నెల రోజుల్లో సాగర్ కుడికాల్వకు నీరు
నెల రోజుల్లో సాగర్ కుడికాల్వకు నీరు
Published Tue, Oct 4 2016 6:39 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు
గుంటూరు వెస్ట్: నెలరోజుల్లో సాగర్ కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తామని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ ఆరుతడి పంటలు, రబీ సాగుకు అవసరమైన నీటిని రైతులకు అందించేందుకుగాను సీఎం చంద్రబాబు నా యుడుతో చర్చించినట్టు తెలిపారు. త్వరలోనే నీటిని విడుదల చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టాలను అంచనా వేసి తగిన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పత్తి, మిరప రైతులు నిరాశ చెందకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలను సాగు చేయాలని, నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని విజ్ఞప్తిచేశారు.
సమీక్ష సమావేశంలో కోడెల తనయుడు..
తొలుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన మండలాల అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదల వల్ల జరిగిన పంట నష్టం, గృహాలు, రోడ్లు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు, పంచాయతీరాజ్ రోడ్లు, స్కీమ్‌లపై అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. ఈ సమావేశానికి స్పీకర్ కోడెల తనయుడు శివరామకృష్ణ హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలపై చేపట్టిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొనడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement