DTCP
-
డీటీసీపీ మాస్టర్ ప్లాన్.. ప్రతీ మున్సిపాలిటీకి రింగ్‌రోడ్డు!
సాక్షి, హైదరాబాద్: ప్రతి మున్సిపాలిటీకి రింగ్‌రోడ్డు.. రహదారులు, డ్రైనేజీల విస్తరణ.. ప్రత్యేకంగా నివాస, వాణిజ్య, మిశ్రమ జోన్లు.. వచ్చే 20ఏళ్ల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు.. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్లు సిద్ధమవుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వీటిని రూపొందిస్తున్నారు. ప్రణాళిక లేకుండా మున్సిపాలిటీలు విస్తరించడం వల్ల ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలు కీలక చర్యలను చేపట్టనున్నారు. డీటీసీపీ యంత్రాంగం ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇదే పనిలో నిమగ్నమైంది. మార్చి నాటికల్లా సిద్ధం చేసేలా.. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్)ను వినియోగించి.. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు, 11 నగరాభివృద్ధి సంస్థలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నారు. 2023 మార్చి నాటికల్లా అమలు చేసేలా బృహత్తర ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లకుగాను 74 మున్సిపాలిటీల్లో ఇప్పటికే రూపొందించిన మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. వాటిలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. మిగతా 68 చోట్ల కొత్తగా మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేస్తున్నారు. ప్రజలు తమ భూవినియోగ వివరాలను సులభంగా తెలుసుకుని.. టీఎస్ బీ–పాస్ విధానంతో సింగిల్ విండో పద్ధతిలో భవన నిర్మాణ/లేఔట్ల అనుమతులు పొందడానికి మాస్టర్ప్లాన్లు ఎంతో ఉపయోగపడతాయని డీటీసీపీ అధికారులు చెప్తున్నారు. జీఐఎస్ ద్వారా క్షుణ్నంగా సర్వే చేసి వచ్చే 20ఏళ్ల వరకు ఎలాంటి భూ వినియోగమారి్పడి అవసరం లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరిస్తున్నారు. వివిధ జోన్లుగా విభజించి.. జనాభా అధికంగా ఉండే ప్రాంతాలను మిశ్రమ వినియోగ ప్రాంతాలుగా.. మిగతా ప్రాంతాలను వాణిజ్య, నివాస ప్రాంతాలుగా ఒక క్రమపద్ధతిలో మాస్టర్ ప్లాన్లలో నిర్దేశించనున్నారు. ప్రజలు తాము నివసించే ప్రాంతాల నుంచి కార్యాలయాలకు, పనిచేసే ప్రాంతాలకు సులభంగా రాకపోకలు సాగించేలా, రహదారులపై ట్రాఫిక్ భారాన్ని నిరోధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారి ఒకరు వివరించారు. రహదారులు చిన్నగా ఉండటం.. జన సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి జరిగితే ఈ ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అన్ని మున్సిపాలిటీల్లో అంతర్గత, ప్రధాన రహదారులపై ఒత్తిడి లేకుండా రింగ్‌రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక చెరువులు, వాగులు, కాల్వలతోపాటు రైలు మార్గాలు, పారిశ్రామికవాడలు మొదలైన ప్రాంతాల్లో బఫర్ జోన్లను మాస్టర్ప్లాన్లలో నిర్దేశించనున్నారు. పట్టణాల్లో కనీసం పదిశాతానికి తగ్గకుండా గ్రీన్జోన్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతా పక్కాగా.. మాస్టర్ ప్లాన్ల రూపకల్పనలో భాగంగా తొలుత నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) నుంచి పట్టణాల చిత్రాలు, వివరాలు సేకరిస్తున్నారు. తర్వాత రెవెన్యూ శాఖ నుంచి సర్వే నంబర్ల వారీగా మ్యాపులను తీసుకుంటున్నారు. స్థానిక పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఆ వివరాలన్నింటినీ క్రోడీకరించి.. పట్టణ ప్రణాళికలో నిపుణులైన వారితో కొత్త మాస్టర్ప్లాన్లను రూపొందిస్తున్నారు. -
లేఅవుట్ డెవలపర్లకు గట్టి షాక్...రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం..!
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ డెవలపర్లకు పెద్ద షాక్ తగిలింది. హెచ్ఎండీఏ, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) అనుమతులు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను అంగీకరించేది లేదని రిజిస్ట్రేషన్ల శాఖ తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం లేఅవుట్లలో ఉన్న అనుమతి లేని ప్లాట్లపై క్రయవిక్రయ లావాదేవీలు జరిపే అవకాశం ఉండదు. గతంలోనే ఈ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రియల్టర్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనుమతి లేకున్నప్పటికీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, సదరు ప్లాట్లకు అనుమతులు లేవని, దీనిపై లావాదేవీలు జరపడం క్రయ, విక్రయదారుల రిస్క్ అంటూ ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌పై పేర్కొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయడంతో ఈ మేరకు కొట్టివేసింది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతుల్లేని ప్లాట్ల క్రయ, విక్రయ లావాదేవీలకు అనుమతి ఇవ్వవద్దని తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ శుక్రవారం నుంచి సదరు ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. అమ్ముడుపోకుండా మిగిలినవాటికే.. అనుమతుల్లేని లేఅవుట్ల ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం స్థలాల రెగ్యులరైజేæషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకంపట్ల ప్రజల నుంచి వ్యతిరేకత రావడం... హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికారపార్టీకి చేదు ఫలితాలు రావడంతో ఉపసంహరించుకున్న ప్రభుత్వం లేఅవుట్లలో అప్పటికే అమ్ముడైన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, అప్పటివరకు అమ్మని ప్లాట్లకు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అక్రమ లేఅవుట్లలో డెవలపర్ల వద్ద ఉన్న ప్లాట్లకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే క్రయవిక్రయ లావాదేవీలు జరిపిన ప్లాట్లకు వర్తించదని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు వెల్లడించారు. -
అక్కడ పిరం.. ఇక్కడ స్థిరం!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరులో స్థిరాస్తి వ్యాపారి ఒకరు అయిదెకరాల విస్తీర్ణంలో లేఅవుట్ వేసేందుకు స్థలాన్ని చూశాడు. భూ యజమానితో ఎకరాకు రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. సరిగా నెల తర్వాత 8 కి.మీ. దూరంలో ఉన్న కడ్తాల్‌లో ఎకరా రూ.4 కోట్ల చొప్పున లే అవుట్ ప్రారంభించాడు. అందేంటి? హెచ్ఎండీఏ పరిధిలో, హైవేకు ఆనుకొని ఉన్న స్థలాన్ని కాదని.. ఎక్కువ ధర పెట్టి డీటీసీపీలో వెంచర్ వేశారేంటని ప్రశ్నించగా.. హెచ్ఎండీఏ పరిధిలో ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్ల కారణంగా నివాసిత స్థలం తక్కువగా ఉంది. పైగా లే–అవుట్ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూడాలి. ఫీజులూ ఎక్కువే. అదే డీటీసీపీ ఫ్రీ జోన్. చార్జీలు తక్కువే, పర్మిషన్లూ సులువుగా వచ్చేస్తాయని సమాధానమిచ్చాడు. పైగా ధర కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాట్లూ త్వరగానే అమ్మకం జరుగుతాయని సెలవిచ్చాడు. .. ఇది ఆ ఒక్క డెవలపర్ అభిప్రాయమే కాదు. చాలా మంది బిల్డర్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రాంతాలలో కాకుండా దగ్గరగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలో వెంచర్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హెచ్ఎండీఏలో కంటే డీటీసీపీ ప్రాంతాల్లోని భూముల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఆంక్షల్లేవ్.. ఆకాశంలో ధరలు హెచ్ఎండీఏ పరిధిలో చాలా వరకు ప్రాంతాలు ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్లలో ఉంటాయి. ఇక్కడ ప్లాంటింగ్ లేదా నివాస భవనాలకు అనుమతి లేదు కేవలం పరిశ్రమలు, ఇతరత్రా నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. లే– అవుట్, నిర్మాణాలకు పనికొచ్చే రెసిడెన్షియల్ (ఆర్)–1 జోన్ స్థలాలు చాలా తక్కువగా ఉంటాయి. డీటీసీపీలో జోన్ల సమస్య ఉండదు కాబట్టి ఇక్కడ భూముల ధరలు హెచ్ఎండీఏతో పోలిస్తే 20–30 శాతం ఎక్కువ పలుకుతున్నాయని స్పేస్ విజన్ సీఎండీ నర్సింహారెడ్డి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ఫీజు చదరపు మీటరుకు రూ.40 చెల్లించాలి. బెటర్మెంట్ చార్జీలు, పార్క్‌లు, ఇతరత్రా లోడ్ల పేరిట ఫీజుల మోత మోగుతుంది. పైగా అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడాలి. డీటీసీపీలో గ్రామ పంచాయితీ తీర్మానాన్ని బట్టి ఫీజుల్లో తేడా ఉంటుంది. బెటర్మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్, లే అవుట్ ఫీజు (చ.మీ.) గజానికి రూ.5–12 వరకు ఉంటుంది. డీటీసీపీలో రోడ్ల విస్తీర్ణం ఎక్కువే.. లే–అవుట్ విస్తీర్ణంలో 10 శాతం ఓపెన్ ప్లేస్, 30 శాతం రోడ్లకు పోగా మిగిలిన స్థలంలో ప్లాటింగ్ చేసుకోవచ్చు. రహదారుల హద్దులను బట్టి ఎకరం స్థలంలో 55–59 శాతం ప్లాటింగ్ ఏరియా ఉంటుంది. అంటే ఎకరానికి సుమారుగా 2,600 గజాల నుంచి 2,900 గజాల ప్లాటింగ్ చేసుకోవచ్చు. హెచ్ఎండీఏలో పోలిస్తే డీటీసీపీలో రహదారుల విస్తీర్ణం కాస్త ఎక్కువగా ఉంటుంది. హెచ్ఎండీఏలో 30 అడుగుల రోడ్లు ఉన్నా అనుమతులు వస్తాయి. అదే డీటీసీపీలో అయితే అంతర్గత రోడ్లు 33 ఫీట్లు ఉండాల్సిందే. ఒకవేళ హెచ్ఎండీఏ పరిధిలో అప్రోచ్ రోడ్ 40 ఫీట్లు ఉంటే ఇంటర్నల్ రోడ్ కూడా 40 ఫీట్లు ఉండాల్సిందే. హెచ్ఎండీఏ, డీటీసీపీ ఏ ప్రాంతంలోనైనా సరే లే–అవుట్‌లోని మొత్తం ప్లాటింగ్ 15 శాతం మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. అమ్మకాలు సులువు.. అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలతో పోలిస్తే ఓపెన్ ప్లాట్ల విషయంలో కొనుగోలుదారుల ఎంపిక భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ధరే కొనుగోలు నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అందుకే చాలా మంది డెవలపర్లు హెచ్ఎండీఏ పరిధిలో అధిక ధర పెట్టి స్థలాన్ని కొని వెంచర్ చేస్తే డెవలపర్‌కు పెద్దగా లాభం ఉండదు. అదే హెచ్ఎండీఏ ప్రాంతం నుంచి 4–5 కి.మీ. దూరంలో ఉన్న డీటీసీపీలో తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి అన్ని రకాల అభివృద్ధి పనులను చేపట్టి ప్లాట్లను చేస్తే సులువుగా అమ్ముడవుతాయి. డెవలపర్‌కూ గిట్టుబాటవుతుంది. ప్రతికూల మార్కెట్ ఉన్న ప్రస్తుత సమయంలో డీటీసీపీలో వెంచర్లు చేయడమే ఉత్తమమని మిర్చి డెవ లపర్స్ ఎండీ మల్లారెడ్డి అన్నారు. (చదవండి: 4 గంటలు.. 3 సర్జరీలు) -
నిర్మాణ రంగంలో జోష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణ రంగం ఊపందుకుంది. వివిధ నగరాలు, మున్సిపాలిటీల పరిధిలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునేవారు పెరుగుతున్నారు. గతేడాది డిసెంబర్ 26 నాటికి 40,536 నిర్మాణాల ప్లాన్లకు అనుమతులు మంజూరైనట్టు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) విభాగం లెక్కలు చెబుతున్నాయి. జిల్లాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో దరఖాస్తు చేసుకునే భవన నిర్మాణ ప్లాన్లను వేగంగా ఆమోదిస్తుండటంతో నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. కోవిడ్ లాక్డౌన్, వరదలు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నిర్మాణాలు వేగంగా సాగాయి. ఇదే ఒరవడి కొత్త సంవత్సరంలోనూ కొనసాగి, ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకు ముందు 2019, 2020 సంవత్సరాల్లో 30 వేల భవనాల ప్లాన్లు మాత్రమే ఆమోదం పొందాయి. 2021లో భారీగా వృద్ధి నమోదైంది. ఈ ఏడాది కొత్త మాస్టర్ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయని, దాంతో లే అవుట్లు, నిర్మాణాలు పెరుగుతాయని డీటీసీపీ అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి రెండు స్థానాల్లో విశాఖ, విజయవాడ రాష్ట్రంలో మొత్తం 123 అర్బన్ లోకల్ బాడీలు (యూఎల్బీలు), 18 అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలు (యూడీఏలు) ఉన్నాయి. నిర్మాణాలన్నింటికీ వీటి అనుమతి తప్పనిసరి. గ్రేటర్ విశాఖపట్నంలో అత్యధికంగా గతేడాది 6,328 ప్లాన్లకు అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో 200 చదరపు మీటర్ల లోపు నిర్మాణాలు 5,154 ఉండగా, 200 నుంచి 300 చ.మీ. మధ్య ఉన్నవి మరో 607 ఉన్నాయి. 300 నుంచి 500 చ.మీ పరిధిలో ఉన్నవి 357, 500 నుంచి 2 వేలు చ.మీ. పరిధిలో ఉన్నవి 171, రెండు వేల నుంచి 4 వేల చ.మీ. పరిధిలోనివి 15, నాలుగు వేల చ.మీ. దాటినవి మరో 24 అనుమతులు ఉన్నాయి. రెండో స్థానంలో నిలిచిన విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 2,457 భవనాల ప్లాన్లను ఆమోదించారు. వీటిలో 200 చ.మీ. పరిధిలోని 2,136 ఉండగా 200 నుంచి 300 చ.మీ.లోపు ఉన్నవి 155 ఉన్నాయి. 300 నుంచి 500 చ.మీ లోపు 110 ప్లాన్లు ఉన్నాయి. 500 నుంచి 2 వేలు చ.మీ. పరిధిలో ఉన్నవి 44 ఉండగా, 2 వేల నుంచి 4 వేల చ.మీ పరిధిలోనివి ఏడు, 4 వేల చ.మీ. దాటినవి 5 ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2,199 అనుమతులు, నెల్లూరులో 1,980, కడపలో 1,625, గుంటూరు పరిధిలో 1,596 అనుమతులు లభించాయి. మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ నిర్మాణ రంగం ఆశాజనకంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో మరింత వేగం కొత్త సంవత్సరంలో నిర్మాణ రంగం మరింత వేగం పుంజుకుంటుందని డీటీసీపీ అంచనా వేస్తోంది. ప్రభుత్వం నిర్మాణ రంగంలో అనుసరిస్తున్న సరళీకృత విధానాలు, ఇసుక పాలసీ, లే అవుట్ అప్రూవల్స్ కోసం అందుబాటులోకి తెచ్చిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టంతో అన్ని పనులు ఆన్లైన్లోనే జరగడం వంటివి నిర్మాణదారులకు బాగా కలిసివస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో నిర్మాణాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. -
ప్రణాళికల రూపకల్పనపై దృష్టి సారించండి
సాక్షి, హైదరాబాద్: ప్రణాళిక సంచాలకులు (డీటీసీపీ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లు.. ఇకపై భవన నిర్మాణ అనుమతులు, వాటి అమలు వంటి నియంత్రణ అంశాలపై కాకుండా ప్రణాళికల రూపకల్పన, వాటి అమలుపై దృష్టి పెట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. అన్ని నగరాభివృద్ధి సంస్థలు, మునిసిపాలిటీలు, మండల కేం ద్రాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్లను రూపొందించాలని సూచించారు. నియంత్రణ చర్యలు, అనుమతుల బాధ్యతను జిల్లా కలెక్టర్లు చూసుకుంటారని స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాలను మెమో రూపంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ గురువారం జారీ చేశారు. డిజిటల్ నంబరింగ్‌కు ప్రణాళిక సిద్ధం చేయాలి పట్టణాలు, నగరాల్లోని ఇళ్లకు డిజిటల్ నంబరింగ్ విధానాన్ని అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయా లని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జీఐఎస్ బేస్ మ్యాప్‌ను రూపొందించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. అన్ని మండల కేంద్రాలు, గ్రామీణ స్థానిక సంస్థలకు భూ వినియోగ ప్రణాళికలు రూ పొందించాలని సూచించారు. హెచ్ఎండీఏ అవతల ఉండే పట్టణాలు, నగర పాలక సంస్థల పరిధిలో ల్యాండ్ పూలింగ్ పథకాన్ని రూపొందించడంలో సాంకేతిక సాధికార సంస్థగా ఉండాలని తెలిపారు. టీఎస్ బి పాస్‌కు సంబంధించి జిల్లా కలెక్టర్లకు అవసరమైన సలహాలు ఇవ్వాలని, సాంకేతిక అంశాల పై మార్గనిర్దేశనం చేయాలని మంత్రి ఆదేశించారు. -
ఇది లక్ష కోట్ల కబ్జా!
-
ఇది లక్ష కోట్ల కబ్జా!
* రాజధాని పేరుతో రైతుల నిలువు దోపిడీకి సర్కారు స్కెచ్ * పైసా పెట్టుబడి లేకుండా 10 వేల ఎకరాల భూముల కైవసం * రైతుల నుంచి తీసుకున్న భూముల అభివృద్ధి పేరుతో 50 శాతం లాగేసుకుంటున్న ప్రభుత్వం * ఎక్కడైనా అభివృద్ధికి తీసుకునేది 40 శాతమే.. అదనంగా 10% భూములు తీసుకుంటున్న సర్కారు * ఇలా 50 వేల ఎకరాల భూమిలో పది శాతమంటే ఐదు వేల ఎకరాల భూమి చంద్రబాబు సర్కారు గుప్పిట్లోకి * ఇక అభివృద్ధి చేసిన తర్వాత మిగిలిన భూమిలో యజమానికి 70 శాతం, డెవలపర్‌కు 30 శాతం వాటా దక్కాలి * రాజధాని ప్రాంతంలో యజమానికి 50 శాతం, డెవలపర్‌కు 50 శాతం అంటూ కైవసం చేసుకుంటున్న సర్కారు * ఇలా రైతుల వాటాలోంచి మరో ఐదు వేల ఎకరాల భూమిని తానే సొంతం చేసుకునేలా చట్టంలో నిబంధనలు * అభివృద్ధి చేసిన భూమిలో 10,000 ఎకరాలు సర్కారుకు * మొత్తం 4.84 కోట్ల గజాల భూమి.. గజం రూ. 25 వేల ధర చొప్పున లెక్కించినా లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల పైనే * ఈ భూముల్లో అభివృద్ధి పనుల కాంట్రాక్టులన్నీ అయిన వారికీ, బినామీలకు కట్టబెట్టేందుకు చట్టంలోనే ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించే పేరుతో లక్ష కోట్ల రూపాయలకు పైగా భూ దోపిడీకి రంగం సిద్ధమైంది. ఈ దోపిడీకి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లన్నిటినీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లులో చంద్రబాబు సర్కారు పొందుపరిచింది. రైతుల నుంచి ‘సమీకరించిన’ భూమిలో సగం భూమిని అభివృద్ధి పేరుతో లాగేసుకోవటమే కాక.. మిగిలిన సగం భూమి లో భూముల యజమానులైన రైతుల వాటా కింద సగం మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. అంటే.. రాజధాని కోసం తీసుకుంటున్న 50 వేల ఎకరాల భూముల్లో వాటి యజమానులైన రైతుల వాటా కింద వారికి దక్కేది పావు వంతు.. అంటే కేవలం 12,500 ఎకరాలు మాత్రమే. మరి.. ప్రభుత్వం చేజిక్కించుకునే భూమి.. 22,500 ఎకరాలుగా లెక్క తేలుతోంది. భూమిని తీసుకుని అభివృద్ధి చేసే ఎంత పెద్ద డెవలపర్లయినా న్యాయంగా తీసుకునే వాటాకన్నా.. 10 వేల ఎకరాలు ఎక్కువ. అంటే.. పూర్తిగా అభివృద్ధి చేసిన పది వేల ఎకరాల భూమి.. మొత్తం 4.84 కోట్ల గజాల భూమి.. ప్రభుత్వం పైసా పెట్టుబడి లేకుండా కబ్జా చేయబోతోంది. ఈ భూమికి కనిష్టంగా గజం రూ. 25,000 చొప్పున ధర చొప్పున లెక్కించినా కూడా లక్ష కోట్ల రూపాయలు దాటిపోతుంది. అంతేకాదు.. రాజధాని ప్రాంతంలో ఏ పని చేపట్టాలన్నా, ఏ కంపెనీ పెట్టాలన్నీ అనుమతి తీసుకోవాల్సింది సీఆర్డీఏ నుంచే. సీఆర్డీఏ తలచుకుంటే ఏ కంపెనీనైనా రంగంలోకి దించగలదు. ఈ విధంగా అప్పనంగా పది వేల ఎకరాల భూములు చేజిక్కుంచుకోవటమే కాకుండా.. వాటిపై సర్వాధికారాలూ తన సారథ్యంలోని సీఆర్డీఏకే కట్టబెట్టటం ద్వారా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుయాయులు, తన బినామీలు, తనకు కావలసిన అందరినీ రంగంలోకి దించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సర్కారు రైతుల నుంచి అన్యాయంగా లాగేసుకుంటున్న భూముల అభివృద్ధి విషయంలో బిల్లులో ఎలాంటి నియమ నిబంధనలు పెట్టకపోవడమే అందుకు నిదర్శనం. మామూలు డెవలపర్ నుంచి పేరుమోసిన డెవలపర్లు సైతం ఎక్కడా ఇలాంటి మోసాలకు పాల్పడిన దాఖలాలు లేవు. అభివృద్ధి పేరుతో ఐదు వేల ఎకరాలు కబ్జా... ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన సీఆర్డీఏ బిల్లును ఆసాంతం పరిశీలిస్తే రైతులు దారుణంగా దోపిడీకి గురవుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. రాజధాని పేరుతో మరోవైపు పైసా పెట్టుబడి లేకుండా వేలాది ఎకరాల రైతుల భూములను సర్కారు కబ్జా చేయనుంది. మామూలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసుకునే ఒప్పందాలైనా, డెరైక్టరేట్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ (డీటీసీపీ) నిబంధనల మేరకైనా.. అభివృద్ధి కోసం ఇచ్చిన భూమిలో 40 శాతం డెవలప్మెంట్ (రోడ్లు, డ్రైనేజీ, పార్కులు వగైరా) కోసం ప్రభుత్వానికి వదిలేస్తారు. అయితే రాజధాని కోసం దాదాపు 50 వేల ఎకరాలను సమీకరించడానికి సన్నద్ధమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అభివృద్ధి పేరుతో ఏకంగా 50 శాతం భూములను లాగేసుకుంటుంది. ఈ 50 వేల ఎకరాల్లో అదనంగా పది శాతమంటే 5 వేల ఎకరాలు. ఎకరాకు 4,840 గజాల చొప్పున 2,42,00,000 గజాల భూమిని అన్యాయంగా లాగేసుకుంటోంది. వాటాలో కోతతో మరో ఐదు వేల ఎకరాలు కైవసం... అలాగే డెవలప్ చేసిన తర్వాత మిగిలిన భూముల్లో సర్వసాధారణంగా దేశమంతా నడుస్తున్న పద్ధతిలో అయితే భూ యజమానికి 70 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 30 శాతం మాత్రమే డెవలపర్ ఆ భూములను డెవలప్ చేసినందుకు గాను తీసుకుంటారు. కానీ రాజధాని పేరుతో ప్రభుత్వం అడ్డగోలు వ్యవహారానికి తెరలేపింది. రైతులకు 70 శాతం కాకుండా 50 శాతం మాత్రమే ఇస్తామని సీఆర్డీఏ బిల్లులో పెట్టింది. డెవపల్‌మెంట్ పేరుతో 10 శాతం భూములను ముందుగానే లాగేసుకుంటున్న ప్రభుత్వం మిగిలిన భూముల్లోనూ దోపిడీకి దిగింది. 50 వేల ఎకరాల్లో అభివృద్ధికి 50 శాతం పేరుతో తీసివేయగా మిగిలిన 25 వేల ఎకరాల్లో న్యాయంగా (70 శాతం) అయితే రైతులకు 17,500 ఎకరాలు ఇవ్వాలి. మిగిలిన (30 శాతం) 7,500 ఎకరాలు మాత్రమే అభివృద్ధి చేసినందుకుగాను డెవలపర్‌గా ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇక్కడా 50:50 నిష్పత్తిలో రైతాంగానికి అన్యాయమే చేస్తున్నారు. రైతులకు 12,500 ఎకరాలు ప్రభుత్వానికి 12,500 ఎకరాల చొప్పున కేటాయిస్తామని సీఆర్డీఏ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. పైసా ఖర్చు లేకుండా పది వేల ఎకరాలు సొంతం... భూముల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసమంటూ అదనంగా ఐదు వేల ఎకరాలు లాగేసుకుంటున్న ప్రభుత్వం.. ఆ తర్వాత ఆ సౌకర్యాలు కల్పించిన భాగస్వామిగా మరో ఐదు వేల ఎకరాలు అప్పనంగా రైతుల నుంచి కైవసం చేసుకుంటోంది. ఈ లెక్కన మొత్తంగా పది వేల ఎకరాల భూమి.. అంటే 4.84 కోట్ల గజాల భూమిని.. పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వం కాజేస్తోంది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చెబుతున్న ధర మేరకు గజానికి 25 వేల లెక్క చూసుకున్నా లక్షా ఇరవై వేల కోట్ల విలువైన భూములు అన్యాయంగా అదనంగా ప్రభుత్వం కాజేస్తోంది. ఇలా భారీ కుంభకోణానికి పూర్వరంగం సిద్ధం చేసుకుంది. కార్పొరేట్లకు కట్టబెట్టే అవకాశం... భూ సమీకరణలో భూముల అభివృద్ధి పనులు చేపట్టడానికి లెసైన్స్ పొందిన ఏదైనా జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీకి కట్టబెట్టడానికి సీఆర్డీఏ బిల్లులో వె సులుబాటు కల్పించారు. ఇప్పటికే సింగపూర్ లాంటి దేశాలకు చెందిన సంస్థలతో మాస్టర్ ప్రణాళిక సిద్ధం చేయిస్తున్న ప్రభుత్వం రేపటి రోజున అభివృద్ధి పేరుతో ‘జాతీయ, అంతర్జాతీయ’ కార్పొరేట్ సంస్థలకు ద్వారాలు తెరవడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది. రాజధాని ప్రాంతంలో భూములు అభివృద్ధి చేయడానికి ఆయా సంస్థలు సీఆర్డీఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇక్కడే ప్రభుత్వం తన యుక్తిని ప్రదర్శించి తనకు కావాల్సిన వారికి డెవలప్మెంటు బాధ్యతలు అప్పగించే విధంగా సీఆర్డీఏ బిల్లు తొమ్మిదో చాప్టర్లోని 54వ సెక్షన్లో పొందుపరిచింది. డెవలప్మెంటు సంస్థ దరఖాస్తు చేసుకునే ముందే సీఆర్డీఏ కమిషనర్ నుంచి లెసైన్సు పొందాలనే నిబంధన ‘సొంత ప్రయోజనాల’ పరిరక్షణకేనని కచ్చితంగా తెలుస్తోంది. ప్రజలపై చట్టాల ప్రయోగం... రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో ఎలాంటి స్థిర, చరాస్తులైనా సేకరించే అధికారాన్ని సీఆర్డీఏకు కట్టబెట్టారు. ఈ విషయంలో రైతులకు ప్రశ్నించే అధికారాలు లేవు. రేపటి రోజున రైతులు, ఆ ప్రాంత పరిధిలో నివశించే అందరూ ప్రతి విషయంలోనూ ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు. అలాగే ప్రభుత్వం అభివృద్ధి పరిచిన ప్రాంతంలో రైతులు, అక్కడ నివాసం ఉండే వారిపై భారీ స్థాయిలో లెసైన్స్ ఫీజులు, యూజర్ చార్జీల భారం వేయనున్నారు. ఆంక్షలు, పరిమితులు, అనుమతుల పేరుతో ఒకరకంగా ఆ ప్రాంత ప్రజలంతా ప్రభుత్వ అనుమతి లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయని ఒకరకమైన ఎమర్జెన్సీ పరిస్థితులకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. సీఆర్డీఏ కమిషనర్‌కు బిల్లులో విశేష అధికారాలను కల్పించారు. కమిషనర్ తీసుకునే నిర్ణయాలు, జారీ చేసే ఉత్తర్వులపై ఎవరూ కూడా ఏ న్యాయస్థానంలోను అప్పీల్ చేయరాదని బిల్లులో పేర్కొన్నారు. సీఆర్డీఏ కమిషనర్ అనుమతి లేనిదే రాజధాని ప్రాంతంలో ఏదీ చేయరాదు. సొంత ఇళ్లు, భవనాల్లో గానీ ఎటువంటి మార్పులు చేయరాదు. సొంత భూమిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదు. కమిషనర్ అనుమతికి విరుద్ధంగా ఎవరైనా అభివృద్ధి పనులను చేపడితే మూడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు ఆ భూమి విలువలో 20 శాతం జురిమానా విధిస్తారు. చట్టం ప్రకారం నిర్ధారించిన వ్యక్తిని భూమి, భవనాల్లోకి అనుమతించకుండా అడ్డంకులు సృష్టిస్తే అలాంటి వారికి ఆరు నెలల పాటు జైలు శిక్షతో పాటు పది వేల రూపాయలు జరిమానా విధిస్తారు.