* రాజధాని పేరుతో రైతుల నిలువు దోపిడీకి సర్కారు స్కెచ్
* పైసా పెట్టుబడి లేకుండా 10 వేల ఎకరాల భూముల కైవసం
* రైతుల నుంచి తీసుకున్న భూముల అభివృద్ధి పేరుతో 50 శాతం లాగేసుకుంటున్న ప్రభుత్వం
* ఎక్కడైనా అభివృద్ధికి తీసుకునేది 40 శాతమే.. అదనంగా 10% భూములు తీసుకుంటున్న సర్కారు
* ఇలా 50 వేల ఎకరాల భూమిలో పది శాతమంటే ఐదు వేల ఎకరాల భూమి చంద్రబాబు సర్కారు గుప్పిట్లోకి
* ఇక అభివృద్ధి చేసిన తర్వాత మిగిలిన భూమిలో యజమానికి 70 శాతం, డెవలపర్‌కు 30 శాతం వాటా దక్కాలి
* రాజధాని ప్రాంతంలో యజమానికి 50 శాతం, డెవలపర్‌కు 50 శాతం అంటూ కైవసం చేసుకుంటున్న సర్కారు
* ఇలా రైతుల వాటాలోంచి మరో ఐదు వేల ఎకరాల భూమిని తానే సొంతం చేసుకునేలా చట్టంలో నిబంధనలు
* అభివృద్ధి చేసిన భూమిలో 10,000 ఎకరాలు సర్కారుకు
* మొత్తం 4.84 కోట్ల గజాల భూమి.. గజం రూ. 25 వేల ధర చొప్పున లెక్కించినా లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల పైనే
* ఈ భూముల్లో అభివృద్ధి పనుల కాంట్రాక్టులన్నీ అయిన వారికీ, బినామీలకు కట్టబెట్టేందుకు చట్టంలోనే ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించే పేరుతో లక్ష కోట్ల రూపాయలకు పైగా భూ దోపిడీకి రంగం సిద్ధమైంది. ఈ దోపిడీకి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లన్నిటినీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లులో చంద్రబాబు సర్కారు పొందుపరిచింది. రైతుల నుంచి ‘సమీకరించిన’ భూమిలో సగం భూమిని అభివృద్ధి పేరుతో లాగేసుకోవటమే కాక.. మిగిలిన సగం భూమి లో భూముల యజమానులైన రైతుల వాటా కింద సగం మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. అంటే.. రాజధాని కోసం తీసుకుంటున్న 50 వేల ఎకరాల భూముల్లో వాటి యజమానులైన రైతుల వాటా కింద వారికి దక్కేది పావు వంతు.. అంటే కేవలం 12,500 ఎకరాలు మాత్రమే. మరి.. ప్రభుత్వం చేజిక్కించుకునే భూమి.. 22,500 ఎకరాలుగా లెక్క తేలుతోంది.
భూమిని తీసుకుని అభివృద్ధి చేసే ఎంత పెద్ద డెవలపర్లయినా న్యాయంగా తీసుకునే వాటాకన్నా.. 10 వేల ఎకరాలు ఎక్కువ. అంటే.. పూర్తిగా అభివృద్ధి చేసిన పది వేల ఎకరాల భూమి.. మొత్తం 4.84 కోట్ల గజాల భూమి.. ప్రభుత్వం పైసా పెట్టుబడి లేకుండా కబ్జా చేయబోతోంది. ఈ భూమికి కనిష్టంగా గజం రూ. 25,000 చొప్పున ధర చొప్పున లెక్కించినా కూడా లక్ష కోట్ల రూపాయలు దాటిపోతుంది. అంతేకాదు.. రాజధాని ప్రాంతంలో ఏ పని చేపట్టాలన్నా, ఏ కంపెనీ పెట్టాలన్నీ అనుమతి తీసుకోవాల్సింది సీఆర్‌డీఏ నుంచే. సీఆర్‌డీఏ తలచుకుంటే ఏ కంపెనీనైనా రంగంలోకి దించగలదు.
ఈ విధంగా అప్పనంగా పది వేల ఎకరాల భూములు చేజిక్కుంచుకోవటమే కాకుండా.. వాటిపై సర్వాధికారాలూ తన సారథ్యంలోని సీఆర్‌డీఏకే కట్టబెట్టటం ద్వారా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుయాయులు, తన బినామీలు, తనకు కావలసిన అందరినీ రంగంలోకి దించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సర్కారు రైతుల నుంచి అన్యాయంగా లాగేసుకుంటున్న భూముల అభివృద్ధి విషయంలో బిల్లులో ఎలాంటి నియమ నిబంధనలు పెట్టకపోవడమే అందుకు నిదర్శనం. మామూలు డెవలపర్ నుంచి పేరుమోసిన డెవలపర్లు సైతం ఎక్కడా ఇలాంటి మోసాలకు పాల్పడిన దాఖలాలు లేవు.
అభివృద్ధి పేరుతో ఐదు వేల ఎకరాలు కబ్జా...
ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన సీఆర్‌డీఏ బిల్లును ఆసాంతం పరిశీలిస్తే రైతులు దారుణంగా దోపిడీకి గురవుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. రాజధాని పేరుతో మరోవైపు పైసా పెట్టుబడి లేకుండా వేలాది ఎకరాల రైతుల భూములను సర్కారు కబ్జా చేయనుంది. మామూలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసుకునే ఒప్పందాలైనా, డెరైక్టరేట్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ (డీటీసీపీ) నిబంధనల మేరకైనా.. అభివృద్ధి కోసం ఇచ్చిన భూమిలో 40 శాతం డెవలప్‌మెంట్ (రోడ్లు, డ్రైనేజీ, పార్కులు వగైరా) కోసం ప్రభుత్వానికి వదిలేస్తారు. అయితే రాజధాని కోసం దాదాపు 50 వేల ఎకరాలను సమీకరించడానికి సన్నద్ధమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అభివృద్ధి పేరుతో ఏకంగా 50 శాతం భూములను లాగేసుకుంటుంది. ఈ 50 వేల ఎకరాల్లో అదనంగా పది శాతమంటే 5 వేల ఎకరాలు. ఎకరాకు 4,840 గజాల చొప్పున 2,42,00,000 గజాల భూమిని అన్యాయంగా లాగేసుకుంటోంది.
వాటాలో కోతతో మరో ఐదు వేల ఎకరాలు కైవసం...
అలాగే డెవలప్ చేసిన తర్వాత మిగిలిన భూముల్లో సర్వసాధారణంగా దేశమంతా నడుస్తున్న పద్ధతిలో అయితే భూ యజమానికి 70 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 30 శాతం మాత్రమే డెవలపర్ ఆ భూములను డెవలప్ చేసినందుకు గాను తీసుకుంటారు. కానీ రాజధాని పేరుతో ప్రభుత్వం అడ్డగోలు వ్యవహారానికి తెరలేపింది. రైతులకు 70 శాతం కాకుండా 50 శాతం మాత్రమే ఇస్తామని సీఆర్‌డీఏ బిల్లులో పెట్టింది. డెవపల్‌మెంట్ పేరుతో 10 శాతం భూములను ముందుగానే లాగేసుకుంటున్న ప్రభుత్వం మిగిలిన భూముల్లోనూ దోపిడీకి దిగింది.
50 వేల ఎకరాల్లో అభివృద్ధికి 50 శాతం పేరుతో తీసివేయగా మిగిలిన 25 వేల ఎకరాల్లో న్యాయంగా (70 శాతం) అయితే రైతులకు 17,500 ఎకరాలు ఇవ్వాలి. మిగిలిన (30 శాతం) 7,500 ఎకరాలు మాత్రమే అభివృద్ధి చేసినందుకుగాను డెవలపర్‌గా ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇక్కడా 50:50 నిష్పత్తిలో రైతాంగానికి అన్యాయమే చేస్తున్నారు. రైతులకు 12,500 ఎకరాలు ప్రభుత్వానికి 12,500 ఎకరాల చొప్పున కేటాయిస్తామని సీఆర్‌డీఏ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు.
పైసా ఖర్చు లేకుండా పది వేల ఎకరాలు సొంతం...
భూముల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసమంటూ అదనంగా ఐదు వేల ఎకరాలు లాగేసుకుంటున్న ప్రభుత్వం.. ఆ తర్వాత ఆ సౌకర్యాలు కల్పించిన భాగస్వామిగా మరో ఐదు వేల ఎకరాలు అప్పనంగా రైతుల నుంచి కైవసం చేసుకుంటోంది. ఈ లెక్కన మొత్తంగా పది వేల ఎకరాల భూమి.. అంటే 4.84 కోట్ల గజాల భూమిని.. పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వం కాజేస్తోంది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చెబుతున్న ధర మేరకు గజానికి 25 వేల లెక్క చూసుకున్నా లక్షా ఇరవై వేల కోట్ల విలువైన భూములు అన్యాయంగా అదనంగా ప్రభుత్వం కాజేస్తోంది. ఇలా భారీ కుంభకోణానికి పూర్వరంగం సిద్ధం చేసుకుంది.
కార్పొరేట్లకు కట్టబెట్టే అవకాశం...
భూ సమీకరణలో భూముల అభివృద్ధి పనులు చేపట్టడానికి లెసైన్స్ పొందిన ఏదైనా జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీకి కట్టబెట్టడానికి సీఆర్‌డీఏ బిల్లులో వె సులుబాటు కల్పించారు. ఇప్పటికే సింగపూర్ లాంటి దేశాలకు చెందిన సంస్థలతో మాస్టర్ ప్రణాళిక సిద్ధం చేయిస్తున్న ప్రభుత్వం రేపటి రోజున అభివృద్ధి పేరుతో ‘జాతీయ, అంతర్జాతీయ’ కార్పొరేట్ సంస్థలకు ద్వారాలు తెరవడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది.
రాజధాని ప్రాంతంలో భూములు అభివృద్ధి చేయడానికి ఆయా సంస్థలు సీఆర్‌డీఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇక్కడే ప్రభుత్వం తన యుక్తిని ప్రదర్శించి తనకు కావాల్సిన వారికి డెవలప్‌మెంటు బాధ్యతలు అప్పగించే విధంగా సీఆర్‌డీఏ బిల్లు తొమ్మిదో చాప్టర్‌లోని 54వ సెక్షన్‌లో పొందుపరిచింది. డెవలప్‌మెంటు సంస్థ దరఖాస్తు చేసుకునే ముందే సీఆర్‌డీఏ కమిషనర్ నుంచి లెసైన్సు పొందాలనే నిబంధన ‘సొంత ప్రయోజనాల’ పరిరక్షణకేనని కచ్చితంగా తెలుస్తోంది.
ప్రజలపై చట్టాల ప్రయోగం...
రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో ఎలాంటి స్థిర, చరాస్తులైనా సేకరించే అధికారాన్ని సీఆర్‌డీఏకు కట్టబెట్టారు. ఈ విషయంలో రైతులకు ప్రశ్నించే అధికారాలు లేవు. రేపటి రోజున రైతులు, ఆ ప్రాంత పరిధిలో నివశించే అందరూ ప్రతి విషయంలోనూ ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు. అలాగే ప్రభుత్వం అభివృద్ధి పరిచిన ప్రాంతంలో రైతులు, అక్కడ నివాసం ఉండే వారిపై భారీ స్థాయిలో లెసైన్స్ ఫీజులు, యూజర్ చార్జీల భారం వేయనున్నారు. ఆంక్షలు, పరిమితులు, అనుమతుల పేరుతో ఒకరకంగా ఆ ప్రాంత ప్రజలంతా ప్రభుత్వ అనుమతి లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయని ఒకరకమైన ఎమర్జెన్సీ పరిస్థితులకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. సీఆర్‌డీఏ కమిషనర్‌కు బిల్లులో విశేష అధికారాలను కల్పించారు.
కమిషనర్ తీసుకునే నిర్ణయాలు, జారీ చేసే ఉత్తర్వులపై ఎవరూ కూడా ఏ న్యాయస్థానంలోను అప్పీల్ చేయరాదని బిల్లులో పేర్కొన్నారు. సీఆర్‌డీఏ కమిషనర్ అనుమతి లేనిదే రాజధాని ప్రాంతంలో ఏదీ చేయరాదు. సొంత ఇళ్లు, భవనాల్లో గానీ ఎటువంటి మార్పులు చేయరాదు. సొంత భూమిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదు. కమిషనర్ అనుమతికి విరుద్ధంగా ఎవరైనా అభివృద్ధి పనులను చేపడితే మూడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు ఆ భూమి విలువలో 20 శాతం జురిమానా విధిస్తారు. చట్టం ప్రకారం నిర్ధారించిన వ్యక్తిని భూమి, భవనాల్లోకి అనుమతించకుండా అడ్డంకులు సృష్టిస్తే అలాంటి వారికి ఆరు నెలల పాటు జైలు శిక్షతో పాటు పది వేల రూపాయలు జరిమానా విధిస్తారు.
ఇది లక్ష కోట్ల కబ్జా!
Published Mon, Dec 22 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM
Advertisement