Union Urban Development
-
విజన్ 2047కు ప్రణాళికలు సిద్ధం చేయండి
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎం.జానకి నెల్లూరు సిటీ : విజన్ 2047లో భాగంగా నెల్లూరు నగర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎం. జానకి అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరపాలకసంస్థ కార్యాలయంలో గురువారం పలు శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్ణాలచెరువు, సర్వేపల్లి కాలువ ఆధునీకరణ, రింగ్‌రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హడ్కో రుణంతో తాగునీరు, భూగర్భ డ్రైనేజీ పనులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వాతంత్రం వచ్చి 2047కి 100 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా నెల్లూరును అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలన్నారు. నూతన మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచిం చారు. ఈ సమీక్ష జరుగుతున్న మందిరంలోకి మీడియాను అనుమతించలేదు. ఈ సమావేశంలో జన ఆర్గనైజేషన్ సభ్యులు స్వాతిరామనాథన్, డీఎంఏ కన్నబాబు, కార్పొరేషన్ కమిషనర్ ఢిల్లీరావు, పబ్లిక్‌హెల్త్ ఎస్ఈ మోహన్, డీటీసీ శివరామప్రసాద్, ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట కమిషనర్లు శ్రీనివాసులు, నరేంద్ర, సూళ్లూరుపేట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
228 సెన్సస్ పట్టణాలను స్థానిక సంస్థలుగా మార్చాలి
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి లేఖ సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని 228 సెన్సస్ పట్టణాలను చట్టబద్ధమైన అర్బన్ స్థానిక సంస్థలుగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను కోరింది. దీంతోపాటు దేశంలోని అన్ని సెన్సస్ పట్టణాలను చట్టబద్ధమైన అర్బన్ స్థానిక సంస్థలుగా మార్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా మంగళవారం లేఖలు రాశారు. ఒక ప్రాంతాన్ని సెన్సస్ పట్టణంగా పరిగణించాలంటే..5 వేలమంది కనీస జనాభాతో చదరపు కిలోమీటర్‌కు 400 మంది జనాభా సాంద్రతను కలిగివుండాలని లేఖలో పేర్కొంది. కనీసం 75% పురుషులు వ్యవసాయేతర పనులు చేస్తూ పట్టణ లక్షణాలు కలిగివుండాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డులను చట్టబద్ధమైన పట్టణాలుగా పరిగణిస్తారు. సెన్సస్ పట్టణాలను చట్టబద్ధమైన అర్బన్ స్థానిక సంస్థలుగా మార్చడం వల్ల వాటికి 14 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర సాయం లభిస్తుందన్నారు. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) పథకం కింద రాష్ట్రంలో చట్టబద్ధమైన పట్టణాల సంఖ్య ఆధారంగా 50% వెయిటేజ్ ఇస్తారని తెలిపారు. ప్రణాళిక, సమన్వయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆదాయ పెరుగుదలతో పాటు పౌరులకు సమర్థవంతంగా సేవలను అందించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి చట్టబద్ధమైన అర్బన్ స్థానిక సంస్థలు దోహదపడతాయని వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 3,784 సెన్సస్ పట్టణాలున్నాయని లేఖలో పేర్కొంది. -
నాయుడమ్మ, గోఖలేలకు సత్కారం
♦ ‘పద్మశ్రీ’ గ్రహీతలకు ప్రముఖుల అభినందనలు ♦ సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నివాసంలో ఆత్మీయ సమ్మేళనం ♦ ప్రజల తరఫున గౌరవించడం సంతోషం: నాయుడమ్మ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి సోమవారం ‘పద్మశ్రీ’ పురస్కారం స్వీకరించిన వైద్య రంగ నిపుణులు డాక్టర్ నాయుడమ్మ యార్లగడ్డ, డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నివాసంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ రంజన్ గొగోయ్, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి, కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి, జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ చైర్మన్ జస్టిస్ డి.కె.జైన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాయుడమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘40 ఏళ్లకుపైగా పీడియాట్రిక్ శస్త్రచికిత్స వైద్యంలో చేసిన కృషికి ప్రజల తరఫున ప్రభుత్వం ఈవిధంగా గౌరవించడం చాలా సంతోషాన్నిస్తోంది. భవిష్యత్తులోనూ ఇదే కృషిని కొనసాగిస్తా. ప్రజలకు ఉపయోగకారిగా, సమాజానికి ఉపయోగకారిగా ఈ రంగంలో కృషిచేస్తానని విశ్వసిస్తున్నాను. కృషిని కొనసాగిస్తానని తెలియజేసుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు. సంతోషాన్నిచ్చింది: వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘నాకు తెలిసి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సాధారణ రైతును ప్రభుత్వం గుర్తించి పద్మ పురస్కారం ఇవ్వడం సంతోషం. దేశంలోని రైతులందరికీ ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నా. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంలో దిట్ట. అలాంటి వ్యక్తిని గుర్తించి పురస్కారం ఇవ్వడం ద్వారా రైతులోకానికి చక్కటి గుర్తింపు లభించింది. రాష్ట్రపతి భవన్లో ఈ ఘట్టం జరుగుతున్నప్పుడు నాకు మనసు పులకించింది. ప్రధాని వద్దకు ఆయనను తీసుకెళ్లాను. ప్రకృతి వ్యవసాయం అనే ఆలోచనను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని ఆయనకు చెప్పారు. ఇక తెలుగు వారికి పద్మ పురస్కారాలు లభించాయి. తెలుగు వారి ప్రతిభా విశేషాలు లోకవిదితమే. ప్రభుత్వం గుర్తించి సత్కరించడం తెలుగు వాడిగా నాకు ఆనందంగా ఉంది. ఒకేసారి 112 మందికి ఇవ్వడం కష్టమని రెండుసార్లు ఏర్పాటు చేశారు. ప్రతిభ ఉన్న వారిని గౌరవించడం అంటే దేశం తనకు తాను ఇచ్చుకున్నట్టు లెక్క. పనిచేసేవారి నుంచి స్ఫూర్తి పొందడానికే ఈ పురస్కారాలు. యామినీ కృష్ణమూర్తి, రామోజీరావు, డాక్టర్ నాయుడమ్మ, డాక్టర్ గోఖలే డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి.. వీళ్లంతా అసమాన ప్రతిభను వివిధ రంగాల్లో కనబరిచారు. వీరంతా తెలుగువారవడం చాలా సంతోషం..’ అని పేర్కొన్నారు. కంభంపాటి మాట్లాడుతూ ‘డాక్టర్ నాయుడమ్మ మూడు దశాబ్దాలకుపైగా వేలాది మంది చిన్నారుల ప్రాణాలు కాపాడి, అవిభక్త కవలలకు శస్త్రచికిత్స ద్వారా కొత్త జీవితాన్ని ఇచ్చి దేశంలోనే అరుదైన వైద్య నిపుణుడిగా నిలిచారు. అలాగే డాక్టర్ గోఖలే తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స చేసి తెలుగువారికి గర్వకారణంగా నిలిచారు.’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నాయుడమ్మ సతీమణి డాక్టర్ కృష్ణభారతి, కుమారుడు రితేశ్, కోడలు డాక్టర్ భువన తదితరులు పాల్గొన్నారు. -
మజ్లిస్‌కు ఓటేస్తేనే బీఫ్ తినే అవకాశమనడం విడ్డూరం
♦ ‘గ్రేటర్’ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి వెంకయ్య ♦ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం ♦ మతోన్మాదశక్తులకు అడ్డాగా మహానగరం ♦ పాతబస్తీ ఎందుకు అభివృద్ది జరగలేదో చెప్పాలి ♦ అధికార పార్టీతో మజ్లిస్ లోపాయికారీ ఒప్పంద ం హైదరాబాద్: మజ్లిస్‌కు ఓటేస్తేనే బీఫ్ తినేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఒవైసీని ఉద్దేశించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ మహానగరం మతోన్మాద శక్తులకు అడ్డాగా మారుతుండటం బాధాకరమని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన సైదాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయిలో విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో కనిపించేలా చేసిన ఘనత ఆనాటి ప్రధాని వాజ్పాయ్, ముఖ్యమంత్రి చంద్రబాబులకే దక్కుతుందన్నారు. గృహనిర్మాణం కింద తెలంగాణకు 55,507 ఇళ్లు కేటాయించగా ఒక్క హైదరాబాద్‌కే 29, 531 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. మంచినీటి పథకం కింద రూ. 2,500 కోట్లు మంజూరు చేయగా ఇప్పటికే రూ. 1,700 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని అడిగే వారికి ఈ లెక్కలు సరిపోవా అని అన్నారు. స్వచ్ఛభారత్ కింద తెలంగాణకు రూ. 498 కోట్లు కేటాయించామని తెలిపారు. కేంద్రంతో కలసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని, ఘర్షణ పడితే నష్టం తప్ప లాభం ఉండదని అన్నారు. 2022 నాటికి దేశంలో పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. మతోన్మాద శక్తులకు అడ్డాగా హైదరాబాద్ పాతబస్తీ ఇప్పటికీ ఎందుకు సైబరాబాద్ నగరంలా అభివృద్ధి చెందలేదో ఎంఐఎం జవాబు చెప్పాలని ప్రశ్నించారు. సైదాబాద్ డివిజన్లో ఎంఐఎం పార్టీ ఎందుకు పోటీ చేయలేదో ఆ పార్టీ నేతలు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారపార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించారు. పార్టీలు మారిన వ్యక్తులకు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. సైదాబాద్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి సమ్‌రెడ్డి శైలజారెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి, కాచం వెంకటేశ్వర్లు, చింతా సాంబమూర్తి, బి. నర్సింహ, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, ముద్దం శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ నాయకులు శ్యామ్‌సుందర్, అమర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
85 స్మార్ట్‌సిటీల ప్రతిపాదనలు సిద్ధం
తెలంగాణలో హైదరాబాద్ బదులు మరో నగరం న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల నిర్మాణం కోసం ప్రతిపాదిన 98 నగరాల్లో 85 మాత్రమే ఇంతవరకు నగరస్థాయి నివేదికలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు ప్రతిపాదలను పంపించాయి. ప్రతిపాదనలు పంపేందుకు చివరిరోజైన మంగళవారం 68 నగరాలు నివేదికలు అందించగా.. సోమవారం 17 సిటీలు ప్రపోజల్స్ పంపించాయి. వరదల కారణంగా తమిళనాడు ప్రతిపాదనలు పంపలేదు. కాగా, హైదరాబాద్ స్థానంలో మరో నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని తెలంగాణ సర్కారు కోరింది. ఆ నగరం పేరును త్వరలోనే వెల్లడిస్తామని కేంద్రానికి తెలిపింది. ప్రతిపాదనలు వచ్చిన వాటిలో 20 నగరాలను ఎంపికచేసి జనవరి మూడోవారం కల్లా ‘స్మార్ట్ సిటీ ప్రాజెక్టు’ పనులు ప్రారంభించేందుకు నిధులు ఇస్తారు. ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు రాష్ట్రాలకు మూడు వర్క్‌షాప్‌లు, ఓ స్మార్ట్‌సిటీ ఐడియా క్యాంపు, ఐదు రౌండ్ల వెబినార్లు, ప్రతిపాదనల అభివృద్ధికి మరో వర్క్‌షాప్ నిర్వహించింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో 20 దేశాలనుంచి 30 విదేశీ కంపెనీలు భాగస్వామ్యం కానున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా 474 పట్టణాల్లో మౌలికవసతుల అభివృద్ధి కోసం రూపొం దించిన అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్)పథకానికి రూ.19వేల కోట్లు బడ్జెట్ కేటాయింపులకు రంగం సిద్ధమైంది. -
రూ. 415 కోట్ల మేర అమృత్
కేంద్రానికి ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, న్యూఢిల్లీ: అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్(అమృత్) పథకం కింద 11 నగరాలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక(ఎస్ఏఏపీ)ను రూపొందించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 415 కోట్ల మేర అభివృద్ధి పనులను దీనిలో ప్రతిపాదించింది. వీటిలో రూ. 405. 16 కోట్లు నీటి సరఫరా పథకాల విస్తరణకు వినియోగిస్తారు. నిర్ధిష్ట ప్రమాణాల మేరకు రోజుకు తలసరి నీటి సరఫరా 135 లీటర్లు ఉండాల్సి ఉండగా.. ఈ నగరాల్లో అంతకంటే తక్కువగా ఉంది. అమృత్ మార్గదర్శకాల ప్రకారం పట్టణ ఆవాసాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ 11 నగరాల్లో తలసరి నీటి సరఫరా... రామగుండంలో 65 లీటర్లు మాత్రమే ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో 114గా ఉంది. మహబూబ్‌నగర్‌లో 75, వరంగల్లులో 80, సూర్యాపేట-90, మిర్యాలగూడ-90, ఖమ్మం-100, ఆదిలాబాద్-102, నల్లగొండ-102, నిజామాబాద్ -108, కరీంనగర్-109 లీటర్లుగా ఉంది. కాగా నల్లా కనెక్షన్లు ఉన్న కుటుంబాల విషయంలో... రామగుండంలో అత్యల్పంగా 35 శాతం కుటుంబాలకు మాత్రమే ఉండగా.. సూర్యాపేటలో అత్యధికంగా 86.50 శాతం ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 40 శాతం, మిర్యాలగూడ-40శాతం, నిజామాబాద్-45 శాతం, ఆదిలాబాద్-48.50 శాతం, నల్లగొండ-52.88 శాతం, ఖమ్మం-54.22 శాతం, వరంగల్లు-58.82 శాతం, జీహెచ్ఎంసీ-76 శాతం, కరీంనగర్-78 శాతం ఉన్నాయి. 2020 నాటికి ఆయా పట్టణాల్లో 135 లీటర్ల మేర తలసరి నీటి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళిక రూపొందించింది. ఎక్కడెక్కడ ఖర్చు ఎంత?.... రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 2015-16లో నీటి సరఫరా పథకాలకు గాను మహబూబ్‌నగర్‌లో రూ. 58.44 కోట్లు, వరంగల్లులో రూ. 55 కోట్లు, నిజామాబాద్‌లో రూ. 49 కోట్లు, కరీంనగర్లో రూ. 45 కోట్లు, ఆదిలాబాద్‌లో రూ. 42.50 కోట్లు, నల్లగొండలో రూ. 34.70 కోట్లు, మిర్యాలగూడలో రూ. 34.53 కోట్లు, రామగుండంలో రూ. 34.30 కోట్లు, జీహెచ్ఎంసీలో రూ. 20 కోట్లు, సూర్యాపేటలో రూ. 9 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. కేంద్రం ఎంతిస్తుంది?... రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్ర అపెక్స్ కమిటీ పరిశీలించి త్వరలోనే తగు నిర్ణయం తీసుకోనున్నట్టు పట్టణాభివృద్ధి శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం ఈ ప్రతిపాదనలు అంగీకరిస్తే కేంద్ర వాటాగా రూ. 210.30 కోట్ల సాయం అందుతుంది. మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు భరించాల్సి ఉంటుంది. మొత్తంగా ఐదేళ్ల పాటు అమృత్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,413 కోట్లు నీటి సరఫరా పైన, రూ. 5,435 కోట్లు మురుగునీటి పారుదల పైన ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందించింది. -
ఇదీవరుస!
విజయవాడ@ 266 పరిశుభ్రతలో వెనుకబాటు స్వచ్ఛ భారత్ ర్యాంకింగుల్లో బయటపడ్డ డొల్లతనం పరిశుభ్రతలో నగరం బాగా వెనుకబడింది. లక్షలాది మంది జనాభా ఉన్న 476 నగరాలు, పట్టణాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన స్వచ్ఛభారత్ సర్వేలో విజయవాడకు 266వ స్థానం దక్కింది. పొరుగున ఉన్న గుంటూరు 70వ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు బెస్ట్ సిటీ అవార్డును దక్కించుకున్న బెజవాడ వెనుకబాటుతనానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంతోపాటు ఆర్థిక సంక్షోభం కూడా కారణమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ : జాతీయ పారిశుధ్య విధానం 2008 ప్రకారం 2014-15 సంవత్సరానికి సర్వే చేపట్టారు. ఆరుబయట మలవిసర్జన, ప్రజామరుగుదొడ్లు, ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ, వ్యర్థ పదార్థాలు, తాగునీటి నాణ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. రోజుకు 550 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీని తరలింపు సక్రమంగా జరగడం లేదు. డంపింగ్ యార్డు కొరత ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంటింటి చెత్త సేకరణ 80 శాతానికి మించడం లేదు. తడి, పొడి చెత్త విభజన జరగడం లేదు. వర్మీకంపోస్ట్ ప్లాంట్లు పనిచేయడం లేదు. తూర్పు నియోజక వర్గంలో కుళాయిల ద్వారా మురుగునీరు వస్తోందని ప్రజలు ఇప్పటికీ గగ్గోలు పెడుతుంటారు. నూరు శాతం లేవు అభివృద్ధి చెందిన నగరంగా పేరొందిన విజయవాడలో నూరు శాతం వ్యక్తగత మరుగుదొడ్లు లేవు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా 59 డివిజన్లలో సర్వే నిర్వహించగా 6,700 వ్యక్తగత మరుగుదొడ్లు కావాల్సి ఉందని లెక్క తేలింది. వీటి నిర్మాణ బాధ్యతల్ని డ్వాక్వా మహిళలకు అప్పగించాలని నిర్ణయించారు. స్వచ్ఛ భారత్ నిబంధనల్ని అనుసరించి అద్దెదారులు, కాల్వగట్లవాసులు ఈ పథకంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించరాదని ఆంక్షలు ఉండడంతో ఆ సంఖ్య 2,500కి తగ్గింది. కాల్వగట్లవాసులు 80 శాతం మంది సెప్టిక్ ట్యాంక్ పైపుల్ని కాల్వగట్లలోకి పెట్టేశారు. దీంతో కాల్వల్లో జలం కలుషితమవుతోంది. గబ్బుకొడుతున్న టాయ్‌లెట్స్ ఏలూరులాకులు, ఉడా పార్క్, ఆర్టీసీ బస్టాండ్, హనుమంతరాయ ఫిష్ మార్కెట్, సర్కిల్-3 ఆఫీసు, యనమలకుదురు, పటమట రైతుబజార్, తారక్నగర్, పద్మావతి ఘాట్, రాజీవ్‌గాంధీ మార్కెట్, రాణీగారితోట, ఇందిరాగాంధీ స్టేడియం, సివిల్ కోర్టు, లెనిన్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ టాక్సీస్టాండ్, భవానీపురం లారీస్టాండ్, వీఎంసీ పూల మార్కెట్, ఐజీఎం స్టేడియం ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ టాయ్‌లెట్స్ నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడి మరమ్మతులు లేకపోవడంతో ఇవి గబ్బుకొడుతున్నాయి. -
నిధులున్నా నిర్లక్ష్యమే!
యూజీడీ నిధులు రూ.904 కోట్లు విడుదలయ్యేనా.. కేంద్రం మంజూరుచేసిన రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోనే.. విజయవాడ, గుంటూరులో రోడ్ల నిర్మాణం పనులు వాయిదా గుంటూరు : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన మిగులు నిధులు రూ.వెయ్యి కోట్లకు ఇంతవరకు మోక్షం కలగలేదు. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది. అయితే, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా కేంద్ర ప్రభుత్వం కరుణ చూపించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థలో యూజీడీ ప్రాజెక్టుకు రూ.540 కోట్లు, విజయవాడ నగరపాలక సంస్థలో రూ.460 కోట్లతో వరద నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఈ నిధులు విడుదలయ్యాయి. దీనికి అదనంగా మరో రాష్ట్ర ప్రభుత్వం రూ.364 కోట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోనే.. కేంద్రం ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో రెండు నెలల కిందట జమ చేసింది. ఇప్పటివరకు దీనిపై విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలకు ఎటువంటి సమాచారం లేదు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కన్నబాబు పలుమార్లు యూజీడీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖ నుంచి ఎటువంటి సమాచారం, ఆదేశాలు రాలేదు. యూజీడీ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను పబ్లిక్ హెల్త్ విభాగానికి అప్పగిస్తారని అప్పట్లో అధికారులు తెలిపారు. అయితే, దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు. ఇదే సమయంలో వర్షాకాలం రావడంతో విజయవాడలో సైతం కొద్దిపాటి వర్షానికే నగరం మునిగిపోయే పరిస్థితి నెలకొంది. విజయవాడ కార్పొరేషన్ సైతం నిధులు మంజూరు కాలేదు. సుమారు 135 కిలోమీటర్ల మేర ఇక్కడ వరద నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. -
స్వచ్ఛ భారత్‌లో ‘తెలంగాణ’ గల్లంతు
కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన జాబితాలో కనిపించని రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్(ఎస్బీఎం) కింద ఎంపిక చేసిన రాష్ట్రాల జాబి తాలో ‘తెలంగాణ’ పేరు గల్లంతైంది. ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం జాబితాను వెలువరించింది. అయితే తెలంగాణ మిన హా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ జాబితాలో చోటు లభించింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంపికైన పట్టణాల సంఖ్య, నిధుల కేటాయింపు తదితర సమాచారం ఈ జాబితాలో ఉంది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ తాజాగా ఈ జాబితాను ప్రకటించింది. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌గా సూచించినట్లు రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 125 పట్టణాల్లో అమలు దేశ వ్యాప్తంగా 4,041 పట్టణాల్లో స్వచ్ఛ భారత్ పథకం అమ లుకానుండగా..(ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్‌లోని 125 పట్టణాలు కేంద్రం ఎంపిక చేసిన జాబితాలో ఉన్నాయి. ఈ పట్టణాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం పెద్దపీట వేయనుంది. వ్యక్తిగత మరుగుదొడ్లకు రూ. 4 వేలు: స్వచ్ఛ భారత్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం రూ.4 వేల ను ప్రోత్సాహకంగా అందజేయనుంది. తొలి విడత కింద కేంద్ర ప్రోత్సాహకం నుంచి రూ.2 వేలతో పాటు రాష్ట్ర వాటా నిధులను లబ్ధిదారులకు చెల్లిస్తారు. నిర్మాణంలో పురోగతిని పరిశీలించాక మిగిలిన 50 శాతాన్ని అందజేస్తారు. నిర్మాణం పూర్తై మరుగుదొడ్ల చిత్రాలను ఎస్బీఎం వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లింపులు జరుగుతాయి. సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం 40 శాతం, రాష్ట్రం 25 శాతం వాటాను అందిస్తాయి. మిగిలిన నిధులను ఇతర మార్గాల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పట్టణాల్లో అవసరాలకు సరిపడే సంఖ్యలో పబ్లిక్ మరుగుదొడ్లను నిర్మించాలని రాష్ట్రాలకు కేం ద్రం సూచించింది. పబ్లిక్ మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణను పీపీపీ పద్ధతిలో చేపట్టాలని కేంద్రం సూచించింది.