాతంగా ఉంది. ఇదిలావుంటే ఈ రబీలో పంటల సాగు శాతం జిల్లాల వారీ గా చూస్తే అత్యధికంగా కామారెడ్డి, సిద్ది పేట, మహబూబాబాద్, వనపర్తి, ఆదిలా బాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 94 శాతం నుంచి 162 శాతం వరకు పంటలు సాగు కాగా, అత్యల్పంగా మేడ్చల్, రంగా రెడ్డి, నల్లగొండ, సంగారెడ్డి తదితర జిల్లాలు న్నాయి. ఇందులో కొన్ని పారిశ్రామిక ప్రాంతాలైనప్పటికీ అతి తక్కువ హెక్టార్ల లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. చి‘వరి’వరకు సా..గుతోంది నవంబర్ చివరివారం నుంచి ఊపందు కున్న వరినాట్లు తెలంగాణ జిల్లాల్లో ఇంకా సాగుతున్నాయి. ఈ రబీలో 5.33 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యం కాగా, ఇప్పటికీ 3.53 లక్షల హెక్టార్ల (66 శాతం)లో వేశారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే మూడింతలు ఎక్కువ అయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,12,241 హెక్టార్లు వరి సాగు లక్ష్యం కాగా, 74,998 హెక్టా ర్లలో సాగైంది. పెద్దపల్లి జిల్లాలో ముందు గానే వరినాట్లు మొదలు కాగా, 29,590 హెక్టార్ల సాగు అంచనాకు అత్యధికంగా 34,348 హెక్టార్లలో వరి వేశారు. సిద్ది పేటలో 29,997 హెక్టార్లకు 39,688 హెక్టార్లలో, నిజామాబాద్‌లో 51,923లకు 45,333 హెక్టార్లు వరి వేశారు. గద్వా లలో అసలే వరినాట్లు లేవు. నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, ఎల్ఎండీ తదితర ప్రాజెక్టుల కింద నీటి విడుదల ప్రణాళిక ఇటీవలే ప్రకటించగా వరినాట్లు ఇంకా సాగుతున్నాయి. -
మనకు 17.. ఏపీకి 35
- హైదరాబాద్ తాగునీటికి 4, సాగర్ ఎడమకాల్వకు 13 టీఎంసీలు - జనవరికి కృష్ణా జలాలను పంచుతూ బోర్డు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: అనేక తర్జనభర్జనల అనంతరం జనవరి 20 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంచుతూ కృష్ణా బోర్డు నిర్ణయం చేసింది. ప్రస్తుత లభ్యత నీటిలో తెలంగాణకు 17 టీఎంసీలు, ఏపీçకు 35 టీఎంసీలు పంచుతూ ఆదేశాలు జారీ చేసింది. జంట నగరాల తాగునీటి అవసరాల నిమిత్తం ఏఎంఆర్పీ కింద 4 టీఎంసీలు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 13 టీఎంసీలు కేటాయించింది. ఏపీకి కృష్ణా డెల్టాకింద 10 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వకు 15 టీఎంసీలు, ఎడమ కాల్వకు 3.1 టీఎంసీలు, హంద్రీనీవా కింద 7 టీఎంసీలు విడుదలకు అంగీకరించింది. ఈ మేరకు సోమవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ ఆదేశాలు జారీచేశారు. నిజానికి సాగర్ కింది సాగు అవసరాలతో పాటు హైదరాబాద్, నల్లగొండ జిల్లా అవసరాలకు కలిపి 56 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ కోరుతూ వచ్చింది. అయితే ఇటీవల పట్టిసీమ వినియోగ లెక్కలు, మైనర్ కింద వినియోగం లెక్కలను పక్కనపెడుతూ 130 టీఎంసీల లభ్యత జలాల్లో తెలంగాణకు 43, ఏపీకి 87 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు ప్రతిపాదించింది. రబీ సాగు ఆలస్యమవుతుండటం, రైతుల నుంచి నీటి విడుదలపై డిమాండ్ పెరుగుతుండటంతో దీనికి తెలంగాణ అంగీకరించింది. అయితే బోర్డు ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించే రీతిలో తనకు 106 టీఎంసీలు కావాలని కోరింది. ఈ వివాదం కొలిక్కి రాకపోవడంతో సోమవారం బోర్డు జనవరి వరకు నీటిని పంపిణీ చేస్తూ నిర్ణయం చేసింది. అపెక్స్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి శ్రీశైలం నుంచి సాగర్‌కు 30 టీఎంసీలు విడుదల చేయాలని సూచించింది. ఈ నీటి విడుదల పూర్తిగా పవర్ హౌస్ ద్వారానే జరగాలని ఆదేశించింది. చేసిన విద్యుదుత్పత్తిని ఎలా పంపిణీ చేసుకోవాలన్న దానిపై కేంద్ర విద్యుత్ శాఖతో చర్చించుకుని ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు నిర్ణయానికి రావాలని కోరింది. ప్రాజెక్టుల కింద కేటాయించిన నీటిని ఎలా వాడుతున్నారన్నది ఈఎన్సీలు గమనిస్తూ ఉండాలని, సాగర్, శ్రీశైలం నీటి విడుదలను సంయుక్త కమిటీలు పర్యవేక్షిస్తాయని స్పష్టం చేసింది. -
రబీలోనూ రైతులకు మొండిచెయ్యి
లక్ష్యం 9 వేల కోట్లు.. బ్యాంకులిచ్చింది 2 వేల కోట్లు ♦ కాడి పడేయడంతో గణనీయంగా తగ్గిపోయిన సాగు విస్తీర్ణం ♦ రుణాలందక రైతుల తిప్పలు.. పట్టించుకోని ప్రభుత్వం ♦ కరువు సాయంపైనా మీనమేషాలు ♦ ‘మాఫీ’ సొమ్ము అందకే రుణాలివ్వడం లేదంటున్న బ్యాంకులు సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్‌ను కరువు మింగింది.. వేసిన పంటలు వేసినట్టే మట్టిపాలయ్యాయి.. నష్టాలతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు.. కనీసం రబీలోనైనా గట్టెక్కుదామనుకున్న వారి ఆశలు అడియాసలవుతున్నాయి! రైతులకు ఉదారంగా రుణాలిచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకులు చేతులెత్తేశాయి. రుణాలిప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రబీలో రైతులకు బ్యాంకుల ద్వారా రూ.9,707 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటివరకు కేవలం రూ.2 వేల కోట్లే ఇచ్చారు. దీంతో అన్నదాత కాడి కిందపడేశాడు. ఫలితంగా సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడతల వారీగా ఇస్తుండడం వల్లే లక్ష్యం మేరకు రుణాలు అందించలేకపోతున్నామని బ్యాంకులు చెబుతున్నాయి. రబీలో మరీ దా‘రుణం’ రాష్ట్రంలో 35.82 లక్షల మంది రుణమాఫీ లబ్ధిదారులున్నారు. అందులో 2015-16 ఖరీఫ్‌లో 23.75 లక్షల మందికి మాత్రమే కొత్త రుణాలు మంజూరయ్యాయి. మిగిలిన 12.07 లక్షల మంది రైతులకు కొత్త రుణాలివ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి. ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.18,032 కోట్లు కాగా... బ్యాంకులు రూ. 14 వేల కోట్లే ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. అలాగే రబీ పంట రుణ లక్ష్యం రూ.9,707 కోట్లు కాగా... ఇప్పటివరకు బ్యాంకులు కేవలం రూ.2 వేల కోట్ల వరకే ఇచ్చాయి. అంటే.. లక్ష్యంలో కేవలం 20 శాతం అన్నమాట! సుమారు లక్షన్నర మంది రైతులు మాత్రమే రబీలో రుణాలు అందుకున్నట్లు సమాచారం. అదీగాక అనేక చోట్ల ప్రభుత్వం చెల్లించని రుణమాఫీ సొమ్మును బ్యాంకులు రైతుల నుంచి రాబడుతున్నాయి. మరికొందరి నుంచి ముక్కుపిండి మరీ వడ్డీ వసూలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రుణమాఫీపై సర్కారు వైఖరి వల్లే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు మాఫీ ప్రకటించింది. ఆ ప్రకారం రూ. 17 వేల కోట్లు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయిం చింది. 35.82 లక్షల రైతు ఖాతాలను గుర్తిం చింది. మొదటి విడతగా రూ. 4,230 కోట్లు మాఫీ ప్రకటించింది. ఆ మొత్తం జిల్లాల్లోని బ్యాంకులకు అందజేసింది. ఆ సొమ్ములో ఇప్పటివరకు రూ.4,086 కోట్లు రైతుల ఖాతాలో మాఫీ చేసినట్లు బ్యాంకులు తెలిపాయి. ఆ తర్వాత రెండో విడత రుణమాఫీ కింద ప్రభుత్వం 2 విడతలుగా మరో రూ.4,086 కోట్లు విడుదల చేసింది. ఇలా విడతల వారీగా సొమ్ము విడుదల చేస్తుండటంతో బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నాయి. కొందరు రైతుల నుంచి మిగిలిన సొమ్మును వసూలు చేస్తూనే ఉన్నాయి. దీనిపై దుమారం రేగినా ప్రభుత్వం స్పందించడం లేదు. మిగిలిన రెండు విడతల రుణమాఫీ సొమ్మును ఒకేసారి విడుదల చేస్తామని చెప్పినా.. ఆ తర్వాత అది సాధ్యం కాదంటూ చేతులెత్తేసింది. దీంతో రుణాలివ్వడానికి బ్యాంకులు రుణాలివ్వబోమని రైతులకు తెగేసి చెబుతున్నాయి. మరికొన్ని బ్యాంకులైతే ఇప్పటికీ రూ.లక్ష రూపాయల లోపు రుణాలకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. రబీ సాగు సగమే..:తెలంగాణలో రబీ సాగు విస్తీర్ణం ఇప్పటికీ 54% మించలేదు. రబీలో సాధారణంగా 31.32 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా.. 16.87 లక్షల ఎకరాల్లో (54%) మాత్రమే సాగు జరిగింది. అందులో సాధారణంగా 16.12 లక్షల ఎకరాల్లో జరగాల్సిన వరిసాగు 5.57 లక్షల ఎకరాల్లోనే సాగింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నా బ్యాంకులు ఆర్థికంగా సహకరించడం లేదు. జాడ లేని ఇన్పుట్ సబ్సిడీ ఒకవైపు బ్యాంకులు రుణాలివ్వక రైతులను ఇబ్బందికి గురిచేస్తుంటే... మరోవైపు ప్రభుత్వం కూడా పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 231 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించలేదు. కరువు సాయంగా రాష్ట్రానికి రూ.791 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటిం చింది. కానీ ఇప్పటికీ ఆ నిధులు విడుదల చేయలేదు. దీంతో ఇన్పుట్ సబ్సిడీ ఊసెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం దాటవేస్తోంది. ఇప్పటికీ పంట నష్టపోయిన రైతుల జాబితాలను సిద్ధం చేయకుండా వ్యవసాయ శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. సగానికిపైగా జిల్లాల నుంచి ఈ జాబితాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదు. దీంతో ఇన్పుట్ సబ్సిడీ కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. -
బక్కోడు... ఒక్క పిలుపిస్తే
⇒ కేసీఆర్ ప్రకటనకు స్పందించిన రైతన్న ⇒ వరి సాగుకు దూరం ⇒ జిల్లాలో భారీగా తగ్గిన రబీ సాగు విస్తీర్ణం ⇒ రోజుకు 2 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘కేసీఆర్ ఎంత మనిసయ్యా..! పిట్ట పిల్లంత మనిషి.. ఉఫ్‌మని ఊత్తే గాలికి ఎగిరి పడతడు.. గీడేంజేత్తరు అన్నరు... అవమానాల పాలుజేసిండ్రు... కానీ మీరంతా కేసీఆర్ మాట మీద నిలబడి ఉద్యమం జేసిండ్రు... ఇయ్యాల తెలంగాణ ఒక నిజం.’ గజ్వేల్ విజయోత్సవ సభలో కేసీఆర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు... కేసీఆర్ నినదిస్తే కోటి గొంతుకలు ఏకమయ్యాయి. ఒక్క పిలుపిస్తే ముక్కోటి జనం కదం తొక్కారు. ఆయన మాటే తెలంగాణ జనానికి ఉత్ప్రే రకం... దిశానిర్దేశం. జిల్లాలో మరోసారి ఇది రుజువయింది. ‘కరెంటుకు ఇబ్బంది ఉంది. రైతులు అర్థంజేసుకోవాలే. పంట వేయకపోతే ఆ బాదేందో నాకూ తెలుసు. నేను రైతు బిడ్డనే. రబీలో నీటి ఆధారిత పంటలు వేసుకోవద్దు. నన్ను నమ్ముర్రి. మూడేళ్ల తరువాత 365 రోజులు 24 గంటల కరెంటు ఇస్తాం. అంతవరకు కొద్దిగ ఓపిక పట్టండి’ అనిముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు రైతులు సానుకూలంగా స్పందించారు. ఎలాంటి ఆర్భాటం, ప్రచారం లేకుండానే మెదక్ జిల్లా రైతాంగం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించింది. రబీ సాగును రైతులు తగ్గించారు. దాదాపుగా ఆరుతడి పంటలకే పరిమితమయ్యారు. జిల్లాలో దాని ఫలితం కనిపిస్తోంది. వ్యవసాయం కోసం కేటాయించిన వాటాలో 40 శాతం కరెంటు మిగులుతోంది. ఈ కరెంటును గృహ అవసరాలకు మళ్లించడంతో జిల్లాలో కరెంటు కోతలు లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాకు రోజుకు 19.167 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. కానీ డిమాండ్‌కు తగినంత సరఫరా లేదు. ఇందులో 6 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి, 9 నుంచి 10 మిలియన్ యూనిట్లు పరిశ్రమలకు, మిగిలినది గృహ అవసరాల కోసం వినియోగిస్తున్నట్టు టాన్స్‌కో రికార్డులు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం రోజుకు 17. 057 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. రోజుకు దాదాపు 2.11 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉన్నా దాని ప్రభావం మాత్రం ఇప్పటివరకు జిల్లాపై పెద్దగా చూపలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా రాత్రి వేళల్లో నిరంతరాయ కరెంట్ ఉంటోంది. జిల్లాలో 2.22 లక్షల ఉచిత విద్యుత్ మోటార్ కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 5.58 లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయి. కేసీఆర్ పిలుపు ఫలితం.. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నేపథ్యంలో జిల్లా రైతాంగం రబీ సాగుకు దూరంగా ఉంది. ఒక్క ఘణపురం ప్రాజెక్టు ఆయకట్టు కింద మాత్రమే పంటలు సాగు చేశారు, ఇక్కడ కూడా కేవలం 30 శాతం మాత్రమే సాగు చేశారు. మిగతా మండలాల్లో కొద్దోగొప్పో ఆరుతడి పంటలు మినహాయిస్తే సాగు లేదనే చెప్పాలి. గత ఏడాది రబీ సీజన్లో 14,944 హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. అత్యధికంగా 62,331 హెక్టార్లలో వరి సాగు చేశారు. తరువాత స్థానాల్లో మిరప, పొద్దుతిరగుడు పంటలున్నాయి. ఈ పంటలకు సాగు నీరు అందించేందుకు గత ఏడాది ఇదే మాసంలో రోజుకు 3.080 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగం జరిగి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ ఏడాది కేవలం 60 వేల హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేశారు. ఇందులో వరి సాగు వాటా కేవలం 15 వేల హెక్టార్లు మాత్రమే. అదీ కూడా ఘణపురం ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న భూముల్లో మాత్రమే సాగు చేశారు. ఎక్కువగా నీటి తడి ఏమాత్రం అవసరం లేని శనగ, మొక్కజొన్న పంటలు వేశారు. ఫలితంగా విద్యుత్ వాడకం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు 0.860 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే వ్యవసాయానికి వినియోగం అవుతోందని, రైతులు ముందస్తుగానే పంటలు తగ్గించుకోవడంతో జిల్లాలో రోజుకు 2 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులుతోందని ట్రాన్స్‌కో అధికారులు చెప్పారు. ఇదే పిలుపు చంద్రబాబు ఇస్తే... 2003లో ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు లేక కరెంటు సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో చంద్రబాబు ‘వరి వద్దు... ఆరుతడి ముద్దు’ అనే నినాదంతో రైతులు రబీలో వరి వేయవద్దని ఆదేశించారు. అప్పట్లో బాబు నిర్ణయాన్ని రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన పిలుపుకు నిరసనగా రైతులు ఉద్యమాలు చేశారు. పట్టుబట్టి వరిసాగు చేశారు. ఆ తరువాత ఇదే నినాదం చంద్రబాబు నాయుడు ఓటమికి ఓ కారణమైంది. కానీ కేసీఆర్ పిలుపును మాత్రం రైతాంగం స్వాగతించింది. -
చిక్కిపోయిన రబీ
నిండుకున్న నీటి నిల్వలు రుణాలివ్వని బ్యాంకర్లు అప్పులు పుట్టక అవస్థలు సగానికి తగ్గిన సాగు విస్తీర్ణం బోర్ల కింద ఆయకట్టు సాగుకు దూరం 10 వేల ఎకరాలకు మించని వరి అపరాల పరిస్థితీ అంతే అన్నదాతపై ప్రకృతి పగబట్టింది. ఒక వైపు హుద్‌హుద్ రూపంలో విరుచుకుపడింది. చేతికొచ్చిన పంటను సర్వనాశనం చేసింది. మరో పక్క వరుణుడు ముఖం చాటేయడంతో చుక్కనీరు లేని పరిస్థితి. దీనికి తోడు ప్రభుత్వం చిన్నచూపు, బ్యాంకర్ల వివక్షతల కారణంగా చిల్లగవ్వ కూడా అప్పు పుట్టని పరిస్థితి. ఇలా ముప్పే టి దాడితో రైతన్నలు రబీకి సాగుకు రాంరాం చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఈసారి రబీ జాడ కనుమరుగైపోయింది. విశాఖపట్నం: జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం1.35లక్షల ఎకరాలు. వీటిలో 35వేల ఎకరాల్లో వరి సాగవుతుంటే, 70వేల ఎకరాల్లో అపరాలు, 10వేల ఎకరాల్లో వేరుశనగ, 10వేల ఎకరాల్లో మొక్క జొన్న, 5వేల ఎకరాల్లో నువ్వులు సాగవుతుంటాయి. మరో ఐదారువేల ఎకరాల్లో ఇతర పంటలు వేస్తుంటారు. ఏటా సుమారు 50వేల మందికి పైగా రైతులు రెండవ పంట వేస్తుంటారు. సీజన్ ముగుస్తున్నా.. సాధారణంగా అక్టోబర్ 15 తర్వాత ప్రారంభమయ్యే రబీ సీజన్ ఫిబ్రవరితో ముగుస్తుంది. వరైతే డిసెంబర్లో నారుమళ్లు పోసి జనవరిలో ఊడుస్తారు. ప్రస్తుతం ఫిబ్రవరి మొదటివారం ముగుస్తున్నా కనీసం 30 శాతం వరి ఊడ్పులు కూడా పూర్తి కాలేదు. అపరాల మాత్రమే 65 శాతం విస్తీర్ణంలో సాగవుతుండగా, ఇక ఇతర పంటలసాగు ఎక్కడా కనిపించడం లేదు. రబీలో 35 వేలఎకరాలకుపైగా వరిసాగవ్వాల్సి ఉండగా ప్రస్తుతం అతికష్టమ్మీద 10వేల ఎకరాలు కూడా దాటలేదు. ఇక అపరాలైతే 70వేల ఎకరాలకు 40వేల ఎకరాల వరకు సాగవుతున్నాయి. మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు పంటలైతే రబీ సీజన్లో 40వేల ఎకరాలకు 15వేల ఎకరాలకు మించలేదు. మొత్తంమీద లక్షా 25 వేల ఎకరాలకు 65వేల ఎకరాలకు మించి రబీ సాగు జరగడం లేదు. ముఖ్యంగా వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్ సరఫరా లేకే.. జిల్లాలో 20 వేలకు పైగా ఇరిగేషన్ బోర్‌వెల్స్ ఉన్నాయి. వీటి కిందే ఏకంగా లక్ష ఎకరాల వరకు సాగవుతుంటుంది. హుద్‌హుద్ తుఫాన్ కారణంగా జనవరి వరకు వీటికి విద్యుత్ పునరుద్ధరించ లేదు. దీంతో వీటి కింద సాగయ్యే ఆయకట్టు ప్రస్తుతం రెండవ పంటసాగుకు దూరమైపోయింది. మరో పక్క అక్టోబర్ తర్వాత కనీస వర్షపాతం కూడా నమోదుకాలేదు. రెండవ పంట పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి సాగు చేస్తుంటారు. మిగులు నీరు ఉంటేనే రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు అనుమతిస్తారు. ముఖం చాటేసిన బ్యాంకర్లు ఒక పక్క హుద్‌హుద్ దెబ్బకు గ్రోయిన్లు, స్లూయిజ్‌లు, చెక్ డామ్లు, కాలువలు, చెరువుల గట్లు దెబ్బతినడంతో రబీసాగుకు సరిపడా నీటి నిల్వలు నిండుకున్నాయి. మరో వైపు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రిజర్వాయర్లలో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోలేని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా రుణమాఫీ పుణ్యమాని బ్యాంకర్లు పూర్తిగా ముఖం చాటేయడంతో అప్పుపుట్టడం లేదు. దీంతో రబీ సాగుకు దూరంగా ఉండడమే మేలని మెజార్టీ రైతులు నిర్ణయించుకున్నారు. -
రబీ కష్టాలు గట్టెక్కేనా..?
31.40 టీఎంసీల సాగర్ నీరు అవసరం లేదంటే సాగు ప్రశ్నార్థకమే.. ఖమ్మం అర్బన్ : ఖరీఫ్‌లో కష్టాలు ఎదుర్కొన్న రైతులకు ఊరట కలగలేదు. రబీలోనూ అవస్థల మధ్య సాగర్ నీరు అందుతోంది. పంటలు చేతికి అందాలంటే ఖరీఫ్‌లో మిగిలి ఉన్న పంటలకు మార్చి 15, రబీలో సాగు చేసిన పంటలకు ఏప్రిల్ 15 వరకు నీరు అందాల్సి ఉంది. ఆయకట్టు లెక్క ప్రకారం 31.40 టీఎంసీల నీరు కావాల్సిందేనని ఎన్నెస్పీ అధికారులు నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఎన్నెస్పీ అధికారుల లెక్కల ప్రకారం ఖరీఫ్‌లో టేకులపల్లి సర్కిల్ (ఖమ్మం) పరిధిలోని జోన్ 1,2,3లో రైతులు 2 లక్షల 23 వేల 591 ఎకరాలు సాగు చేశారు. ప్రభుత్వం కేటాయించిన నీటి కేటాయింపుల ప్రకారం 35 టీఎంసీలను వాడుకున్నారు. ఇందులో లక్షా 20 వేల ఎకరాల వరకు వరి సాగు చేశారు. మిగిలిన ఎకరాల్లో రైతులు మొక్కజొన్న, మిరప తోటలు, వేరుశనగ తదితర ఆరుతడి పంటలు సాగు చేశారు. ఆరుతడి పంటలు సాగు చేసిన వాటిని పంట చేతికందే వరకు కనీసం 9.16 టీఎంసీలు నీరు అవసరం ఉందని, దీని ద్వారా లక్షా 11 వేల 565 ఎకరాల్లో పంట చేతికందుతుందని లెక్కలు చెబుతున్నాయి. రబీలో సాగులో ఉన్న లక్షా 39 వేల ఎకరాలకు 22.24 టీఎంసీలు నీరు అవసరం ఉంటుందని అధికారులు అంటున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో జోన్ 1,2,3లో లక్షా 20 వేల ఎకరాలు, నల్లగొండ జిల్లాలోని జోన్1 పరిధిలో 19 వేల 500 ఎకరాలకు నీరు అందిస్తే తప్ప పంట సక్రమంగా చేతికందే పరిస్థితి ఉంటుందంటున్నారు. ప్రధానంగా రబీలో కల్లూరు డివిజన్ పరిధిలోని కల్లూరు, తల్లాడ, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం తదితర మండలాల్లో అత్యధికంగా రైతులు వరి సాగు చేశారని చెబుతున్నారు. వీటితోపాటు వైరా చెరువు, పాలేరు చెరువు తదితర ప్రధాన జలాశయాల పరిధిలో కూడా రైతులు వరి సాగు చేశారు. అధికారికంగానే కాకుండా అనధికారికంగా వేలాది ఎకరాలను రైతులు వివిధ రకాల పంటను సాగు చేశారు. సాగునీటితోపాటు వేసవిలో తాగునీటి అవసరాలకు కూడా అదనంగా నీరు కేటాయింపులు చేయాల్సి ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి కాల్వల పరిధిలో చివరి భూములకు నీరు సక్రమంగా అందడం లేదని రైతులు ఎన్నెస్పీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆరురోజుల క్రితం ఎన్నెస్పీ ఎస్ఈని పాలేరు నియోజకవర్గంలోని రైతులు ఘెరావ్ చేసి ఆందోళనకు దిగారు. సాగునీరు అందించాలని కోరారు. సాగునీటి కోసం కల్లూరు డివిజన్ రైతుల నుంచి మరింత డిమాండ్ ఉందని ఎన్నెస్పీ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే సాగర్ జలాశయంలో నిల్వలు తగ్గడంతో డిమాండ్‌కు అనుగుణంగా నీరు అందించడం ప్రశ్నార్థకమేనని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి రబీ పంటలు చేతికి అందేలా చర్యలు చేట్టాలని రైతులు కోరుతున్నారు. -
ముందుకు సాగని రబీ
-
ముందుకు సాగని రబీ
వర్షపాతం లోటు 42 శాతం సాగుభూమి మొత్తం 25.89 లక్షల హెక్టార్లు సాగయింది 14.72 లక్షల హెక్టార్లలోనే.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రబీ సాగు ముందుకు సాగడం లేదు. తీవ్ర వర్షాభావం, సాగర్ కుడి కాల్వకు నీటి విడుదలపై అయోమయంతో వ్యవసాయశాఖ ఆశించిన మేరకు పంటలు పండలేదు. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించి వంద రోజులు దాటిపోయినా రాష్ట్రంలో ఎక్కడా చెప్పుకోదగిన వర్షాలు పడలేదు. సాగర్ కుడి కాల్వ కింద సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల వివాదంతో పంటలు పూర్తయ్యేంత వరకు నీరు వస్తుందో రాదో అంతుబట్టకుండా ఉంది. దీంతో సంక్రాంతికి వరి కోతలు ముగించే ప్రాంతాల్లో రెండో పంట వేయడానికి రైతులు వెనకాడుతున్నారు. రబీ సీజన్లో 25.89 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయన్నది వ్యవసాయ శాఖ లెక్క. మామూలు పరిస్థితుల్లో ఇప్పటికి 90 శాతం పంటలు వేయడం పూర్తి కావాలి. కానీ 59 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికి 18.75 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉంటే 14.72 లక్షల హెక్టార్లలో పంటలు పడ్డాయి. రాయలసీమ జిల్లాల్లో వేసిన మొక్కజొన్న, రాగి, శనగ, వేరుశనగ, పెసర, పొద్దుతిరుగుడు వంటి మెట్ట పంటలు నీళ్లు లేక వాడిపోతున్నాయి. ఏ జిల్లాలోనూ సాగు పరిస్థితి సంతృప్తికరంగా లేదు. 7 జిల్లాల్లో 25 శాతం, 6 జిల్లాల్లో 26 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు వేసినట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. ఇక వర్షపాతం లోటు కూడా నానాటికీ పెరిగిపోతోంది. గత వారంలో 40 శాతంగా ఉన్న లోటు ఇప్పటికి 42 శాతానికి చేరింది. రాష్ట్రంలోని 13 జిల్లాలూ వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 10.7 శాతం, విజయనగరంలో 4.9, విశాఖలో 19.4, తూర్పుగోదావరిలో అత్యధికంగా 49.8, పశ్చిమ గోదావరిలో 44.7, కృష్ణాలో 41.7, గుంటూరులో 39.2, ప్రకాశంలో 46.6, నెల్లూరులో 45.2, చిత్తూరులో 46.2, కడపలో 49.4, అనంతపురంలో 44.5, కర్నూలు జిల్లాలో 32.8 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటి నుంచి ఇప్పటికి కురవాల్సిన వర్షపాతం 855.3 మిల్లీమీటర్లు కాగా 549.7 మిల్లీమీటర్లు నమోదైంది. సాగు పరిస్థితి ఇలా.. మాగాణి భూముల్లో మొక్కజొన్న సాగుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల ఇప్పటికే నువ్వు విత్తారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పొగాకు నాట్లు ఊపందుకున్నాయి. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలకు తెగుళ్లు సోకడంతో రైతులు నానా ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో సైతం నానాటికీ నీటి నిల్వ తరుగుతోంది. గత ఏడాది ఇదేకాలానికి 565 అడుగుల నీళ్లు ఉంటే ప్రస్తుతం 555 అడుగుల మేరకే నీరుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కుడి కాల్వ కింద రబీలోనే అత్యధికంగా వరి సాగుచేస్తుంటారు. ప్రస్తుతం వేసిన పంట చేతికి రావాలంటే కనీసం మరో నెల రోజులైనా నీళ్లు ఇవ్వాల్సి ఉంది. ఇక జిల్లాల వారీగా సాగు విస్తీర్ణం చూస్తే శ్రీకాకుళంలో అత్యధికంగా సాగయింది. 69,454 హెక్టార్లకుగాను ఇప్పటికి 61,791 హెక్టార్లలో పంటలు పడ్డాయి. అతితక్కువగా తూర్పు గోదావరి జిల్లాలో 29,823 హెక్టార్లకుగాను 8,976 హెక్టార్లలో మాత్రమే పంటలు వేసినట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. -
తేల్చాల్సింది మీరే..!
సయోధ్య కుదరనందున మీ జోక్యం తప్పనిసరి కృష్ణా బోర్డుకు తెలంగాణ మరో లేఖ సాక్షి,హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ తెలంగాణ సర్కారు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది. నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరని దృష్ట్యా రబీ అవసరాలకు నీటి కేటాయింపులపై బోర్డే స్వయంగా కల్పించుకొని పరిష్కరించాలని కోరింది. రాష్ట్రంలో ఇప్పటికే సాగర్ ఎడమ కాల్వ కింద పంటల సాగు మొదలైనందున లభ్యత కలిగిన నీటిలో అవసరమైన మేరకు నీటిని వాడుకునే అవకాశం కల్పించాలని కోరింది. కృష్ణా నీటి లెక్కలపై ఏపీ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసిన నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ ఉండాలన్న దానిపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులతో చర్చలు జరిపారు. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను ఎక్కడా ఉల్లంఘించకుండా, కేటాయింపుల మేరకే నీటిని వాడుకుంటున్నామని తెలుపుతూ బోర్డుకు, కేంద్ర జల వనరుల శాఖకూ లేఖ రాయాలని భావించారు. కేంద్ర జల వనరుల శాఖకు లేఖ రాసే విషయమై ముఖ్యమంత్రి కేరళ పర్యటన ముగించుకొని వచ్చాక నిర్ణయం తీసుకుందామని, బోర్డుకు వాస్తవ గణాంకాలతో లేఖ రాయాలని మంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు లేఖ సిద్ధం చేసి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాకు మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపారు. లేఖలో ప్రస్తుతం సాగర్‌లో ఉన్న 101 టీఎంసీల నీటిలో ఏపీకి దక్కే వాటా ఏమీలేదని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. ‘కృష్ణా జలాలపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు 811 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీల హక్కు కలిగి ఉన్నాయి. తుంగభద్ర ఎగువన, సాగర్ దిగువన ఉన్న కేటాయింపులు మినహాయిస్తే.. జూరాల మొదలు సాగర్ వరకు తెలంగాణ 200, ఏపీ 281 టీఎంసీల హక్కు కలిగిఉన్నాయి. వీటికి తోడు ప్రస్తుత ఏడాది సాగర్‌లోకి వచ్చిన 137 టీఎంసీలను కలుపుకుంటే మొత్తంగా 618 టీఎంసీలు అవుతుంది. ఇందులో 68 టీఎంసీలు ఆవిరి నష్టాల కింద లెక్కకడితే అందుబాటులో ఉన్న 550 టీఎంసీలను తెలంగాణ 229, ఏపీ 321 టీఎంసీల మేర వాడుకోవాలి. ఇప్పటికే ఏపీ 321 టీఎంసీలకు అదనంగా మరో 8 టీఎంసీలను వాడుకోవడంతో అది 329 టీఎంసీలు వాడుకున్నట్లవుతుంది. ఇప్పుడు మిగిలిన ఖరీఫ్ అవసరాలకు 41 టీఎంసీలు, మిగిలిన రబీ అవసరాలకు మరో 155 టీఎంసీలు కావాలని కోరుతోంది. ఇది అసమంజసం. కృష్ణా డెల్టా కింద సైతం 152.2 టీఎంసీల కేటాయింపులుంటే ఖరీఫ్‌లోనే 155 టీఎంసీలు వాడుకుంది. ఖరీఫ్‌కు అదనంగా డెల్టాకు మరో 26 టీఎంసీలు కోరుతోంది. వాటాకు మించి కోటాను వాడుకొని, లభ్యత ఉన్న 101 టీఎంసీల్లో వాటా కోరుతోంది. మానవతా దృక్పథంతో ఏపీ ఖరీఫ్ అవసరాలకు 30 టీఎంసీలను అప్పుగా ఇస్తామని, తర్వాతి సీజన్లో దాన్ని సర్దుబాటు చేసుకుందామని ప్రతిపాదించినా ఏపీ అంగీకరించడం లేదు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కష్టంగా మారినందున వివాదానికి తెరదించేందుకు మీ జోక్యం తప్పనిసరి’ అని లేఖలో తెలంగాణ పేర్కొన్నట్లుగా తెలిసింది. -
ముందస్తు సాగు.. మహా జాగు
* రుణాలు అందక మొదలుకాని రబీ నాట్లు * 30 శాతమైనా పూర్తికాని నారుమడులు * నెలాఖరులోగా నాట్లు వేయడం కష్టమేనంటున్న అన్నదాతలు * రుణాలు అందకపోవడమే ప్రధాన కారణం ఏలూరు : గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది రబీ సాగు ముందుగానే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ నిర్ణరుుంచింది. ఈ మేరకు రైతులకు సూచనలూ చేసింది. క్షేత్రస్థారుులో మా త్రం ముందస్తు రబీ సాగుకు పరిస్థితు లు అనుకూలిం చడం లేదు. డిసెంబర్ 31లోగా నాట్లు పూర్తి చేయూలని అధికారులు తొందరపెడుతుండగా, ఆ సమయూనికి కనీసం నారుమడులైనా పూర్తిచేసే అవకాశాలు కనిపించడం లేదు. అన్నదాతకు అడుగడుగునా ఆటంకాలు ఎదురు కావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రుణాలేవీ రుణమాఫీ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో రైతులకు పంట రుణాలు అందటం లేదు. ఇప్పటివరకు అధికారులు వ్యవసాయ రుణ ప్రణాళికను ఖరారు చేయలేదు. డీసీసీబీ ద్వారా ఏ మేరకు రుణాలు ఇస్తారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నా. రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసే తతంగం జనవరి నెలాఖరు వరకు కొనసాగేలా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కనీసం ఒక్క రైతుకైనా బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేదు. రుణమాఫీ సొమ్ములు ప్రభుత్వం నుంచి జమ అయితేనే కొత్తగా రుణాలిస్తామని బ్యాంకర్లు, సొసైటీ అధికారులు చెబుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి అరుుతే మరీ దయనీయంగా ఉంది. జిల్లాలో రెండు లక్షలకు పైగా కౌలు రైతులు ఉండగా, వారికి రుణాలు ఎప్పుడిస్తారు, ఎంత ఇస్తారనేది నిర్ణయం కాలేదు. నీటి లభ్యతపైనా అనుమానాలు గోదావరి డెల్టా పరిధిలో దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు చేయూల్సి ఉంది. నూరు శాతం ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అధికారులు, యంత్రాంగం చెబుతున్నా గత అనుభవాలను బట్టి చూస్తే అది సాధ్యమవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నారుు. గోదావరిలో నీటి లభ్యత తగ్గిపోతోందని, యుద్ధప్రాతిపదికన నారుమడులు వేసి ఈనెలాఖరు నాటికి నాట్లు పూర్తి చేసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీర్మానం సైతం చేశారు. ఆ దిశగా రైతులను సమాయత్తం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. మార్చి నెలాఖరు నాటికి కాలువలకు నీటిని నిలుపుదల చేసి డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుండగా, ఆ సమయూనికి పంటలు పూర్తయ్యే అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు. నీరున్నా కృష్ణా డెల్టాకు ఇవ్వరేం కృష్ణా డెల్టా పరిధిలోని వరి చేలకు సాగునీరిచ్చే విషయంలో సర్కారు రైతులను వంచిస్తోంది. కృష్ణా నదిలో నీరున్నా రైతుల అవసరాలకు నీటిని విడుదల చేయడం లేదని, ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేస్తామని సర్కారు చెప్పడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కృష్ణా కాలువ కింద ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలాల్లోని 50వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. రబీలో ఏటా ఇక్కడి భూములకు సాగునీరు అందించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. 30 శాతం నారుమడులు పూర్తి జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగుకు 1.20 లక్షల హెక్టార్ల నారుమడి అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ 40 వేల హెకార్ల మేర నారుమడులు వేశారు. ఇదికూడా మెట్ట ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. ఈ నెలాఖరు నాటికైనా నారుమడులు పూర్తిస్థారుులో వేసే అవకాశం కనిపించడం లేదు. అలా చేయకపోతే జనవరి నెలాఖరు నాటికైనా నాట్లు పూర్తిచేయలేమని వ్యవసాయ శాఖ ఆందోళన చెందుతోంది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి కోతలు పూర్తరుుతే తప్ప డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టలేమని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అదును దాటితే డెల్టాలో వరి సాగుకు నీరివ్వలేమని చేతులెత్తేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం ఈ నెలాఖరు నాటికి రబీ నాట్లు పూర్తి చేసేలా రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది విత్తనాలు, ఎరువుల కొరత ఏ మాత్రం లేదు. అన్ని సవ్యంగానే ఉన్నాయి. పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఆకివీడు తదితర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు పడుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి కనీసం 50 శాతం విస్తీర్ణంలో అరుునా నాట్లు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటాం. - సారుులక్ష్మీశ్వరి, జేడీ, వ్యవసాయ శాఖ -
ఏడిపిస్తున్న యెవుసం..
నేల తల్లిని నమ్ముకుని బతుకు ఈడుస్తున్న రైతుకు కష్టకాలం వచ్చి పడింది. కాడిని వదిలి కూలీగా మారాల్సిన దుస్థితి వచ్చింది. ఏటా అతివృష్టి.. అనావృష్టి.. ఏదో ఒకదాని బారిన పడుతూ నష్టాలను చవిచూస్తున్నారు. సాగుకు దిగుదామంటే బ్యాంకులు రుణాలివ్వక.. వరుణుడు కరుణించక.. ప్రభుత్వాలూ ఆదుకోక.. ఆందోళన చెందుతున్నారు. పంట కోసం చేసిన అప్పుల కుంపటిని వేగలేక ‘చితి’కి పోతున్నారు. కొత్త అప్పు చేయలేక.. చేద్దామన్నా ఇచ్చేవారు లేక సాగుకు గుడ్‌బై చెబుతున్నారు. ఖరీఫ్‌లో నష్టాలనే ఎదుర్కొన్న రైతులు రబీ సాగుపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికీ రుణాలు లేక.. కరెంటు కోతలు భరించలేక.. ప్రాజెక్టుల నుంచి నీరొచ్చే మార్గం లేక వ్యవసాయ శాఖ వేసిన అంచనా తారుమారైంది. 90 వేల హెక్టార్లు సాగు చేస్తారనుకుంటే 19 వేల హెక్టార్లకే పరిమితం కావడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో అన్నదాతను ఈ ఏడాది ప్రారంభం నుంచీ సమస్యలు వెంటాడుతున్నాయి. గతేడాది అతివృష్టితో నష్టపోతే ఈ ఏడాది అనావృష్టితో పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్ సాగు నుంచి ప్రారంభమైన కష్టాలు.. రబీలోనూ తప్పడం లేదు. ప్రతి సంవత్సరం జూన్ మాసంలో రుతు పవనాలు వస్తే ఈ ఏడాది రెండున్నర నెలల పాటు ఆలస్యంగా వచ్చాయి. వాతావరణ శాఖ వారు ముందుగా తెలిపిన సమాచారం ప్రకారం జూన్ మాసంలో విత్తనాలు వేసుకున్న రైతులు వర్షాలు కురవక వేసిన విత్తనాలు ఎండకు మాడిపోయాయి. ఇలా జిల్లాలో రెండు నుంచి మూడేసి సార్లు రైతులు విత్తనాలను విత్తుకున్నారు. ఖరీఫ్ కష్టాలను ఎదుర్కొని తీవ్ర నష్టాల్లో మునిగిన రైతన్న రబీ సాగులో వ్యవసాయమంటేనే నిరసక్తత చూపుతున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. జిల్లాలో ఈ ఏడాది రబీలో 90,110 హెక్టార్లలో సాగువుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ.. ఇప్పటివరకు 19 వేల 434 హెక్టార్లలో మాత్రమే సాగైంది. సాగు సమయం గడుస్తున్నా.. రబీ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దగ్గర పడుతున్నా సగం వరకు కూడా సాగు కాకపోవడం ఆందోళనకు గురిచేసే అంశం. గతేడాది ఇప్పటి వరకు 50 వేల హెక్టార్లలో సాగవ్వగా ఈసారి ఇప్పటి వరకు 19 వేల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగు చేసుకున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఆరుతడి పంటలు సాగు వేయాలని సూచిస్తున్నా రైతులు మాత్రం సాగు చేయడానికి సాహసించడం లేదు. పంటల సాగుకు పూ ర్తి పదును, వర్షాలు లేకపోవడం, మరోపక్క చెరువులు, కుంటలు, డ్యామ్‌లలో నీరు అడుగంటడం, దీనికితోడు వేసవిలో వచ్చే విద్యుత్ కోతలు ఇప్పటి నుంచే అమలవుతుండడం.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున రబీ సాగుకు రైతన్నలు ముందడుగు వేయడంలేదు. దీనికితోడు డిసెంబర్ వరకు జిల్లాలో సాధారణ వర్షాపాతం 1088.6 మిల్లీమీటర్లకు గాను 734.9 మి.మీ కురిసింది. 33 శాతం లోటు వర్షాపాతం నమోదైంది. ఫలితంగా భూగర్భ జలాలూ అడుగంటుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో పంటలు సాగు చేసి నష్టపోవడంకంటే సాగు చేయకపోతేనే మేలని రైతులు భావిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో గతేడాది రబీలో లక్ష హెక్టార్ల వరకు సాగవ్వగా.. ఈ ఏడాది మొత్తం సాగు ఈ రబీలో 25 వేల హెక్టార్లు దాటేలా లేదు. బోసిపోతున్న జలాశయాలు.. గతేడాది అధిక వర్షాలతో జలకళ సంతరించుకున్న జలాశయాలు.. ఈ ఏడాది బోసిపోతున్నాయి. గత ఖరీఫ్‌లో అతివృష్టితో నీటి నిల్వలు పెరిగిపోయి దిగువ ప్రాంతానికి లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణం కంటే తక్కువగా కురవడంతో రబీ సాగుకు పంటలకు నీరు అందించే స్వర్ణ ప్రాజెక్టు నుంచీ నీరు అందించలేని పరిస్థితి దాపురించింది. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద వేల హెక్టార్లలో సాగవ్వాల్సిన పంటలు వందల హెక్టార్లకు పడిపోయాయి. -
రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం
భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉమా రామచంద్రాపురం(విస్సన్నపేట) : మెట్టప్రాంత రైతులకు రబీ సాగుకు సాగర్ జలాలను సక్రమంగా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మండలంలోని కలగర రామచంద్రాపురం గ్రామం వద్ద ఉన్న ఎన్ఎస్పీ 117 హెడ్ రెగ్యులేటర్ వద్ద సోమవారం ఆయన లాకులు ఎత్తి సాగర్ జలాలను నూజివీడు బ్రాంచ్ కెనాల్‌కు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగం సాగుకు ఇబ్బంది పడకుండా సకాలంలో జోన్-3 కి సాగర్ జలాలు తీసుకువచ్చామన్నారు. మార్చి వరకు సాగర్ నీటి సరఫరా కొనసాగుతుందన్నారు. రెండు రాష్ట్రాల రైతాంగానికి ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం 13.4 టిఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. 20 టీఎంసీలు నిలుపుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. తాగు నీటికి ఇబ్బంది లేకుండా చెరువులు నింపేందుకు నీరు సరఫరా చేస్తామన్నారు. భవిష్యత్తులో నీటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా కృష్ణా లేదా, గోదావరి నీటిని లిఫ్టు ద్వారా తీసుకొచ్చి చెరువులు నింపేందుకు ప్రతిపాదనలు తయారు చేసి తక్కువ ఖర్చు అయ్యేదాన్ని అమలు చేయటానికి చూస్తున్నామన్నారు. 13 లక్షల ఎకరాలకు అవసరమైన నీటిని స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రైతులకు సంబంధించి బ్యాంకుల్లో మామిడి సాగు అని నమోదు చేయటంతో రుణ మాఫీ వర్తించడంలేదని పేర్కొంటూ మంత్రికి రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ అంశాన్ని పరిశీలించి రుణమాఫీ తమను అర్హులుగా గుర్తించాలని వారు కోరారు. తెల్లదేవరపల్లి తండాకు లిప్టు ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రికి మరో వినతి పత్రం అందజేశారు. వీటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి మాట్లాడుతూ, మెట్ట ప్రాంత రైతులకు సక్రమంగా సాగర్ జలాలు అందేలా చూడాలని కోరారు. సకాలంలో సాగర్ జలాలు జోన్-3 కు తీసుకు వచ్చేందుకు కృషి చేసినందుకు మంత్రి ఉమాకు కృతజ్ఞతలు తెలిపారు. నూతిపాడు 1,2 లిప్టులు మోటార్లు పనిచేయక చెరువులు నింపుకోలేని పరిస్థితి ఏర్పడిందని, సంబంధిత అధికారులు స్పందించి లిప్టు పనిచేసేలా చూడాలని కోరారు. మెట్ట ప్రాంత రైతులకు చివరి వరకు సాగర్ జలాలు అందించాలన్నారు. సాగర్ జలాలను వారబంది పద్ధతిన కాకుండా 15 రోజుల పాటు నిరంతరంగా ఒక జోన్‌కు, మిగతా 15 రోజులు మరో జోన్‌కు అందించేలా చూడాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కోరారు. జోన్-3 ద్వారా నీరు అందిచటం వలన మెట్ట ప్రాంత రైతులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. తుమ్మగూడెం వద్ద బ్రిడ్జి ఏర్పాటు అవసరమన్నారు. దీన్ని ఏర్పాటు చేస్తే రైతులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలో అవసరమైన చెరువులన్నింటిలో తాగునీటి సరఫరా కోసం సాగర్ జలాలు నింపుకునే అవకాశం ఇవ్వాలన్నారు. అనంతరం వనమహోత్సవం సందర్భంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుజాత, ఎన్ఎస్పీ ఎస్ఈ వీరరాజు, పులిచింతల ఎస్ఈ చంద్రశేఖర్, ఈఈ కృష్ణారావు, డిఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లవాగు నుంచి నీటి విడుదల
ఎమ్మెల్యే కిష్టారెడ్డి, ఎమ్మెల్సీ రాములునాయక్ హాజరు కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు నుంచి రబీ సాగు కోసం ఆదివారం నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్సీ రాములునాయక్, స్థానిక ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ప్రాజెక్టు నుంచి ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేశారు. రబీ ప్రాజెక్టు కోసం నీటిని విడుదల చేసేందుకు కలెక్టర్ రాహుల్ బొజ్జా ఇటీవలే నల్లవాగును సందర్శించి రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రాజెక్టు కాల్వలను కలెక్టర్ స్వ యంగా పరిశీలించారు. అనంతరం రూ.20 లక్షలతో పూడికతీత, ఇతర మరమ్మతు పను లు చేశారు. ఇవి పూర్తి కావడంతో ఆయకట్టు ప్రధాన కాల్వ ద్వారా నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 17న నల్లవాగు నుంచి నీటిని విడుదల చే యాలని అధికారులు నిర్ణయించారని తెలిపా రు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భం గా ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. రైతుల అవసరాల మే రకు అధికారులు ఆయకట్టుకు సాగు నీటిని సరఫరా చేస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమం లో నీటి పారుదల శాఖ ఎస్ఈ సురేంద్ర, డీఈఈ ధన్రాజు, ఆత్మ కమిటీ చైర్మన్ భాస్క ర్ సేట్, సీడీసీ చైర్మన్ నర్సిం హారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మురళీయాదవ్, మోహిద్‌ఖాన్, నాయకులు గుండు మోహన్, సర్పంచ్‌లు అప్పారావు షెట్కార్, రాములు, ఎంపీటీసీలు గోలీ రాములు, కిష్టాగౌడ్, కాంగ్రెస్ నాయకులు బి.పోచయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, దుర్గారెడ్డి, సంజీవరెడ్డి, చంద్రప్ప, దాడె సాయిలు పాల్గొన్నారు. సమయ పాలన పాటించరా...? ఎమ్మెల్సీ రాములునాయక్ సమయపాలన పాటించడం లేదంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనతో గొడవకు దిగేందుకు ప్రయత్నించారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు ఎమ్మెల్యే కిష్టారెడ్డి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ రాములునాయక్ వస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు గుండు మోహన్ ఎమ్మెల్యేతో చెప్పారు. దీంతో ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు ఎమ్మె ల్సీ కోసం వేచి చూశారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆయన రాకపోవడంతో ఎమ్మెల్సీపై కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారు. ఎట్టకేలకు ఎమ్మె ల్సీ అక్కడకు రావడంతో ఆయనతో గొడవకు దిగేందుకు యత్నించారు. మీ కోసం చాలా సేపటి నుంచి వేచి చూస్తున్నాం.. సమయపాలన పాటించరా? అని వాదించారు.దీంతో అ క్కడ ఉన్న అధికారులు టెన్షన్‌కు గురయ్యారు. కానీ వీరి మాటలను ఎమ్మెల్సీ పెద్దగా పట్టిం చుకోకపోవడంతో కార్యక్రమం సాఫీగా జరి గింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
రబీ..రంది
ప్రభుత్వ ప్రకటనతో సందిగ్ధంలో అన్నదాతలు నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో రబీసాగు అంతగా ముందుకు సాగడం లేదు. ఆరుతడి పంటలు సాగుచేయాలన్న ప్రభుత్వ ప్రకటనతో రైతులు సందిగ్ధంలో పడ్డారు. గత రబీ సీజన్లో 2,27,245 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకాగా, అందులో 2,00,558 హెక్టార్లలో వరిసాగు చేశారు. ఈ సీజన్లోనూ 2,50,000 హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అయితే సీజన్ ప్రారంభమై నలభైరోజులు అవుతున్నా, కేవలం నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో రబీసాగు అంతగా ముందుకు సాగడం లేదు. ఆరుతడి పంటలు సాగుచేయాలన్న ప్రభుత్వ ప్రకటనతో రైతులు సందిగ్ధంలో పడ్డారు. గత రబీ సీజన్లో 2,27,245 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకాగా, అందులో 2,00,558 హెక్టార్లలో వరిసాగు చేశారు. ఈ సీజన్లోనూ 2,50,000 హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అయితే సీజన్ ప్రారంభమై నలభైరోజులు అవుతున్నా, కేవలం 3149 హెక్టార్టలో వివిధ పంటలు సాగయ్యాయి. గత సీజన్లో ఈ సమయానికి 15,000 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఏఎమ్మార్పీ, నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా నీటివిడుదల కొనసాగుతున్నా, సాగుకు రైతులు సుముఖంగా లేరు. విద్యుత్ సంక్షోభంగా కారణంగా, సరిపడా కరెంట్ సరఫరా చేసే పరిస్థితులు కనిపించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. వరికాకుండా వేరుశనగ, మొక్కజొన్న, మినుము, కంది, జొన్న తదితర మెట్టపంటలను సాగుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సూచించింది. ఈ నేపథ్యంలో బోరుబావులు, చెరువుల్లో సమృద్ధిగా నీరున్నా వరిసాగుకు రైతులు వెనుకాముందు ఆడుతున్నారు. ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని, దానికి అవసరమైన విత్తనాలను సబ్సిడీపై ఇస్తామని ప్రభుత్వం ఓవైపు చెబుతుండగా, చెరువుల పునరుద్ధరణ పేరుతో చెరువుల్లో ఉన్న నీటిని ఖాళీచేసే అవకాశముంది. దీంతొ వరిని సాగుచేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. రైతుల ఆశలపై నీళ్లు ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో వరి, పత్తి దిగుబడి రాలేదు. దీంతో రైతులు రబీపైనే ఆశ పెట్టుకున్నారు. ఆయకట్టు పరిధిలో వరికి దోమపోటు కారణంగా దిగుబడి తగ్గే అవకాశముంది. దీంతోరైతులు రబీలోనన్నా కలిసి వస్తుందని సాగుకు సన్నద్ధమవుతున్న సందర్భంలో ప్రభుత్వ ప్రకటన వారి ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో రబీలో సాగువిస్తీర్ణం గణనీయంగా పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆరుతడి పంటలే మేలు : జేడీఏ నర్సింహారావు విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయలేమని రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టంగా ప్రకటించింది.ఈ పరిస్థితులలో వరిసాగు చేసుకుని నష్టపోవద్దు. కేవలం ఆరుతడి పంటలే సాగు చేసుకోవాలి. -
అన్నదాత అరిగోస
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఖరీఫ్ ఆరంభంలో కురిసిన చిరు జల్లుల అనంతరం వేసిన పంటలు ఆ తర్వాత వర్షాభావం, కరెంట్ కోతలతో చాలా వరకు దెబ్బతిన్నాయి. రైతుల పంటలను తగుల బెట్టే పరిస్థితి ఎదురైంది. ఖరీఫ్ సాగు రైతులకు అప్పులనే మిగల్చగా, సకాలంలో పంటరుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకర్లు నిబంధనల పేరిట ఇబ్బందులకు గురి చేశారు. 25 శాతం రుణమాఫీ రైతులకు ఉపశమనం కలిగించలేదు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా 287 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ల క్ష్యంగా పెట్టుకోగా, 92 కేంద్రాలనే ఏర్పాటు చేశారు. 3,20,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 5,080 మె.టన్నులే కొనుగోలు చేశారు. దళారులు, రైసుమిల్లర్లు కొందరు రంగంలోకి దిగడంతో రైతులకు గిట్టుబాటు ధర అందని ద్రాక్షలా మారుతోంది. ఊరట ఏదీ? రుణమాఫీ రైతులకు ఊరట కలిగించలేదు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించేనాటికి 4,33,132 మంది రైతులు రూ.1863.65 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ రుణాలన్నింటినీ రద్దు చేస్తామని సర్కారు చెప్పినప్పటికీ, 25 శాతం మాత్రమే రుణాలను మాఫీ చేశారు. 1,26,539 మందికి చెందిన రూ.465.19 కోట్ల రుణాలు మొదటి విడతగా మాఫీ అయ్యాయి. 3,06,593 మంది రైతులకు చెందిన రూ.1,398.46 కోట్లు ఇంకా మాఫీ కావాల్సి ఉంది. ఇదిలా వుంటే, వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ము ందే ప్రభుత్వం రుణ ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంది. ఖరీఫ్‌లో 2,86,540 మంది రైతులకు రూ.1,300 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అక్టోబర్ 15 నాటికి రూ.479.29 కోట్లు పంట రుణాలుగా ఇచ్చినట్లు రికార్డులు చెప్తున్నాయి. పంటల రుణాలను కనిష్టంగా, గరిష్టంగా ఎకరానికి ఇంత ఇవ్వచ్చన్న ప్రతిపాదనలను సైతం అక్కడక్కడ బ్యాంకర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పంటలపై ఇచ్చే రుణ మొత్తం (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)విధానాన్ని పాటించలేదని రైతులు వాపోతున్నారు. తగ్గిన వర్షపాతం ఖరీఫ్‌లో సాధారణ సాగు లక్ష్యం 3,20,931 హెక్టార్లు కాగా, 3,10,679 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి జిల్లా సాధారణ వర్షపాతం 49.8 శాతం తగ్గిపోగా చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భజలాలలో 10.37 మీటర్లకు పడిపోయాయి. 22,375 హెక్టార్లలో వరి, సోయాబీన్ పంటలు ఎండిపోగా, సుమారుగా పదివేల హెక్టార్ల వరకు రైతులు సోయా, వరి పంటలను తగులబెట్టారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1405.00 అడుగులు. గతేడాది ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడితే, ఈసారి నీటిమట్టం 1381.78 అడుగులకు పడిపోయింది. శ్రీరాంసాగర్‌లో గతేడాది ఇదే సీజన్లో రిజర్వాయర్ లెవెల్ 1091.00 అడుగులుంటే, ఈసారి 1067.40 అడుగులకు పడిపోయింది. గతేడాది ఇదే సీజన్ శ్రీరాంసాగర్‌లో 90.31 టీఎంసీల నీళ్లుంటే ప్రస్తుతం 24.28 టీఎంసీలే ఉన్నాయి. నిజాంసాగర్‌లో గతేడాది 17.80 టీఎంసీలుంటే ప్రస్తుతం1.67 టీఎంసీలకు పడిపోవడం ఆందోళన కల్గిస్తోంది. కరెంట్ కోతలు, ఎండిపోయిన పంటలు, అప్పుల బాధలు భరించలేక మూడు నెలల వ్యవధిలో 21 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖరీఫ్‌లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కున్న రైతులు రబీసాగుపై అనాసక్తితో ఉన్నారు. రబీలో 1,78,684 హెక్టార్లు సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 6,877 హెక్టార్లలోనే పంటలు వేశారు. మొత్తంగా జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తుండగా.. కష్టాన్ని నమ్ముకున్న రైతులు కాడిని వదిలే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పంట మార్పిడి మంచిదే..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో రబీ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఏటా వేసిన పంటలనే మళ్లీ వేస్తూ నష్టపోతున్నారు. పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడల వ్యాప్తి ఎక్కువై దిగుబడి తగ్గుతోంది. పంట మార్పిడితో ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి.మోహన్‌దాస్ వివరించారు. పంట మార్పిడి అవలంబిస్తే చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. పంట మార్పిడిపై చాలామంది రైతులకు అవగాహన లేదు. ఏళ్ల తరబడిగా వేసిన పంటనే వేస్తూ.. ఒకరిని చూసి మరొకరు పంటలో మార్పు లేకుండా సాగు చేయడం జిల్లాలో అధికంగా కనిపిస్తోంది. ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా వస్తుంది. పంట మార్పు మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి అవుతుంది. చీడపీడలు దూరమవుతాయి. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు. శిలీంధ్ర వ్యాధులను దూరం చేయవచ్చు. బీజాలు, వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. సూచనలు జొన్న పంట సాగు చేసిన పొలంలో మిరప వేయొద్దు. వేరుశనగ సాగు చేసిన తర్వాత మళ్లీ అదే పంట వేసుకోరాదు. దీనివల్ల ఎర్రగొంగళి పురుగు, శనగపచ్చ పురుగు ఆశించివచ్చు. వేరుశనగ తర్వాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు. నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాటా, ఉలువ, మినుము, పెసర పంటలు వేస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి. అందుకు వాటిని పంట మార్పిడి చేయరాదు. జాగ్రత్తలు పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో శనగ, బబ్బెర, మినుము, ఉలువలు, పెసర పంటలు వేయడంతో నేలను కప్పి ఉంచుతాయి. కలుపు మొక్కలను నివారించవచ్చు. లెగ్యూమ్ జాతి(పప్పు దినుసులు) పైర్లను వేయడం వల్ల రైజోబియం బుడిపెలు ఏర్పడుతాయి. ఇవి గాలిలోని నత్రజనిని భూమిలో స్థిరీకరించి నేల సారవంతంగా చేస్తాయి. ఈ జాతి పంటలను పచ్చిరొట్టె ఎరువులుగా వాడుకోవచ్చు. పత్తి పైరును మినుము, పెసర వంటి పంటలతో మార్పిడి చేసకోవడంతో తెల్లదోమ ఉధృతి తగ్గించుకోవచ్చు. వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలు పండించాలి. దీనివల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని తగ్గించవచ్చు. పసుపు తర్వాత వరి, జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి. దీనివల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది. వరిపైరు తర్వాత పప్పుధాన్యాల పైర్లను గానీ, నూనె గింజల పైర్లను గానీ పండించడం వల్ల వరి పంటను ఆశించే టుంగ్రోవైరస్, దోమపోటులను సమర్థంగా నివారించుకోవచ్చు. పెసర గానీ పశుగ్రాసంగా జొన్నగానీ సాగు చేస్తే తర్వాత వేరుశనగ, సోయాబీన్ పంటలు వేసుకోవాలి. రైతులు పాటించాల్సింది.. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి. వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి. బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. -
రైతులతో వరుణుడి జూదం
వరినాట్లు పడితేనే బీమా దరఖాస్తుకు అర్హత ఈ నెలాఖరుతో పంటల బీమాకు గడువు పూర్తి అనకాపల్లి : వరుణుడు రైతులతో జూదమాడుతున్నట్లుగా ఉంది ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి. వర్షాల ఆలస్యం పంటల నాట్లు పైనే కాదు... ప్రభుత్వ పథకాల అర్హతకూ గండి కొడుతున్నాయి. ఎక్కడ చూసినా వర్షభావమే. ఇది ఖరీఫ్‌లో నాట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఏజెన్సీలో మాత్రం వరి నారుమళ్ల నుంచి నాట్లు దశ జోరుగా సాగుతోంది. మైదాన ప్రాంతంలో మాత్రం నారుమళ్ల కోసం రైతులు గత వారం రోజుల వర్షాలు చూసి సన్నద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల నారుమళ్ల దశ పూర్తయింది. అయినప్పటికీ అంచనా వేయలేని వాతావరణ స్థితిగతులు, ఆగస్టు తరువాత విజృంభించే తుపానులు, అల్పపీడనాల దృష్ట్యా ప్రతి రైతుకు పంటల బీమా తప్పనిసరి అవుతోంది. బ్యాంక్ ద్వారా రుణాలను తీసుకునే రైతులకు పంటల బీమా సొమ్ము రుణం మంజూరులోనే మినహాయించి ఇస్తున్నారు. అయితే రుణాలు తీసుకోనిరైతుల పరిస్థితి ఇప్పుడు గందరగోళంలో పడింది. జిల్లాలో 8 వేల మంది వరకు రుణాలు తీసుకోని రైతులు ఉన్నారు. వారంతా ఇప్పుడు పంటల బీమా పథకం గడువుపైనే ఆందోళన చెందుతున్నారు. జూలై 31 నాటికి వరి పంటపై ఎకరానికి రూ. 555 చొప్పున చెల్లించాల్సి ఉంది. మైదాన ప్రాంతంలో ఖరీఫ్, రబీ సాగు క్యాలెండర్ గత కొన్నేళ్ల నుంచి గతి తప్పింది. ఈ కారణంగా నారుమళ్లు ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగగా, సెప్టెంబర్ నెలాఖరు వరకు వరినాట్లు పడుతూనే ఉన్నాయి. కాని వరి పంట బీమా చెల్లింపుకు జూలై నెలాఖరులోనే వరినాట్లను చూపించి రైతు బీమా ప్రీమియం చెల్లించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో రుణాలు తీసుకోని రైతులెవ్వరూ పంటల బీమా పథకానికి దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రంగంలోకి ఇన్సూరెన్స్ అధికారులు... జిల్లాలో పంటల బీమా పథకం దరఖాస్తుకు రైతుల నుంచి స్పందన కొరవడడంతో యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు రంగంలోకి దిగారు. వాస్తవానికి గతంలో వ్యవసాయాధికారులే పంటల బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులు నింపి హైదరాబాద్‌కు పంపించాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా బ్యాంకు ప్రతినిధులే రైతుల వద్దకు వచ్చి దరఖాస్తులను సంబంధిత వ్యవసాయాధికారి ద్వారా తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇది సానుకూల పరిణామమే అయినప్పటికీ ఈ నెలాఖరులోపు వరినాట్లు చూపించి బీమా మొత్తం చెల్లించే రైతుల మాత్రం కనిపించని పరిస్థితి. -
రబీ.. కష్టాల సాగు!
కుంటాల, న్యూస్‌లైన్ : కరెంటు కోతలు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రబీ సాగు చేసిన పంటలకు నీరందించలేని దుస్థితిలో రోడ్డెక్కుతున్నారు. మండలంలోని 90శాతం మంది రైతులు కరెంటుపై ఆధారపడి రబీ పంటలు సాగు చేశారు. ఊహించినట్లుగానే గత ఏడాది కంటే ఈ ఏడాది రబీ సాగు పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగమూ పెరుగుతోంది. కోటాకు మించి వినియోగించడంతో కోతలు మొదలయ్యాయి. వ్యవసాయ రంగానికి ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా సక్రమంగా అమలు కాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. కాలిపోతున్న పరికరాలు ఖరీఫ్ సాగు కష్టాలే మిగిల్చింది. అధిక వర్షాలతో పత్తి, వరి పంటలు నష్టపోయారు. రబీలోనైనా కష్టాల నుంచి గట్టెక్కుతామని ఆశించిన రైతులు ఎన్నో ఆశలు సాగుకు సిద్ధమయ్యారు. మండలంలో కరెంటు బావులపై ఆధారపడి 1,050 హెక్టార్లలో వరి, 1,125 హెక్టార్లలో మొక్కజొన్న, 239 హెక్టార్లలో శెనగ, 78 హెక్టార్లలో పసుపు, 54 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 38 హెక్టార్లలో మినుము, 42 హెక్టార్లలో పెసర, 65 హెక్టార్లలో నువ్వు పంటలు సాగు చేశారు. ఏళ్ల కిందటి ఫీడర్లు, కాలం చెల్లిన విద్యుత్ తీగలు, తరచూ కాలిపోతున్న నియంత్రీకరణ పరికరాలు రైతుల పాలిట శాపంగా మారాయి. విద్యుత్ సరఫరాలో కోతలు, లోఓల్టేజీ సమస్యలను నిరసిస్తూ లింబా(కె), విఠాపూర్ గ్రామాల రైతులు ఇటీవల కుంటాల సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రాస్తారోకో చేశారు. ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా మూడు నాలుగు గంటలకు మించి సరఫరా కావడం లేదు. రాత్రివేళ అడవి పందుల బెడద తీవ్రంగా ఉండడంతో పొలాల వైపు వెళ్లడం లేదు. మొక్కజొన్న, శెనగ, పొద్దుతిరుగుడు, పసుపు, నువ్వు, మినుము, పెసర పంటలు కోత దశకు వచ్చాయి. వారం పదిరోజుల్లో పంటలు చేతికొచ్చే అవకాశం ఉండడంతో అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు అందోళన చెందుతున్నారు. రబీ సాగు గట్టెక్కడానికి రైతులు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు. కాగా, ఈ విషయమై డిస్కం ఏఈ శంకర్‌ను సంప్రదించగా సామర్థ్యానికి మించి కనెక్షన్లు ఉండడంతో నియంత్రీకరణ పరికరాలు తరచూ చెడిపోతున్నాయని తెలిపారు. ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. -
రబీ ‘సాగు’డెలా..?
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కోటి ఆశలతో రబీ సాగును ప్రారంభించిన అన్నదాతకు కరెంట్ కష్టాలు కమ్ముకొస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్ కోతలు భారీగా పెరిగిపోయాయి. కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక తికమకపడుతున్నారు. ఏడు గంటలు సరఫరా అటుంచితే నాలుగు గంటలకు మించడం లేదు. ఇచ్చిన కొన్ని గంటలైనా తరచూ అంతరాయం. అయితే లోవోల్టేజీ.. లేకుంటే ట్రిప్. దీంతో కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు. ఇలాగైతే తమకు గడ్డుకాలం తప్పదని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఖరీఫ్‌లో భారీ వర్షాలు ఓ వైపు.. తెగుళ్లు మరోవైపు రైతులను నిండా ముంచాయి. ఆ నష్టం తాలూకూ పీడకలను మర్చిపోయి మళ్లీ రబీసాగుకు సిద్ధమయ్యారు. నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో ఇంక తమ ‘పంట’ పండినట్లేనని అనుకున్నారు. కానీ.. వారి ఆశలపై కరెంట్ కోతలు నీళ్లు చల్లుతున్నాయి. జిల్లాలో 2 లక్షల 88 వేల 807 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. జిల్లాకు ప్రస్తుతం 10.42 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటా కేటాయించారు. మరోవైపు రబీలో వివిధ పంటలు 3.17 లక్షల హెక్టార్లలో సాగవుతాయ ని వ్యవసాయశాఖ అంచనా వేసుకుంది. కేటాయించిన విద్యుత్ కోటా రబీకి సరిపోని పరిస్థితి. ఉత్పత్తి తగ్గి వినియోగం పెరిగిందన్న సాకుతో ట్రాన్స్‌కో అధికారులు మొదట వ్యవసాయ రంగానికే కోత పెడుతున్నారు. గ్రామాల్లో 12 గంటలు, ఉపకేంద్రాలున్న గ్రామాల్లో 8 గంటలు, మున్సిపాలిటీల్లో 4గంటలు అధికారికంగా కోత విధిస్తున్నా.. పరిస్థితులు వేరుగా ఉన్నాయి. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చెబుతూనే విడతలవారీగా అనధికారిక కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా యి. పంటల విస్తీర్ణం పెరగకముందే లోటు కలవరపెడుతోంది. పెరిగిన వరిసాగు విస్తీర్ణం జిల్లావ్యాప్తంగా 33 మండలాల్లో అధికంగా, 23 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. బావులు, చెరువులు, కుంటలు, మద్యతరహా ప్రాజెక్ట్‌లు నీటితో కళకళలాడుతున్నాయి. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 2.50 లక్షల హెక్టార్లు. ఈ రబీలో 3 లక్షల 17 వేల 500 హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. ప్రధానంగా వరి 2.25 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 55 వేలహెక్టార్లు, ఇతర పంటలు 37,500 హెక్టార్లలో సాగయ్యే అవకాశముందని అంచనా వేశారు. అదే గతేడాది రబీలో వరి 1.29 లక్షల హెక్టార్లలో వరి, మొక్కజొన్న 60,709 హెక్టార్లు, ఇతర పంటలు 77,656 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈసారి ఒక్క వరి పంటే లక్షా 22 వేల54 హెక్టార్లకు పెరిగింది. ఇప్పటికే 182000 హెక్టార్లలో సాగు చేశారు. ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు. ఆరుగంటలే... వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్ ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. తొమ్మిదేళ్లుగా అమలులో ఉన్న 7 గంటల విద్యుత్ సరఫరా విధానానికి కిరణ్ సర్కారు మంగళం పాడింది. ఆరు గంటలే సరఫరా అంటూ ఎన్పీడీసీఎల్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కోతలు ఈ నెల 2 నుంచే అమల్లోకి వచ్చాయి. కోతల కారణంగా రైతులు నిత్యం వ్యవసాయ బోర్ల వద్దే వుంటున్నారు. కరెంటు తరచూ ట్రిప్ కావడంతో కరెంట్ రాగానే అందరూ ఒకేసారి మోటార్లు వేస్తున్నారు. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్‌లోడ్ పడి కాలిపోతున్నాయి. వాటిని మరమ్మతు చేసేందుకు 10 నుంచి 15 రోజులు పడుతోంది. దీనివల్ల పంటలు ఎండిపోతున్నాయి. నిబంధనల మేరకు అర్బన్ పరిధిలో 24 గంటలు, రూరల్ పరిధిలో 48 గంటల్లోపు కొత్త ట్రాన్స్ఫార్మర్ అమర్చాలి, దీన్ని అధికారులెవరూ పాటించడం లేదు. రైతుల అష్టకష్టాలు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులకు అష్టకష్టాలు తప్పడం లేదు. ట్రాన్స్ఫార్మర్లను తీసుకొచ్చింది మొదలు, మరమ్మతు పూర్తి చేసి తిరిగి బిగించే వరకూ రైతులపైనే భారం పడుతోంది. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు 2 కేవీకి రూ.20 వేల వరకు, 63 కేవీకి రూ.25 వేల వరకు, 100 కేవీకి రూ.30 వేల వరకు ఖర్చవుతోంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వాటి మరమ్మతు కోసం కేంద్రాలకు తరలించేందుకు కనీసం రెండు రోజులు పడుతోంది. కేంద్రాల్లో కుప్పులు తెప్పలుగా ట్రాన్స్ఫార్మర్లకు సీరియర్ నంబర్ కేటాయించి మరమ్మతు చేస్తుంటారు. ఒక ట్రాన్స్ఫార్మర్ సీరియల్ నంబర్ రావాలంటే కనీసం పది రోజులు పడుతోంది. ఫలితంగా దాని పరిధిలోని పంటలు ఎండిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని రైతులు ఫిర్యాదు చేస్తే కనీసం స్పందించేవారు కూడా లేరు. వ్యవసాయశాఖ పరంగా ఇబ్బందులు రానివ్వం : జేడీఏ రబీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రానివ్వం. వ్యవసాయశాఖపరంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తాం. వర్షాలు సమృద్ధిగా కురవడంతో నీటి వనరులు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు ఎక్కువగా వరిసాగుపైనే దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం వరి నాట్లు వేసుకుంటున్నారు. కరెంటు ఇబ్బందుల దృష్ట్యా రైతులు శ్రీవరి సాగు పద్ధతిన సాగు చేసుకోవాలి. -
ఆవగింజంతైనా శ్రద్ధ లేదు!
అచ్యుతాపురం, న్యూస్‌లైన్: కొండకర్ల ఆవలోని నీటి నిల్వలపై 3 వేల ఎకరాల ఆయకట్టు రైతులు, 200 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఆవను అభివృద్ధి చేస్తామని పదేళ్లుగా ప్రజాప్రతినిధులు చెబుతూనే ఉన్నా, కార్యాచరణ లేకపోవడంపై రైతులు, మత్స్యకారులు నిరాశ చెందుతున్నారు. అడుగడుగునా ఆక్రమణలు కొండకర్ల ఆవ 2400 ఎకరాల్లో విస్తరించి వుంది. ఆక్రమణలతో 14వందల ఎకరాలకు కుదించుకుపోయింది. ప్రస్తుతం సర్వే నిర్వహిస్తే వెయ్యి ఎకరాలు కూడా ఉండకపోవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఆవ గర్భంలో సుమారు మూడడుగుల ఎత్తు పూడిక పేరుకు పోయింది. దీంతో గతం కంటే నీటినిల్వలు తగ్గాయి. దీనిపై ఆధారపడి ఎగువ దిగువ ఆయకట్టు రైతులు రబీ, ఖరీఫ్ సాగు చేస్తున్నారు. చీమలాపల్లి, వాడ్రాపల్లిలో రెండు ఎత్తిపోతల పథకాలతో నీటిని వినియోగిస్తున్నారు. సాగునీటి వినియోగం పెరగడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మత్స్యకారులు ఆవలో ఏటా రూ.2 లక్షల విలువైన చేప పిల్లలను పెంచుతారు. వర్షాకాలంలో నీరు చేరినప్పుడు చేప పిల్లల్ని వేస్తారు. ఆరునెలల పాటు పర్యాటకుల్ని దోనె షికారు చేయించి ఆదాయం పొందుతారు. ఆ తరువాత చేపల వేట మొదలుపెడతారు. ఆరునెలల పాటు చేపలవేట సాగించి ఉపాధి పొందుతారు. ఆవ పరిసరాల్లో సౌకర్యాలు లేకపోవడం, సరస్సును చేరుకునేందుకు రోడ్డు నిర్మించకపోవడంతో ఏటా పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. హరిపాలెం, కొండకర్ల, వాడ్రాపల్లి గ్రామాలను కలుపుకొంటూ ఆవ చుట్టూ రహదారి, జట్టీలు, సేద దీరడానికి వ్యూపాయింట్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగి మత్స్యకారులు ఉపాధి పొందే అవకాశం ఉంది. గత ఏడాది ఆవ అభివృద్ధికి రూ.16 కోట్లతో అధికారులు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. అభివృద్ధి చేయకపోవడంతో మత్స్యకారులకు మొదటి ఆరునెలల ఆదాయానికి గండి పడింది. నీటినిల్వలు తగ్గుముఖం పట్టగానే వేట మొదలు పెడతారు. ఫిబ్రవరి నెల నుంచి జూలై నెల వరకూ వేట సాగిస్తారు. రబీ సాగుకు రైతులు ఎక్కువ మొత్తంలో నీటిని వినియోగించడంతో మూడు నెలల్లోనే నీటి నిల్వలు తగ్గిపోతాయి. చేపలవేట సాగించే మత్స్యకారులకు నియమ నిబంధనలుండవు. ఎవరికి వారు తమకి దొరికినన్ని చేపల్ని పట్టుకోవచ్చు. నీటినిల్వలు తగ్గిపోవడంతో చేపల వేట జోరుగా సాగుతుంది. మూడు నెలల్లోనే చేపలవేట ముగిసిపోతుంది. ఈ సమయంలో ఎక్కువ సంఖ్యలో చేపల్ని మార్కెట్‌కి తరలించడం వల్ల గిట్టుబాటు ధర రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. -
ఎండేనా.. పండేనా..?
మిర్యాలగూడ/ చౌటుప్పల్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా రబీ సాగుకు సిద్ధమైన రైతాంగాన్ని అప్పుడే కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరున్నా.. సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా ఉత్తమాటే అయ్యింది. సాగర్ ఆయకట్టుతోపాటు నాన్ ఆయకట్టు పరిధిలోనూ వరి నార్లు పోసుకోవడంతోపాటు నాట్లు కూడా ప్రారంభమయ్యాయి. జిల్లాలో సాధారణ వరి సాగు 4.5 లక్షల ఎకరాలు కాగా రబీలో సాగర్ ఆయకట్టుతోపాటు నాన్ ఆయకట్టులో కూడా ఎక్కువగా వరి సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 2.95 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో తొమ్మిది వేల కనెక్షన్లు పేయింగ్ జాబితాలో ఉండగా మిగతావి ఉచిత విద్యుత్ వినియోగదారుల జాబితాలో ఉన్నాయి. 7గంటలు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ ఐదు గంటలు మించడం లేదు. అధికారికంగా రాత్రి పూట 3గంటలు, పగటిపూట 4గంటలు ఇస్తున్నామని చెబుతున్నా, పగటి పూట గంట నుంచి 2గంటల వరకు కోతలు విధిస్తున్నారు. విద్యుత్ సరఫరా చేసిన సమయంలోనూ ఎన్నో సార్లు వచ్చిపోతోంది. చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్, అల్లాపురం, డి.నాగారం, మల్కాపురం గ్రామాల్లో కరెంటు కోతలతో రైతులు అల్లాడుతున్నారు. నారుమళ్లు, దుక్కులు ఎండిపోయే దశకు చేరాయి. లోఓల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలి పోతున్నాయి. ఫ్యూజులు కొట్టేస్తున్నాయి. ట్రాన్స్‌కో సిబ్బంది మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రైతులే ఫ్యూజులు వేసుకుంటున్నారు. షెడ్యూల్లోనూ కోత విద్యుత్ ఫీడర్లు, సబ్స్టేషన్ల వారీగా విద్యుత్ సరఫరా వేళల షెడ్యూల్‌ను ట్రాన్స్‌కో అధికారులు ఇటీవల ప్రకటిం చారు. ప్రతి సబ్‌స్టేషన్ పరిధిలో ఉద యం మూడు, రాత్రి వేళలో మూడు గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయనున్నట్లు చెప్పారు. కానీ, ఆ సమయంలో పవర్ కట్ అయితే మరో సమయంలో సరఫరా చేయడం లేదు. దాంతో పవర్ ట్రిప్ అయిన సమయంలో తిరిగి విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల కేవలం 5 గంటలు మాత్రమే వ్యవసాయానికి సరఫరా అవుతున్నది. మూతపడిన ఎస్పీఎం కేంద్రం.. చౌటుప్పల్‌లోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రం మూతపడింది. కేంద్రం నడపలేనని కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. రెండు నెలలు కావస్తున్నా ఈ కేంద్రాన్ని కొత్త వారికి కేటాయించలేదు. దీంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండడంతో మరమ్మతుల కోసం రైతులు రామన్నపేటకు తీసుకెళ్తున్నారు. రవాణా ఖర్చులు, మరమ్మతుల కేంద్రంలో సిబ్బందికి ఇచ్చే మామూళ్లు రైతులకు తడిసి మోపెడవుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ తీసుకెళ్లిన వెంటనే, స్పేర్‌లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఇవ్వాలి. కానీ, స్పేర్‌లో లేవంటూ, మరమ్మతుల కోసం వచ్చిన వాటిని సీరియల్‌గా మరమ్మతులు చేస్తున్నామని, మూడు రోజుల తర్వాత ఇస్తున్నారు. మరమ్మతు ఖర్చులు మోపెడు.. విద్యుత్ మోటార్ల మరమ్మతుల ఖర్చు లు అమాంతం పెరిగాయి. మోటారు మరమ్మతు చేయాలంటే *4వేల ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇది రైతుల సాగుకు అదనపు భారంగా మారింది. -
రెండేళ్లుగా రెండో పంట లేదు
=రెండేళ్లుగా రెండో పంట లేదు =ఈ ఏడాది భారీ వర్షాలతో ఖరీఫ్‌లో ఎదురుదెబ్బ =రబీపైనే అన్నదాత ఆశలు = ప్రజాప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తులు భారీ వర్షాలకు ఖరీఫ్ పంట నష్టపోయిన జిల్లా రైతులు రబీపై దృష్టి సారించారు. రెండో పంటకు రెండేళ్లుగా నీరివ్వని ప్రభుత్వం ఈ ఏడాదైనా ఇస్తుందా అనే అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. డెల్టా ఆధునికీకరణను బూచిగా చూపి నీటి విడుదల నిలిపివేసిన ప్రభుత్వం పనులు చేపట్టిందీ లేదని విమర్శిస్తున్నారు. ఈ ఏడాదైనా నీరిచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో రబీ సాగుకు ప్రభుత్వం గత రెండేళ్లుగా నీరు విడుదల చేయడం లేదు. దీంతో ఏడాదిలో ఒక్క పంట మాత్రమే సాగు చేసి రైతులు భూమిని ఖాళీగా ఉంచాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3.50 లక్షల ఎకరాల్లో రబీ సీజన్లో వరిసాగు జరుగుతుంది. రబీ సీజన్లో రెండో పంటగా వేసే అపరాల (మినుము, పెసర) వంటి పైర్లు సముద్రతీరంలోని మండలాల్లో సాగుచేసే అవకాశం లేదు. దీంతో వారికి రబీ సీజన్లో వరిసాగే ప్రధాన ఆధారం. ఈ ఏడాది ఖరీఫ్ పంట భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న నేపథ్యంలో రబీకి సాగునీటిని విడుదల చేస్తే రైతులకు కొంతమేర మేలు చేకూరుతుందనే వాదన వినపడుతోంది. మంత్రి కొలుసు పార్థసారథి ఇటీవల మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామానికి వెళ్లిన సమయంలో రైతులు రబీకి సాగునీరు విడుదల చేయాలని కోరగా ముఖ్యమంత్రితో మాట్లాడి నీరు విడుదల చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మినుముతోనే సరి... రబీకి గత రెండేళ్లలో నీరు విడుదల చేయకపోవడంతో రైతులు రెండో పంటగా మినుము సాగు చేశారు. దీనివల్ల సరైన ఆదాయం వచ్చే పరిస్థితి ఉండదని, రెండో పంటగా వరి సాగు చేసేందుకు వీలుగా ఈ ఏడాదైనా సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరం. తొలి పంటలో కౌలు, పెట్టుబడి వ్యయం పోను వారికి మిగిలేదేమీ ఉండదు. ఈ నేపథ్యంలో రెండో పంట కూడా లేకపోవడం వారికి అశనిపాతమే. సముద్రతీర ప్రాంతాల్లో మినుము సాగుకూ అవకాశం లేదు. 40 టీఎంసీలు అవసరం... జిల్లాలో రబీ సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 3.50 లక్షలు కాగా 40 టీఎంసీల నీరు విడుదల చేస్తే సరిపోతుందని నీటిపారుదల శాఖ అధికారుల అంచనాగా ఉంది. రబీలో వరిసాగు చేస్తేనే కూలీలకూ పనులు అందుబాటులో ఉంటాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో కరెంటు ఉత్పత్తికి వాడే నీటిని దిగువకు విడుదల చేసినా జిల్లాలో రబీకి నీరు సరిపోతుందని రైతులు చెబుతున్నారు. నీటి విడుదలతో తీర ప్రాంతంలోని మండలాల్లో తాగునీటి ఇబ్బందులు కూడా ఉండవు. గత రెండే ళ్లుగా నీటి లభ్యత తక్కువగా ఉందనే కారణం చూపి జిల్లా వ్యాప్తంగా రబీకి సాగునీటిని విడుదల చేయలేదు. దీంతో సముద్రతీరంలో తాగునీటికి సైతం ఇక్కట్ల పాలయ్యారు. ప్రజాప్రతినిధులే ఒత్తిడి తేవాలి... డెల్టా ఆధునికీకరణ పనులను బూచిగా చూపి ఈ ఏడాది రబీకి నీటి విడుదలను నిలిపివేయవద్దని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రబీకి నీటిని విడుదల చేయించేందుకు జిల్లాకు చెందిన పాలకులు, అధికారులు ప్రభుత్వంపై ఇప్పటి నుంచే ఒత్తిడి తేవాలని రైతులు కోరుతున్నారు. డెల్టా ఆధునికీకరణ పనులు గతేడాది అసలు చేపట్టనేలేదు. గత రెండేళ్లుగా కాలువ పనులు చేయకుండా వంతెన నిర్మాణ పనులు మాత్రమే చేపట్టారు. ఈ నేపథ్యంలో సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.