Municipalities
-
ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలు విలీనం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని 51 పంచాయితీలు సమీప మున్సిపాలిటీల్లో వీలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇప్పటికే హైకోర్టు కొట్టేవేయడంతో పంచాయతీల విలీనానికి మార్గం సుగమమైంది. దీంతో గవర్నర్ అమోదంతో గెజిట్ జారీ అయ్యింది.ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న మొత్తం 51 గ్రామ పంచాయతీలను విలీనానికి మంత్రివర్గం సబ్ కమిటీ సిఫారసు చేయగా, సెప్టెంబర్ 3న ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల విలీనంతో ఔటర్ రింగు రోడ్డు పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో కలపగా అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను 7 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను అక్కడి రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం విలీనం చేసింది.కాగా, హైదరాబాద్ చుట్టూ ఉన్న 51 గ్రామ పంచాయతీలను పరిసర మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 3 సబబేనని తేల్చిచెప్పింది. విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని రాంపల్లి దాయార, కీసర, బోగారం, యాద్గారపల్లి గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.ఆయా గ్రామాలను మున్సిపాలిటీల నుంచి తొలగించి పంచాయతీలుగానే కొనసాగించాలని రాంపల్లి దాయారకు చెందిన మాజీ వార్డు మెంబర్ ముక్క మహేందర్, మాజీ సర్పంచ్ గంగి మల్లేశ్, మాజీ ఉప సర్పంచ్ కందాడి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఆయా గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది పూస మల్లేశ్, బి. హనుమంతు, మొల్గర నర్సింహ వాదనలు వినిపించారు.పైన పేర్కొన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో కలుపుతూ సెప్టెంబర్ 2, 2024న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.3ను వెంటనే రద్దు చేసి.. ఆ గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడమంటే భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనలోని పార్ట్–9ని ఉల్లంఘించటమేనని వాదించారు. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ఈ వాదనలను తప్పుబట్టారు. విలీనానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లలో మెరిట్స్ లేవంటూ కొట్టివేసింది. -
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, అన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలా లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ సిటీల పేరుతో నాలుగు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం ఇటీవలే అధికారులను ఆదేశించారు. పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే.. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించాలని, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఇటీవల సమాలోచనలు చేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత విలీనం చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని యూనిట్‌గా తీసుకొని ఒకే గ్రేటర్ సిటీ కార్పొ రేషన్‌గా చేయటం, లేదా సిటీ మొత్తాన్ని 4 కార్పొరేషన్లుగా విభజించడం అనే అంశాన్ని పరిశీలించాలని మున్సిపల్ శాఖ అధికా రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జనాభా ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన.. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలున్నాయని విమర్శలున్నాయి. కొన్ని డివిజన్ల పరిధిలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో కేవలం 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి, కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిటీలో అభివృద్ధి చెందిన డివిజన్లకు తక్కువ నిధులు సరిపోతాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఏకరీతిగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించారు. ఇంచుమించుగా సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై ముందుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ కార్పొరేషన్ తరహాలో... దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందటే అక్కడున్న మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేసింది. అక్కడ జరిగిన విలీనం తీరు, అందుకు అనుసరించిన విధానాలను సీఎం మున్సిపల్ శాఖను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ పేట్, మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్లు, మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. 30 మున్సిపాలిటీలివే.. ► రంగారెడ్డి జిల్లా: పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్‌నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకరపల్లి, తుక్కుగూడ ►మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా: మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ ►యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి ►సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, చేర్యాల ►మెదక్ జిల్లా: తూప్రాన్, నర్సాపూర్ -
కాంగ్రెస్‌కు మరో 3 మున్సిపాలిటీలు
జగిత్యాల/నారాయణఖేడ్/సాక్షి, యాదాద్రి: జగిత్యాల, నారాయణఖేడ్, భువనగిరి మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కోసం బుధవారం సమావేశం ఏర్పాటు చేయగా.. 47 మంది కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో మెంబర్‌గా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ హాజరయ్యారు. చైర్పర్సన్ స్థానానికి బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్ సమిండ్ల వాణిని పార్టీ ప్రతిపాదించింది. రెబల్ అభ్యర్థిగా కౌన్సిలర్ అడువాల జ్యోతి పోటీ పడ్డారు. జ్యోతికి కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరుగురు, బీజేపీ కౌన్సిలర్లు ముగ్గురు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు 8 మంది, స్వతంత్రులు ఐదుగురు, ఎంఐఎం, ఏఎఫ్‌బీఐ పార్టీలకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు అనుకూలంగా ఓటు వేశారు. బీఆర్ఎస్ ప్రతిపాదించిన సమిండ్ల వాణికి 22 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో సభ్యుడు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఓటు వేశారు. ఒకే ఒక్క ఓటు తేడాతో జ్యోతి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కాగా, చైర్‌పర్సన్‌గా ఎన్నికైన జ్యోతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లడం మున్సిపల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ వశమైంది. బుధవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మా నం నెగ్గడంతో కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్ స్వరూప్ షెట్కార్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా దారం శంకర్ ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ వసంతకుమారి ప్రకటించారు. మొత్తం 15 మంది కౌన్సిలర్లకుగాను బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరగా.. కాంగ్రెస్ మద్దతుదారులైన కౌన్సిలర్ల సంఖ్య 11కు చేరింది. ఎనిమిదిమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన ముగ్గురు కౌన్సిలర్లు, ఎక్స్‌అఫిíÙయో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిపి మొత్తం 12 మంది హాజరయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్‌కు సంబంధించి ఒక్కో దరఖాస్తు రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అలాగే భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్ పదవి కూడా బీజేపీ ఖాతాలో