తనను బతకనిస్తే మనకు బతుకు | Dileep Reddy Guest Column On Farmers Problems | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 8 2018 1:33 AM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM

Dileep Reddy Guest Column On Farmers Problems - Sakshi

పెట్టుబడి పెట్టి, చెమట–రక్తం కలగలిసే శరీరకష్టంతో పండించిన పంటను పారబోసుకోవడానికి రైతు సిద్ధమవడం నిజంగా దయనీయ పరిస్థితే. అదే రైతు ధర్మాగ్రహం ఇంకా హెచ్చి, పంట బంద్‌ ప్రకటిస్తే పరిస్థితేమిటి? ఎకరం, రెండెకరాల నుంచి... ఎంత పెద్ద రైతయినా, కుటుంబ జరుగుబాటుకు సరిపడే పంట సాగుకే పరిమితమౌ తాడు. పరిమిత సాగుతో కనాకష్టంగా బతకడానికి సిద్ధపడతాడు. మిగతా భూమి బీడు వదిలితే... దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించగలమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘పంట విరామం’ ప్రకటించి గోదావరి జిల్లా రైతాంగం అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఉద్యమంగా ఇది దేశవ్యాప్తమైతే ప్రభుత్వాలు తట్టుకోగలవా?

‘అజాతశత్రుండె అలిగిన నాడు....’ అంటూ కౌరవస భలో హెచ్చరిస్తాడు రాయ బారానికి వచ్చిన శ్రీకృష్ణుడు. శాంత స్వభావి, శత్రువేలేని ధర్మరాజుకే కోపం వస్తే... మీకిక పుట్ట గతులుండవని చెప్పడమే ఆయన ఉద్దేశం. నేడు దీనా వస్థలో కొట్టు మిట్టాడుతున్న ‘దేశపు వెన్నెముక’ రైతు గురించి, రేపు రైతే ఆగ్రహిస్తే రాగల దుష్పరిణామాల గురించీ పాలకులతో రాయబారం చేసే వాళ్లు లేకుండా పోయారీ దేశాన! వారం రోజులుగా  ప్రధాన రాష్ట్రాల్లో రైతులు జరుపుతున్న ‘గ్రామ బంద్‌’ నిరసనను ఆయా ప్రభుత్వాలు  పట్టించు కోవడం లేదు.

ఆ మాటకొస్తే, రైతునే పట్టించుకో వడం లేదు పాలకులు. కానీ, ఏ దారీ కానక దశా బ్దాలుగా అలమటిస్తున్న ఈ దేశ రైతాంగానికి ఇప్పు డిప్పుడే దారులు తెరచుకుంటున్నాయి. అదే పోరు బాట! సందర్భాన్ని బట్టి సంఘటితమవుతున్నారు. మొన్న మధ్యప్రదేశ్, నిన్న మహారాష్ట్ర... నిజాయి తీతో జరిపే రైతాంగ పోరాటాలు ప్రభుత్వాలపై ప్రభావం చూపుతున్నాయి. సంఘటితమై రైతాంగం ఉద్యమాల్ని ఉదృతం చేసిన చోట ప్రభుత్వాలు విధి లేక దిగివస్తున్నాయి. పరిస్థితిని ముందే పసిగట్టిన కొందరు ముఖ్యమంత్రులు విజ్ఞతతో రైతు హితంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.

రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్రం అందుకొక ప్రత్యక్ష సాక్ష్యం. వ్యవసాయ రంగాన్ని ఖాతరు చేయని గుడ్డి పాలకులున్న చోట, చైతన్యపు యువనేతలు రైతుకు భరోసా కల్పించే విస్పష్ట హామీలతో ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అందుకు, ‘రాబోయేది రైతు ప్రభుత్వమే’ అని విపక్ష నేత విస్పష్ట ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్‌ నిలువెత్తు ఉదాహరణ! ఉత్తరాదిని అట్టుడికిస్తున్న ‘గ్రామ బంద్‌’ రైతుపోరు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. రైతు సంఘాల మధ్య విబేధాలు సృష్టించో, మరో ఎత్తుగడతోనో... సంఘటిత పోరాటాల్ని దెబ్బతీసే పాలకుల కుయత్నాలూ సాగుతున్నాయి.

