బక్కోడు... ఒక్క పిలుపిస్తే | KCR statement To Responding farmers | Sakshi
Sakshi News home page

బక్కోడు... ఒక్క పిలుపిస్తే

Published Thu, Feb 26 2015 12:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

బక్కోడు... ఒక్క పిలుపిస్తే - Sakshi

బక్కోడు... ఒక్క పిలుపిస్తే

కేసీఆర్ ప్రకటనకు స్పందించిన రైతన్న
వరి సాగుకు దూరం
జిల్లాలో భారీగా తగ్గిన రబీ సాగు విస్తీర్ణం
రోజుకు 2 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘కేసీఆర్ ఎంత మనిసయ్యా..! పిట్ట పిల్లంత మనిషి..  ఉఫ్‌మని ఊత్తే గాలికి ఎగిరి పడతడు.. గీడేంజేత్తరు అన్నరు... అవమానాల పాలుజేసిండ్రు... కానీ మీరంతా కేసీఆర్ మాట మీద నిలబడి ఉద్యమం జేసిండ్రు...  ఇయ్యాల తెలంగాణ ఒక నిజం.’  

గజ్వేల్ విజయోత్సవ సభలో కేసీఆర్  ఉద్వేగపూరిత వ్యాఖ్యలు...
 
కేసీఆర్ నినదిస్తే కోటి గొంతుకలు ఏకమయ్యాయి. ఒక్క పిలుపిస్తే ముక్కోటి జనం కదం తొక్కారు. ఆయన మాటే తెలంగాణ జనానికి ఉత్ప్రే రకం... దిశానిర్దేశం. జిల్లాలో మరోసారి ఇది రుజువయింది. ‘కరెంటుకు ఇబ్బంది ఉంది. రైతులు అర్థంజేసుకోవాలే. పంట వేయకపోతే ఆ బాదేందో నాకూ తెలుసు. నేను రైతు బిడ్డనే. రబీలో నీటి ఆధారిత పంటలు వేసుకోవద్దు. నన్ను నమ్ముర్రి. మూడేళ్ల తరువాత 365 రోజులు 24 గంటల కరెంటు ఇస్తాం.

అంతవరకు కొద్దిగ ఓపిక పట్టండి’ అనిముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు రైతులు సానుకూలంగా స్పందించారు. ఎలాంటి ఆర్భాటం, ప్రచారం లేకుండానే మెదక్ జిల్లా రైతాంగం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించింది. రబీ సాగును రైతులు తగ్గించారు. దాదాపుగా ఆరుతడి పంటలకే పరిమితమయ్యారు. జిల్లాలో దాని ఫలితం కనిపిస్తోంది. వ్యవసాయం  కోసం కేటాయించిన వాటాలో 40 శాతం కరెంటు మిగులుతోంది. ఈ కరెంటును గృహ అవసరాలకు మళ్లించడంతో జిల్లాలో కరెంటు కోతలు లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతోంది.  
 
ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాకు రోజుకు 19.167 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. కానీ డిమాండ్‌కు తగినంత సరఫరా లేదు. ఇందులో 6 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి, 9 నుంచి 10 మిలియన్ యూనిట్లు పరిశ్రమలకు, మిగిలినది గృహ అవసరాల కోసం వినియోగిస్తున్నట్టు టాన్స్‌కో రికార్డులు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం రోజుకు 17. 057 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. రోజుకు దాదాపు 2.11 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉన్నా దాని ప్రభావం మాత్రం ఇప్పటివరకు జిల్లాపై పెద్దగా చూపలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా రాత్రి వేళల్లో నిరంతరాయ కరెంట్ ఉంటోంది. జిల్లాలో 2.22 లక్షల  ఉచిత విద్యుత్ మోటార్ కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 5.58 లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయి.
 
కేసీఆర్ పిలుపు ఫలితం..

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నేపథ్యంలో జిల్లా రైతాంగం రబీ సాగుకు దూరంగా ఉంది. ఒక్క ఘణపురం ప్రాజెక్టు ఆయకట్టు కింద మాత్రమే పంటలు సాగు చేశారు, ఇక్కడ కూడా కేవలం 30 శాతం మాత్రమే సాగు చేశారు. మిగతా మండలాల్లో  కొద్దోగొప్పో ఆరుతడి పంటలు మినహాయిస్తే సాగు లేదనే చెప్పాలి. గత ఏడాది రబీ సీజన్‌లో 14,944 హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. అత్యధికంగా 62,331 హెక్టార్లలో వరి సాగు చేశారు. తరువాత స్థానాల్లో మిరప, పొద్దుతిరగుడు పంటలున్నాయి.

ఈ పంటలకు సాగు నీరు అందించేందుకు గత ఏడాది ఇదే మాసంలో రోజుకు 3.080 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగం జరిగి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ ఏడాది కేవలం 60 వేల హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేశారు. ఇందులో వరి సాగు వాటా కేవలం 15 వేల హెక్టార్లు మాత్రమే. అదీ కూడా ఘణపురం ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న భూముల్లో మాత్రమే సాగు చేశారు. ఎక్కువగా నీటి తడి ఏమాత్రం అవసరం లేని శనగ, మొక్కజొన్న పంటలు వేశారు. ఫలితంగా విద్యుత్ వాడకం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు 0.860 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే వ్యవసాయానికి వినియోగం అవుతోందని, రైతులు ముందస్తుగానే పంటలు తగ్గించుకోవడంతో జిల్లాలో రోజుకు 2 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులుతోందని ట్రాన్స్‌కో అధికారులు చెప్పారు.
 
ఇదే పిలుపు చంద్రబాబు ఇస్తే...
 
2003లో ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు లేక కరెంటు సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో చంద్రబాబు ‘వరి వద్దు... ఆరుతడి ముద్దు’ అనే నినాదంతో రైతులు రబీలో వరి వేయవద్దని ఆదేశించారు. అప్పట్లో బాబు నిర్ణయాన్ని రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన పిలుపుకు నిరసనగా రైతులు ఉద్యమాలు చేశారు. పట్టుబట్టి వరిసాగు చేశారు. ఆ తరువాత  ఇదే నినాదం చంద్రబాబు నాయుడు ఓటమికి ఓ కారణమైంది. కానీ కేసీఆర్ పిలుపును మాత్రం రైతాంగం స్వాగతించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement