సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణ రంగం ఊపందుకుంది. వివిధ నగరాలు, మున్సిపాలిటీల పరిధిలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునేవారు పెరుగుతున్నారు. గతేడాది డిసెంబర్ 26 నాటికి 40,536 నిర్మాణాల ప్లాన్లకు అనుమతులు మంజూరైనట్టు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) విభాగం లెక్కలు చెబుతున్నాయి. జిల్లాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో దరఖాస్తు చేసుకునే భవన నిర్మాణ ప్లాన్లను వేగంగా ఆమోదిస్తుండటంతో నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. కోవిడ్ లాక్‌డౌన్, వరదలు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నిర్మాణాలు వేగంగా సాగాయి. ఇదే ఒరవడి కొత్త సంవత్సరంలోనూ కొనసాగి, ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకు ముందు 2019, 2020 సంవత్సరాల్లో 30 వేల భవనాల ప్లాన్లు మాత్రమే ఆమోదం పొందాయి. 2021లో భారీగా వృద్ధి నమోదైంది. ఈ ఏడాది కొత్త మాస్టర్ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయని, దాంతో లే అవుట్లు, నిర్మాణాలు పెరుగుతాయని డీటీసీపీ అధికారులు అంచనా వేస్తున్నారు.
మొదటి రెండు స్థానాల్లో విశాఖ, విజయవాడ
రాష్ట్రంలో మొత్తం 123 అర్బన్ లోకల్ బాడీలు (యూఎల్‌బీలు), 18 అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీలు (యూడీఏలు) ఉన్నాయి. నిర్మాణాలన్నింటికీ వీటి అనుమతి తప్పనిసరి. గ్రేటర్ విశాఖపట్నంలో అత్యధికంగా గతేడాది 6,328 ప్లాన్లకు అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో 200 చదరపు మీటర్ల లోపు నిర్మాణాలు 5,154 ఉండగా, 200 నుంచి 300 చ.మీ. మధ్య ఉన్నవి మరో 607 ఉన్నాయి. 300 నుంచి 500 చ.మీ పరిధిలో ఉన్నవి 357, 500 నుంచి 2 వేలు చ.మీ. పరిధిలో ఉన్నవి 171, రెండు వేల నుంచి 4 వేల చ.మీ. పరిధిలోనివి 15, నాలుగు వేల చ.మీ. దాటినవి మరో 24 అనుమతులు ఉన్నాయి.
రెండో స్థానంలో నిలిచిన విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 2,457 భవనాల ప్లాన్లను ఆమోదించారు. వీటిలో 200 చ.మీ. పరిధిలోని 2,136 ఉండగా 200 నుంచి 300 చ.మీ.లోపు ఉన్నవి 155 ఉన్నాయి. 300 నుంచి 500 చ.మీ లోపు 110 ప్లాన్లు ఉన్నాయి. 500 నుంచి 2 వేలు చ.మీ. పరిధిలో ఉన్నవి 44 ఉండగా, 2 వేల నుంచి 4 వేల చ.మీ పరిధిలోనివి ఏడు, 4 వేల చ.మీ. దాటినవి 5 ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2,199 అనుమతులు, నెల్లూరులో 1,980, కడపలో 1,625, గుంటూరు పరిధిలో 1,596 అనుమతులు లభించాయి. మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ నిర్మాణ రంగం ఆశాజనకంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
కొత్త ఏడాదిలో మరింత వేగం
కొత్త సంవత్సరంలో నిర్మాణ రంగం మరింత వేగం పుంజుకుంటుందని డీటీసీపీ అంచనా వేస్తోంది. ప్రభుత్వం నిర్మాణ రంగంలో అనుసరిస్తున్న సరళీకృత విధానాలు, ఇసుక పాలసీ, లే అవుట్ అప్రూవల్స్ కోసం అందుబాటులోకి తెచ్చిన డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టంతో అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే జరగడం వంటివి నిర్మాణదారులకు బాగా కలిసివస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో నిర్మాణాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
నిర్మాణ రంగంలో జోష్
Published Mon, Jan 3 2022 4:13 AM | Last Updated on Mon, Jan 3 2022 8:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment