
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలంలో లభ్యతగా ఉన్న 33 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 24 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 9 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇరురాష్ట్రాల సాగునీటి అవసరాల దృష్ట్యా ఈ నెలాఖరు వరకు ఈ నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చింది. నాగార్జున సాగర్ వద్ద కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో శుక్రవారం జలసౌధలో కమిటీ సమావేశమైంది. బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ ఈఎన్‌సీలు మురళీధరరావు, వెంకటేశ్వరరావు, నాగార్జున సాగర్ సీఈ ఎస్.సునీల్, కర్నూలు సీఈ నారాయణ రెడ్డి, అంతర్రాష్ట్ర జలవనరుల సీఈ నరసింహారావు పాల్గొన్నారు.
60 టీఎంసీలు వాడుకోలేదు: ఏపీ
భేటీ సందర్భంగా తొలుత ఏపీ తన అవసరాలను పేర్కొంది. జనవరి 10న జరిగిన కృష్ణా బోర్డు కమిటీ సమావేశంలో తమకు కేటాయించిన 60 టీఎంసీలను ఇంకా పూర్తిగా వాడుకోనేలేదని, అందులో మిగిలిన కోటాతో కలిపి తమకు 30.38 టీఎంసీల నీటి అవసరాలు ఉన్నాయని ఏపీ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. తమకు కేటాయించిన 60 టీఎంసీలకు మించి వాడుకున్నామని బోర్డు సభ్య కార్యదర్శి లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. సాగర్ ఎడమ కాల్వకు ఫిబ్రవరి 26 వరకు 16.728 టీఎంసీలు ఏపీ వాడుకున్నట్లు లేఖలో పేర్కొన్నారని, నిజానికి ఏపీ సరిహద్దు వద్ద కేవలం 7.49 టీఎంసీలు మాత్రమే చేరిందని తెలిపారు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా నీటి కోటా పూర్తయిందనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాగర్ కుడి కాల్వకు 10.66 టీఎంసీలు, ఎడమ కాల్వకు 7.72 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 8 టీఎంసీలు, హంద్రీనివాకు 4 టీఎంసీలు అవసరమని, ఆ మేరకు కేటాయింపులు జరపాలని కోరారు.
మార్చి చివరికి 515 అడుగులు..
మార్చి 20 వరకు సాగర్ మట్టం 520 అడుగులు ఉండేలా రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. మార్చి చివరికి 515 అడుగుల నీటిమట్టం ఉండేలా ఒప్పందం కుదిరింది. ఇందుకు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను సాగర్‌కు విడుదల చేసేందుకు ఏపీ అంగీకరించింది. ఇరురాష్ట్రాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ తర్వాత రెండు ప్రాజెక్టుల్లోనూ కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లి నీటిని తీసుకోవాలని నిర్ణయించాయి. రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు సంబంధించి ఏప్రిల్‌లో మళ్లీ ఉత్తర్వులు జారీ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.
లభ్యత నీరంతా మాకే: తెలంగాణ
అయితే ఏపీ ప్రతిపాదనలపై తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తింది. ఇప్పటికే అదనంగా 2 టీఎంసీలకు మించి వినియోగం చేసిందని, వాటా పూర్తయిందని బోర్డు చెబుతున్నా, హంద్రీనివా ద్వారా నిరంతరం నీటిని తీసుకుంటూనే ఉంటోందని స్పష్టం చేసింది. ప్రస్తుత లభ్యత నీరంతా తెలంగాణకే దక్కుతాయని పేర్కొంది. వచ్చే ఆగస్టు వరకు తెలంగాణకు 46 టీఎంసీల అవసరం ఉన్నట్టు బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం రబీ పంటకు నీరు అందించాల్సి ఉందని వివరించింది. అయితే ఏపీ సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని బోర్డు సూచించడంతో మొత్తం కనీస నీటి మట్టాలకు ఎగువన లభ్యతగా ఉన్న 33 టీఎంసీల్లో 9 టీఎంసీలు ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించింది. దీనికి ఏపీ కూడా సానుకూలత వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment