రూ. 415 కోట్ల మేర అమృత్
కేంద్రానికి ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్(అమృత్) పథకం కింద 11 నగరాలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక(ఎస్‌ఏఏపీ)ను రూపొందించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 415 కోట్ల మేర అభివృద్ధి పనులను దీనిలో ప్రతిపాదించింది. వీటిలో రూ. 405. 16 కోట్లు నీటి సరఫరా పథకాల విస్తరణకు వినియోగిస్తారు. నిర్ధిష్ట ప్రమాణాల మేరకు రోజుకు తలసరి నీటి సరఫరా 135 లీటర్లు ఉండాల్సి ఉండగా.. ఈ నగరాల్లో అంతకంటే తక్కువగా ఉంది. అమృత్ మార్గదర్శకాల ప్రకారం పట్టణ ఆవాసాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల తప్పనిసరిగా ఉండాలి.
అయితే ఈ 11 నగరాల్లో తలసరి నీటి సరఫరా... రామగుండంలో 65 లీటర్లు మాత్రమే ఉండగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 114గా ఉంది. మహబూబ్‌నగర్‌లో 75, వరంగల్లులో 80, సూర్యాపేట-90, మిర్యాలగూడ-90, ఖమ్మం-100, ఆదిలాబాద్-102, నల్లగొండ-102, నిజామాబాద్ -108, కరీంనగర్-109 లీటర్లుగా ఉంది. కాగా నల్లా కనెక్షన్లు ఉన్న కుటుంబాల విషయంలో... రామగుండంలో అత్యల్పంగా 35 శాతం కుటుంబాలకు మాత్రమే ఉండగా.. సూర్యాపేటలో అత్యధికంగా 86.50 శాతం ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 40 శాతం, మిర్యాలగూడ-40శాతం, నిజామాబాద్-45 శాతం, ఆదిలాబాద్-48.50 శాతం, నల్లగొండ-52.88 శాతం, ఖమ్మం-54.22 శాతం, వరంగల్లు-58.82 శాతం, జీహెచ్‌ఎంసీ-76 శాతం, కరీంనగర్-78 శాతం ఉన్నాయి. 2020 నాటికి ఆయా పట్టణాల్లో 135 లీటర్ల మేర తలసరి నీటి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళిక రూపొందించింది.
ఎక్కడెక్కడ ఖర్చు ఎంత?....
రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 2015-16లో నీటి సరఫరా పథకాలకు గాను మహబూబ్‌నగర్‌లో రూ. 58.44 కోట్లు, వరంగల్లులో రూ. 55 కోట్లు, నిజామాబాద్‌లో రూ. 49 కోట్లు, కరీంనగర్‌లో రూ. 45 కోట్లు, ఆదిలాబాద్‌లో రూ. 42.50 కోట్లు, నల్లగొండలో రూ. 34.70 కోట్లు, మిర్యాలగూడలో రూ. 34.53 కోట్లు, రామగుండంలో రూ. 34.30 కోట్లు, జీహెచ్‌ఎంసీలో రూ. 20 కోట్లు, సూర్యాపేటలో రూ. 9 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు.
కేంద్రం ఎంతిస్తుంది?...
రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్ర అపెక్స్ కమిటీ పరిశీలించి త్వరలోనే తగు నిర్ణయం తీసుకోనున్నట్టు పట్టణాభివృద్ధి శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం ఈ ప్రతిపాదనలు అంగీకరిస్తే కేంద్ర వాటాగా రూ. 210.30 కోట్ల సాయం అందుతుంది. మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు భరించాల్సి ఉంటుంది. మొత్తంగా ఐదేళ్ల పాటు అమృత్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,413 కోట్లు నీటి సరఫరా పైన, రూ. 5,435 కోట్లు మురుగునీటి పారుదల పైన ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందించింది.