Vijayawada municipal corporation
-
నేటి నుంచి కృష్ణా తీరాన ఫుడ్ ఫెస్టివల్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నదీ తీరాన ప్రజలు చల్లని గాలులతో కూడిన ప్రదేశంలో సేద తీరేందుకు వీలుగా విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కృష్ణా నది ఒడ్డునున్న భవానీపురంలోని పున్నమి ఘాట్‌లో ఏప్రిల్ 29 నుంచి మే 7 వరకు ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. ‘ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా’ థీమ్ తో తొలిసారిగా నదీ తీరాన ఈ ఫుడ్ ఫెస్టివల్ ను వీఎంసీ ఏర్పాటు చేసింది. స్కూళ్లకు వేసవి సెలవులు కావడంతో, పిల్లలు,పెద్దలు ఈ ప్రాంతంలో కనీసం 2 గంటల పాటు సేద తీరటంతోపాటు వారిని ఆహ్లాద పరిచే విధంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉండనుంది. ఇందులో ప్రసిద్ధిగాంచిన పంజాబీ, రాజస్థానీ, ఢిల్లీ, కేరళ, తందూరిలు, తెలుగు రాష్ట్రాల రుచికరమైన వంటకాలను 20కి పైగా స్టాల్స్‌లో తీసుకురాబోతున్నారు. విజయవాడకి సంబంధించి ప్రముఖ హోటళ్లు ఈ ఫుడ్ ఫెస్టివల్లో భాగస్వామ్యమవుతున్నాయి. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది. నదీ తీరాన ఈట్ స్ట్రీట్ తరహాలో దీన్ని అభివృద్ధి చేసేందుకు వీలుగా ఇక్కడ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ప్రజలకు రుచికరమైన ఆహారంతో పాటు లైవ్ రాక్ బ్యాండ్, డ్యాన్స్, జుంబా, గోడ, రోడ్డు పెయింటింగ్, శాండ్ ఆర్ట్, స్టాండ్–అప్ కామెడీ, వంటి ఈవెంట్స్‌తో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో నటులతో కామెడీషో ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఫుడ్ ఫెస్టివల్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. -
మటన్ కొంటున్నారా? జర జాగ్రత్త! విజయవాడలో భారీగా కుళ్లిన మాంసం పట్టివేత
సాక్షి, విజయవాడ: విజయవాడలో మాంసం దుకాణాలపై వీఎంసీ అధికారులు దాడులు చేపట్టారు. కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమలో మాచవరం, బీఆర్టీఎస్ రోడ్డు, ప్రకాష్‌నగర్, కొత్తపేట మార్కెట్లలో సోదాలు జరిపారు. మాచవరంలో 500 కేజీల కుళ్లిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. కుళ్లిన మాంసం విక్రయిస్తున్న వ్యాపారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నటీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ.. మాంసాన్ని కొనే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుళ్లిపోయిన మాంసాన్ని తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారని, తద్వారా అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మొత్తం పరిశీలన చేసిన తరువాతే మాసం కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కుళ్లిపోయిన మాంసాన్ని ఎవరైనా విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: నాపరాళ్లతో వెళ్తున్న లారీ బోల్తా.. ముగ్గురు కూలీలు దుర్మరణం -
నిర్మాణ రంగంలో జోష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణ రంగం ఊపందుకుంది. వివిధ నగరాలు, మున్సిపాలిటీల పరిధిలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునేవారు పెరుగుతున్నారు. గతేడాది డిసెంబర్ 26 నాటికి 40,536 నిర్మాణాల ప్లాన్లకు అనుమతులు మంజూరైనట్టు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) విభాగం లెక్కలు చెబుతున్నాయి. జిల్లాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో దరఖాస్తు చేసుకునే భవన నిర్మాణ ప్లాన్లను వేగంగా ఆమోదిస్తుండటంతో నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. కోవిడ్ లాక్డౌన్, వరదలు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నిర్మాణాలు వేగంగా సాగాయి. ఇదే ఒరవడి కొత్త సంవత్సరంలోనూ కొనసాగి, ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకు ముందు 2019, 2020 సంవత్సరాల్లో 30 వేల భవనాల ప్లాన్లు మాత్రమే ఆమోదం పొందాయి. 2021లో భారీగా వృద్ధి నమోదైంది. ఈ ఏడాది కొత్త మాస్టర్ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయని, దాంతో లే అవుట్లు, నిర్మాణాలు పెరుగుతాయని డీటీసీపీ అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి రెండు స్థానాల్లో విశాఖ, విజయవాడ రాష్ట్రంలో మొత్తం 123 అర్బన్ లోకల్ బాడీలు (యూఎల్బీలు), 18 అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలు (యూడీఏలు) ఉన్నాయి. నిర్మాణాలన్నింటికీ వీటి అనుమతి తప్పనిసరి. గ్రేటర్ విశాఖపట్నంలో అత్యధికంగా గతేడాది 6,328 ప్లాన్లకు అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో 200 చదరపు మీటర్ల లోపు నిర్మాణాలు 5,154 ఉండగా, 200 నుంచి 300 చ.మీ. మధ్య ఉన్నవి మరో 607 ఉన్నాయి. 300 నుంచి 500 చ.మీ పరిధిలో ఉన్నవి 357, 500 నుంచి 2 వేలు చ.మీ. పరిధిలో ఉన్నవి 171, రెండు వేల నుంచి 4 వేల చ.మీ. పరిధిలోనివి 15, నాలుగు వేల చ.మీ. దాటినవి మరో 24 అనుమతులు ఉన్నాయి. రెండో స్థానంలో నిలిచిన విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 2,457 భవనాల ప్లాన్లను ఆమోదించారు. వీటిలో 200 చ.మీ. పరిధిలోని 2,136 ఉండగా 200 నుంచి 300 చ.మీ.లోపు ఉన్నవి 155 ఉన్నాయి. 300 నుంచి 500 చ.మీ లోపు 110 ప్లాన్లు ఉన్నాయి. 500 నుంచి 2 వేలు చ.మీ. పరిధిలో ఉన్నవి 44 ఉండగా, 2 వేల నుంచి 4 వేల చ.మీ పరిధిలోనివి ఏడు, 4 వేల చ.మీ. దాటినవి 5 ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2,199 అనుమతులు, నెల్లూరులో 1,980, కడపలో 1,625, గుంటూరు పరిధిలో 1,596 అనుమతులు లభించాయి. మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ నిర్మాణ రంగం ఆశాజనకంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో మరింత వేగం కొత్త సంవత్సరంలో నిర్మాణ రంగం మరింత వేగం పుంజుకుంటుందని డీటీసీపీ అంచనా వేస్తోంది. ప్రభుత్వం నిర్మాణ రంగంలో అనుసరిస్తున్న సరళీకృత విధానాలు, ఇసుక పాలసీ, లే అవుట్ అప్రూవల్స్ కోసం అందుబాటులోకి తెచ్చిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టంతో అన్ని పనులు ఆన్లైన్లోనే జరగడం వంటివి నిర్మాణదారులకు బాగా కలిసివస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో నిర్మాణాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. -
చంద్రబాబు ఓ ఊసరవెల్లి: మంత్రి కొడాలి నాని
సాక్షి, విజయవాడ: కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ పూటకో రంగు మార్చి పబ్బం గడుపుకోవాలని చూసే చంద్రబాబు నాయుడుని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయనగరంలో హిందువునని, కర్నూలుకు వెళ్లి టోపీ పెట్టుకొని ముస్లింనని ప్రచారం చేసుకునే చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పూటకో మతం పేరు చెప్పుకుంటూ ఆయా మతాల వారి మనోభావాలను దెబ్బతీస్తున్న చంద్రబాబుకు ఓటనే ఆయుధంతో బుద్ధిచెప్పాలని కోరారు. చంద్రబాబు హయాంలో సంపదనంతా విజయవాడలో గోడలపై పెయింటింగ్‌ల కోసం ఖర్చ చేశారని విమర్శించారు. గత కౌన్సిల్లో నిధులను టీడీపీ నేతలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలు నగరంలో పేదల ఉండే ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, తమ ప్రభుత్వం వచ్చాక వారి స్థితిగతుల్లో చాలా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి మంచి ఆలోచనతో పేదల కోసం 30 లక్ష ఇళ్ల పట్టాలను ఇవ్వాలని చూస్తే చంద్రబాబు అండ్ కో కోర్టుల ద్వారా అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 45 వేల స్కూళ్ల రూపురేఖల్ని మార్చేశామన్నారు. టీడీపీ హయాంలో కార్పొరేట్ కళాశాలు రాజ్యమేలిన విషయాన్ని ఆయన ప్రస్థావించారు. 8 వేల కోట్లతో రాష్టంలో 16 మెడికల్ కళాశాలు కట్టాలని సీఎం జగన్‌మెహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్‌మెహన్‌రెడ్డిపై విషం కక్కాలని చూసే చంద్రబాబుకు ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయడులు సహకరిస్తున్నారన్నారు. కరోనా కష్టాల్లో ఉన్నా అప్పులు తెచ్చి మరీ నిరుపేదల కడుపులు నింపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్ధులకు ఓటు వేసి.. రాష్టాన్ని సంక్షేమం, అభివృద్ధిపధంలో తీసుకెళ్తున్న సీఎం జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. -
ఓటుతో చంద్రబాబును తరిమికొట్టండి: కొడాలి నాని
సాక్షి, విజయవాడ: సీఎం జగన్మోహన్రెడ్డి అద్భుత పరిపాలన చూసి, పోటీ చేసినా ఓటమి తప్పదని టీడీపీ, బీజేపీ అభ్యర్దులు ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. విజయవాడ నగరంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడేనన్నారు. విజయవాడ నగర మేయర్ పీఠంపై వైఎస్సార్సీపీ జండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కులమతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు చేరాయని పేర్కొన్నారు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి చంద్రబాబును ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వంగవీటి రంగా, నెహ్రూ పిల్లలను ఇబ్బంది పెట్టిన చంద్రబాబుకు విజయవాడ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేదలకు ఆరోగ్యం, విద్య, నివాసం కల్పించాలని ఆలోచన చేస్తున్నారని, ఇందులో భాగంగా అనేక పథకాలు ఇదివరకే ప్రజలకు చేరువయ్యాయన్నారు. సీఎం జగన్ విద్య విషయంలో తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తారని, ఈ విషయంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి, సీఎం జగన్మోహన్రెడ్డి ఇద్దరూ ఇద్దరేనని ప్రశంసించారు. పేదల ఆరోగ్యం విషయంలోనూ తండ్రి బాటలో సీఎం జగన్ నడుస్తున్నారన్నారు. 30 వేల కోట్ల భూముల కొని 30 లక్షల మంది పేదలకు పంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. 3 సెంట్ల భూమి ఇస్తానని 14 ఏళ్లు కాలయాపన చేసిన దుర్మాగుడు చంద్రబాబన్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన మొనగాడు సీఎం జగన్మోహన్రెడ్డే అన్నారు. అన్ని డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్దులను గెలిపించుకొని, నగర అభివృద్ధికి అధిక నిధులు తెచ్చుకుందామన్నారు. రాష్ట్ర ప్రజల ఆరాధ్యుడు.. ఆర్థికంగా చితికి పోయిన రాష్టంలో కులమతాలకతీతంగా సంక్షేమ పధకాలను గడపగడపకు అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. విజయవాడ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ పధకాలను అన్ని వర్గాల ప్రజలకు అందిస్తూ రాష్ట్ర ప్రజల పాలిట ఆరాధ్యుడయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో 36 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్నారు. అమ్మాఇది నీ ఇల్లు.. కొబ్బరి కాయ కొట్టి లోనికి వెళ్ళు అని మహిళాలోకానికి ధైర్యం నింపారన్నారు. ప్లకార్డులు పట్టుకునే కమ్యూనిస్టు కూడా ఇళ్ల గురించి చర్చించేలా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. -
కరోనా : యాచకులు, నిరాశ్రయులపై ప్రత్యేక దృష్టి
-
బెజవాడలో యాచకులు తరలింపు
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ నేపథ్యంలో యాచకులు, నిరాశ్రయులపై వీఎంసీ(విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడలో ఉన్న యాచకులు, నిరాశ్రయుల కోసం రోడ్లపై జల్లెడ పడుతున్నారు. స్వచ్చంధ సంస్ధలు రోడ్లపైకి వస్తూ యాచకులు, నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేస్తుండడంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యి రోడ్లపై యాచకులు కనిపిస్తే వారిని వెంటనే షెల్టర్లకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐదు బస్సుల ద్వారా 250మందికి పైగా యాచకులను షెల్టర్లకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా విజయవాడ పరిధిలోని పది షెల్టర్ల లో యాచకులను ఉంచనున్నట్లు, మిగతా నిరాశ్రయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వీఎంసీ అధికారులు తెలిపారు. యాచకులు, నిరాశ్రయులకు భోజనం పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతితో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ('శ్రియా.. ప్లీజ్ అతన్ని ఇబ్బంది పెట్టకు') -
కరోనా.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్
సాక్షి, విజయవాడ : ఆంధప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నాహాలు చేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. మరోవైపు సమన్వయంతో కరోనా కట్టడికి వీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. మొండికేసిన కరోనా పెషేంట్‌ను ఎలా తీసుకురావాలి, డిసిన్ఫెక్షన్ ఎలా చేయాలి అన్న విషయాలపై మాక్ డ్రిల్ ఏర్పాటు చేసింది. నగరంలోని మున్సిపల్ స్టేడియంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాల డెమో నిర్వహించి అవగాహన కల్పించాయి. ఈ మాక్ డ్రిల్‌లో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్, ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బీవీరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. కరోనాపై అవగాహన పెంచేందుకే ఐదు శాఖల సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించినట్టు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తామని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చివారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రెస్క్యూ సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీవీ రావు మాట్లాడుతూ.. కరోనాపై యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వ సూచనల ప్రకారం ప్రజలు ఇంటిపట్టునే ఉంటే కరోనా కట్టడి సులభతరమౌతుందన్నారు. -
'స్వచ్ఛత పై అవగాహన కల్పించడమే లక్ష్యం'
సాక్షి, విజయవాడ : విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ వాహనాలను బుధవారం మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమీషనర్ ప్రసన్న వెంకటేశ్ మాట్లాడుతూ.. స్వచ్ఛత పై అవగాహన కల్పించేందుకు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ వాహనాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నగరంలోని 59 డివిజన్లలో ఈ వాహనాల ద్వారా తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని తెలిపారు. దీంతో పాటు వైఎస్ఆర్ నవశకం వాహనాన్ని సైతం ప్రారంభించి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. -
వీఎమ్‌సీ సర్కిల్ కార్యాలయాలపై ఏసీబీ దాడి
సాక్షి, విజయవాడ: విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్(వీఎమ్‌సీ) పటమట సర్కిల్ పరిధిలోని మూడు ఆఫీసులలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) మెరుపుదాడి చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సూర్య భగవాన్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇంటిపన్నులో పేరు మార్చడానికి సూర్య భగవాన్ డబ్బులు డిమాండ్ చేయడంతో.. బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సూర్య భగవాన్ను ట్రాప్ చేసి పట్టుకున్నారు. రూ. 9వేల నగదు స్వాధీనం చేసుకొని అతడిని కస్టడీలోకి తీసుకొన్నారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ కనకరాజులు పాల్గొన్నారు. -
వీఎంసీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా వెల్లంపల్లి, మల్లాది విష్ణు
సాక్షి,విజయవాడ : విజయవాడ నగరపాలక సంస్థ ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగరపాలక సంస్థకు రావాల్సిన నిధుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నా రోడ్లపై పూడికలు అలాగే వదిలేయడంతో డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. వెంటనే వీఎంసీ అధికారులు డ్రైనేజీ సమస్యపై దృష్టి సారించాలని ఆదేశించారు. వచ్చే ఉగాది వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టి అర్హులైన వారికి పట్టాలు అందిస్తామని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. -
చంద్రబాబు ఫోటో ఎందుకు తీశారంటూ...
సాక్షి, విజయవాడ : నగర కార్పొరేషన్లో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోల రగడ తీవ్రస్థాయికి చేరింది. కార్పొరేషన్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలను తొలగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోటోను ఏర్పాటు చేశారు అధికారులు. దీనిపై నగర మేయర్ కోనేరు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడకుండా హాల్లో చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోటోలు ఎందుకు తీశారంటూ అధికారులపై చిందులేశారు. ఎన్టీఆర్ ఫోటో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ ఫోటో పెడితే వైఎస్సార్ ఫోటో కూడా పెట్టాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఇద్దరు మాజీ సీఎంలే కాబట్టి ఒద్దరివి పెట్టాలని మేయర్ పోడియం వద్ద వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. కార్పొరేషన్ తనదని, తాను చెప్పిందే చేయాలంటూ అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయవాడ మున్సిపల్ సమావేశం రసాభాస
-
విజయవాడ మున్సిపల్ సమావేశం రసాభాస
సాక్షి, అమరావతి : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. 2019-20 బడ్జెట్‌పై సవరణ తీర్మానం చేయాలన్న వైఎస్సార్సీపీ, సీపీఎం కార్పొరేటర్ల విజ్ఞప్తిని మేయర్ తోసిపుచ్చారు. దీంతో రెండు పార్టీల కార్పొరేటర్లు సమావేశాన్ని వాకౌట్ చేసి కౌన్సిల్ హాలు ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ, సీపీఎంల కార్పొరేటర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదని తెలిసినా.. రూ.1968కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి బిల్ల తేలేని పాలకపక్షం..ఎన్నికల ముందు బడ్జెట్ అంకెలను పెంచిందని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డబ్బులు కట్టించుకొని ఇప్పుడు లబ్ధిదారులకు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారని మండిపడ్డారు. పేదల ఇళ్లకోసం భవిష్యత్తులో పోరాటం చేస్తామని రెండు పార్టీల కార్పొరేటర్లు పేర్కొన్నారు. -
కౌన్సిల్ హాల్లో ఎన్టీఆర్, బాబు ఫొటోలు
విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు హాలును టీడీపీ కార్యాలయంగా మారుస్తున్నారని, ఎలాంటి సమాచారం లేకుండా మాజీ సీఎం ఎన్టీఆర్, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫొటోలను ఏర్పాటు చేయటం అధికార పార్టీ పక్షపాత ధోరణికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. కౌన్సిల్ హాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఫొటో కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కౌన్సిల్ సమావేశం గరం గరంగా సాగింది. పటమట : నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారం, నగరాభివృద్ధిపై జరిగిన వీఎంసీ కౌన్సిల్ సమావేశం ఆద్యంతం పాలకపక్ష అనుకూల నిర్ణయాలు తీర్మానించుకోవటానికి.. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలను ఆఫీసు రిమార్కులకు పంపే వేదికగా మారింది. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షత శనివారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు చర్చ జరగకుండానే, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండానే ముగిసింది. ఏకపక్షంగా సాగిన సమావేశంలో ఇప్పటి వరకు లేని మాజీ సీఎం ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలను ఏర్పాటు చేయటంపై రగడ మొదలైంది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు వైఎస్ చిత్రపటాన్ని కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. చిత్రపటాన్ని పట్టుకుని మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. దీనిపై మేయర్ ఆగ్రహంతో ఆందోళన చేస్తున్న ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల, బీజాన్బీ, పాలా ఝాన్సీలక్ష్మి ని సస్పెండ్ చేశారు. ఈ పరిణామంపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. మేయర్ వైఖరికి వ్యతిరేకంగా కౌన్సిల్ హాలు బయట ఆందోళన చేపట్టారు. చర్చకు రాని అంశంపై.. ఎజెండాలో పొందుపరచని అంశం కాకుండా టీడీపీ కార్పొరేటర్లు బీసెంట్ రోడ్డు హాకర్ల గురించి చర్చించటంపై వైఎస్సార్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీసెంట్ రోడ్డులో ఆక్రమణలను తొలగించాలని, రోడ్డుకు మార్జిన్లు ఏర్పాటు చేపి హాకర్ జోన్ ఏర్పాటు చేయాలని స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ప్రస్తావించారు. దీనిపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ బుల్లా విజయ్‌కుమార్ స్పందించి బీసెంట్ రోడ్డుపై పలువురు చిరు వ్యాపారులు ఆధారపడ్డారని, అలాంటి వారి జీవనాధారంపై వేటు వేయాలని చూడటం హేయమని అన్నారు. ఈ అంశం కేవలం కొంతమంది టీడీపీ నేతల వ్యక్తిగత ఎజెండా అని, నెలవారీ మామూళ్లు చెల్లించని హాకర్లను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అయితే ఎజెండాలో ఈ అం«శం లేదని దీనిపై చర్చ జరిగేందుకు అవకాశం లేదని కార్పొరేటర్లు సూచించారు. దీంతో ఇరు పక్షాలు వెనక్కు తగ్గాయి. కీలకాంశాలు.. జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో జీప్లస్3 గృహ సముదాయంలో ఇళ్ల కేటాయింపునకు సంబంధించి లబ్ధిదారుల వాటా రూ.66 వేల నుంచి రూ.1.56 లక్షలకు పెంపుదల చేసే అంశాన్ని సభ వాయిదా వేసింది. ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు, స్వాతంత్య్ర సమరయోధులు తలశిల వెంకటరామయ్యకు స్థలం కేటాయింపుపై వచ్చిన తీర్మానం ఆఫీస్ రిమార్కులకు పంపారు. వివాదాస్పదమైన ఫన్‌టైం క్లబ్ స్వాధీనం అంశంను తిరస్కరించారు. భాగ్యనగర్ గ్యాస్ ఏజన్సీకి స్థల కేటాయింపులపై కౌన్సిల్ ఆమోదం చేస్తూ తీర్మానం చేసింది. ఎన్టీయార్ సర్కిల్ నుంచి ఆటోనగర్ చెక్‌పోస్టు వరకు బందరు రోడ్డు విస్తరణలో భాగంగా నిర్వాసితులవుతున్న వారందరికీ టీడీఆర్ బాండ్లు కాకుండా నగదు రూపంలో చెల్లింపులు జరగాలని వచ్చిన ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కార్పొరేటర్ల ఉదారత.. నాలుగుసార్లు కార్పొరేటర్‌గా పని చేసిన తాజ్నోత్ దాసు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనను ఆదుకోవాలని వచ్చిన ప్రతిపాదనపై సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు. ప్రతి కార్పొరేటర్ ఓ నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆయనకు గూడు కల్పించాలనే విషయంలో జీప్లస్3 గృహ సముదాయాల్లో ఇంటికి కేటాయించాలని కమిషనర్‌ను కోరగా ఆయన అంగీకరించారు. సమాధానాలు రావటం లేదు.. ఆఫీస్ రిమార్కులకు వెళ్లిన వాటిపై అధికారులు స్పష్టత ఇవ్వటం లేదని పలువురు కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు కూడా అసమగ్రంగా ఉంటున్నాయని ఆరోపించారు. దీనిపై కమిషనర్ కల్పించుకుని ఈసారి ఇలాంటి పొరపాటు జరగదని, కార్పొరేటర్లు కూడా ప్రశ్నలను 15 రోజుల ముందుగా అధికారులకు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను జప్తు చేయాల్సిందే.. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాలల నుంచి కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోతున్నామని, ఆయా సంస్థలు వీఎంసీకి ఎలాంటి పన్నులు చెల్లించటం లేదని, ఇలాంటి సంస్థలను జప్తు చేస్తామని అధికారులు నోటీసులు పంపాలని కొందరు కోరారు. బందరు రోడ్డులో ఇటీవల నిర్మించిన ఆర్అండ్బీ రాష్ట్ర కార్యాలయం నుంచి పన్నులేమీ రాలేదని, అలాగే పక్కనే ఉన్న పోలీసు గ్రౌండ్స్‌లో ఉన్న వ్యాస్ కాంప్లెక్స్ భవనానికి అనుమతి ఉన్నదీ లేనిదీ తెలియదని, పన్నులు చెల్లిస్తున్నారో లేదో విచారణ చేయాల్సి ఉందని మేయర్ కోనేరు శ్రీధర్ ప్రస్తావించారు. భవానీపురంలో శుక్రవారం జరిగిన పోలీస్ స్టేషన్ నూతన భవన శంకుస్థాపన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అనుమతి, ప్లాను లేకుండా నిర్మాణం చేపడితే టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు చేపట్టాలని కౌన్సిల్‌ల్లో ప్రస్తావించారు. -
అత్త సొమ్ము అల్లుడు దానంలా ఉంది
సాక్షి, విజయవాడ : మున్సిపల్ నిధులు ఎమ్మెల్యేలు వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని విజయవాడ నగర పాలక సంస్థ వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో నగరపాలక సంస్థ లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. నగర పాలక సంస్థ వ్యవహారం అత్త సొమ్ము అల్లుడు దానంలా ఉందని ఎద్దేవా చేశారు. డిస్నిల్యాండ్ ఇంకా కొలిక్కిరాలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే చివరికి సెంట్ భూమి లేకుండా చేస్తారన్నట్లుగా ఉందన్నారు. అన్ని అంశాలను సోమవారం జరిగే మున్సిపల్ సమావేశంలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ కండువాలు ధరించారని..
- పార్టీ కండువాలు ధరించిన వైఎస్సార్సీసీ కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు - కౌన్సిల్ మీటింగ్‌లో విజయవాడ మేయర్ శ్రీధర్ తీరుపై సభ్యుల మండిపాటు విజయవాడ: పార్టీ కండువాలు ధరించి వచ్చారన్న కారణంగా ఆరుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను మేయర్ సస్సెండ్ చేయడం వివాదాస్పదమైంది. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన బుధవారం విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జిరిగింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పార్టీ కండువాలు ధరించడంపై మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కండువాలు తీసి కౌన్సిల్ కు రావాలని మేయర్ ఆంక్షలు విధించారు. దీంతో కండువాలు ధరించవద్దనే నిబంధనలు చూపాలని వైసిపి కార్పోరేటర్లు పట్టుబట్టారు. సభ్యుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా మేయర్ శ్రీధర్.. ఆరుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు. దీనికి నిరసనగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్ ఎదుట ధర్నాకు దిగారు. -
కమిషనర్‌పై వీరంగం!
తిట్లపురాణం అందుకున్న టీడీపీ ప్రజాప్రతినిధులు విజయవాడలో రోడ్డెక్కిన ఫుడ్ కోర్టు తరలింపు రగడ ఎదురుతిరిగిన వ్యాపారులు బంగ్లా వద్ద అర్ధరాత్రి హైడ్రామా మనస్తాపానికి గురైన కమిషనర్ విజయవాడ సెంట్రల్ : కృష్ణా రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్, అమరావతి షాపింగ్ ఫెస్టివల్ పేరుతో విజయవాడ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఫుడ్‌కోర్టులను తరలించాలనే ఆలోచనే ఇంతటి వివాదానికి దారితీసింది. అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ బాబు.ఎ, మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్‌కు అప్పగించారు. దీంతో నగరపాలక సంస్థ తరఫున పద్మావతి ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అయితే ఆశించిన స్థాయిలో షాపింగ్ ఫెస్టివల్ విజయవంతం కాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం రోడ్డులో ఉన్న ఫుడ్‌కోర్టును తరలించడంలో కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. వ్యాపారులు ఎదురుతిరిగారన్న సమాచారం అందుకున్న కమిషనర్ ఆదివారం అర్ధరాత్రి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఖాళీ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వ్యాపారులు లెక్క చేయలేదు. దీంతో కమిషనర్‌కు చిర్రెత్తుకొచ్చింది. తినుబండారాల్లో ఫినాయిల్, బ్లీచింగ్ పోయాలంటూ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. దీంతో వివాదం ముదిరింది. క్షణాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడకు చేరుకున్నారు. దీంతో సీన్ మారిపోయింది. ప్రజాప్రతినిధులే తిట్లపురాణం లంకించుకోవడంతో కమిషనర్ కారెక్కారు. వ్యాపారులు చుట్టిముట్టి ఆందోళనకు దిగడంతో విధిలేని పరిస్థితిలో నడుచుకుంటూ బంగ్లాకు వెళ్లాల్సి వచ్చింది. జరిగిన విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు బాబు.ఎకు కమిషనర్ ఫోన్‌ద్వారా వివరించారు. ఆయన అక్కడకు చేరుకొనేలోపే వ్యాపారుల ఆందోళన బంగ్లాకు చేరింది. కమిషనర్ బయటకు రావాలని ఆందోళనకారులు రెచ్పిపోయారు. దిమ్మ తిరిగింది ... రాత్రి 10 గంటలకు ప్రారంభమైన ఫుడ్ కోర్టు వివాదం తెల్లవారుజాము మూడు గంటల వరకు కొనసాగింది. కమిషనర్ బంగ్లా వద్ద ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అర్ధరాత్రి ఆందోళన జరగడం నగరంలో చర్చనీయాంశమైంది. తమతో ఒక్కమాటైనా చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే గద్దె కమిషనర్‌ను గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది. తిట్టడం, వెంటపడి ఆందోళన చేయడంపై కమిషనర్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కార్పొరేషన్ ఉద్యోగుల ద్వారా తెలుస్తోంది. కృష్ణా రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్, అమరావతి షాపింగ్ ఫెస్టివల్ పేరుతో నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఫుడ్‌కోర్టులను తరలించాలనే ఆలోచనే ఇంతటి వివాదానికి దారితీసింది. పద్మావతి ఘాట్ వద్దకు ఫుడ్‌కోర్టును తరలించాలని చెప్పిన టీడీపీ ప్రజాప్రతినిధులే ఆందోళనకారులకు కొమ్ముకాయడంతో అధికారులకు దిమ్మ తిరిగి నంతపనైంది. -
అవినీతికి ఆపరేషన్
టౌన్‌ప్లానింగ్‌లో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు టీపీఎస్‌లు అక్టోబర్ 17 నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేత విజయవాడ సెంట్రల్ : విజయవాడ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతికి శస్త్రచికిత్స మొదలైంది. ప్రత్యేక అధికారి తిమ్మారెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ల(టీపీఎస్)పై టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ పి.రఘు సస్పెన్షన్ వేటు వేశారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఆష, లక్ష్మీజ్యోతి. టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్లు జి.వెంకటేశ్వరరావు, కృష్ణ, ప్రవీణ్‌లను విధుల నుంచి తొలగిస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన అక్రమ నిర్మాణాల్లో వీరి పాత్రపై టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మంగళవారం ఇక్కడకు వచ్చిన తిమ్మారెడ్డి అధికారులతో రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు సాగించారు. ఏం చేసినా చర్యలుండవనే ధీమా పెరిగిపోవడం వల్లే టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి పెరిగిందని దీనికి ఫుల్స్టాప్ పెట్టాల్సిందేనని తిమ్మారెడ్డి గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. బుధవారం తిరిగి మళ్లీ డెర్టైర్తో భేటీ అయ్యారు. మొదటి విడత సస్పెన్షన్ల పర్వం పూర్తవ్వగా రెండో విడతలో మరో ముగ్గురిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాఘటన టౌన్‌ప్లానింగ్ అధికారుల్లో కలకలం రేపింది.బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, వెంకటేశ్వరరావులు ఐదు నెలల క్రితమే పదోన్నతిపై ఇక్కడ నుంచి బదిలీ అయ్యారు. పుష్కరాల ముసుగులో డెరైక్టరేట్లో లాబీయింగ్ చేసి ఓడీ తెచ్చుకున్నారు. పుష్కర విధులు పూర్తయిన నేపథ్యంలో కమిషనర్ జి.వీరపాండియన్ రిలీవ్ చేశారు. ప్రవీణ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాల్టీకి టీపీఎస్‌గా వెళ్లారు. పదోన్నతి వచ్చినా టౌన్‌ప్లానింగ్‌ను వదలడం ఇష్టం లేని జి.వెంకటేశ్వరరావు ఓడీ తెచ్చుకొని ఇక్కడే కొనసాగుతున్నారు. ఓడీ వ్యవహారంపై తిమ్మారెడ్డి మండిపడ్డట్లు తెలుస్తోంది. తాఖీదులు రెడీ ... అక్రమ భవన నిర్మాణదారులకు టౌన్‌ప్లానింగ్ అధికారులు తాఖీదులు సిద్ధం చేస్తున్నారు. తిమ్మారెడ్డి ఆదేశాల మేరకు నగరంలో అక్రమ కట్టడాలను కూల్చేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. వారం రోజుల ముందస్తు నోటీసుల్ని రూపొందిస్తున్నారు. మొదటి విడతలో 200 చదరపు గజాల విస్తీర్ణం ఆపైన వాటికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దసరా ముందు కూల్చివేతలు చేపడితే భవన నిర్మాణదారుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని భావించిన అధికారులు అక్టోబర్ 17 నుంచి అక్రమ కట్టడాలను కూల్చేయాలని ముహూర్తంగా నిర్ణయించారు. -
కీచులాటల పాలన
నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి. పాలన గాడి తప్పడంతోపాటు అవినీతి పెచ్చుమీరింది. స్ట్రాంవాటర్ డ్రెయిన్ నిర్మాణానికి కేంద్రం మంజూరు చేసిన రూ.461 కోట్లను వినియోగంలోకి తేవడంలో పాలకులు విఫలమయ్యారు. మంచినీటి చార్జీలు ఏడాదికి ఏడు శాతం చొప్పున పెరుగుతున్నాయి. గతేడాది దర్గా భూములు, శ్రీకనకదుర్గా సొసైటీ లేవఅవుట్ వివాదాల్లో చిక్కుకున్న పాలక వర్గం ఈ దఫా విజ్ఞానయాత్రతో రచ్చకెక్కింది. అసమ్మతి వర్గం మేయర్ చైర్‌ను టార్గెట్ చేసి దూకుడు పెంచింది. విజయవాడ : నగర పాలన మూడడుగులు ముందుకు ఏడడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. నగరపాలక సంస్థలో అవినీతిని కట్టడి చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ప్రజారోగ్య, ఎస్టేట్ సెక్షన్ల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరునెలలుగా తిరుగుతున్నా ఇంటిపన్ను వేయడం లేదని ఇటీవల జరిగిన జరిగిన కౌన్సిల్ సమావేశంలో డెప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు చెప్పిన ఘటన పాలన ఎంతబాగా సాగుతుందోననే విషయాన్ని పట్టిచూపుతోంది. గడిచిన రెండేళ్లలో ఎనిమిది కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అధికారపార్టీ కార్పొరేటర్ల కలెక్షన్ల దందాపై బలమైన విమర్శలు ఉన్నాయి. పన్నుభారాలు మోపబోమంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించారు. మంచినీటి చార్జీలను ఏటా 7 శాతం పెంచాలని ప్రత్యేక అధికారుల పాలనలో చేసిన నిర్ణయాలనే నేటికీ యథాతథంగా అమలుచేస్తున్నారు. అమృత్ పథకంలో భాగంగా నీటి మీటర్ల ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవీ వైఫల్యాలు జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల పథకాన్ని పూర్తి చేయడంలో పాలకవర్గం పిల్లిమొగ్గలేసింది. నగరానికి జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు 28,152 ఇళ్లు మంజూరవగా నాలుగు విడతల్లో 18,176 ఇళ్ల నిర్మాణం చేపట్టి 13,664 ఇళ్లను పూర్తి చేశారు. స్థలాభావం కారణంగా పదివేల ఇళ్లను పూర్తి చేయలేమని గతేడాది ప్రభుత్వానికి లేఖరాసిన నగరపాలకులు, 4,512 ఇళ్లను పూర్తి చేయడంలోనూ విఫలమయ్యారు. స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.461 కోట్ల నిధులు రాబట్టడంలో సఫలమైన మేయర్ శ్రీధర్ వాటి వినియోగించడంలో విఫలమయ్యారు. ఏడాది క్రితమే నిధులు విడుదలయ్యాయి. డ్రెయిన్ల నిర్మాణం కోసం ఇరవై రోజుల క్రితం పబ్లిక్‌హెల్త్ విభాగం టెండర్లు పిలవగా 14 శాతం ఎక్సెస్ పడ్డాయి. దీంతో మరోమారు టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. టెండర్ల దశదాటి పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయో వేచిచూడాలి. కీచులాటలు టీడీపీలో అంతర్గత కీచులాటలు అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయి. స్టాండింగ్ కమిటీ, మేయర్ మధ్య సయోధ్య కొరవడింది. ఫలితంగా తీర్మానాలు తిర‘కాసు’ మయమవుతున్నాయి. కార్పొరేర్ల విజ్ఞానయాత్ర వివాదాస్పదంగా మారింది. అధికారపార్టీ కార్పొరేటర్లు తోటి మహిళా ప్రయాణికులతో అసభ్యంగా వ్యవహరించి చెడ్డపేరు తెచ్చుకున్నారు. మేయర్ చైర్‌ను టార్గెట్ చేసిన అసమ్మతి వర్గం దూకుడు పెంచింది. మేయర్‌తో మాటామంతి కూడా ఆపేసింది. ఎంపీ కేశినేని నాని జోక్యం నేపథ్యంలో పుష్కరాల వరకు తాత్కాలిక విరామం ప్రకటించింది. ఇష్టం లేకుంటే తనను మార్చేయాలని స్వయంగా మేయర్ టీడీపీ పెద్దల ముందు వాపోయినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీనే గ్రూపు లను ప్రోత్సహించడంతో మేయర్ చైర్ బలహీనపడింది. రెండేళ్ల పాలనలో స్వపక్షం కార్పొరేటర్లే మేయర్‌ను ముప్పుతిప్పలు పెట్టడం చర్చనీయాంశమైంది. -
సీఎం ఉన్నారన్న ధీమాతోనే ఈ అరాచకాలు
విజయవాడ: విమానంలో ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు ఆ పార్టీ కార్పొరేటర్లు మద్దతుగా నిలవడం వివాదాస్పదంగా మారింది. వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్‌మీట్ పెట్టడం పట్ల మహిళా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో మహిళలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని, కార్పొరేటర్ల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అధికారముందని టీడీపీ నాయకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని, ఏంచేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారనే ధీమాతో అరాచకాలకు పాల్పడుతున్నారని మహిళలు విమర్శించారు. ప్రజల సొమ్ముతో టీడీపీ కార్పొరేటర్లు విహారయాత్రలకు వెళ్లడం సిగ్గుచేటని మండిపడ్డారు. కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు మద్యంమత్తులో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన చర్యను సమర్థిస్తూ టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపట్టారు. మహిళలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శించారు. -
ఈ కమిషనర్‌కూ ఓ లెక్కుంది!
కార్పొరేషన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం గుణదల స్థలంలో గజం రూ. 25 వేలు నేడు లాటరీ ద్వారా విక్రయం నోటీసు జారీతో భగ్గుమంటున్న ఉద్యోగులు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ కాసుల వేటలో పడ్డారు. ఇందుకోసం రెండు దశాబ్దాల కిందట ఉద్యోగులకోసం గుణదలలో కొనుగోలు చేసిన ప్లాట్లను బేరం పెట్టారు. సామాన్య ఉద్యోగులకు అందుబాటులో లేని విధంగా.. బడాబాబులకు మేలుచేసేలా గజం భూమి ధర అక్షరాలా పాతిక వేలుగా నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు లాటరీ ద్వారా ప్లాట్ల విక్రయానికి కౌన్సిల్‌హాల్ వేదికగా ముహూర్తాన్ని ఖరారు చేశారు. విజయవాడ : నగరపాలక సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసింది. ఇందుకు ఉద్యోగులనే ఎంచుకుంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని లాభనష్టాలకు అతీతంగా కేటాయించాల్సిన ప్లాట్లతో బిజినెస్ చేసేందుకు సమాయత్తమైంది. గుణదలలోని ఆ ప్లాట్లలో రూ.8,300 పలికే గజం ధరను రూ.25 వేలుగా నిర్ణయించడం ద్వారా సామాన్య ఉద్యోగులు అటువైపు కన్నెత్తి చూసే ధైర్యం లేకుండా పక్కా స్కేచ్ వేశారు. ఉద్యోగుల ముసుగులో లాటుగా స్థలాన్ని ఎగరేసుకుపోయేందుకు బిగ్షాట్లు తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారనే బలమైన ఆరోపణలున్నాయి. తాజా పరిణామాలపై ఉద్యోగవర్గాలు భగ్గుమంటున్నాయి. వారు కమిషనర్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇలా మొదలైంది కార్పొరేషన్ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్థలాలు కొనుగోలు చేయాలని 1995లో అధికారులు ప్రతిపాదన చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 26న నాటి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గుణదలలో 57.43 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 200 చ.మీ స్థలం ధర రూ.1,44,360, 150 చ.మీ. రూ. 1,08,270, 100 చ.మీ రూ. 72,180 గా నిర్ణయించారు. 711 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్లాట్లు విక్రయించారు. రోడ్లు, డ్రెయిన్లు, పార్కులు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో 2010లో రూ.8 కోట్లను కార్పొరేషన్ అధికారులు వారినుంచి వసూలు చేశారు. ఇంకా 73 ప్లాట్లు మిగిలిపోయాయి. వీటికోసం 811 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. రియల్ బిజినెస్ ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చూపిన టీడీపీ పాలకులు గుణదల ప్లాట్లను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు ప్రణాళిక రచించారు. ఈ మేరకు కౌన్సిల్లో తీర్మానం చేసేందుకు తెగబడ్డారు. ఉద్యోగ వర్గాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తమకు కేటాయించాల్సిన ప్లాట్లను బయటి వ్యక్తులకు ఎలా విక్రయిస్తారంటూ ఆందోళనకు దిగారు. అనూహ్య పరిణామంతో కంగుతిన్న పాలకులు బహిరంగ వేలం ప్రక్రియకు బ్రేక్ ఇచ్చారు. తాజాగా కమిషనర్‌ను అడ్డుపెట్టుకొని లాటరీ పేరుతో రియల్ బిజినెస్‌కు ఏర్పాట్లు చేశారు. సబ్‌రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారం ఆ ప్రాంతంలో గజం రూ.8,300 ఉండగా కార్పొరేషన్ ఏకంగా రూ.25 వేలు నిర్ణయించింది. ఇది ముమ్మాటికీ వ్యాపారమే అని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. లాటరీ ప్రక్రియ ద్వారా ప్లాట్లను ఉద్యోగులకు కేటాయిస్తారు. గజానికి రూ.25 వేలు చొప్పున చెల్లించి వారు ప్లాటును పొందాల్సిఉంటుంది. అంత పెద్ద మొత్తాన్ని భరించలేక వదులుకుంటే తన్నుకుపోయేందుకు పలువురు కాచుకుని కూర్చున్నారు. పోరాటం తప్పదు కమిషనర్ వీరపాం డియన్ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు అన్యాయం చేసేలా ఉంది. ఆయన తన ఆలోచన మార్చుకోకుంటే ఉద్యోగుల పక్షాన నిలిచి పోరాటం చేస్తాం. మేయర్ డెరైక్షన్లోనే కమిషనర్ యాక్షన్ చేస్తున్నారు. - ఆసుల రంగనాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ -
‘నారాయణ’ శిక్షణ మాకొద్దు
ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ బహిష్కరించిన ఉపాధ్యాయులు విజయవాడ సెంట్రల్ : ఐఐటీ ఫౌండేషన్ బ్రిడ్జి కోర్సుల శిక్షణా తరగతుల్ని మున్సిపల్ ఉపాధ్యాయులు బహిష్కరించారు. నారాయణ విద్యాసంస్థల ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పలు మున్సిపల్ స్కూళ్లవిద్యార్థులకు ఐఐటీ శిక్షణా తరగతుల్ని 15 నుంచి ప్రారంభించాలని మున్సిపల్ మంత్రి పి.నారాయణ నిర్ణయించారు. ఈమేరకు లెక్కలు, సైన్స్, బయాలజీ, ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు గురువారం నుంచి మూడు రోజుల పాటు పటమట జీడీఈటీ స్కూల్లో శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేశారు. నారాయణ విద్యాసంస్థల ఫ్యాకల్టీ శిక్షణ ఇచ్చేందుకు వచ్చారు. దీంతో మున్సిపల్ ఉపాధ్యాయులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. మీరిచ్చే శిక్షణ మాకు అక్కర్లేదు అంటూ బయటకు వచ్చేశారు. ఎస్టీయూ అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు మూకల అప్పారావు, డి.చంద్రశేఖర్ మాట్లాడుతూ గతేడాది ఇదే తంతు జరిగిందన్నారు. ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతినే విధంగా మంత్రి వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులతో శిక్షణ ఇప్పించాల్సిందిగా కోరినప్పటికీ మంత్రి మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి నారాయణ ఉపాధ్యాయ వర్గాలపై ముఖ్యమంత్రికి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. తాము ఐఐటీ ఫౌండేషన్ కోర్సులకు వ్యతిరేకం కాదని, మంత్రి వైఖరిని మాత్రమే నిరసిస్తున్నామని స్పష్టం చేశారు. -
కార్పొరేటర్ల పోకిరీ వేషాలు... మేయర్ చీవాట్లు
విజ్ఞాన యాత్రలో టీడీపీ కార్పొరేటర్ల పోకిరీ వేషాలు మద్యం మత్తులో మహిళపై అనుచిత వ్యాఖ్యలు పూణేలో రైల్వే పోలీసుల వార్నింగ్ ఫోన్లో చీవాట్లు పెట్టిన మేయర్ శ్రీధర్ విజయవాడ : టీడీపీ కార్పొరేటర్ల వెకిలి చేష్టలతో విజయవాడ పరువు పోయింది. విజ్ఞాన యాత్రకు వెళ్లినవారిలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు మద్యం మత్తులో రైల్లో ఓ మహిళా ప్రయాణికురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పూణే రైల్వే పోలీసులు కార్పొరేటర్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. తాము ఫలానా అని కాళ్లబేరమాడి బయటపడ్డట్లు సమాచారం. నలుగురికి బుద్ధులు చెప్పాల్సిన మీరే (ప్రజాప్రతినిధులే) ఇలా చౌకబారుగా వ్యవహరిస్తే ఎలాగంటూ రైల్వే పోలీసులు చీవాట్లు పెట్టి వదిలేశారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ ఘటన గత నెల 30వ తేదీ రాత్రి జరగగా.. బుధవారం వెలుగుచూసింది. టీడీపీ కార్పొరేటర్ల పోకిరీ వేషాలు తెలుసుకున్న మేయర్ కోనేరు శ్రీధర్ ఫోన్లో చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ‘మీరు చేసే పనుల వల్ల పార్టీ పరువు పోతోంది.. మరోసారి ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే సహించేది లేదు’ అంటూ హెచ్చరించినట్లు వినికిడి. పూణే ఘటనపై మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ఆరా తీసినట్లు తెలుస్తోంది. టూర్లో తెలుగు తమ్ముళ్లు చేసిన రచ్చ బుధవారం నగరంలో హల్చల్ చేసింది. రాజకీయ పార్టీలతో పాటు కార్పొరేషన్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. పరువు తీశారు విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు గత నెల 29న విజ్ఞాన యాత్రకు బయలుదేరారు. ఈ నెల 13వ తేదీ వరకు టూర్ కొనసాగనుంది. మొత్తం 59 మంది కార్పొరేటర్లకు గాను 36 మంది టూర్ కు వెళ్లారు. మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీలతో పాటు మరో 21 మంది టూర్‌కు దూరంగా ఉన్నారు. పూణే, జయపూర్, ఆగ్రా, ఢిల్లీ, చండీఘర్, అమృత్సర్ నగరాల్లో పర్యటించేలా షెడ్యూల్ రూపొందించారు. అక్కడ కార్పొరేషన్లలో పాలనా వ్యవహారాలు, అభివృద్ధి తదితర అంశాలపై అధ్యయనం చేయాలన్నది విజ్ఞాన యాత్ర ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం రూ.30 లక్షలు కేటాయించారు. సదరన్ ట్రావెల్స్‌కు కాంట్రాక్ట్ అప్పగించారు. 29న నగరం నుంచి బయలుదేరిన కార్పొరేటర్లు 30వ తేదీనే మద్యం మత్తులో రైల్లో వివాదాన్ని సృష్టించారు. పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేయడంతో గప్‌చుప్ అయిపోయిందనుకున్నారు. కానీ ఆ సమాచారం బుధవారం విజయవాడకు చేరింది. టూర్ కొనసాగుతుండగానే విషయం అల్లరైపోవడంతో సంబంధిత కార్పొరేటర్లు కంగుతిన్నారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు సాక్షితో మాట్లాడుతూ పూణేలో ఎలాంటి వివాదం జరగలేదన్నారు. తమను అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు ఈ అల్లరి చేస్తున్నారన్నారు. ప్రస్తుతం తాము ఢిల్లీలో ఉన్నట్లు చెప్పారు. కలకలం టూర్లో టీడీపీ కార్పొరేటర్ల చేష్టలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. మేయర్ మొదటి నుంచి టూర్‌ను వ్యతిరేకిస్తున్నారు. మంత్రి పి.నారాయణ పుష్కరాల తరువాత వెళ్లాలని ఆదేశించారు. ఆ ప్రతిపాదనను కొందరు సీనియర్ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పట్టుబట్టిమరీ టూర్ షెడ్యూల్ ఖరారు చేశారు. డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ సారథ్యంలో వెళ్లిన కొందరు కార్పొరేటర్లు వివాదంలో చిక్కుకొని పార్టీతో పాటు బెజవాడ పరువును నిట్టనిలువునా తీశారు. టూర్లో అపశ్రుతి చోటు చేసుకుందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు, కుటుంబసభ్యులు ఫోన్లద్వారా వారి క్షేమసమాచారాన్ని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో టూర్ ముగియనుంది. -
మేయరా.. మోనార్కా!?
మేయర్ తీరుపై కార్పొరేటర్ల గుర్రు సమోసాలు తినేందుకేనా స్టాండింగ్ కమిటీ చిన్నబుచ్చడమేనా ‘పెద్దరికం’ విజయవాడ : ఏమ్మా.. స్టాండింగ్ కమిటీలో ఏదో వచ్చేస్తోంది అనుకోవద్దు. సమోసాలు తిని వెళ్లేందుకే ఈ మీటింగ్.. చాయ్ తాగి, సమోసాలు తినేందుకే అయితే స్టాండింగ్ కమిటీ సమావేశాలెందుకు అన్నది స్టాండింగ్ కమిటీ సభ్యుల ప్రశ్న. జీతాలు చాలకపోతే వెళ్లిపోండి. రెండేవేలకు పని చేసేందుకు ఏఎన్ఎంలు వస్తారని అన్నా. అంటే మీరు పేపరోళ్లకు చెబుతారా. ఆందోళన చేస్తే జీతాలు రావు. అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బందిపై కస్సుబుస్సు.. మాట్లాడింది చాల్లే అమ్మా.. కూర్చో, కూర్చుంటారా సభ నుంచి బయటకు పంపేయమంటారా? కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులకు ఇచ్చే వార్నింగ్. ఏం కమిషనర్ మాటే వింటారా? నా దగ్గరకు వచ్చే పన్లేందా. మీరు సమావేశంలో ఉండొచ్చు. ఇంకెక్కడైనా ఉండొచ్చు. పిలిస్తే రావాలికదా. ఓ ముఖ్య అధికారిపై కన్నెర్ర వివిధ సందర్భాల్లో మేయర్ వ్యవహారశైలి ఇది... నగరపాలక సంస్థలో మేయర్ కోనేరు శ్రీధర్ ఏకపాత్రాభినయంపై నిరసన వెల్లువెత్తుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన తమను డమ్మీల్ని చేస్తూ అంతా నా ఇష్టం అన్న చందంగా మేయర్ వ్యవహారశైలి మారిందని టీడీపీ కార్పొరేటర్లే ధ్వజమెత్తుతున్నారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసి అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల క్రితం స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ వ్యవహరించిన తీరుపై సభ్యులు గుర్రుగా ఉన్నారు. సమావేశానికి ముందు ఓ సభ్యురాలు చాంబర్‌కు వెళ్లగా స్టాండింగ్ కమిటీలో ఏదో వచ్చేస్తోంది అనుకోవద్దని, సమోసాలు తిని వెళ్లేం దుకు తప్ప ఎందుకు ఉపయోగం ఉండదని మేయర్ అనడంపై ఆమె మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయాన్ని తోటి సభ్యులకు చెప్పి వాపోయారు. నగరపాలక సంస్థ ఆప్స్ కాంట్రాక్ట్‌ను కోడ్ట్రీ టెక్నాలజీస్‌కు రూ.27.36 లక్షలు కట్టబెట్టే విషయంలో చర్చకు సభ్యులు పట్టుబట్టగా మేయర్ ఏకపక్షంగా టెండర్‌ను ఆమోదిస్తూ తీర్మానం చేయడంలో ఆంతర్యమేమిటని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కోటరీకే ప్రాధాన్యం మేయర్ కీలక నిర్ణయాలు తీసుకొనే సందర్భంలో కోటరీకే ప్రాధాన్యత ఇస్తూ తమను పక్కకు నెట్టేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. మూడు నెలలకు ఒకసారి జరిగే కౌన్సిల్ సమావేశాల్లో సైతం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే ఆవేదనను జూనియర్ కార్పొరేటర్లు వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ‘లబ్ధి’ చేకూర్చేలా మేయర్ నిర్ణయాలు ఉంటున్నాయన్నది టీడీపీ కార్పొరేటర్ల వాదన. చిన్నబుచ్చుతున్నారు కౌన్సిల్ సమావేశాల అజెండాలో ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ ఒక్క రోజులో అయిపోవాలనే విధంగా మేయర్ తీరు ఉంటుందని, దీనివల్ల ప్రధాన అంశాలపై సమగ్ర చర్చ జరగడం లేదన్నది పలువురి సభ్యుల అభిప్రాయం. తమ ప్రశ్నలకు అధికారులతో సమాధానం చెప్పించాల్సి ఉండగా మేయరే జోక్యం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఇబ్బందికరంగా ఉందని కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. ప్రశ్నోత్తరాల నుంచి తీర్మానాల వరకు అంతా గందరగోళంగా సాగుతోందన్నది సభ్యుల ఆరోపణ. అజెండా లో చేర్చాల్సిన ప్రతిపాదనల్లోనూ కోతలు వేయడాన్ని తప్పుబడుతున్నారు. నగరపాలక సంస్థకు ‘పెద్ద’లా వ్యవహరించాల్సిన మేయర్ తమను ‘చిన్న’బుచ్చడంపై అధికారపార్టీ సభ్యులు మనస్తాపానికి గురవుతున్నారు. హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తాం - స్టాండింగ్ కమిటీ సభ్యులు నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ వ్యవహారశైలిపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు కాకు మల్లిఖార్జున యాదవ్, కొరకాని అనూరాధ, నాగోతు నాగమణి స్పష్టం చేశారు. ప్రజాఫిర్యాదుల కమిటీ హాల్లో శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడారు. స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో తమను ఉత్సవ విగ్రహాలను చేస్తున్నారన్నారు. అధికారులను తాము ప్రశ్నిస్తే మేయర్ ఎందుకు సమాధానమిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆప్స్ కాంట్రాక్ట్‌పై సమగ్ర చర్చ జరగాల్సి ఉండగా ఆమోదించాననే ఒక్క మాటతో మేయర్ తేల్చేశారన్నారు. గంటలో సమావేశం పూర్తి చేయాలనే హైరానా తప్ప స్టాండింగ్ కమిటీలో సమగ్ర చర్చ జరగడం లేదని తెలిపారు. కబేళాలో కోటి రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన మిషన్‌ను వాడకుండా పక్కన పడేశారని కాకు పేర్కొన్నారు. ఆప్స్ కాంట్రాక్ట్‌ను ఐదుగురు సభ్యులు ఆమోదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. మేయర్‌పై తమకు వ్యక్తిగత ద్వేషం లేదని, కార్పొరేటర్లకు కనీస గౌరవం ఇవ్వాలన్నదే తమ వాదన అన్నారు. మేయర్ నియంతలా వ్యవహరిస్తున్నారు -వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల విజయవాడ సెంట్రల్ : మేయర్ కోనేరు శ్రీధర్ నియంతలా వ్యవహరిస్తున్నారని నగరపాలక సంస్థ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల దుయ్యబట్టారు. శుక్రవారం తన చాంబర్లో విలేకర్లతో మాట్లాడారు. కౌన్సిల్లో ప్రతిపక్షాల గొంతునొక్కుతున్న మేయర్ స్టాండింగ్ కమిటీలో సొంతపార్టీ వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. గుట్టుగా పాలన సాగిద్దామనుకుంటే కుదరదని, ప్రతి సభ్యుడికి స్వతంత్రంగా అభిప్రాయాలు తెలియజేసే అవకాశం ఉందన్న విషయాన్ని మేయర్ గుర్తిస్తే మంచిదని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగం దేశానికి బైలా లాంటిదంటూ ప్రసంగం చేసిన మేయర్ ప్రజాప్రతినిధులకు మాట్లాడే స్వేచ్ఛను ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. స్టాండింగ్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా యాప్స్ కాంట్రాక్ట్‌ను ఎం దుకు ఆమోదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్టాండింగ్ కమిటీని, కౌన్సిల్‌ను అడ్డుపెట్టుకొని మేయర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. కనకదుర్గ సొసైటీ లే అవుట్ అప్రూల్ విషయంలో మేయర్ తొందరపాటు నిర్ణయం వెనుక కాసుల కక్కూర్తి ఉందన్నారు. సొంతపార్టీ సభ్యుల నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న శ్రీధర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ దాసరి మల్లీశ్వరి పాల్గొన్నారు.