నిధులున్నా నిర్లక్ష్యమే!
యూజీడీ నిధులు రూ.904 కోట్లు విడుదలయ్యేనా..
కేంద్రం మంజూరుచేసిన రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోనే..
విజయవాడ, గుంటూరులో రోడ్ల నిర్మాణం పనులు వాయిదా
గుంటూరు : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన మిగులు నిధులు రూ.వెయ్యి కోట్లకు ఇంతవరకు మోక్షం కలగలేదు. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది. అయితే, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా కేంద్ర ప్రభుత్వం కరుణ చూపించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థలో యూజీడీ ప్రాజెక్టుకు రూ.540 కోట్లు, విజయవాడ నగరపాలక సంస్థలో రూ.460 కోట్లతో వరద నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఈ నిధులు విడుదలయ్యాయి. దీనికి అదనంగా మరో రాష్ట్ర ప్రభుత్వం రూ.364 కోట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోనే..
కేంద్రం ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో రెండు నెలల కిందట జమ చేసింది. ఇప్పటివరకు దీనిపై విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలకు ఎటువంటి సమాచారం లేదు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కన్నబాబు పలుమార్లు యూజీడీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖ నుంచి ఎటువంటి సమాచారం, ఆదేశాలు రాలేదు. యూజీడీ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను పబ్లిక్ హెల్త్ విభాగానికి అప్పగిస్తారని అప్పట్లో అధికారులు తెలిపారు. అయితే, దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు. ఇదే సమయంలో వర్షాకాలం రావడంతో విజయవాడలో సైతం కొద్దిపాటి వర్షానికే నగరం మునిగిపోయే పరిస్థితి నెలకొంది. విజయవాడ కార్పొరేషన్ సైతం నిధులు మంజూరు కాలేదు. సుమారు 135 కిలోమీటర్ల మేర ఇక్కడ వరద నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది.