మాచర్లటౌన్/విజయపురి సౌత్ : నాగార్జునసాగర్ కుడి కాలువకు 7 వేల క్యూసెక్కుల నీటి విడుదలను ఆదివారం కూడా కొనసాగించారు. కుడి కాలువ జల విద్యుత్ కేంద్రం, కాలువ గేట్ల ద్వారా 7,104 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం శనివారం రాత్రి నుంచి ఎడమ కాలువకు నీటి విడుదలను నిలిపివేసింది. ఇప్పటికే విడుదలైన నీరు మరికొన్ని రోజుల పాటు రైతుల పంట పొలాలకు సరిపోతుందని, మళ్లీ అవసరమైనప్పుడు విడుదల చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
నల్గొండ జిల్లా ఎస్‌ఎల్‌బీసీకి మాత్రం 1,500 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటోంది. కుడి కాలువకు నీటి విడుదలను పర్యవేక్షించేందుకు ఒక డీఈ, ముగ్గురు జేఈలు, ఐదుగురు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఎడమ కాలువకు నీటిని నిలిపివేయటం వల్ల సాగర్ రిజర్వాయర్ నుంచి ఔట్‌ఫ్లోగా వెళ్లే నీటి విడుదల తగ్గింది. అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సాగర్ రిజర్వాయర్‌కు ఎలాంటి ఇన్‌ఫ్లో రావటం లేదు. సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం ప్రస్తుతం 532.20 అడుగులు ఉంది. ఇది 172.4730 టీఎంసీలకు సమానం. ఔట్‌ఫ్లోగా సాగర్ నుంచి 8,604 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.
కుడికాలువకు కొనసాగుతున్న నీటి విడుదల
Published Mon, Feb 16 2015 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM
Advertisement