సాక్షి, హైదరాబాద్: రానున్న వేసవిలో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తీవ్ర గడ్డుపరిస్థితులు తప్పేట్లు లేవు. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టులో నానాటికి తగ్గుతున్న నీటి నిల్వల కారణంగానే కలవరం రేగుతోంది. ప్రాజెక్టులో మరో 5 టీఎంసీల నీరు తగ్గితే.. నీటి నిల్వ కనీస నీటి మట్టానికి (ఎండీడీఎల్) పడిపోనుంది. ఈ పరిస్థితిని గమనించి తీవ్ర సమస్యను ముందే గుర్తించిన కృష్ణాబోర్డు, హైదరాబాద్ జలమండలి, మిషన్ భగీరథ శాఖలు నీటి పారుదల శాఖను అప్రమత్తం చేశాయి. కనీస నీటి మట్టాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని.. వరుసగా 3 రోజుల్లో 3లేఖల రూపంలో విడివిడిగా హెచ్చరికలు జారీ చేశాయి. మరోవైపు ఈసారి తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలూ భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిర్వహణ కట్టు తప్పితే రానున్న వేసవిలో తాగునీటికి గండం తప్పదనిపిస్తోంది.
మిగిలింది 5.3 టీఎంసీలే: కృష్ణా బేసిన్ ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 869 అడుగుల మట్టంలో 140 టీఎంసీల మేర నిల్వలు ఉండగా, అది ప్రస్తుతం 538 అడుగులకు పడిపోయింది. దీంతో ప్రాజెక్టులో కేవలం 59.28 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. ఇందులో కనీస నీటిమట్టం 834 అడుగులకు ఎగువన ఉన్న నీళ్లు కేవలం 5.3 టీఎంసీలు మాత్రమే. ఇప్పటికే శ్రీశైలంలో ఉన్న నీటి లభ్యత ఆధారంగా.. ఈ ఏడాది మే వరకు ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు నీటిని కేటాయించింది.
ఇందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 6.69 టీఎంసీలు, తెలంగాణలోని కల్వకుర్తి ఎత్తిపోతలకు 8 టీఎంసీలు కేటాయించింది. ఇందులో ఏపీ తన వాటా కింద 3.02 టీఎంసీలు, తెలంగాణ
తన వాటా కింద 3.03 టీఎంసీల వినియోగం చేసేసింది. వినియోగం పోనూ ఇరు రాష్ట్రాలకు కలిపి మరో 8.63 టీఎంసీల మేర నీటి వాటాలున్నాయి. కానీ ప్రస్తుతం ఎండీడీఎల్ ఎగువన శ్రీశైలంలో లభ్యతగా ఉన్నది కేవలం 5.3టీఎంసీలే కావడంతో, వాటా నీటికోసం ఇరు రాష్ట్రాలు కచ్చితంగా దిగువకు వెళ్లాల్సిన అగత్యం కనబడుతోంది.
ఒక్కసారి ఎండీడీఎల్‌ను దాటి నీటిని తోడటం మొదలు పెడితే మే, జూన్ వరకు శ్రీశైలంలో చుక్క నీరు మిగలడం కష్టమే. అదే జరిగితే దిగువన నాగార్జునసాగర్‌లో నీటిలభ్యత పైనే ఇరు రాష్ట్రాలు ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం సాగర్‌లో 545 అడుగుల వద్ద 199 టీఎంసీల మేర నీటిలభ్యత ఉంది. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన 65 టీఎంసీల మేర నీళ్లున్నాయి. ఇందులో ఇరు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలు ముడిపడి ఉండటంతో నీటికి ఇబ్బంది తప్పని పరిస్థితులు ఎదురు కానున్నాయి.
విభాగాలు మూడు.. హెచ్చరిక ఒక్కటే!
శ్రీశైంలో నీటిమట్టం వేగంగా పడిపోతుండటంతో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలను హెచ్చరిస్తూ ఇప్పటికే లేఖలు రాసింది. శ్రీశైలం నుంచి విద్యుత్ అవసరాలకు నీటి వినియోగించరాదని.. కనీస నీటి మట్టాలను పాటించాలని ఆ లేఖల్లో బోర్డు కార్యదర్శి పరమేశం కోరారు. ఇక హైదరాబాద్ తాగునీటికి ఇబ్బంది తప్పదనిపిస్తున్న పరిస్థితుల దృష్ట్యా, శ్రీశైలంలో కనీస నీటిమట్టాల నిర్వహణపై నీటి పారుదల శాఖ దృష్టి పెట్టాలని జలమండలి కోరింది. ఈ మేరకు జలమండలి టెక్నికల్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ లేఖ రాశారు. జులై 31 వరకు నాగార్జునసాగర్‌లో 510 అడుగుల దిగువకు మట్టాలు పడిపోకుండా చూడాలని సూచించింది. మరోపక్క మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి సైతం నీటి పారుదల శాఖకు లేఖ రాశారు.
ఈ ఏడాదిలో నెలకు 4.73 టీఎంసీల చొప్పున జూన్ వరకు కనిష్టంగా 28.42 టీఎంసీల అవసరం ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలను పాటించాలని కోరారు. కొన్ని ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలు పాటించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, ఈ మేరకు జీవో 885కి అనుగుణంగా ప్రాజెక్టుల్లో నిల్వలు ఉండేలా చూడాలని సూచించారు. శ్రీశైలంపై ఆధారపడ్డ కల్వకుర్తి పరిధిలోని ఎల్లూర్ కింద 7.12 టీఎంసీల తాగు నీటి అవసరాలున్నాయి. శ్రీశైలంలో మట్టాలు తగ్గితే ఎల్లూరు కింది అవసరాలకు ఇబ్బందులున్న నేపథ్యంలో ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ నెల 3, 4, 5 తేదీల్లో వరుసగా వచ్చిన మూడు లేఖలు సాగునీటి శాఖలో కలవరం రేపుతున్నాయి.
భూగర్భ జలాల్లోనూ క్షీణత
రాష్ట్రంలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. 17% లోటు వర్షపాతం కారణంగా చాలా జిల్లాల్లో ఖరీఫ్ పంటల సాగుకు రైతులు బోర్లపై ఆధారపడటంతో మట్టాల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది డిసెంబర్ నీటిమట్టాలతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 2.10 మీటర్ల దిగువకు పడిపోయాయి. గతేడాది డిసెంబర్‌లో రాష్ట్ర సగటు నీటి మట్టం 9.05 మీటర్లు ఉండగా, అది ప్రస్తుతం 11.15 మీటర్లకు పెరిగింది. కేవలం పది జిల్లాల పరిధిలో సగటున 0.01 మీటర్ల నుంచి 1.57 మీటర్ల మేర భూగర్భ మట్టాలు పెరగ్గా, 21 జిల్లాలో ఏకంగా 7.59 మీటర్ల వరకు మట్టాలు పడిపోయాయి. మెదక్ జిల్లాలో ఏకంగా 20.8 మీటర్లకు భూగర్భ నీటిమట్టం పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇక అత్యంత ఎక్కువగా సంగారెడ్డి జిల్లాలో గత ఏడాది 12.01 మీటర్లు ఉన్న మట్టం ఈ ఏడాది 19.6 మీటర్లకు పడిపోయి మట్టాల క్షీణతలో తొలి స్థానంలో ఉంది. ఇక రంగారెడ్డి, గద్వాల, నాగర్‌కర్నూల్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మట్టాలు ఊహించని రీతిలో పడిపోయాయి. ఏకంగా కొన్ని జిల్లాలో 7 మీటర్లు పడిపోగా, మరికొన్ని జిల్లాలో 6 మీటర్లకు పైగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటడం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో వేసవికి ముందే ఇలాంటి పరిస్థితులుంటే.. ఇక మండే వేసవిలో ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయోననే ఆందోళన పెరుగుతోంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిర్వహణ కట్టు తప్పితే తాగునీటికి కూడా కష్టాలు రానున్న పరిస్థితుల్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఏం చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
శ్రీశైలం.. జరపైలం
Published Mon, Jan 7 2019 2:57 AM | Last Updated on Mon, Jan 7 2019 2:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment