సాక్షి, హైదరాబాద్: నిర్మాణ యంత్ర సామగ్రి తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం సాదర స్వాగతం పలుకుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. వీటికోసం ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశామన్నారు. ఇండియా కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఐఏ) ఆధ్వర్యంలో శనివారం జరిగిన వెబినార్‌లో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, పారిశ్రామిక పార్కుల నిర్మాణాలతో నిర్మాణ రంగ యంత్ర సామగ్రి తయారీదారులకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో రాబోయే రోజుల్లోనూ నిర్మాణరంగ యంత్రపరికరాల తయారీ రంగానికి మంచి డిమాండ్ ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ రంగంలోని పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. వీటి తయారీదారులు ఏటా నిర్వహించే ‘ఎక్స్‌కాన్’వంటి కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తే ఆతిథ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ పరిశ్రమలకు అవసరమైన సిబ్బందికి ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా కార్యక్రమాల్లో స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యమివ్వాలని అభిప్రాయపడ్డారు.
హైస్పీడ్ నెట్‌వర్క్, నూతన ఎయిర్‌పోర్టులు, భారీ సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక వాడల నిర్మాణం వంటి మౌలిక వసతుల ద్వారానే భారత్ అగ్ర దేశాల సరసన చేరుతుందన్నారు. దీనిలో కీలక పాత్ర పోషించే కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ పరిశ్రమకు సంబంధించి కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపైనా ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, కరోనా సంక్షోభంలోనూ వలస కార్మికులను ఆదుకున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కాగా, రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టులను సీఐఏ అభినందించింది.
సిమెంటు ధరల తగ్గింపు దిశగా చర్యలు: మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో నిర్మాణ రంగం గత ఆరేళ్లుగా అభివృద్ధిపథాన కొనసాగుతోందని, కరోనా కల్లోలంలోనూ అదే ఒరవడి కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న నిర్మాణరంగం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు మార్గనిర్దేశంపై చర్చించేందుకు శనివారం ప్రగతిభవన్‌లో నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. సిమెంట్ ధరల పెరుగుదలపట్ల నిర్మాణరంగ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయగా, ధరల తగ్గింపు దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిచ్చారు.
దేశంలోని ఇతర మెట్రోనగరాల్లో నిర్మాణ రంగ పరిస్థితి అయోమయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో పర్వాలేదని నిర్మాణ రంగ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అప్రూవల్, మాస్టర్ ప్లాన్లకు సంబంధించి వారిచ్చిన సూచనల పట్ల మంత్రి సానుకూలంగా స్పందిస్తూ నిర్మాణ రంగానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ప్రస్తుతంæ సైట్ల వద్ద పనిచేస్తున్న అతిథి కార్మికుల వివరాలను క్రోడీకరించి తమకు అందజేయాలని, సంక్షోభ సమయాల్లో వారికి తొందరగా సహాయక చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. నిర్మాణ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు మద్దతు ఇస్తామని నిర్మాణ సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు.
తెలంగాణ ఉత్పత్తులకు జీఐ బ్రాండింగ్
- ‘తెలంగాణ జీఐ’పై రూపొందించిన ‘ఈ బుక్’ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వివిధ వస్తువుల పుట్టుపూర్వోత్తరాలను తెలియజేయడంలో భౌగోళిక సూచన (జియోలాజికల్ ఇండెక్స్–జీఐ) గుర్తులు కీలకపాత్ర పోషిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ‘తెలంగాణ జీఐ’పై రూపొందించిన ‘ఈ బుక్’ను శనివారం కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం 15 వస్తువుల కు మాత్రమే జీఐ కింద నమోదయ్యాయని, తెలంగాణలో మరిన్ని ఉత్పత్తులు జీఐ కోసం నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. కనీసం జిల్లాకు ఒక ఉత్పత్తిని గుర్తించి జీఐ నమోదు కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు.
తాజాగా విడుదలైన ‘ఈ బుక్’ద్వారా రాష్ట్రంలోని వివిధ ఉత్పత్తులు, ప్రదేశాలు, తయారీదారులకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ఆయా ఉత్పత్తుల తయారీలో ఏళ్ల తరబడి సా«ధించిన నైపుణ్యం, చరిత్ర, సంస్కృతి వెలుగులోకి వస్తుందని, జీఐ టూరిజంను ప్రోత్సహించడంలో ‘ఈ బుక్’ తోడ్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా మొదట రాష్ట్రంలోని ఉత్పత్తులకు బ్రాం డ్ సాధించి పేరు గడించాలని కేటీఆర్ సూచిం చారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ము ఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment