- టౌన్‌ప్లానింగ్‌లో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు
- ఇద్దరు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు టీపీఎస్‌లు
- అక్టోబర్ 17 నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేత
విజయవాడ సెంట్రల్ : విజయవాడ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతికి శస్త్రచికిత్స మొదలైంది. ప్రత్యేక అధికారి తిమ్మారెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ల(టీపీఎస్)పై టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ పి.రఘు సస్పెన్షన్ వేటు వేశారు. బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, ఆష, లక్ష్మీజ్యోతి. టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్లు జి.వెంకటేశ్వరరావు, కృష్ణ, ప్రవీణ్‌లను విధుల నుంచి తొలగిస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన అక్రమ నిర్మాణాల్లో వీరి పాత్రపై టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
మంగళవారం ఇక్కడకు వచ్చిన తిమ్మారెడ్డి అధికారులతో రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు సాగించారు. ఏం చేసినా చర్యలుండవనే ధీమా పెరిగిపోవడం వల్లే టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి పెరిగిందని దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందేనని తిమ్మారెడ్డి గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. బుధవారం తిరిగి మళ్లీ డెర్టైర్‌తో భేటీ అయ్యారు. మొదటి విడత సస్పెన్షన్ల పర్వం పూర్తవ్వగా రెండో విడతలో మరో ముగ్గురిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తాజాఘటన టౌన్‌ప్లానింగ్ అధికారుల్లో కలకలం రేపింది.బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్, వెంకటేశ్వరరావులు ఐదు నెలల క్రితమే పదోన్నతిపై ఇక్కడ నుంచి బదిలీ అయ్యారు. పుష్కరాల ముసుగులో డెరైక్టరేట్‌లో లాబీయింగ్ చేసి ఓడీ తెచ్చుకున్నారు. పుష్కర విధులు పూర్తయిన నేపథ్యంలో కమిషనర్ జి.వీరపాండియన్ రిలీవ్ చేశారు. ప్రవీణ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాల్టీకి టీపీఎస్‌గా వెళ్లారు. పదోన్నతి వచ్చినా టౌన్‌ప్లానింగ్‌ను వదలడం ఇష్టం లేని జి.వెంకటేశ్వరరావు ఓడీ తెచ్చుకొని ఇక్కడే కొనసాగుతున్నారు. ఓడీ వ్యవహారంపై తిమ్మారెడ్డి మండిపడ్డట్లు తెలుస్తోంది.
తాఖీదులు రెడీ ...
అక్రమ భవన నిర్మాణదారులకు టౌన్‌ప్లానింగ్ అధికారులు తాఖీదులు సిద్ధం చేస్తున్నారు. తిమ్మారెడ్డి ఆదేశాల మేరకు నగరంలో అక్రమ కట్టడాలను కూల్చేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. వారం రోజుల ముందస్తు నోటీసుల్ని రూపొందిస్తున్నారు. మొదటి విడతలో 200 చదరపు గజాల విస్తీర్ణం ఆపైన వాటికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దసరా ముందు కూల్చివేతలు చేపడితే భవన నిర్మాణదారుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని భావించిన అధికారులు అక్టోబర్ 17 నుంచి అక్రమ కట్టడాలను కూల్చేయాలని ముహూర్తంగా నిర్ణయించారు.