పంజాబ్‌ అందుకు వేదికవుతోందిప్పుడు. అటువంటి విద్రోహ చర్యల పట్ల రైతులు, రైతు సంఘాలు, పౌర సంస్థలు అప్రమత్తంగా ఉండటమే తక్షణ కర్తవ్యం అంటు న్నారు ఉద్యమకారులు. రైతాంగం మనోధైర్యం వీడకుండా, ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ సంఘటిత పోరాటాలు చేస్తే రాజకీయ వ్యవస్థ దిగి రాక తప్పదని భరోసా కల్పిస్తున్నారు.

కడుపు మంట నుంచే ఆగ్రహజ్వాల
పది రోజులని ప్రారంభించిన ఈ సమ్మె వారం దాటింది. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఈనెల 10న ‘భారత్‌బంద్‌’ జరుపుతామనీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఘ్‌ (ఆర్కేఎమ్‌) హెచ్చరించింది. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో ఇది ఉదృతంగా సాగుతోంది. పాలు, పండ్లు, కూరగాయలు, తదితర వ్యవసాయోత్ప త్తుల్ని పట్టణాలు, నగరాలకు నిలిపివేశారు. ‘పోతే పోయింది, ఇట్లానన్నా పాలకులకు తెలిసి వస్తుంద’ని రైతులు మనసు చంపుకొని తమ ఉత్పత్తుల్ని పేద లకు పంచుతున్నారు. కాదంటే రోడ్ల మీద పార బోస్తున్నారు నిరసనగా! పట్టణాలు, నగరాలకు చేర నీయడం లేదు. అక్కడ ఈ నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయి.

పట్టణాలు–నగరాల నుంచి రైతాంగం ఈ పదిరోజులు ఏమీ కొనుగోలు చేయొ ద్దనీ నిర్ణయించుకున్నారు. 30 జాతీయ రహదారు లపై నిరసన బైఠాయింపులు చేస్తున్నారు. రోజు రోజుకు పరిస్థితి గంభీరంగా మారుతోంది. ఒక్కసారి వ్యవసాయ రుణాల్ని మాఫీ చేయాలి, వ్యవసాయో త్పత్తులకు తగిన ధర నిర్ణయించాలనే రెండే డిమాం డ్లను ముందుకు తెస్తూ ఈ నిరసన చేపట్టారు. సరిగ్గా ఏడాది కిందట మధ్యప్రదేశ్‌ మందసౌర్‌లో ఇలాగే ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరిపి, ఆరుగురిని పొట్టనపెట్టుకున్న ఉదంతం కేంద్రకంగా ఈ ఆందోళన షెడ్యూల్‌ ఖరారు చేశారు.

దేశ వ్యాప్తంగా దిగజారుతున్న రైతు దీనావస్థే ప్రస్తుత పోరుకు ప్రేరణ! 130కి పైగా రైతు సంఘాలు ‘రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఘ్‌’ సమాఖ్యగా ఏర్ప డ్డాయి. రైతులు తమ నిరసనకు ఈ ‘మార్కెట్‌ బాయ్‌ కాట్‌’ పద్దతి ఎంచుకోవడం సరికాదని, దీనివల్ల వినియోగదారుడి, ఉత్పత్తిదారుడి ఆర్థికస్థితీ భంగపో తోందని కొందరు వ్యవసాయ నిపుణుల అభి ప్రాయం. పైగా, రోడ్లపై పారబోయటం వల్ల ఆహార పదార్థాలు వ్యర్థమవుతున్నాయన్నది వారి ఆందోళన. ప్రత్యామ్నాయ నిరసనలు పనిచేయకే ఈ పద్ధతికి రావాల్సి వచ్చిందని రైతు నాయకులంటున్నారు.

రేపు ‘పంట బంద్‌’ ప్రకటిస్తే!
అన్నం పెట్టే రైతుకు ఆగ్రహం తెప్పించకూడదనే మాట మన పురాణ కాలం నుంచీ ఉంది. ప్రకృతి వైపరీ త్యాలకు, పాలకుల నిర్లక్ష్యానికి కుదేలయిన వ్యవ సాయ రంగాన్ని మాయల మార్కెట్‌ మరింత దిగ జార్చింది. వాన చినుక్కి, విత్తనానికీ ఆరాటపడటం నుంచి... ఎరువులు, పురుగుమందులు, దిగుబడి, మార్కెట్, పంటకు ధర ఇలా ప్రతిదశ ఒక యుద్ధమే! ఆదుకునే వ్యవస్థ లేక ఈ యుద్ధంలో రైతు చేష్టలుడిగి నేలకొరుగుతున్నాడు. వలసలు, ఆత్మహత్యలు మామూ లయ్యాయి.

ఉత్పత్తి వ్యయం కూడా రానపుడు వ్యవ సాయం చేసి ఎట్లా బతగ్గలం అని అడుగుతున్నారు. పెట్టుబడి పెట్టి, చెమట–రక్తం కలగలిసే శరీరకష్టంతో పండించిన పంటను పారబోసుకోవడానికి రైతు సిద్ధ మవడం నిజంగా దయనీయ పరిస్థితే. అదే రైతు ధర్మాగ్రహం ఇంకా హెచ్చి, పంట బంద్‌ ప్రకటిస్తే పరి స్థితేమిటి? ఎకరం, రెండెకరాల నుంచి... ఎంత పెద్ద రైతయినా, కుటుంబ జరుగుబాటుకు సరిపడే పంట సాగుకే పరిమితమౌతాడు. పరిమిత సాగుతో కనా కష్టంగా బతకడానికి సిద్ధపడతాడు. మిగతా భూమి బీడువదిలితే... దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించగలమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘పంట విరామం’ ప్రకటించి గోదావరి జిల్లా రైతాంగం అప్పట్లో సంచలనమే సృష్టించింది.

ఉద్యమంగా ఇది దేశవ్యాప్తమైతే... ఆహారోత్పత్తి మీద, ఆర్థిక రంగం పైనా విపరీత ప్రభావం పడుతుంది. ఇతరేతర సమ స్యలు కూడా ముప్పిరిగొంటాయి. వినియోగదారులు అల్లాడుతారు. రైతులే కాక వ్యవసాయంపై ప్రత్య క్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ కోట్ల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇంతటి అత్యయిక పరిస్థితిని ప్రభు త్వాలు తట్టుకోగలవా? ఇప్పుడే సామరస్యంగా సమ స్యను పరిష్కరించి రైతును ఆదుకోవాల్సిన అవసరం, అంతకు మించిన బాధ్యత ప్రభుత్వాల పైనుంది.

సకాలంలో మేల్కొంటేనే....
రైతాంగాన్ని ఆదుకుంటామని, వ్యవసాయాన్ని లాభ సాటి చేస్తామని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నా వాస్త వంలో జరగటం లేదు. పంటలన్నింటీకీ కనీస మద్దతు ధర వెంటనే లభింపజేస్తామని, 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ దిశలో అడుగులు పడటం లేదు. ఉద్యమిస్తున్న రైతాంగం కోరే రుణమాఫీ, మద్దతు ధర ఈ రెండంశాలు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివే!  రైతాంగాన్ని అదుకునే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పటిష్టమైన రెండ డుగులు వేశారు.

ఎకరానికి రూ. 8,000ల పంట పెట్టుబడి సహాయం ప్రకటించి, అందులో సగం ఒక పంటకోసం ఇప్పటికే రైతుకు అందజేశారు. రూపాయి ప్రీమియం చెల్లించ నవసరం లేకుండా 5 లక్షల రూపాయల జీవితభీమాను ప్రతి రైతు కుటుం బానికీ కల్పించే ప్రక్రియ చేపట్టారు. ఏపీలో విపక్షనేత వై.ఎస్‌. జగన్‌ తన విధాన ప్రకటన ‘నవరత్నాల్లో’ భాగంగా రైతాంగానికి దన్ను ఇచ్చే ఎన్నో చర్యల్ని వెల్లడించారు. వాటికి తోడు ప్రస్తుత పాదయాత్ర సందర్భంగా తనను కలుస్తున్న రైతాంగానికి నిర్దిష్ట మైన మాటలు చెబుతూ భరోసా కల్పిస్తున్నారు.

పంట పెట్టుబడి కోసం మే నెలలోనే ప్రతి రైతుకూ రూ. 12.500 (వైఎస్సార్‌ భరోసా పథకం), రైతులకు ఉచితంగా బోర్లు, రైతు ట్రాక్టర్‌కు రోడ్డు పన్ను రద్దు, పంటవేసే ముందే మద్దతు ధర ప్రకటన, రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పాడి రైతుకు లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహకం, రూ. 4,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి... ఇలా ఎన్నెన్నో సానుకూలాంశాల్ని ప్రకటించారు. వ్యవసాయం పట్ల మంచి దృక్పథం ఉన్న నాయకత్వం ప్రస్తుత ఊబి లోంచి రైతుల్ని బయటకు తీసే చర్యలు స్వచ్ఛం దంగా చేపట్టాలి. మరోవైపు ఉద్యమాలు, పోరాటాల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే చర్యలు ఎలాగూ సాగుతున్నాయి.

ధర, రుణమాఫీ అడగరు
ద్రవ్యోల్బనం ఆధారంగా సవరించిన జీడీపీ లెక్కల్ని కేంద్ర ఆర్థిక గణాంక శాఖ గత వారం వెల్లడించింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి–సేవల వ్యయం పెరు గుదల రేటు స్థాయిలో ఆదాయ పెరుగుదల లేదని స్పష్టమైంది. అంటే, క్రమంగా రైతుల ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారుతోందని మరోమారు రుజువైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. పర్యావరణంతో అను సంధానం చేసిన పంటల సమగ్ర విధానం ఉండాలి. ఎప్పుడు, ఎక్కడ, ఏ పంట, ఎంత విస్తీర్ణంతో వేయాలో ఖరారు చేసే నిపుణుల కమిటీలుండాలి.

ప్రతి పంటకు తగినంత ముందుగానే మద్దతు ధర ప్రకటించాలి. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫా రసు చేసినట్టు సమగ్ర వ్యయం (సీ–2) పై 50 శాతం అధికంగా ఎమ్మెస్పీ ఖరారు చేయాలి. ధాన్యం రైతు చేతి నుంచి దళారులకు చేరాక కాకుండా, ముందే సర్కారు ధాన్యం సేకరణ జరపాలి. ఎమ్మెస్పీ లభిస్త లేనపుడు, ప్రభుత్వాలే మార్కెట్‌ జోక్యంతో కొనుగోలు చేయాలి. అందుకు ధరల స్థిరీకరణ నిధి ఉండాలి. ‘మా ఉత్పత్తికి తగిన ధర ఇప్పించండి చాలు, రుణం మాఫీ చేయమని మేమేం అడగం’ అని రైతులు, రైతు సంఘాలే చెబుతున్నాయి.

దళారీ వ్యవస్థను తగ్గించి ఉత్పత్తిదారు– వినియోగదారుడికి మధ్య ఒక ప్రత్యక్ష మార్కెట్‌ వ్యవస్థను పటిష్టపరచాలి. అనేక ఆటు పోట్లెదుర్కొంటూ, ఏడాది కష్టపడి రైతు పొందే ప్రయో జనానికి అయిదారు రెట్ల అధిక లాభాన్ని రెండు, మూడంచెల దళారులు కొన్ని రోజుల్లోనే గడించడం దుర్మార్గం. దీన్ని పరిహరించాలి. ఏం చేసైనా రైతు కన్నీరు తుడవాలి. అది రాకుండా, రైతే అసలు ఆగ్ర హించకుండా జాతి జాగ్రత్తపడాలి. ఇది రైతు కోసం కాదు, మనందరి కోసం!

వ్యాసకర్త: దిలీప్‌ రెడ్డి, ఈ-మెయిల్‌ :dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement