
కారును ఢీకొన్న టిప్పర్ లారీ
ఐదుమంది బీటెక్ విద్యార్థుల దుర్మరణం
వీకెండ్ టూర్‌లో ఘోర విషాదం
చామరాజనగర జిల్లాలో ప్రమాదం
మైసూరు: ఐదుమంది భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. ఇంజినీరింగ్ కోర్సు అయిపోయిన తరువాత మంచి ఉద్యోగాలు చేద్దామని, లేదా మరింత ఉన్నత చదువులు చదవాలని భావించారు. అయితే వీకెండ్ టూర్ ఆలోచన– ఓ టిప్పర్ లారీ వారి స్వప్నాలను భగ్నం చేశాయి. ఐదుగురి కుటుంబాలలో అంతులేని విషాదాన్ని కలిగించాయి. సరదాగా సాగుతున్న విహారయాత్రలో టిప్పర్ లారీ డ్రైవర్ యమదూత మాదిరిగా విరుచుకుపడ్డాడు.
మైసూరు నుంచి బయల్దేరి..
చామరాజనగర జిల్లా కొళ్లేగాళ వద్ద కారును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుమంది ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. కొళ్లేగాల రూరల్‌లోని చిక్కందువాడి గ్రామం వద్ద రహదారిలో ఈ విషాదం సంభవించింది. వివరాలు.. మైసూరు సిటీలో నివసించే శ్రీలక్ష్మీ, లిఖిత, మండ్యకు చెందిన సుహాన్, నితిన్, శ్రేయస్‌లు మైసూరు ఎంఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. వీరి వయస్సు 20– 23 ఏళ్లలోపు ఉంటుంది. అందరూ మంచి స్నేహితులు. మలె మహదేశ్వర బెట్టలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలను చూసుకుని, ఆ తరువాత హొగెనేకల్ జలపాతానికి వెళ్లాలని బయల్దేరారు. ఓ గంటన్నర పాటు ప్రయాణం సాగింది.
మృత్యుశకటమైన టిప్పర్
ఇంతలో ఓ టిప్పర్ లారీ వేగంగా వస్తూ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసింది, ఈ క్రమంలో కారును ఢీకొని కొంత దూరం ఈడ్చుకెళ్లి రెండు వాహనాలు రోడ్డు పక్కకు పడిపోయాయి. కారు వెళ్లి ఓ నీటి గుంతలోకి పల్టీలు కొట్టింది. కారు చాలా భాగం నుజ్జయింది. ఈ తాకిడికిలో అందులో ఐదుగురు యువతీ యువకులు గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ప్రజలు చేరుకుని కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మరోవైపు టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కొళ్లేగాల రూరల్ పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఘటనాస్థలి భీతావహంగా మారింది.
ఇరుకు, మలుపుల రోడ్డు : ఎస్పీ
జిల్లా ఎస్పీ బీటీ కవిత ఘటనాస్థలిలో మాట్లాడుతూ ఉదయం 9 గంటల సమయంలో మహదేశ్వర బెట్ట నుంచి వస్తున్న టిప్పర్ లారీ ఓవర్ టేక్ చేయబోతూ ఎదురుగా వస్తున్న విద్యార్థుల కారును ఢీకొట్టింది, ఆపై 26, 30 మీటర్ల దూరం లాక్కెళ్లింది. రెండు వాహనాలూ రోడ్డుపక్కన బోల్తా పడ్డాయి అని తెలిపారు.
పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు ఆమె చెప్పారు. అక్కడ రోడ్డు ఇరుకుగా, అనేక మలుపులతో ఉండగా, టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమని తెలిపారు. కొళ్లేగాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘోరం గురించి తెలియగానే తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆస్పత్రికి వచ్చారు. వారి రోదనలతో ఆస్పత్రిలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment