శ్రీశైలం నుంచి నీరు విడుదల
శ్రీశైలం ప్రాజెక్టు: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు దిగువ ప్రాంతాలకు మంచినీటిని అందించేందుకు శ్రీశైలం డ్యాం నుంచి నీటిని ఆదివారం విడుదల చేశారు. డ్యాం రివర్ స్లూయిస్ గేటు ఒక దానిని ఆదివారం సాయంత్రం 4గంటలకు జలవనరుల శాఖ ఇంజనీర్లు తొమ్మిది అడుగులకు తెరచి 5,318 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం నీటిమట్టం 775 అడుగులకు చేరుకునే వరకు నీటిని విడుదల చేయాలని నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులో పేర్కొంది. ప్రస్తుతం జలాశయంలో 22.3458 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. సుమారు 4.8 టీఎంçసీల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. 775 అడుగుల వద్ద 18.6 టీఎంసీల నీటి నిల్వలు శ్రీశైలం జలాశయంలో ఉంటాయి. ఆదివారం రాత్రి 8గంటలు దాటిన తరువాత 15 అడుగులకు ఎత్తే యోచనలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 785.10 అడుగులుగా ఉంది. ఈ ఏడాది రెండు సార్లు రివర్‌స్లూయిస్ గేట్లు తెరవడంతో జలాశయంలో ఉన్న పూడిక కొంత మేరకు గేట్ల ద్వారా దిగువకు కొట్టుకుపోతోంది.