సాక్షి, హైదరాబాద్: ప్రతి మున్సిపాలిటీకి రింగ్‌రోడ్డు.. రహదారులు, డ్రైనేజీల విస్తరణ.. ప్రత్యేకంగా నివాస, వాణిజ్య, మిశ్రమ జోన్లు.. వచ్చే 20ఏళ్ల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు.. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్లు సిద్ధమవుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వీటిని రూపొందిస్తున్నారు. ప్రణాళిక లేకుండా మున్సిపాలిటీలు విస్తరించడం వల్ల ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలు కీలక చర్యలను చేపట్టనున్నారు. డీటీసీపీ యంత్రాంగం ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇదే పనిలో నిమగ్నమైంది.
మార్చి నాటికల్లా సిద్ధం చేసేలా..
జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్)ను వినియోగించి.. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు, 11 నగరాభివృద్ధి సంస్థలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నారు. 2023 మార్చి నాటికల్లా అమలు చేసేలా బృహత్తర ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లకుగాను 74 మున్సిపాలిటీల్లో ఇప్పటికే రూపొందించిన మాస్టర్‌ప్లాన్లు అమల్లో ఉన్నాయి. వాటిలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. మిగతా 68 చోట్ల కొత్తగా మాస్టర్ ప్లాన్‌లను సిద్ధం చేస్తున్నారు. ప్రజలు తమ భూవినియోగ వివరాలను సులభంగా తెలుసుకుని.. టీఎస్ బీ–పాస్ విధానంతో సింగిల్ విండో పద్ధతిలో భవన నిర్మాణ/లేఔట్ల అనుమతులు పొందడానికి మాస్టర్‌ప్లాన్లు ఎంతో ఉపయోగపడతాయని డీటీసీపీ అధికారులు చెప్తున్నారు. జీఐఎస్ ద్వారా క్షుణ్నంగా సర్వే చేసి వచ్చే 20ఏళ్ల వరకు ఎలాంటి భూ వినియోగమారి్పడి అవసరం లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరిస్తున్నారు.
వివిధ జోన్లుగా విభజించి..
జనాభా అధికంగా ఉండే ప్రాంతాలను మిశ్రమ వినియోగ ప్రాంతాలుగా.. మిగతా ప్రాంతాలను వాణిజ్య, నివాస ప్రాంతాలుగా ఒక క్రమపద్ధతిలో మాస్టర్ ప్లాన్లలో నిర్దేశించనున్నారు. ప్రజలు తాము నివసించే ప్రాంతాల నుంచి కార్యాలయాలకు, పనిచేసే ప్రాంతాలకు సులభంగా రాకపోకలు సాగించేలా, రహదారులపై ట్రాఫిక్ భారాన్ని నిరోధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారి ఒకరు వివరించారు. రహదారులు చిన్నగా ఉండటం.. జన సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి జరిగితే ఈ ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అన్ని మున్సిపాలిటీల్లో అంతర్గత, ప్రధాన రహదారులపై ఒత్తిడి లేకుండా రింగ్‌రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక చెరువులు, వాగులు, కాల్వలతోపాటు రైలు మార్గాలు, పారిశ్రామికవాడలు మొదలైన ప్రాంతాల్లో బఫర్ జోన్లను మాస్టర్‌ప్లాన్లలో నిర్దేశించనున్నారు. పట్టణాల్లో కనీసం పదిశాతానికి తగ్గకుండా గ్రీన్‌జోన్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అంతా పక్కాగా..
మాస్టర్ ప్లాన్ల రూపకల్పనలో భాగంగా తొలుత నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) నుంచి పట్టణాల చిత్రాలు, వివరాలు సేకరిస్తున్నారు. తర్వాత రెవెన్యూ శాఖ నుంచి సర్వే నంబర్ల వారీగా మ్యాపులను తీసుకుంటున్నారు. స్థానిక పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఆ వివరాలన్నింటినీ క్రోడీకరించి.. పట్టణ ప్రణాళికలో నిపుణులైన వారితో కొత్త మాస్టర్‌ప్లాన్లను రూపొందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment