అది ‘కౌలు రైతుబంధు’ కాదు | Tenant Farmers Not Eligible For Rythu Bandhu Scheme | Sakshi
Sakshi News home page

అది ‘కౌలు రైతుబంధు’ కాదు

Published Sun, Jul 1 2018 1:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM

Tenant Farmers Not Eligible For Rythu Bandhu Scheme - Sakshi

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌ : రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’పథకాన్ని అమలు చేస్తోందని.. కౌలు రైతుల కోసం ఎంత మాత్రం కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి స్పష్టం చేశారు. ఇది రైతు బంధు పథకమే తప్ప, కౌలు రైతుబంధు పథకం కాదని పేర్కొన్నారు. సమాజంలో అనేక రకాల ఆస్తులను ఇతరులకు కొం త కాలం కోసం లీజుకు ఇస్తారని, అలా లీజుకు తీసుకున్న వారెవరూ ఆ ఆస్తులకు హక్కుదారులు కారని చెప్పారు. అలా ఇతర ఆస్తుల విషయంలో లేని నిబంధన కేవలం రైతులకే ఎందుకు ఉండాలని, రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని వ్యాఖ్యానించారు. రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేయాలనే డిమాండ్‌ అర్థరహితమైనదని, ఆ వాదన న్యాయ సమ్మతం కూడా కాదని పేర్కొన్నారు. శనివారం ప్రగతి భవన్‌లో ‘రైతుబంధు’పథకంపై కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఆ డిమాండ్‌ సరికాదు.. 
రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి ఏటా రూ.8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని చేపట్టిందని సమీక్షలో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘ఈ పథకం కేవలం రైతులకు ఉద్దేశించిందే తప్ప, కౌలు రైతులకు సంబంధించినది కాదు. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది. బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. శాసనసభ ఆమోదించిన బడ్జెట్‌ ప్రకారమే రాష్ట్రంలో భూమిపై యాజమాన్య హక్కులున్న రైతులకు, ప్రభుత్వం గుర్తించిన ప్రతి రైతుకు సాయం అందిస్తున్నాం. దీన్ని ఎవరూ తప్పుపట్టడానికి లేదు. కౌలు రైతులను ఎలా విస్మరిస్తారని, వారికి కూడా రైతుబంధు సాయం అందించాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ డిమాండ్‌ అర్థరహితమైనది. ఆ వాదనలో న్యాయం లేదు. అసలు కౌలురైతులు ఎవరన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. ప్రభుత్వం దగ్గరా కౌలు రైతుల వివరాలేవీ లేవు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా కౌలు రైతులకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదు. ఏ రైతు కూడా కౌలు రైతులను గుర్తిం చలేదు. కౌలు రైతులుగా పిలిచే వారికి భూమి పై ఎలాంటి హక్కు లేదు, ఉండదు. అలాంటి వారికి ఏ ప్రాతిపదికన పెట్టుబడి సాయం అందించాలి..’’అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 

ఏ హక్కూ లేనివారికి ఎలా ఇస్తాం? 
కేవలం రైతులకే సాయం ఇవ్వాలన్నది ప్రభుత్వ విధానమని కేసీఆర్‌ చెప్పారు. ఇది ప్రజాధనంతో కూడుకున్న అంశమని, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి అసెంబ్లీ ఆమోదం ఉండాలని.. ఆ ఖర్చుకు ఆడిట్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఎవరికి పడితే వారికి డబ్బు పంచిపెట్టడం సాధ్యం కాదన్నారు. ఏ హక్కూ లేని వారికి, భూమిపై ఎలాంటి పత్రం లేని వారికి డబ్బులు ఇవ్వాలన్న వాదన న్యాయ సమ్మతం కాదని వ్యాఖ్యానించారు. అలా ఏ హక్కూ లేని వారికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లిస్తే తప్పవుతుందని.. ప్రభుత్వం అలాంటి తప్పు చేస్తే ప్రశ్నించాలేగానీ, అంతా సవ్యంగా జరుగుతుంటే తప్పు పట్టడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఏ హక్కూ, ఆధారం లేని వారికి ప్రభుత్వం సాయం అందిస్తే, ఎవరు పడితే వారు తమకూ సాయం కావాలని అడిగే అవకాశముందని.. అలాంటి వారికి డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 

లీజుకు తీసుకుంటే హక్కు రాదు.. 
కేవలం రైతులు మాత్రమే కాకుండా.. చాలా మంది తమ ఆస్తులను ఇతరులకు కిరాయికి, లీజుకు ఇస్తారని.. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇళ్లు, ఆటోలు, కార్లు, ఫంక్షన్‌ హాళ్లు.. ఇలా చాలా రకమైన వాటిని నిర్ణీత సమయం కోసం కిరాయికి ఇస్తారని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘లీజుకు తీసుకున్న వారు ఎన్నటికీ యజమానులు కారు. ఆ ఆస్తులపై ఎన్నటికీ వారికి హక్కులు లభించవు. అలాంటి వాటి విషయంలో లేని డిమాండ్‌ కేవలం రైతుల విషయంలో మాత్రమే ఎందుకు వస్తుంది. సమైక్య పాలనలో రైతులు చితికిపోయారు. నష్టపోయి ఉన్నారు. అలాంటి రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వం రైతుబంధు అమలు చేస్తున్నది. దీనికి కొర్రీలు పెట్టడం సమంజసం కాదు. కౌలు రైతుల పేరుతో అసలు రైతుకు అన్యాయం చేయాలని చూడడం మంచిది కాదు. రైతులు ఒక్కో పంట కాలానికి ఒక్కొక్కరికి తమ భూమిని కౌలుకు ఇస్తారు. ఒకే ఏడాది ఇద్దరు ముగ్గురికి కూడా కౌలుకు ఇస్తారు. అలాంటప్పుడు ప్రభుత్వం కౌలుదారును ఎలా గుర్తిస్తుంది. అసలు ఏ రైతు అయినా తన భూమిని కౌలుకు ఇస్తున్నట్టు లిఖితపూర్వకంగా అంగీకరిస్తాడా? అలాంటప్పుడు ప్రభుత్వానికి కౌలు రైతును గుర్తించడం ఎలా సాధ్యమవుతుంది?..’’అని ప్రశ్నించారు. అందువల్ల రైతు బంధు పథకాన్ని కచ్చితంగా రైతుల కోసమే అమలు చేయాలని, కౌలు రైతులకు సాయం అందించాలనే డిమాండ్‌ నెరవేర్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement