construction industry
-
నిర్మాణ రంగంలో జోష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణ రంగం ఊపందుకుంది. వివిధ నగరాలు, మున్సిపాలిటీల పరిధిలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునేవారు పెరుగుతున్నారు. గతేడాది డిసెంబర్ 26 నాటికి 40,536 నిర్మాణాల ప్లాన్లకు అనుమతులు మంజూరైనట్టు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) విభాగం లెక్కలు చెబుతున్నాయి. జిల్లాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో దరఖాస్తు చేసుకునే భవన నిర్మాణ ప్లాన్లను వేగంగా ఆమోదిస్తుండటంతో నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. కోవిడ్ లాక్డౌన్, వరదలు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నిర్మాణాలు వేగంగా సాగాయి. ఇదే ఒరవడి కొత్త సంవత్సరంలోనూ కొనసాగి, ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకు ముందు 2019, 2020 సంవత్సరాల్లో 30 వేల భవనాల ప్లాన్లు మాత్రమే ఆమోదం పొందాయి. 2021లో భారీగా వృద్ధి నమోదైంది. ఈ ఏడాది కొత్త మాస్టర్ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయని, దాంతో లే అవుట్లు, నిర్మాణాలు పెరుగుతాయని డీటీసీపీ అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి రెండు స్థానాల్లో విశాఖ, విజయవాడ రాష్ట్రంలో మొత్తం 123 అర్బన్ లోకల్ బాడీలు (యూఎల్బీలు), 18 అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలు (యూడీఏలు) ఉన్నాయి. నిర్మాణాలన్నింటికీ వీటి అనుమతి తప్పనిసరి. గ్రేటర్ విశాఖపట్నంలో అత్యధికంగా గతేడాది 6,328 ప్లాన్లకు అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో 200 చదరపు మీటర్ల లోపు నిర్మాణాలు 5,154 ఉండగా, 200 నుంచి 300 చ.మీ. మధ్య ఉన్నవి మరో 607 ఉన్నాయి. 300 నుంచి 500 చ.మీ పరిధిలో ఉన్నవి 357, 500 నుంచి 2 వేలు చ.మీ. పరిధిలో ఉన్నవి 171, రెండు వేల నుంచి 4 వేల చ.మీ. పరిధిలోనివి 15, నాలుగు వేల చ.మీ. దాటినవి మరో 24 అనుమతులు ఉన్నాయి. రెండో స్థానంలో నిలిచిన విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 2,457 భవనాల ప్లాన్లను ఆమోదించారు. వీటిలో 200 చ.మీ. పరిధిలోని 2,136 ఉండగా 200 నుంచి 300 చ.మీ.లోపు ఉన్నవి 155 ఉన్నాయి. 300 నుంచి 500 చ.మీ లోపు 110 ప్లాన్లు ఉన్నాయి. 500 నుంచి 2 వేలు చ.మీ. పరిధిలో ఉన్నవి 44 ఉండగా, 2 వేల నుంచి 4 వేల చ.మీ పరిధిలోనివి ఏడు, 4 వేల చ.మీ. దాటినవి 5 ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2,199 అనుమతులు, నెల్లూరులో 1,980, కడపలో 1,625, గుంటూరు పరిధిలో 1,596 అనుమతులు లభించాయి. మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ నిర్మాణ రంగం ఆశాజనకంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో మరింత వేగం కొత్త సంవత్సరంలో నిర్మాణ రంగం మరింత వేగం పుంజుకుంటుందని డీటీసీపీ అంచనా వేస్తోంది. ప్రభుత్వం నిర్మాణ రంగంలో అనుసరిస్తున్న సరళీకృత విధానాలు, ఇసుక పాలసీ, లే అవుట్ అప్రూవల్స్ కోసం అందుబాటులోకి తెచ్చిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టంతో అన్ని పనులు ఆన్లైన్లోనే జరగడం వంటివి నిర్మాణదారులకు బాగా కలిసివస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో నిర్మాణాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. -
విద్యుత్ ఆదాతో ‘చల్లటి’ వెలుగులు
సాక్షి, అమరావతి: పేదలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో విద్యుత్‌ను ఆదా చేసేలా ఇళ్ల నిర్మాణం జరుగుతుందని భవన నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఇండో స్విస్– బీప్ (బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్), ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సంయుక్తంగా ఎకో–నివాస్ సంహిత (రెసిడెన్షియల్ ఈసీబీసీ కోడ్)పై విజయవాడలో గురువారం అవగాహనా సదస్సు జరిగింది. జగనన్న కాలనీల్లో ఇంధన సామర్థ్య ఇళ్ల నిర్మాణ ప్రచార పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. అనంతరం అజయ్ జైన్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా తొలి విడత రూ. 28 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇళ్లల్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ‘ఇండో స్విస్ బీప్’ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆ ఇళ్లకు బల్బులు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు సరఫరా చేస్తామన్నారు. విద్యుత్ వినియోగంలో 42 శాతం బిల్డింగ్ సెక్టార్లోనే జరుగుతున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఇండో స్విస్ బీప్ సాంకేతికత వల్ల బైట ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇళ్ల లోపల 3 నుంచి 5 డిగ్రీలు, విద్యుత్ వినియోగం 20 శాతం తగ్గుతుందని, వెలుగు ఎక్కువగా ఉంటుందని బీప్ ఇండియా డైరెక్టర్ సమీర్ మైతేల్ అన్నారు. ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ రంగ సంస్థల ప్రతినిధులు, భవన నిర్మాణ రంగ నిపుణులు పాల్గొన్నారు. -
నిర్మాణ రంగంపై డీజిల్, బొగ్గు దెబ్బ
సాక్షి, అమరామతి: పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక సంక్షోభం, కోవిడ్ వంటి వరుస దెబ్బలను తట్టుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నిర్మాణ రంగాన్ని డీజిల్ ధరలు, బొగ్గు కొరత మరోసారి తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఏడాదిన్నరలో లీటర్ డీజిల్ ధర ఏకంగా రూ.28 పెరగడంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. ఏడాదిన్నర కిందట లీటర్ డీజిల్ ధర రూ.78గా ఉండగా ఇప్పుడు అది రూ.106 దాటింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు కొరత రావడంతో డిమాండ్ లేకున్నా ఉత్పత్తి తగ్గడం వల్ల స్టీల్, సిమెంట్, అల్యూమినియం, కాపర్, ప్లాస్టిక్ వంటి అన్ని రకాల ఉత్పత్తుల ధరలు 40 నుంచి 50 శాతం వరకూ పెరిగాయని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు కొరత ప్రభావం అధికంగా స్టీల్ రంగంపై పడింది. కొరత లేకముందు టన్ను స్టీల్ ధర రూ.40–45 వేల మధ్య ఉంటే.. ఇప్పుడది ఏకంగా రూ.65,000 మార్కును అధిగమించింది. సిమెంట్ బస్తా రూ.260 నుంచి రూ.370కి చేరింది. డీజిల్ ధరలు పెరగడంతో ఇసుక, కంకర, ఇటుక వంటి వస్తువుల రవాణా వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందని ఏపీ క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజాశ్రీనివాస్ చెప్పారు. ముడి సరుకుల వ్యయం భారీగా పెరగడంతో చదరపు అడుగు నిర్మాణ వ్యయం 20 శాతం వరకూ పెరుగుతోందన్నారు. దీంతో నూతన ప్రాజెక్టులు చేపట్టేందుకు బిల్డర్లు వెనుకాడుతున్నారు. ఇప్పటికే మొదలు పెట్టినవారు పని వేగాన్ని తగ్గించినట్టు క్రెడాయ్ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నవాటిని వదిలించుకుందాం.. నిర్మాణ వ్యయం పెరిగినా ధరలు పెంచలేని పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఉందని ఏపీ క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజా శ్రీనివాస్ చెప్పారు. వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో ఇప్పుడిప్పుడే అమ్మకాలు పుంజుకుంటున్నాయన్న తరుణంలో నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరిగిపోయిందని, దీంతో నూతన ప్రాజెక్టుల కంటే.. ఇప్పటికే నిర్మించిన వాటిని అమ్ముకోవడం పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. కొత్త వెంచర్లు వేసేందుకు కూడా బిల్డర్లు వెనుకాడుతున్నారని వైజాగ్ క్రెడాయ్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. క్రెడాయ్ అంచనాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1.4 లక్షల ఫ్లాట్స్ నిర్మాణంలో ఉండగా, వాటిలో 56,000 ఫ్లాట్స్ గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించే నిర్మాణ రంగాన్ని వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయని క్రెడాయ్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నిర్మాణ సామగ్రి పరిశ్రమలకు ఊతం
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ యంత్ర సామగ్రి తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం సాదర స్వాగతం పలుకుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. వీటికోసం ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశామన్నారు. ఇండియా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఐఏ) ఆధ్వర్యంలో శనివారం జరిగిన వెబినార్‌లో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, పారిశ్రామిక పార్కుల నిర్మాణాలతో నిర్మాణ రంగ యంత్ర సామగ్రి తయారీదారులకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో రాబోయే రోజుల్లోనూ నిర్మాణరంగ యంత్రపరికరాల తయారీ రంగానికి మంచి డిమాండ్ ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ రంగంలోని పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. వీటి తయారీదారులు ఏటా నిర్వహించే ‘ఎక్స్‌కాన్’వంటి కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తే ఆతిథ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పరిశ్రమలకు అవసరమైన సిబ్బందికి ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా కార్యక్రమాల్లో స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యమివ్వాలని అభిప్రాయపడ్డారు. హైస్పీడ్ నెట్వర్క్, నూతన ఎయిర్‌పోర్టులు, భారీ సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక వాడల నిర్మాణం వంటి మౌలిక వసతుల ద్వారానే భారత్ అగ్ర దేశాల సరసన చేరుతుందన్నారు. దీనిలో కీలక పాత్ర పోషించే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పరిశ్రమకు సంబంధించి కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపైనా ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, కరోనా సంక్షోభంలోనూ వలస కార్మికులను ఆదుకున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కాగా, రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టులను సీఐఏ అభినందించింది. సిమెంటు ధరల తగ్గింపు దిశగా చర్యలు: మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో నిర్మాణ రంగం గత ఆరేళ్లుగా అభివృద్ధిపథాన కొనసాగుతోందని, కరోనా కల్లోలంలోనూ అదే ఒరవడి కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న నిర్మాణరంగం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు మార్గనిర్దేశంపై చర్చించేందుకు శనివారం ప్రగతిభవన్‌లో నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. సిమెంట్ ధరల పెరుగుదలపట్ల నిర్మాణరంగ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయగా, ధరల తగ్గింపు దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిచ్చారు. దేశంలోని ఇతర మెట్రోనగరాల్లో నిర్మాణ రంగ పరిస్థితి అయోమయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో పర్వాలేదని నిర్మాణ రంగ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అప్రూవల్, మాస్టర్ ప్లాన్లకు సంబంధించి వారిచ్చిన సూచనల పట్ల మంత్రి సానుకూలంగా స్పందిస్తూ నిర్మాణ రంగానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ప్రస్తుతంæ సైట్ల వద్ద పనిచేస్తున్న అతిథి కార్మికుల వివరాలను క్రోడీకరించి తమకు అందజేయాలని, సంక్షోభ సమయాల్లో వారికి తొందరగా సహాయక చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. నిర్మాణ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు మద్దతు ఇస్తామని నిర్మాణ సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉత్పత్తులకు జీఐ బ్రాండింగ్ ‘తెలంగాణ జీఐ’పై రూపొందించిన ‘ఈ బుక్’ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: వివిధ వస్తువుల పుట్టుపూర్వోత్తరాలను తెలియజేయడంలో భౌగోళిక సూచన (జియోలాజికల్ ఇండెక్స్–జీఐ) గుర్తులు కీలకపాత్ర పోషిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ‘తెలంగాణ జీఐ’పై రూపొందించిన ‘ఈ బుక్’ను శనివారం కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం 15 వస్తువుల కు మాత్రమే జీఐ కింద నమోదయ్యాయని, తెలంగాణలో మరిన్ని ఉత్పత్తులు జీఐ కోసం నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. కనీసం జిల్లాకు ఒక ఉత్పత్తిని గుర్తించి జీఐ నమోదు కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా విడుదలైన ‘ఈ బుక్’ద్వారా రాష్ట్రంలోని వివిధ ఉత్పత్తులు, ప్రదేశాలు, తయారీదారులకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ఆయా ఉత్పత్తుల తయారీలో ఏళ్ల తరబడి సా«ధించిన నైపుణ్యం, చరిత్ర, సంస్కృతి వెలుగులోకి వస్తుందని, జీఐ టూరిజంను ప్రోత్సహించడంలో ‘ఈ బుక్’ తోడ్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా మొదట రాష్ట్రంలోని ఉత్పత్తులకు బ్రాం డ్ సాధించి పేరు గడించాలని కేటీఆర్ సూచిం చారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ము ఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు. -
ఆ రంగాలు మరింత సంక్షోభంలోకి: రాజన్
సాక్షి, ముంబై : ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ దేశ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కోనున్నాయని హెచ్చరించారు. ఇండియా టుడే పత్రికలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని తెలిపారు. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి చేరిన విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగిత రేటు తీవ్ర స్థాయిలో ఉందని తెలిపారు. రియల్టీ, కన్స్ట్రక్షన్, మాన్యుఫాక్చర్ కంపెనీలకు పెద్దమొత్తంలో రుణాలిచ్చే (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్) ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యతను పరిశీలించాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర బ్యాంకు టాప్ 50 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పనితీరును సమీక్షిస్తుందన్న ఆయన ఆర్బీఐ వాటి పనితీరును, వాటి ఎసెట్ క్వాలిటీని కూడా సమీక్షించాలని సూచించారు. కాగా షాడో బ్యాంకింగ్ రంగంలో మొత్తం ఆస్తులలో 75 శాతం వాటా ఉన్న టాప్ 50 నాన్-బ్యాంక్ ఫైనాన్షియర్లను సెంట్రల్ బ్యాంక్ నిశితంగా పరిశీలిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అలాగే అతి ముఖ్యమైన పెద్ద ఎన్బీఎఫ్సీలు కుప్పకూలకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని ఆయన పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. కాగా నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని సుమారు యూఎస్డీ 66 బిలియన్ల మేర బకాయిలు ఉన్నటు ఇటీవల ఓ సర్వే తెలియజేసిందని పేర్కొన్నారు. మరోవైపు ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ స్పందిస్తూ సుమారు 4.54 లక్షల యూనిట్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి కావడం లేదని వెల్లడించారు. -
నిర్మాణ రంగ కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ
కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ వెల్లడి సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు త్వరలో ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ సేవలు అందించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి కార్మికుడి వివరాలను రిజిస్టర్ చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ప్రత్యేకంగా ఈఎస్ఐ కార్పొరేషన్ సమావేశం నిర్వహించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. శనివారం ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్ప్రీ (స్కీం ఫర్ ప్రమోటింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయిస్) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిం ది. ఇందులో భాగంగా ప్రతి కార్మికుడు, కంపెనీ వివరాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఇప్పటివరకు 2.31 లక్షల మంది పేర్లు రిజిస్టర్ చేశాం. వీరికి సం ఘటిత కార్మిక విభాగం కింద కార్మిక రాజ్య బీమా సంస్థ సేవలు, భవిష్య నిధి సేవలు అందుతాయి’ అని చెప్పారు. జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేపట ్టనున్నట్లు దత్తాత్రేయ వివరించారు. బీడీ కార్మికు లను ఈఎస్ఐసీ పరిధి లోకి తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వం భూమిస్తే వెంటనే రూ.300 కోట్లు.. రాష్ట్రంలో మూడు ఈఎస్ఐసీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే కేంద్రం నుంచి తక్షణమే రూ.300 కోట్లు విడుదల చేస్తామని దత్తాత్రేయ చెప్పారు. ఖమ్మంలో ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం, రామగుండం, కొత్తగూడెంలో ఉప ప్రాంతీయ కార్మిక రాజ్య బీమా కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికుల గుర్తింపుపై కమిటీ వేశామని, నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దన్నారు. సమావేశంలో కార్మిక శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, ఉపాధి కల్పన సంచాలకులు కే.వై.నాయక్, ఈఎస్ఐ సంచాలకులు దేవికారాణి తదితరులు పాల్గొన్నారు.