నీటి విడుదల కొనసాగేనా?
నీటి విడుదల కొనసాగేనా?
Published Mon, Aug 22 2016 7:04 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
24న కృష్ణా బోర్డు సమావేశం
సాగర్ కుడికాలువ నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులు
మాచర్ల: నాగార్జున సాగర్ కుడికాలువ ఆయకట్టు పరిధిలో లక్షల ఎకరాలకు రెండేళ్లుగా సాగునీరు విడుదల కాని పరిస్థితి. ప్రస్తుతం నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండిపోవడం శ్రీశైలం ప్రాజెక్టు కూడా గరిష్ట నీటి మట్టానికి (885 అడుగులు) సమీపంలో 11 అడుగుల (874 అడుగుల) దూరంలో ఉండడంతో శ్రీశైలంకు వచ్చే నీటిని సాగర్ రిజ ర్వాయర్ విడుదల చేసే పరిస్ధితి ఉంది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 514.50 అడుగుల వద్ద ఉంది. మరో 70 అడుగులు నీరు వస్తే సాగర్ ప్రాజెక్టు నిండుతుంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో ఉన్న నీటిని సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేసి ఒక పంటకు నీళ్లీచ్చే అవకాశాలుండటంతో ఏపీ ప్రభుత్వం 48 టీఎంసీల నీటిని సాగు అవసరాల నిమిత్తం విడుదల చేయాలని ఇప్పటికే కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వివిధ నీటి అవసరాల నిమిత్తం కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈనెల 24వ తేదీన కృష్ణాబోర్డు సమావేశం కానుంది.
కరువును అధిగమించాలంటే..
కరువు పరిస్థితులను అధిగమించాలంటే ఒక పంటకైనా నీటిని విడుదల చేసి భూగర్భజలాల పెంపుదల, మంచినీటి సమస్య పరిష్కారానికి సానుకూలంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుందని ఆశపడుతున్నారు. తెలంగాణ –ఆంధ్రాకు సంబంధించి రెండు రాష్ట్రాల నీటి వివాదాలపై రెండు రోజుల్లో సమావేశం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుడికాలువ సాగునీటి విడుదల కోసం ప్రతిపాదన ఆమోదం అవుతుందా లేదని రైతాంగం ఆలోచనలో పడ్డారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ ఎక్కువగా ఉండటం, రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడే అవకావడం ఉండటంతో మొత్తంగా ఈ ఏడాది నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఎంతోకొంత మేలు జరిగే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని రైతులు భావిస్తున్నారు.
రెండు రోజుల్లో స్పష్టత..
సాగునీటిని విడుదల చేస్తారా లేక మంచినీటి అవసరాలకే విడుదల చేస్తారా అనే విషయంపై రెండురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో బోర్డు నిర్ణయం కోసం ఎదురు చూసే పరిస్థితి. ఆదివారం సాగర్ రిజర్వాయర్‌కు 22,330 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అదే స్థాయిలో సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, కుడికాలువ, ఎస్‌ఎల్‌బీసీకి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 155 టీఎంసీల నీరు నిల్వ ఉండగా సాగర్ రిజర్వాయర్లో 139.43 టీఎంసీల నీరు ఉంది. జూరాల నుంచి 16 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం రిజర్వాయర్‌కు వచ్చి చేరుతుంది.
Advertisement
Advertisement