sagar right canal
-
కారు ప్రమాదంలో ఎమ్మెల్యే బంధువులు దుర్మరణం
మాచర్ల రూరల్: కారు అదుపుతప్పి సాగర్ కుడి కాలువలో పడిన ఘటనలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి కుమారుడు మదన్‌మోహన్‌రెడ్డి భార్య లావణ్య (30), కుమార్తె సుదీక్షిత (9) కన్నుమూశారు. మంగళవారం రాత్రి మదన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు సాగర్ కుడి కాలువలో పడిపోయిన విషయం తెలిసిందే. అడిగొప్పల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే సమయంలో కారు కాలువలో పడింది. మదనమోహన్రెడ్డిని స్థానికులు కాపాడారు. ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. గజ ఈతగాళ్లు కాలువలో గాలించారు. ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో కారును గుర్తించారు. కారులోనే ఉన్న లావణ్య, సుదీక్షిత అప్పటికే విగతజీవులుగా మారారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. -
సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు.. కారులో ఎమ్మెల్యే బంధువులు
మాచర్ల: గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల వద్ద మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ కుమారుడు ప్రయాణిస్తున్న కారు మంగళవారం రాత్రి అదుపుతప్పి సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు సురక్షితంగా బయటపడగా.. ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ సుందరరామిరెడ్డి కుమారుడు మదనమోహన్‌రెడ్డి తన భార్య, కుమార్తెతో కలిసి గుంటూరు వెళ్లారు. తిరిగి మాచర్ల వస్తుండగా కారు అదుపు తప్పి కుడికాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి మదన్‌మోహన్‌రెడ్డిని కాపాడారు. కారులో ఉన్న ఆయన భార్య, కుమార్తె ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గజఈతగాళ్లతో గాలింపు చేయిస్తున్నారు. సంఘటనపై విచారణ చేపట్టారు. -
సాగర్ కుడి కాలువకు రెండు టీఎంసీలు
సాక్షి, అమరావతి: గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎ.పరమేశం అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈఎన్సీలు నారాయణరెడ్డి, మురళీధర్ హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాగర్ కుడి కాలువకు రెండు టీఎంసీల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరద రోజుల్లో సముద్రంలో కలిసే నీటిలో వాడుకున్న 22 టీఎంసీలను లెక్కలోకి తీసుకోవద్దంటూ బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంకు ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణరెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇందులో 11 టీఎంసీలను లెక్కలోకి తీసుకోబోమని.. మిగతా 11 టీఎంసీలను లెక్కలోకి తీసుకుంటామని బోర్డు గతంలో చెప్పిందన్నారు. అయినా ఇప్పుడు మిగులు జలాలను పూర్తి స్థాయిలో ఏపీ కోటాలో వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత వరద రోజుల్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలు తేల్చడానికి బోర్డు నియమించిన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. కాగా, సాగర్ కుడి కాలువకు 158.225 టీఎంసీలను కేటాయిస్తే.. 158.264 టీఎంసీలు వాడుకున్నారంటూ కృష్ణా బోర్డు ఈనెల 19న నీటి విడుదలను ఆపేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వరద రోజుల్లో వాడుకున్న 22 టీఎంసీలను లెక్కలోకి తీసుకోవద్దని తాము బోర్డును కోరినా.. దానిని పరిగణనలోకి తీసుకోకుండా కోటా పూర్తయిందంటూ నీటి విడుదల ఆపేయడంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే ప్రకాశం, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరింది. దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని త్రిసభ్య కమిటీని కృష్ణా బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆదేశించడంతో ఆ కమిటీ సమావేశమైంది. -
సాగర్ నీళ్లొచ్చేస్తున్నాయ్..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎట్టకేలకు ప్రభుత్వం సాగర్ కుడికాలువకు తాగు, సాగు నీటి అవసరాల కోసం నీరు విడుదల చేసింది. ఎగువ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి ఇప్పటికే శ్రీశైలం జలాశయం నిండింది. నాగార్జున సాగర్‌కు సైతం పూర్తి స్థాయిలో నీరు చేరింది. దీంతో కుడికాలువ పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ నీరు గుంటూరు జిల్లా పరిధిలోని బుగ్గవాగుకు చేరింది. అక్కడి నుంచి శుక్రవారం ఉదయానికి ప్రకాశం జిల్లా సరిహద్దుకు చేరనుంది. జిల్లాకు 3వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. తొలుత గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయనున్నారు. గుండ్లకమ్మలో 3 టీఎంసీలనిల్వకు అవకాశం.. 3.875 టీఎంసీలు సామర్థ్యం కలిగిన గుండ్లకమ్మలో 3 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. అనంతరం రామతీర్థం రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేస్తారు. ఆ తర్వాత ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు. పిబ్రవరి నెల వరకు నీటి విడుదల ఉంటుంది. సాగర్ కుడికాలువ పరిధిలో ప్రకాశం జిల్లాలో 4,37,330 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 1,85,046 ఎకరాలు మాగాణి భూములు ఉండగా 2,49,283 ఎకరాలు ఆరుతడి పంటలు పండే భూములు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో వరిపంటకు సాగునీరు ఇవ్వడంఇదే తొలిసారి. గత ఏడాది సైతం ఎగువన కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్ జలాశయంలో 580 అడుగుల మేర నీరు చేరినా కుడికాలువ పరిధిలో ఆయకట్టుకు ప్రభుత్వం సాగునీరు విడుదల చేయలేదు. దీంతో నాలుగేళ్లుగా సాగర్ రైతాంగం పంటలు లేక పొలాలు బీళ్లుగా పెట్టుకుని ఎదురు చూపులు చూడాల్సి వచ్చింది. తిండిగింజలు, పశువుల మేత గోదావరి జిల్లాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు సాగర్‌నీటిని విడుదల చేయడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యంక్తం చేస్తోంది. రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అద్దంకి, దర్శి, పర్చూరు, సంతనూతలపాడు ప్రాంతాల్లో బోరుబావి వసతి ఉన్న రైతాంగం వరినార్లు పోసి సిద్ధంగా ఉన్నారు. నీరు చేరిన వెంటనే నాట్లు వేసే అవకాశం ఉంది. -
నవంబర్ 1 నుంచి సాగర్ కుడి కాలువకు నీరు
సత్తెనపల్లి: నాగార్జున సాగర్ కుడి కాలువకు నవంబరు 1 నుంచి రబీ పంటకు సాగు నీరు విడుదల కానున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటి పారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మాట్లాడామన్నారు. నవంబరు 1 నుంచి కుడి కాలువకు సాగునీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రైతులు ఆరుతడి పంటల సాగుకు ఆరాటంగా ఉన్నారన్నారు. నీటిని రైతు సోదరులు శాస్త్రీయ పద్ధతిలో వాడు కోవాలన్నారు. ప్రస్తుతం సాగర్‌లో 540 అడుగులు నీటి మట్టం ఉందని, గతంలో 515 అడుగులు ఉన్నప్పుడే సాగునీటిని విడుదల చేశామన్నారు. -
'నీళ్లు విడుదల చేయకుంటే ఉద్యమమే'
గుంటూరు: నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయకపోవడంపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, డా.గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడులతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రబీకి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని, నీరు లేక పంట భూములన్నీ బీడులుగా మారిపోతున్నాయని నేతలు మండిపడ్డారు. మంచినీళ్ల చెరువులు కూడా ఎండిపోతున్నాయని అందుచేత వెంటనే సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీరు విడుదల చేయని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని వైఎస్ఆర్ సీపీ నేతలు తెలిపారు. -
నెల రోజుల్లో సాగర్ కుడికాల్వకు నీరు
స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు వెస్ట్: నెలరోజుల్లో సాగర్ కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తామని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ ఆరుతడి పంటలు, రబీ సాగుకు అవసరమైన నీటిని రైతులకు అందించేందుకుగాను సీఎం చంద్రబాబు నా యుడుతో చర్చించినట్టు తెలిపారు. త్వరలోనే నీటిని విడుదల చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టాలను అంచనా వేసి తగిన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పత్తి, మిరప రైతులు నిరాశ చెందకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలను సాగు చేయాలని, నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని విజ్ఞప్తిచేశారు. సమీక్ష సమావేశంలో కోడెల తనయుడు.. తొలుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన మండలాల అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదల వల్ల జరిగిన పంట నష్టం, గృహాలు, రోడ్లు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులు, పంచాయతీరాజ్ రోడ్లు, స్కీమ్‌లపై అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. ఈ సమావేశానికి స్పీకర్ కోడెల తనయుడు శివరామకృష్ణ హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలపై చేపట్టిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొనడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. -
నీటి విడుదల కొనసాగేనా?
24న కృష్ణా బోర్డు సమావేశం సాగర్ కుడికాలువ నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులు మాచర్ల: నాగార్జున సాగర్ కుడికాలువ ఆయకట్టు పరిధిలో లక్షల ఎకరాలకు రెండేళ్లుగా సాగునీరు విడుదల కాని పరిస్థితి. ప్రస్తుతం నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండిపోవడం శ్రీశైలం ప్రాజెక్టు కూడా గరిష్ట నీటి మట్టానికి (885 అడుగులు) సమీపంలో 11 అడుగుల (874 అడుగుల) దూరంలో ఉండడంతో శ్రీశైలంకు వచ్చే నీటిని సాగర్ రిజ ర్వాయర్ విడుదల చేసే పరిస్ధితి ఉంది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 514.50 అడుగుల వద్ద ఉంది. మరో 70 అడుగులు నీరు వస్తే సాగర్ ప్రాజెక్టు నిండుతుంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో ఉన్న నీటిని సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేసి ఒక పంటకు నీళ్లీచ్చే అవకాశాలుండటంతో ఏపీ ప్రభుత్వం 48 టీఎంసీల నీటిని సాగు అవసరాల నిమిత్తం విడుదల చేయాలని ఇప్పటికే కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వివిధ నీటి అవసరాల నిమిత్తం కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈనెల 24వ తేదీన కృష్ణాబోర్డు సమావేశం కానుంది. కరువును అధిగమించాలంటే.. కరువు పరిస్థితులను అధిగమించాలంటే ఒక పంటకైనా నీటిని విడుదల చేసి భూగర్భజలాల పెంపుదల, మంచినీటి సమస్య పరిష్కారానికి సానుకూలంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుందని ఆశపడుతున్నారు. తెలంగాణ –ఆంధ్రాకు సంబంధించి రెండు రాష్ట్రాల నీటి వివాదాలపై రెండు రోజుల్లో సమావేశం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుడికాలువ సాగునీటి విడుదల కోసం ప్రతిపాదన ఆమోదం అవుతుందా లేదని రైతాంగం ఆలోచనలో పడ్డారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ ఎక్కువగా ఉండటం, రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడే అవకావడం ఉండటంతో మొత్తంగా ఈ ఏడాది నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఎంతోకొంత మేలు జరిగే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని రైతులు భావిస్తున్నారు. రెండు రోజుల్లో స్పష్టత.. సాగునీటిని విడుదల చేస్తారా లేక మంచినీటి అవసరాలకే విడుదల చేస్తారా అనే విషయంపై రెండురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో బోర్డు నిర్ణయం కోసం ఎదురు చూసే పరిస్థితి. ఆదివారం సాగర్ రిజర్వాయర్‌కు 22,330 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అదే స్థాయిలో సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, కుడికాలువ, ఎస్ఎల్బీసీకి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 155 టీఎంసీల నీరు నిల్వ ఉండగా సాగర్ రిజర్వాయర్‌లో 139.43 టీఎంసీల నీరు ఉంది. జూరాల నుంచి 16 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం రిజర్వాయర్‌కు వచ్చి చేరుతుంది. -
సాగర్ కుడికాలువకు నీరు విడుదల చేయాలి
ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల : నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలోని రైతుల పంటలను కాపాడేందుకు నీటి విడుదలను కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి ఆయన గురువారం రాత్రి ఆయన సాక్షితో ఫోన్లో మాట్లాడారు. రెండేళ్లుగా సాగర్ కుyì lకాలువ రైతులు నీటి కొరతతో పంటలు సరిగా పండించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే పరిస్థితి నెలకొన్నందున సాగర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో పెరిగిందన్నారు. ఇప్పటికీ సాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని కృష్ణా బోర్డు అధికారులతో చర్చించి కుడికాలువ పరిధిలోని రైతులకు పంట నీరు అందించాలని ఆయన కోరారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
ఇక ఎక్కిళ్లే!
పల్నాడు ప్రాంతంలోని పట్టణాలకు తాగునీటిఎద్దడి పొంచి ఉంది. సాగర్ కుడికాలువ నుంచి ఎప్పుడు నీరు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆయా పట్టణాల్లో రిజర్వాయర్లలో నీరు కేవలం 15 రోజులకు మాత్రమే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. తర్వాత పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. నరసరావుపేట వెస్ట్: సకాలంలో వర్షాలు లేకపోవడంతో సాగునీటిపై రైతులు ఆశలు వదులుకున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం డెడ్స్టోరే జీకి చేరువలో ఉంది. మరోవైపు తాగునీరు కూడా విడుదల చేసే పరిస్థితి కన్పించడంలేదు. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా సాగర్‌కు 3 టీఎంసీల నీటిని తీసుకుంటేనే కుడికాలువకు నీటి విడుదల సాధ్యమవుతుందని ఎన్ఎస్పీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నీరు విడుదల చేసే విషయంలో నోరు మెదపలేదు. ఎప్పుడు నీరు విడుదలవుతుందోననే చెప్పలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. రోజురోజుకు రిజర్వాయర్లు ఖాళీ అవుతుండటంతో ఆందోళన మొదలైంది. వర్షాలు లేక.. ఈ ఏడాది ఇప్పటివరకు వర్షాలు సక్రమంగా కురవపోవటంతో సాగర్‌కు వరదనీరు చేరలేదు. గురువారం నాటికి శ్రీశైలం డ్యామ్‌లో 802.9 అడుగులు ఉండగా సాగర్‌లో 510.1 అడుగుల నీరు మాత్రమే ఉంది. గతేడాది ఇదే రోజుల్లో శ్రీశైలం డ్యామ్‌కు వరదనీరు చేరింది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతో రై తులు ఖరీఫ్‌పై ఆశలు వదులుకున్నారు. పట్టణ ప్ర జానీకానికి కావాల్సిన తాగునీటికోసమైనా సాగర్ నుంచి నీరు వదలాలని జిల్లా పరిషత్ సమావేశం తీ ర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. ఆగస్టు 15 నుం చి నీరు విడుదలవుతుందనే ఆశతో ప్రజలు ఉన్నారు. మినరల్ వాటర్‌పై ఆధారం.. సుమారు 1.20లక్షలమంది జనాభా ఉన్న నరసరావుపేట పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాలకు రిజర్వాయర్‌లోని నీరు మరో 15రోజులకు మించిరాదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఒకపూట మాత్రమే మంచినీరు సరఫరా చేస్తుండటంతో ప్రజలు మినరల్ వాటర్‌పై ఆధారపడుతున్నారు. సాగర్ కాలువలకు మరో 20రోజులపాటు నీరు విడుదల చేయకపోతే ఇబ్బందేనని నరసరావుపేట ప్రజారోగ్యశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.నాగమల్లేశ్వరరావు చెప్పారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి పట్టణాల్లోని ప్రజలకు రోజుమార్చి రోజు నీరు విడుదల చేస్తున్నామన్నారు. ఇదికూడా 15రోజులు మాత్రమేనని తెలిపారు. వినుకొండకు దొండపాడుచెరువు నుంచి నీరు తీసుకునే అవకాశం ఉండటంతో రెండునెలల వరకు ఇబ్బంది లేదని పేర్కొన్నారు. -
కుడికాలువకు కొనసాగుతున్న నీటి విడుదల
మాచర్లటౌన్/విజయపురి సౌత్ : నాగార్జునసాగర్ కుడి కాలువకు 7 వేల క్యూసెక్కుల నీటి విడుదలను ఆదివారం కూడా కొనసాగించారు. కుడి కాలువ జల విద్యుత్ కేంద్రం, కాలువ గేట్ల ద్వారా 7,104 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం శనివారం రాత్రి నుంచి ఎడమ కాలువకు నీటి విడుదలను నిలిపివేసింది. ఇప్పటికే విడుదలైన నీరు మరికొన్ని రోజుల పాటు రైతుల పంట పొలాలకు సరిపోతుందని, మళ్లీ అవసరమైనప్పుడు విడుదల చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. నల్గొండ జిల్లా ఎస్ఎల్బీసీకి మాత్రం 1,500 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటోంది. కుడి కాలువకు నీటి విడుదలను పర్యవేక్షించేందుకు ఒక డీఈ, ముగ్గురు జేఈలు, ఐదుగురు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఎడమ కాలువకు నీటిని నిలిపివేయటం వల్ల సాగర్ రిజర్వాయర్ నుంచి ఔట్‌ఫ్లోగా వెళ్లే నీటి విడుదల తగ్గింది. అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సాగర్ రిజర్వాయర్‌కు ఎలాంటి ఇన్‌ఫ్లో రావటం లేదు. సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం ప్రస్తుతం 532.20 అడుగులు ఉంది. ఇది 172.4730 టీఎంసీలకు సమానం. ఔట్‌ఫ్లోగా సాగర్ నుంచి 8,604 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. -
నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
-
నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
గుంటూరు: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులు రెండువైపులా మోహరించారు. మరోవైపు అధికారులకు బందోబస్తుగా పోలీసులు భారీగా తరలి వచ్చారు. నాగార్జున సాగర్ నుంచి కుడికాల్వకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు యత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోవైపు నాగార్జున సాగర్ డ్యాం ఉన్నతాధికారులతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. మార్చి నెలాఖరుకల్లా సాగర్ కుడికాల్వకు నీరందించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే వేలాది ఎకరాలకు నష్టం తప్పదని ఆయన ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. -
సాగర్ కుడి కాలువకు నీరు విడుదల
గుంటూరు : నాగార్జున సాగర్ కుడి కాల్వకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తునట్లు గురువారం అధికారులు తెలిపారు. 7 వేల క్యూసెక్కుల నీరు అవసరముండగా కేవలం 2వేల క్యూసెక్కులే విడుదల చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కాల్వకు చివర నున్న భూములు సాగు అవ్వాలంటే 7 వేల క్యూసెక్కుల నీరు అవసరమని రైతులు చెప్తున్నారు. (మాచర్ల) -
సాగర్ కుడి కాలువకు నీటి సరఫరా నిలుపుదల
గుంటూరు: నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదల పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ఇప్పటి వరకు విద్యుదుత్పత్తి ద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని హెడ్ రెగ్యులేటర్ ద్వారా కుడి కాలువకు విడుదల చేస్తున్నారు. అయితే బుధవారం ఉదయం 11 గంటలకు సంబంధిత పవర్‌హౌస్ టర్బయిన్‌లో శబ్ధాలు వచ్చాయి. దీంతో ప్రాజెక్టు అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. ఈ ఘటనను ఏపీ ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నీరు నిలుపుదలతో కుడి కాలువ పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (మాచెర్ల టౌన్)