చేరింది. కాంగ్రెస్‌కు చెందిన పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్‌గా, బీ జేపీకి చెందిన మాయ దశరథ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు పదవిలో ఉన్న బీఆర్ఎస్కి చెందిన చైర్మన్, వైస్‌చైర్మన్‌పై జనవరి 23న అవిశ్వాసం పెట్టగా నెగ్గింది. దీంతో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం బుధవారం మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికకు 29 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడి హో దాలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. చైర్మన్ పదవికి కాంగ్రెస్ నుంచి పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బీజేపీ నుంచి బొర్ర రాకేష్ పోటీలో నిలిచారు. రాకే ష్కు మద్దతుగా బీజేపీకి చెందిన ఐదుగురు సభ్యులు మా త్రమే చేతులెత్తారు. పోతంశెట్టి వెంకటేశ్వర్లుకు మద్దతుగా 11 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు బీఆర్ఎస్, ఒక ఇండిపెండెంట్, ఒక బీజేపీ కౌన్సిలర్ చేతులెత్తారు. దీంతో చైర్మన్‌గా వెంకటేశ్వర్లు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. -
అవిశ్వాసాలు @ 30 మున్సిపాలిటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణ పాలక మండళ్లలో మొదలైన అవిశ్వాసాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు 34 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్ / చైర్పర్సన్ / వైస్ చైర్మన్ లేదా మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదిస్తూ నోటీసులు జారీ చేయగా, 30 చోట్ల ప్రత్యే క సమావేశాలు నిర్వహించారు. అవిశ్వాస పరీక్షల్లో ఓడిపోయిన వారిలో 15 మందిని పదవుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. మిగతా 15 చోట్ల నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. 9 మున్సిపాలిటీల్లో కొత్త చైర్పర్సన్లు అవిశ్వాస తీర్మానాలు నెగ్గి పదవుల నుంచి దిగిపోయిన చైర్మన్లు, వైస్ చైర్మన్ల స్థానంలో కొత్త వారిని ఎన్నుకొనే ప్రక్రియ కూడా 9 మున్సిపాలిటీల్లో పూర్తయింది. మహబూబ్‌నగర్, నేరేడిచర్ల, కోదాడ, భూపాలపల్లి, నస్పూర్, మంచిర్యాల, నల్గొండ, వేములవాడ, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో కొత్త వారు కొలువు దీరారు. జగిత్యాల, భువనగిరి, ఖానాపూర్, హుజూర్నగర్, సుల్తానాబాద్, నారాయణఖేడ్ మునిసిపాలిటీల్లో ఈనెల 28న ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, కొత్త చైర్మన్/వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నాగారం, మణికొండ, తూంకుంట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు జారీ చేసినప్పటికీ, సమావేశం తేదీలను నిర్ణయించలేదు. కాగా బండ్లగూడ జాగీర్, జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. మరికొన్ని పట్టణాల్లో అవిశ్వాస నోటీసులు రాష్ట్రంలోని 142 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి ఇప్పటి వరకు 34 చోట్ల అవిశ్వాస నోటీసులు జారీ అయినప్పటికీ, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పురపాలక వర్గాలు చెపుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ సాగుతోంది. మొత్తంగా కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాలలోని పట్టణాల పరిధిలో మెజారిటీ మునిసిపాలిటీలను లోక్‌సభ ఎన్నికల లోపు హస్తగతం చేసుకొనే ఆలోచనలో అధికార పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. -
Jan 22: రామ మందిర్డేగా గుర్తించిన కెనడా మునిసిపాలిటీలు
టొరంటో: జై శ్రీరామ్ నినాదాలు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. 22న అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుక ఎప్పుడెప్పుడా అని ప్రపంచంలోని రామ భక్తులంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కెనాడాలోని మూడు మునిసిపాలిటీలు జనవరి 22వ తేదీని రామ మందిర్ డే గా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. బ్రాంప్టన్, ఓక్ విల్లే, బ్రాంట్‌ఫోర్డ్ మునిసిపాలిటీలు 22ను రామ మందిర్ డేగా అధికారికంగా ప్రకటించాయి. మూడు మునిసిపాలిటీల నుంచి 22వ తేదీని అధికారిక రామ మందిర్ డేగా గుర్తించినట్లు ఉత్తర్వులు తీసుకోవడంలో విజయవంతమైనట్లు హిందూ కెనడియన్ ఫౌండేషన్(హెచ్‌సీఎఫ్) అధ్యక్షుడు అరుణేష్ గిరి తెలిపారు. గ్రేటర్ టొరంటో ఏరియా(జీటీఏ)లోనూ రాముని ప్రాణప్రతిష్ట వేడుకకు సంబంధించి హోర్డింగులు పెట్టినట్లు ఇవి పండుగ వాతావరణాన్ని వ్యాప్తి చేస్తున్నాయని గిరి చెప్పారు. కెనడా వ్యాప్తంగా హిందూ సంఘాలతో కలిసి రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఇదీచదవండి.. పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల కూడా గడువక ముందే చాలా పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం ఊపందుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మునిసిపాలిటీలో గురువారం జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు మునిసిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గగా మరో ఏడు మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలపై చర్చకు జిల్లా కలెక్టర్లు కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరుగనుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో అవిశ్వాస నోటీసుకు స్పందించిన కలెక్టర్ ఈ నెల 8న పాలకమండలిని సమావేశపరిచారు. అదేరోజు నల్లగొండలోనూ సమావేశం జరగనుంది. 11న మంచిర్యాల మునిసిపాలిటీ పాలకమండలి సమావేశం కానుండగా ఆ సమావేశంలోనే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్, ఆ తరువాత గంటకే కొత్త చైర్పర్సన్, వీసీ ఎన్నిక ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లితోపాటు నస్పూర్ మునిసిపాలిటీ సమావేశం ఈ నెల 12న జరగనుంది. కాగజ్‌నగర్ మునిసిపాలిటీ చైర్పర్సన్ సద్దాం హుస్సేన్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 20న సభ సమావేశం కానుంది. అలాగే ఈ నెల 19న సిద్దిపేట జిల్లా చేర్యాల మునిసిపాలిటీ సమావేశం జరగనుంది. ఇంకా చాలా మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు ఇచ్చిన నోటీసులపై జిల్లా కలెక్టర్లు స్పందిస్తున్నారు. అవిశ్వాసాల నుంచి తప్పించుకోవడానికి సుమారు 15 మంది మునిసిపల్ చైర్పర్సన్లు కాంగ్రెస్‌లో చేరినా పదవీగండం తప్పేలా లేదు. మరికొన్ని చోట్ల నోటీసులకు సిద్ధం.. నల్లగొండ జిల్లాలో నల్లగొండ మునిసిపాలిటీతోపాటు నేరే డుచెర్ల, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ మునిసిపాలిటీల్లో అవిశ్వాసాల రగడ నడుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద అంబర్‌పేట మునిసిపాలిటీ లతోపాటు మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, గుండ్లపో చంపల్లి, నిజాంపేట మునిసిపాలిటీలు, పీర్జాదిగూడ, జవహ ర్‌నగర్ కార్పొరేషన్లలో నోటీసులు జారీ చేసేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌లో చేరిన ఇందుప్రియపై బీఆర్ఎస్ అవిశ్వాస నోటీసుకు సిద్ధమవుతోంది. కరీంనగర్లో జమ్మికుంట మునిసిపల్ చైర్‌పర్సన్‌పై ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొన్నగంటి మల్లయ్య అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అయితే రామగుండం కార్పొరేషన్లో అవిశ్వాసం ఆలోచన తమ సభ్యులకు లేదని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అసమ్మతి సభ్యుల నుంచే.. సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 128 మునిసిపాలిటీలు, 13 కార్పొరేషన్లకుగాను మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా నాలుగైదు పాలక మండళ్లనే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. పురపాలక చట్టం ప్రకారం పాలకమండలి మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యాక అవిశ్వాస లేదా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉండగా ఈ తీర్మానాల గడువును నాలుగేళ్లకు పెంచుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మునిసిపల్ చట్టంలో మార్పులు చేసింది. అయితే అది గవర్నర్ ఆమోదం పొందలేదు. దీంతో గతేడాది జనవరి 27 తరువాత 36 మునిసిపాలిటీలు, పలు కార్పొరేషన్లలో బీఆర్ఎస్ అసమ్మతి సభ్యులు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. వారికి కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తోడై చైర్పర్సన్లు, మేయర్లను గద్దె దించాలని ప్రయత్నించారు. అయితే గత ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు పాలకమండళ్లను సమావేశపరచకపోవడం, ఈలోగా మునిసిపల్ చైర్పర్సన్లు, మేయర్లు కోర్టుకెక్కి స్టే తెచ్చుకోవడంతో అప్పట్లో అవిశ్వాసాలకు బ్రేక్ పడింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవిశ్వాస తీర్మానాల్లో మళ్లీ కదలిక మొదలైంది. ‘ఆర్మూర్’చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం పదవి కోల్పోయిన వినీత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె భర్త బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారనే..! ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మునిసిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆమె తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మునిసిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌కు చెందిన 24 మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. మరో 12 మంది కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. 2020 జనవరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా 33వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పండిత్ వినీత గెలిచారు. అప్పట్లో చైర్పర్సన్ పదవికి బీసీ మహిళా రిజర్వేషన్ కలిసి రావడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చైర్పర్సన్ భర్త పండిత్ పవన్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపిస్తూ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్ కౌన్సిలర్లు సంప్రదించగా ఆయన సూచన మేరకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నూతన మునిసిపల్ చైర్పర్సన్ ఎంపికపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నారు. -
పురపాలికల్లో మోగుతున్న అవిశ్వాస గంట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పురపాలికల్లో కొత్త ఎత్తులు మొదలయ్యాయి. సుమారు నాలుగేళ్లుగా పదవుల్లో కొనసాగుతున్న పాలక మండళ్ల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లతోపాటు మేయర్లపై ‘అవిశ్వాస పరీక్ష’అనే కత్తి వేలాడుతోంది. గత జనవరితో మూడేళ్ల పదవీ కాలం పూర్తవడంతో మునిసిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లను గద్దె దించాలని కొందరు సభ్యులు చేసిన ప్రయత్నాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెరవేరలేదు. దాదాపు 95 శాతం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో బీఆర్ఎస్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లే ఉండటంతో అవిశ్వాసం ద్వారా ఎవరిని గద్దె దించినా.... రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతో గులాబీ పెద్దలు వీరి ప్రయత్నాలకు చెక్ పెట్టారు. దీంతో రాష్ట్రంలోని 130 మునిసిపాలిటీలకుగాను 34 చోట్ల అవిశ్వాస తీర్మానం నోటీసులు జిల్లాల కలెక్టర్లకు ఇచ్చినప్పటికీ, ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 15 మంది చైర్మన్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కిన నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లకు అవిశ్వాసంపై పెద్దగా టెన్షన్ లేనప్పటికీ, బీఆర్ఎస్లోనే ఉన్న మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లలో పదవీగండం భయం పట్టుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచిన జిల్లాల్లో బీఆర్ఎస్లో ఉన్న మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు అవసరమైతే పార్టీ మారేందుకూ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్ వాళ్లతో కలిసి ప్రస్తుత పాలక మండళ్ల చైర్మన్లను, వైస్ చైర్మన్లను గద్దె దించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. చాలాచోట్ల ప్రయత్నాలు షురూ ప్రస్తుతం రాష్ట్రంలోని నల్లగొండ, నేరేడుచర్ల, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్, కోస్గి, ఆంథోల్ మునిసిపాలిటీల్లో ఇప్పటికే అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఇందులో బెల్లంపల్లి మునిసిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, సభ్యులు అవిశ్వాస నోటీసు ఇవ్వడం గమనార్హం. ఆర్నెల్ల క్రితం అవిశ్వాస నోటీసులు ఇచ్చిన మునిసిపాలిటీల్లో 15 మంది బీఆర్ఎస్ చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, చాలాచోట్ల సభ్యులు వారిని గద్దె దించాలనే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు ఉన్న అన్ని మునిసిపాలిటీల్లో కలెక్లర్లకు అవిశ్వాస నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అసంతృప్త సభ్యులకు కాంగ్రెస్ సభ్యులు కూడా తోడవుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో సగం మునిసిపాలిటీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. ఇల్లందు, వైరా, జనగాం, భూపాలపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, పెద్దపల్లి, సుల్తానాబాద్, కోరుట్ల, హుజూర్నగర్, మిర్యాలగూడ, కోదాడ, యాదగిరిగుట్టలో అవిశ్వాస నోటీసులు ఇచ్చేందుకు అసమ్మతి సభ్యులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర సభ్యులతో కలిసి ఈ మేరకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు మునిసిపాలిటీల్లోనూ అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. కార్పొరేషన్లలో సైతం రాష్ట్రంలోని 13 మునిసిపల్ కార్పొరేషన్లలో హైదరాబాద్ మినహా మిగతా కార్పొరేషన్లలో సైతం అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్, నిజాంపేట, బోడుప్పల్, ఫిర్జాదీగూడ కార్పొరేషన్లతోపాటు నిజామాబాద్, రామగుండం, ఖమ్మం వంటి కార్పొరేషన్లలో కూడా అవిశ్వానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ మేయర్, చైర్మన్లు ఉన్న పట్టణాల్లో కొంత భిన్నమైన వైఖరి ఉండే అవకాశం ఉంది. కలెక్టర్లకు నోటీసులు ఇచ్చిన తరువాత నెల రోజుల్లోపు అవిశ్వాస తీర్మానానికి గడువు ఇచ్చి ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. అయితే అవిశ్వాస తీర్మానాలపై ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలియాల్సి ఉంది. -
ఈ-ఆటోలతో ఆర్థిక భారం తగ్గుతుంది: ఆదిమూలపు
సాక్షి, అమరావతి: ఈ-ఆటోలతో మున్సిపాలిటీలపై ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్న లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెట్టారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘‘ఐదు క్వింటాళ్ల సామర్థ్యం కలిగిన వాహనాలను కొనుగోలు చేశాం. వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను చేపట్టాం. కోటి 20 లక్షల డస్ట్బిన్లను అందించాం. తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేక ఏర్పాటు చేశాం. మురుగు నీటిని శుద్ది చేసే ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నాం. రానున్న రోజుల్లో చెత్త రహిత రాష్ట్రం సాకారం అవుతుంది. మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేశాం.. కానీ ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. రేపు గుడివాడలో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నాం. పేదలకు ఇళ్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యం’’ అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చదవండి: CM Jagan: క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో మరో ముందడుగు -
చిన్న మున్సిపాల్టిలకు ఈ–ఆటోలు.. నేడు ప్రారంభించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధృడ సంకల్పం. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెడుతున్నారు. తద్వారా ఆ మున్సిపాల్టి లకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించనున్నారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఈ–ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టి లకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ– ఆటోల‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్ టిప్పర్లను వినియోగిస్తోంది. అలాగే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది. త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. రూ.157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు నిరి్మస్తున్నారు. 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్ టు కంపోస్ట్, నాలుగు బయో మిథనేషన్ ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయి. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 టీపీఐఎస్‌లు, లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీల్లో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా చిన్న మున్సిపాలిటీల్లో ఈ–ఆటోలు ప్రవేశపెడుతున్నారు. -
మున్సిపాలిటీల్లో మైనారిటీలకు కోటా రాజ్యాంగ ఉల్లంఘనే
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యులుగా మైనారిటీల నియామకానికి వీలు కల్పిస్తూ తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022ను తీసుకురావడం రాజ్యాంగ ఉల్లంఘనేనని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం మైనారిటీ అనే పదాన్ని నిర్వచించడానికి అవసరమైన నిర్దిష్ట ప్రామాణికతను తీసుకురావాలని కోరుతూ మున్సిపల్ బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతలో ఉండి అందుకు తూట్లు పొడిచే పనుల్లో భాగస్వామి కాలేనని ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మైనారిటీల ప్రస్తావనే లేదు... ‘మున్సిపాలిటీల పాలనా వ్యవహారాల్లో దేశవ్యాప్తంగా ఏకరూప విధానం కోసం కేంద్రం 74వ రాజ్యాంగ సవరణ తెచ్చింది. మున్సిపాలిటీల ఏర్పాటు, పాలకవర్గ సభ్యుల ఎంపిక, సీట్ల రిజర్వేషన్ల అంశాలపై రాజ్యాంగంలోని పేరా–9–ఏలో ఉన్న ఆర్టికల్ 243–పీ, 243–జీలలో స్పష్టమైన వివరణలున్నాయి. ఎక్కడా అందులో మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలని లేదు. ఎన్నికల ద్వారానే మున్సిపాలిటీల్లో సీట్ల నియామకం జరపాలని ఆర్టికల్ 243–ఆర్ పేర్కొంటోంది. పురపాలనలో అనుభవం, పరిజ్ఞానంగల వ్యక్తులను కో–ఆప్షన్ సభ్యులుగా నియమించడానికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వార్డు కమిటీ చైర్పర్సన్లను మున్సిపాలిటీల్లో (ఎక్స్అఫిషియో) సభ్యులుగా నియమించడానికే మినహాయింపు ఉంది. రాజ్యాంగంలోని పేరా–9–ఏలో మైనారిటీల ప్రస్తావన లేదు. ప్రతిపాదిత మున్సిపల్ బిల్లులోని నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 9–ఏను ఉల్లంఘించేలా ఉన్నాయి’అని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఖజానాపై భారమనే ఆ బిల్లు తిరస్కృతి వైద్యవిద్య డైరెక్టర్, అదనపు డైరెక్టర్, వైద్య కళాశాల ల ప్రిన్సిపాళ్లు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్ల పదవీవిరమణ వయసును 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్) చట్ట సవరణ బిల్లు–2022ను గవర్నర్ తమిళిసై తిరస్కరించడం తెలిసిందే. 2019 జూలై 20 నుంచి ఈ మేరకు రిటైర్మెంట్ వయసు పొడిగింపును వర్తింపజేస్తూ 2022 సెప్టెంబర్ 12న బిల్లును ప్రభుత్వం తేవడంపట్ల గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 61 ఏళ్లు నిండి పదవీ విరమణ చేసిన నాటి నుంచి తిరిగి పునర్నియమితులయ్యే వరకు ఉన్న కాలంలో ఒక్కరోజూ పనిచేయకపోయినా వారికి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించాల్సి వస్తుందని ఆరోపిస్తూ ఈ బిల్లును గవర్నర్ తిరస్కరించారు. ఈ బిల్లుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొనడంపై సైతం గవర్నర్ స్పందించినట్లు సమాచారం. ఇప్పటికే రిటైరైన ఎందరికి దీనిద్వారా ప్రయోజనం కలుగుతుంది? ఎంత మేరకు రాష్ట్ర ఖజానాపై భారం పడుతుంది? వంటి అంశాలపై తమిళిసై ప్రభుత్వ వివరణ కోరినట్లు సమాచారం. ప్రభుత్వ వర్సిటీలకు దిక్కులేదు.. ప్రైవేటువి కావాలా? రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీల ఏర్పాటును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022ను తీసుకురావడం సరికాదని గవర్నర్ తమిళిసై అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వ వివరణ కోరినట్టు సమాచారం. -
ఆస్తిపన్ను వసూళ్లు రూ. 825.87 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక సంఘాలు, సంస్థల నుంచి ఆస్తిపన్ను రూపంలో రూ.825.87 కోట్లు వసూలయ్యాయి. జీహెచ్ఎంసీ మినహా 128 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్ల పరిధిలో నిర్దేశిత లక్ష్యం రూ.1,146.56 కోట్లలో 72.03 శాతం మేర వసూలైంది. 2021– 22 ఏడాది ఆస్తిపన్ను వసూళ్లతో పోలిస్తే ఈసారి రూ.127.62 కోట్లు అదనంగా సమకూరాయి. ఆస్తిపన్ను వసూళ్లలో హైదరాబాద్ మినహా 12 కార్పొరేషన్లలో 92.33 శాతం పన్ను వసూళ్లతో ఫిర్జాదిగూడ మొదటిస్థానంలో నిలవగా, 55.02 శాతం పన్ను వసూళ్లతో నిజామాబాద్ చివరిస్థానంలో ఉంది. మునిసిపాలిటీలలో జగిత్యాల జిల్లా కోరుట్లలో అత్యధికంగా 97.39 శాతం, నిర్మల్ జిల్లా బైంసాలో అత్యల్పంగా 26.93 శాతం మాత్రమే వసూలైంది. ఆస్తిపన్ను, భవన నిర్మాణాల ఫీజుల వసూళ్లతో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రతి సంవత్సరం ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. చిన్న మునిసిపాలిటీల్లో కూడా పన్నువసూళ్లు ఆశాజనకంగా ఉండటంతో ప్రభుత్వానికి ఏయేటికాయేడు ఆదాయం పెరుగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు నెలల ముందు నుంచే కమిషనర్ అండ్ డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ మునిసిపల్ కమిషనర్లతో తరుచూ సమావేశాలు నిర్వహించడం, ఆదాయలక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన సమీక్షలు ఎప్పటికప్పుడు చేయడంవల్ల పన్నువసూళ్లలో పురోగతి స్పష్టంగా కనిపించింది. మునిసిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గ్రాంట్లతోపాటు స్వయంగా ఆదాయం సమకూర్చుకోవడం తప్పనిసరని సీడీఎంఏ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆస్తిపన్నుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రతీ మంగళ, గురు, ఆదివారాల్లో మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30లోగా ఆస్తిపన్నుచెల్లిస్తే 5 శాతం రాయితీ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించినవారికి ఎర్లీబర్డ్ స్కీమ్ వర్తిస్తుందని కమిషనర్, డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ తెలిపారు. ఆస్తిపన్ను మొత్తం చెల్లించేవారికి ఐదుశాతం రాయితీ లభిస్తుందన్నారు. ఆస్తిపన్ను మునిసిపల్ కార్యాలయానికి రాకుండానే పేమెంట్ యాప్స్ ద్వారా చెల్లించవచ్చని పేర్కొన్నారు. పన్నుచెల్లింపు దారులకు మునిసిపాలిటీలు పంపించే ఎస్ఎంఎస్లలో లింక్ తెరిచి పన్ను చెల్లించవచ్చని, లేదంటే వాట్సాప్ చాట్‌బాట్ నంబర్ 90002 53342 ద్వారా కూడా చెల్లించవచ్చని వివరించారు. -
మున్సిపాల్టీల్లో తల‘సిరి’ తక్కువే
సాక్షి, అమరావతి: దేశంలో 15 రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల మొత్తం ఆదాయంలో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం మున్సిపాలిటీల జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.4,624 కాగా.. 15 రాష్ట్రాల్లో ఈ సగటు ఇంకా తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. పట్టణ జనాభా పెరుగుతున్నప్పటికీ జీడీపీలో మున్సిపాలిటీల వ్యయం 0.44 శాతం నుంచి 0.37 శాతానికి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితులు, అకౌంటింగ్ విధానంపైనా నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా మున్సిపాలిటీల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో పాటు పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక, పరిపాలన సంస్కరణలు చేపట్టాలని పేర్కొంది. ఏపీలో స్థానిక సంస్థలకు 16 అంశాలు బదిలీ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు 18 అంశాలను బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే 18 అంశాలను బదిలీ చేశాయని, ఆంధ్రప్రదేశ్ 16 అంశాలను బదిలీ చేసిందని నివేదిక వెల్లడించింది. అలాగే, పట్టణ స్థానిక సంస్థల్లో ఏటా తప్పనిసరిగా అకౌంటింగ్ విధానం ఉండాలని నివేదిక సూచించింది. అలాగే, నీతి ఆయోగ్ ఇంకా ఏం సూచించిందంటే.. ► రాష్ట్రాల తరహాలోనే పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం అమలుచేయాలి. ► పట్టణ స్థానిక సంస్థలు సొంత ఆదాయ వనరులను పెంచుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ► దేశంలో 223 క్రెడిట్ రేటింగ్‌లు ఇస్తే కేవలం 95 పట్టణ స్థానిక సంస్థలకే పెట్టుబడి రేటింగ్ ఉంది. ఇందులో కేవలం 41 మున్సిపాలిటీలే బాండ్ల ద్వారా రూ.5,459 కోట్ల నిధులు సమీకరించాయి. ► 2036 నాటికి పెరిగే జనాభాలో 73 శాతం పట్టణాల్లోనే ఉంటుందని, అందుకనుగుణంగా మౌలిక వసతుల కోసం అవసరమైన నిధుల సమీకరణకు మున్సిపల్ బాండ్ల జారీతో పాటు ఇతర మార్గాలను అనుసరించాలి. ఇందుకోసం మున్సిపాలిటీల సొంత ఆదాయాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు క్రెడిట్ రేటింగ్ సాధ్యమవుతుంది. ► స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరులైన ఆస్తి పన్ను, వినియోగ రుసుం చాలా తక్కువగా వస్తున్నాయి. అయితే, దేశ జీడీపీలో మున్సిపాలిటీల ఆస్తి పన్ను కేవలం 0.2 శాతమే ఉంది. ► మున్సిపాలిటీలు ఎక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీచేసే నిధులపైనే ఆధారపడుతున్నాయి. ► మెరుగైన మున్సిపల్ పాలన కోసం ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. ► మున్సిపల్ అకౌంటింగ్ రికార్డులు, వార్షిక ఖాతాలు కచ్చితత్వంతో ఉండాలి. ► వాస్తవ ఆదాయం, వ్యయంతోనే అకౌంటింగ్ ఉండాలి తప్ప ఇంకా రాని ఆదాయం, చేయని వ్యయాలను అకౌంటింగ్లో ఉండకూడదు. ► ఏటా ఆదాయంలో 5 శాతం నగదు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ► రుణ స్థాయిలో చట్టబద్ధమైన సీలింగ్‌ను విధించుకోవాలి. ► జీతం, పెన్షన్ వ్యయాలను 49 శాతానికి పరిమితం చేయాలి. ► 51 శాతం ఆస్తుల సృష్టి, రుణ సేవలు, పెట్టుబడికి వ్యయం చేయాలి. ► క్రెడిట్ రేటింగ్‌తో బాండ్ల జారీని ప్రోత్సహించాలి. ► ఫలితాల ఆధారిత బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. ► ఆదాయ అంచనాలు సగటు వార్షిక వృద్ధి కంటే ఎక్కువగా ఉండకూడదు. ► స్థానిక సంస్థలు ఆర్థిక డేటాబేస్‌ను ఏర్పాటుచేయాలి. ► సొంత పన్నులు, కేంద్ర.. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం, వ్యయంతో పాటు అన్ని వివరాలు పౌరులకు ప్రదర్శించాలి. -
బిల్లును ఓకే చేయించి.. అవిశ్వాసాలు ఆపేలా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో నెలకొన్న అవిశ్వాసాల గందరగోళానికి తెర దించాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 26తో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకొన్న 127 పట్టణ, నగర పాలక మండళ్లలో చాలా చోట్ల లుకలుకలు బహిర్గతమయ్యాయి. పలుచోట్ల ఇప్పటికే మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చారు. కొన్ని పట్టణాల్లో క్యాంపులు, కొనుగోళ్ల పర్వం కూ డా మొదలైంది. అవిశ్వాసాలు ప్రతిపాదించిన పట్ట ణాలు, నగరాల్లో అధికార బీఆర్ఎస్ పాలక మండళ్లే కొలువు తీరి ఉండటం, ప్రస్తుత మేయర్లు, చైర్పర్సన్లను గద్దె దించేందుకు సొంత పార్టీ ప్రతినిధులే అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. పట్టణ, నగర పాలక మండళ్లలో అవిశ్వాస తీర్మా నం ప్రవేశపెట్టేందుకు ఉన్న కనీస గడువును నాలుగేళ్లకు పెంచుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందితే మరో ఏడాది వర కు సమస్య ఉండదని భావిస్తోంది. రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించేలా పావులు కదుపుతోంది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు విషయమై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ గవర్నర్‌ను కలవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ బిల్లు విషయంలో గవర్నర్‌కు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసి ఆమోదించాల్సిందిగా కోరాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇన్నాళ్లుగా పెండింగ్‌లో.. తెలంగాణ మున్సిపల్ చట్టం– 2019 ప్రకారం నగర, పురపాలక సంఘాల్లో మేయర్/ డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్/వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు.. పాలక మండలి ఏర్పాటైన నాటి నుంచి కనీసం మూడేళ్లు గడువు పూర్తయి ఉండాలి. ఈ నిబంధనకు సవరణ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస కనీస గడువును నాలుగేళ్లకు పెంచుతూ మున్సిపల్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఆమోదించినా గవర్నర్ వద్ద పెండింగ్‌లో పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య ఏర్పడిన అగాథం నేపథ్యంలో గవర్నర్ వద్ద ఆగిన ఏడు బిల్లుల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు కూడా ఉంది. మరోవైపు రాష్ట్రంలోని పుర/నగర పాలక సంస్థల పాలక మండళ్లకు గత నెల 26తో మూడేళ్ల పదవీకాలం పూర్తయింది. ఇదే అదనుగా అసమ్మతి ప్రజాప్రతినిధులు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. అవన్నీ కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈలోపే చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే సమస్యకు చెక్‌పడుతుందని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. -
డీటీసీపీ మాస్టర్ ప్లాన్.. ప్రతీ మున్సిపాలిటీకి రింగ్‌రోడ్డు!
సాక్షి, హైదరాబాద్: ప్రతి మున్సిపాలిటీకి రింగ్‌రోడ్డు.. రహదారులు, డ్రైనేజీల విస్తరణ.. ప్రత్యేకంగా నివాస, వాణిజ్య, మిశ్రమ జోన్లు.. వచ్చే 20ఏళ్ల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు.. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్లు సిద్ధమవుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వీటిని రూపొందిస్తున్నారు. ప్రణాళిక లేకుండా మున్సిపాలిటీలు విస్తరించడం వల్ల ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలు కీలక చర్యలను చేపట్టనున్నారు. డీటీసీపీ యంత్రాంగం ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇదే పనిలో నిమగ్నమైంది. మార్చి నాటికల్లా సిద్ధం చేసేలా.. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్)ను వినియోగించి.. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు, 11 నగరాభివృద్ధి సంస్థలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నారు. 2023 మార్చి నాటికల్లా అమలు చేసేలా బృహత్తర ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లకుగాను 74 మున్సిపాలిటీల్లో ఇప్పటికే రూపొందించిన మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. వాటిలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. మిగతా 68 చోట్ల కొత్తగా మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేస్తున్నారు. ప్రజలు తమ భూవినియోగ వివరాలను సులభంగా తెలుసుకుని.. టీఎస్ బీ–పాస్ విధానంతో సింగిల్ విండో పద్ధతిలో భవన నిర్మాణ/లేఔట్ల అనుమతులు పొందడానికి మాస్టర్ప్లాన్లు ఎంతో ఉపయోగపడతాయని డీటీసీపీ అధికారులు చెప్తున్నారు. జీఐఎస్ ద్వారా క్షుణ్నంగా సర్వే చేసి వచ్చే 20ఏళ్ల వరకు ఎలాంటి భూ వినియోగమారి్పడి అవసరం లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరిస్తున్నారు. వివిధ జోన్లుగా విభజించి.. జనాభా అధికంగా ఉండే ప్రాంతాలను మిశ్రమ వినియోగ ప్రాంతాలుగా.. మిగతా ప్రాంతాలను వాణిజ్య, నివాస ప్రాంతాలుగా ఒక క్రమపద్ధతిలో మాస్టర్ ప్లాన్లలో నిర్దేశించనున్నారు. ప్రజలు తాము నివసించే ప్రాంతాల నుంచి కార్యాలయాలకు, పనిచేసే ప్రాంతాలకు సులభంగా రాకపోకలు సాగించేలా, రహదారులపై ట్రాఫిక్ భారాన్ని నిరోధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారి ఒకరు వివరించారు. రహదారులు చిన్నగా ఉండటం.. జన సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి జరిగితే ఈ ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అన్ని మున్సిపాలిటీల్లో అంతర్గత, ప్రధాన రహదారులపై ఒత్తిడి లేకుండా రింగ్‌రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక చెరువులు, వాగులు, కాల్వలతోపాటు రైలు మార్గాలు, పారిశ్రామికవాడలు మొదలైన ప్రాంతాల్లో బఫర్ జోన్లను మాస్టర్ప్లాన్లలో నిర్దేశించనున్నారు. పట్టణాల్లో కనీసం పదిశాతానికి తగ్గకుండా గ్రీన్జోన్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతా పక్కాగా.. మాస్టర్ ప్లాన్ల రూపకల్పనలో భాగంగా తొలుత నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) నుంచి పట్టణాల చిత్రాలు, వివరాలు సేకరిస్తున్నారు. తర్వాత రెవెన్యూ శాఖ నుంచి సర్వే నంబర్ల వారీగా మ్యాపులను తీసుకుంటున్నారు. స్థానిక పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఆ వివరాలన్నింటినీ క్రోడీకరించి.. పట్టణ ప్రణాళికలో నిపుణులైన వారితో కొత్త మాస్టర్ప్లాన్లను రూపొందిస్తున్నారు. -
అభివృద్ధికి పది సూత్రాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో పది పాయింట్ల ఎజెండాతో కార్యాచరణ రూపొందిస్తున్నట్టు మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పట్టణాల అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. గురువారం మునుగోడులో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి సమీక్ష సందర్భంగా ఆయన ఈ పది సూత్రాల ప్రణాళికను వివరించారు. వచ్చే మార్చి నాటికల్లా ఈ ప్రణాళిక మేరకు పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పారిశుధ్య కార్యక్రమాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు రాష్ట్రానికి చెందిన 26 మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు అందుకున్నాయని గుర్తుచేశారు. దీనిని బట్టి దేశంలోనే మన మున్సిపాలిటీల పని విధానం ఉత్తమంగా నిలిచిందన్నారు. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయని, వాటికోసం పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. మంత్రి వివరించిన ప్రణాళిక ఇదీ.. ► చిన్న, పెద్ద మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణాలకు 21 రోజుల్లోపే అన్ని అనుమతులు ఇవ్వాలి. 75 చదరపు అడుగులలోపు అయితే ఏ అనుమతులూ అవసరం లేదు. ఎక్కడైనా తేడాలుంటే నా దృష్టికి తేవాలి. టీఎస్ బీపాస్ ద్వారానే అనుమతులు ఇవ్వాలి. ► ప్రతి మున్సిపాలిటీలో ఒక్కటైనా వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ ఉండాలి. ప్రజలకు ఉపయోగపడేలా వచ్చే మార్చి 31లోగా పూర్తి చేయాలి. ► అంతిమ సంస్కారాన్ని సంస్కారవంతంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీల్లో వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయాలి. వైకుంఠ రథాన్ని మున్సిపాలిటీల ఆధ్వర్యంలోనే అందుబాటులో ఉంచాలి. ► హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలలో 1,700కు పైగా అర్బన్ నర్సరీలు ఉన్నాయి. వాటికోసం 12 శాతం గ్రీన్ బడ్జెట్ వినియోగిస్తున్నారు. మిగతా మున్సిపాలిటీల్లో అవసరమైన చోట ఇంకా కొత్త నర్సరీలు ఏర్పాటు చేయాలి. ► ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక దోబీ ఘాట్లు నిర్మించాలి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలి. వాటిలో అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలి. ► అన్ని మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డుల్లోని చెత్త తొలగింపునకు బయోమైనింగ్ ప్రక్రియను ప్రారంభించాలి. ఎక్కడైనా ప్రారంభించకపోతే వెంటనే చేయాలి. మానవ వ్యర్ధాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ► ప్రతి మున్సిపాలిటీ తనదైన మాస్టర్ ప్లాన్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలి. కొత్త మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ దశలోనే ప్రజాప్రతినిధులు క్షుణ్నంగా పరిశీలించాలి. ఎక్కడ రోడ్డు వస్తుంది, ఎక్కడ చెరువులు ఉన్నాయనేది పరిశీలించి, ఆమోదించి పంపాలి. ఒకసారి ఫైన్ డ్రాప్ట్ ఆమోదించాక మార్పులు చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ► అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఇంటికి యూనిక్ నంబర్ ఉంటుంది. అలాగే ఇక్కడ మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి యూనిక్ స్ట్రక్చర్ డిజిటల్ డోర్ నంబర్ ఏర్పాటు చేయాలి. ఆ నంబర్ కొడితే ఇంటి యజమాని వివరాలు వచ్చేలా ఆన్లైన్ చేయాలి. హైదరాబాద్‌లో 25 లక్షల ప్రాపర్టీలు ఉంటే 18 లక్షల ప్రాపర్టీల నుంచే పన్ను వస్తోంది. ఇకపై పట్టణాలు, మున్సిపాలిటీల్లో లెక్కలోకి రాని ప్రాపర్టీలు ఉండకూడదు. అందుకోసమే ఈ విధానం తెస్తున్నాం. ► మున్సిపాలిటీల్లోని సెలూన్ల వివరాలు సేకరించాలి. వాటి యజమానుల ఫోన్ నంబర్లు తీసుకోవాలి. ముందుగా సమాచారం సిద్ధం చేస్తే.. తర్వాత వారికి అవసరమైన మోడల్ సెలూన్లను డెవలప్ చేయవచ్చు. ఏసీ వంటి సదుపాయాలతో సెలూన్లను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడం వంటి అంశాలను పరిశీలిస్తాం. ► మిషన్ భగీరథలో భాగంగా ప్రతి ఇంటికి నీటిని అందించాలి. ఎక్కడైనా మంచినీరు అందని ప్రాంతాలుంటే గుర్తించి వెంటనే మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లను నియమించేందుకు చర్యలు చేపడుతున్నాం. 50వేల కన్నా జనాభా తక్కువ ఉన్న మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒక వార్డు ఆఫీసర్‌ను నియమిస్తాం. మంత్రుల సమీక్షలు ► ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పల్లె–పట్టణ ప్రగతి, పరిశ్రమలు, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ, విద్యుత్, మిషన్ భగీరథ, రోడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లుŠ, గిరిజన సంక్షేమం, మహిళాశిశు సంక్షేమం, నీటిపారుదల అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత మంత్రులు సమీక్షించారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై చర్చించారు. ► జిల్లాలో ఎన్ని పనులు మంజూరయ్యాయి, ఎన్ని పూర్తయ్యాయి, పూర్తికాని పనులను ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఎప్పటిలోగా పూర్తి చేసుకోవాలో నిర్ణయించడానికి ఈ సమావేశం నిర్వహించామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ► ఉపాధి హామీ కింద గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా పనులు చేపట్టి పంచాయతీలకు ఆదాయం పెరిగేలా, ట్రాక్టర్ బకాయిలు తీర్చుకునేలా చూడాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. డంపింగ్ యార్డుల్లో ఎరువుల తయారీతో ఆదాయం రాబట్టాలన్నారు. ► రాష్ట్రస్థాయిలో అంతటా 4లేన్ల రోడ్లు ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. గత 8 ఏళ్లలో ఇందుకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. పంచాయతీలుగా మారిన తాండాల్లో రోడ్లకు బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించామని, ఐటీడీఏల పరిధిలో రూ.476 కోట్ల పనులకు అనుమతి ఇచ్చామని మంత్రి సత్యవతి చెప్పారు. ‘మునుగోడు’కు 380 కోట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాబోయే ఆరేడు నెలల్లో రూ.1,544 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో రూ. 380 కోట్లతో మునుగోడును అభివృద్ధి చేస్తామని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపిస్తే ఆ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాను గుండెల్లో పెట్టి చూసుకుంటామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు నెలరోజుల్లోనే సమీక్ష చేపట్టామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విస్తృతంగా రోడ్ల అభివృద్ధి పనులు చేపడతామని, మున్సిపాలిటీలకు అదనపు గ్రాంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేత జౌళిశాఖ తరఫున నేతన్నల కోసం రూ.4 కోట్లతో హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక రూ.30 కోట్లతో చండూరు మున్సిపాలిటీ, రూ.50 కోట్లతో చౌటుప్పల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు. చండూరును రెవెన్యూ డివిజన్ చేస్తామన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు రూ.కోటి వ్యయంతో నారాయణపూర్‌లో సంత్ సేవాలాల్ గిరిజన బంజారా భవన్ నిర్మిస్తామని, గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే 12 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. ఆలోగా పనులు పూర్తిచేయాలన్నారు. -
16 పురపాలికలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. ఇవి స్వచ్ఛ సర్వేక్షణ్–22 అవార్డులను సాధించాయి. జాతీయస్థాయిలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ పారిశుధ్య సంబంధిత సమస్యల పరిష్కారాలను, చెత్తరహిత నగరాల(జీఎఫ్‌సీ)కు స్టార్ రేటింగ్ ఇచ్చి(జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు) ఈ అవార్డులకు ఎంపిక చేసింది. పారిశుధ్యం, పురపాలక ఘన వ్యర్థాల నిర్వహణ, ఇతర అంశాలపై ప్రజల్లో అవగాహనకుగాను దేశవ్యాప్తంగా 4,355 పట్టణ, స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన 16 పట్టణ, స్థానిక సంస్థలకు అవార్డులొచ్చాయి. వీటి ఎంపికకు 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్యప్రాంతాలు, కమ్యూనిటీ లెవెల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రజల అవగాహన, సిటిజన్ ఎంగేజ్మెంట్, ఇన్నోవేషన్స్‌లో అవార్డులను ఎంపిక చేశారు. ఢిల్లీలో అక్టోబర్ 1న జరిగే స్వచ్ఛ మహోత్సవ్‌లో అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డులతోపాటు రాష్ట్రంలోని 142 పట్టణ, స్థానిక సంస్థల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 70 పట్టణ స్థానికసంస్థలను బహిరంగ మలవిసర్జన లేని (ఓడీఎఫ్+)గా, 40 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్++గా, ఒక పట్టణ స్థానిక సంస్థను వాటర్+, మిగిలిన 31 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్ పట్టణాలుగా ప్రకటించారు. అవార్డులు సాధించిన మున్సిపాలిటీలివే.. ఆదిభట్ల, బడంగ్పేట్, భూత్పూర్, చండూర్, చిట్యాల, గజ్వేల్, ఘట్కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరేడుచర్ల, సికింద్రాబాద్ కంటోన్మెంట్, సిరిసిల్ల, తుర్కయాంజాల్, వేములవాడ. సంస్కరణల ఫలితమే ఈ అవార్డులు: మంత్రి కేటీఆర్ ఈ ఏడాది కూడా భారీగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక కావడంపట్ల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అవార్డులకు ఎంపికైన 16 పురపాలికల్లోని మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులను అభినందించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నూతన పురపాలక చట్టం, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల పట్టణాల్లో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందన్నారు. పాలనాపరమైన సంస్కరణలు చేపట్టి వదిలేయకుండా, పట్టణాలకు ప్రతినెలా రాష్ట్ర బడ్జెట్ నుంచి నిరంతరం నిధులు అందించడంతో ప్రాథమిక సేవలకు వీలు కలిగిందన్నారు. ఈ అవార్డుల ద్వారా పట్టణాభివృద్ధి, పట్టణ పరిపాలన రంగాల్లో సైతం తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో, పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నా రు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2022 అవార్డుల్లో తెలంగాణలోని 16 పట్టణాలు అవార్డులు గెలుచుకోవడం, రాష్ట్ర ప్రభుత్వ కృషికి దర్పణంగా నిలిచిందన్నారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద తెలంగాణ పలు విభాగాల్లో 13 అవార్డులను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పట్టణాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన పురపాలక చట్టంతో పాటు, విడతల వారీగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయని సీఎం వివరించారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, పట్టణ హరిత వనాల ఏర్పాటు, గ్రీన్ కవర్‌ను పెంచడం, నర్సరీల ఏర్పాటు, ఓడీఎఫ్‌ల దిశగా కృషితో పాటు పలు అభివృద్ధి చర్యలు చేపట్టడం ద్వారా గుణాత్మక ప్రగతి సాధ్యమైందని వెల్లడించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశా నికి తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేసిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను, ఆ శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, భాగస్వాములైన అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాల సాధన దిశగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇదే స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. -
ఆస్తిపన్ను పరిధిలోకి రాని గృహాలు లక్షల్లో..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. ఆస్తిపన్ను మదింపు, వసూళ్లలో క్షేత్రస్థాయి యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల పురపాలికలకు ఏటా రూ.వందల కోట్ల ఆదాయానికి గండిపడుతోంది. నిధుల్లేక పురపాలికలు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. క్ష్రేత్రస్థాయిలో ఇంకా లక్షల సంఖ్యలో ఆస్తుల పన్ను మదింపు జరగడం లేదు. ఒకవేళ మదింపు జరిగి, నోటీసులు జారీ చేసినా, వందశాతం వసూళ్లు కావడం లేదు. స్థానిక సంస్థలు అభివృద్ధి నిధుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైపు చూడక తప్పడం లేదు. ప్రభుత్వాలు నిధులు విదిలించకపోతే ఆ స్థానిక సంస్థలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండాల్సిన పరిస్థితులుంటున్నాయి. చదవండి: మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల.. రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో సహా మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థలున్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం 17.50 లక్షల స్థిరాస్తులపై ఏటా రూ.4,500 కోట్ల ఆస్తిపన్నులు విధించి వసూలు చేస్తున్నారు. మిగిలిన 141 మునిసిపాలిటీలు/కార్పొరేషన్ల పరిధిలో 22 లక్షల స్థిరాస్తులను ఆస్తి పన్నుల పరిధిలోకి తెచ్చి మొత్తం రూ.1,322 కోట్ల పన్నులను వాటిపై విధించారు. మిగిలిన వాటితో పోల్చితే ఒక్క జీహెచ్ఎంసీ 3.2 రెట్లు అధిక ఆదాయాన్ని పొందుతోంది. వాణిజ్య భవనాలు, పరిశ్రమలు, కార్యాలయాలు పెద్దసంఖ్యలో ఉండటం, అద్దె విలువ సైతం అధికంగా ఉండటంతో జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం వస్తోంది. క్షేత్రస్థాయిలో కనిపించని మార్పు రాష్ట్రవ్యాప్తంగా ఆస్తిపన్ను వసూళ్లలో లోపాలను అరికట్టేందుకు ఉన్నతస్థాయిలో కొత్త ఆలోచనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మార్పు రావట్లేదు. జిల్లాల్లో అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)ను ప్రత్యేకంగా సీనియర్ అధికారిగా నియమించినా.. ఆస్తిపన్ను పెంపులో పెరుగుదల ఉండట్లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పట్టణాల వైపు పెరుగుతూ..కొత్త నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి. అయినా, స్థానిక సంస్థల ఆదాయం ఆ స్థాయిలో పెరగడం లేదు. మరోవైపు ఆస్తిపన్ను వసూళ్లలో వందకు వందశాతం వసూలైన దాఖలాలు లేవు. మదింపులోనే అసలు సమస్య ఆస్తిపన్ను మదింపులోనే అసలు సమస్యలు వస్తున్నాయి. టాక్స్ ఇన్స్పెక్టర్లు ఆస్తిపన్ను మదింపు సమయంలోనే చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముడుపులు పుచ్చుకుని ఆస్తిపన్ను తక్కువగా వేస్తున్నారని, ముడుపులివ్వకపోతే అధికంగా వేస్తున్నారని అంటున్నారు. టాక్స్ ఇన్స్పెక్టర్లకు ఈ అవకాశం ఇవ్వకుండా భవన నిర్మాణ అనుమతి సమయంలోనే.. నిర్మాణ వైశాల్యం ఆధారంగా ఆస్తిపన్ను మదింపు చేసే విధానాన్ని పురపాలక శాఖ ప్రవేశపెట్టింది. చాలామంది అనుమతులకు మించిన సంఖ్యలో అంతస్తులను నిర్మిస్తుండటంతో.. అక్రమంగా నిర్మించిన అనుమతులు పన్నుల పరిధిలోకి రావడం లేదు. అనుమతిలేకుండా కట్టిన నిర్మాణాలకు పన్నుల చెల్లింపు విషయంలోనూ కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆస్తిపన్నుల సవరణ ప్రతీ ఐదేళ్లకోమారు జరగాల్సి ఉన్నా.. నివాస గృహాలపై గత 20 ఏళ్లుగా జరగలేదు. భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచినప్పుడల్లా ఆస్తిపన్ను ఆటోమెటిక్‌గా పెంచేందుకు పురపాలక శాఖ యత్నిస్తోంది. 141 మునిసిపాలిటీలు/ కార్పొరేషన్లలో ఇప్పటివరకు 76 మునిసిపాలిటీల్లో భూముల విలువలు పెరిగినప్పుడల్లా ఆస్తిపన్ను పెరిగే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మరో 65 మునిసిపాలిటీల్లో ఈ విధానం అమలు కావాల్సి ఉంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 141 పురపాలికల్లో గత ఐదేళ్లలో ఆస్తి పన్ను ఇలా..(ఆగస్టు10 వరకు) సంవత్సరం ఉన్న ఇళ్లు (లక్షల్లో) డిమాండ్ (రూ.కోట్లలో) వసూళ్లు (రూ.కోట్లలో) శాతం 2018-19 17.53 501.20 445.89 88.96 2019-20 19.18 650.13 561.05 86.30 2020-21 20.27 799.14 719.34 90.01 2021-22 20.76 811.48 698.25 86.04 2022-23 21.95 1,322.89 334.18 25.26 -
ముంపు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు బంద్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వరద ముంపునకు గురైన వెంచర్లు, ఖాళీ స్థలాల్లో భవిష్యత్తులో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని మున్సిపల్ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ మేరకు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీల శివార్లలోని అనేక నివాసాలు నీటమునిగాయి. హెచ్ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలోని నిర్మాణాలకు, ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకున్న ప్లాట్లలో అనుమతుల విషయంలో ఎలాంటి నిబంధనలను అమలు చేయాలనే విషయమై పురపాలక శాఖ కసరత్తు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. చెరువులు, కుంటల్లోనే పట్టణాలు! గతనెలలో భారీవర్షాల వల్ల పట్టణాల్లో ని ఏయేప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయనే విషయమై పురపాలక శాఖ నివేదిక రూపొందించినట్లు తెలియవచ్చింది. అందుకు గల కారణాలను కూడా పేర్కొన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ శివార్లలో మొన్నటివరకు గ్రామ పంచాయతీలుగా ఉన్న ప్రాంతాలన్నీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా మారాయి. చెరువులు, కుంటలుగా ఉన్న ప్రాంతాలు పూడుకుపోయిన చోట్ల, శిఖం భూములుగా ఉన్న ప్రాంతాల్లోనే పట్టణాలు విస్తరించినట్లు అధికారులు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. ఆయా ప్రాంతాలకు ఆనుకొని కొత్తగా ఏర్పాటైన వెంచర్లు కూడా ముంపు ప్రాంతాలుగా నే ఉన్నట్లు పురపాలక శాఖ నిర్ణయానికి వచ్చింది. -
ఉత్సాహంగా మూడోరోజు ‘పట్టణ ప్రగతి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్టణప్రగతి మూడోరోజు కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై అక్కడికక్కడే స్పందించి పరిష్కరించారు. మున్సిపల్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు మంత్రులు, ఒక ఎంపీ, 28 మంది ఎమ్మెల్యేలతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీసహా 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 10,189 టన్నుల చెత్త, 1,059 కిలోమీటర్ల మేర రోడ్ల పక్కనున్న పొదలు, 3,129 టన్నుల శిథిలవ్యర్థాలను తొలగించారు. 897 కిలోమీటర్ల మేర మురుగు కాలువల్లో పూడిక తీశారు. మురుగు, వరద నీటికాల్వలు, కల్వర్టుల వద్ద 146 జాలీలను ఏర్పాటు చేశారు. 1,256 ప్రజా మరుగుదొడ్లు, 644 ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, 546 మతపరమైన ప్రదేశాలు, పార్కులను శుభ్రంచేశారు. 182 లోతట్టు ప్రాంతాలను పూడ్చారు. 1,32,762 ప్రాంతాల్లో ఫాగింగ్, స్ప్రే చేశారు. 121 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సీజ్ చేసి, బాధ్యులపై రూ.15,303 అపరాధ రుసుం విధించారు. పనిచేయని, ఎండిపోయిన 71 బోర్లను మూసివేశారు. 36 ఇంకుడు గుంతలను పునరుద్ధరించడంతోపాటు కొత్తగా పదింటిని నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న 68 ఇళ్లను తొలగించినట్లు తెలిపారు. విద్యుత్ మరమ్మతులు.. వైకుంఠధామాలు 125 విద్యుత్, నీటిమీటర్లకు మరమ్మతులు చేశారు. 26 మోటార్లకు కెపాసిటర్లు బిగించారు. 113 వంగిన స్తంభాలను సరిచేసి, 56 తుప్పు పట్టిన విద్యుత్‌స్తంభాలను మార్చారు. 2,100 మీటర్ల మేర వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేశారు. 84 వైకుంఠధామాలు, శ్మశాన వాటికలను శుభ్రంచేశారు. 141 వైకుంఠధామాల పనులు ప్రారంభించారు. 28 వైకుంఠ రథాలను కొనుగోలు చేశారు. 25 మార్కెట్లు, రైతుబజార్లను శుభ్రం చేశారు. 42 క్రీడాప్రాంగణాలను ప్రారంభించారు. మొక్కల సంరక్షణకు అనువుగా... పట్టణాలు, నగరాల్లో 24,045 మొక్కల మధ్య కలుపు తీసి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా 11,779, రోడ్ల మధ్యన ఉన్న పాదుల్లో 6, 844 మొక్కలను నాటారు. కొత్తగా 36 స్థలాలను ట్రీ పార్కుల కోసం గుర్తించారు. కొత్త ట్రీ పార్కులో 2,252 గుంతలను మొక్కలు నాటడానికి అనువుగా తీశారు. 14,210 మొక్కలను ఇళ్లకు పంపిణీ చేశారు. మొక్కలు పెంచిన 21 మందిని సన్మానించారు. 320 ప్రదేశాల్లో పైపులైన్ లీకేజీలను గుర్తించి నీరు కలుషితం కాకుండా సరిచేశారు. 44 పంపు సెట్లను బ్రేక్‌డౌన్ కాకుండా సరిచేశారు. 321 మందికి ఒక రూపాయికి నల్లా కనెక్షన్‌ను ఇచ్చారు. 148 మందికి రూ.100కు నల్లా నీటి కనెక్షన్ ఇచ్చారు. -
'పల్లె' వించిన పట్టణీకరణ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామాలు పట్టణాలయ్యాయి.. పట్టణాలకు ఆనుకుని ఉన్న పల్లెలు వాటిలో అంతర్భాగమయ్యాయి. గ్రామీణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనువుగా గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు చేర్పులు చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు పట్టణ స్థానిక సంస్థలుగా మారడంతోపాటు తొమ్మిది జిల్లాల్లో కొత్తగా 15 మునిసిపాలిటీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి కొత్త బాటలు పడ్డాయి. ప్రధానంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని.. అభివృద్ధికి వినియోగించుకోవడంతో ఆయా గ్రామాల స్థాయి పెరిగింది. జిల్లాలవారీగా కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థలు ఇవే.. అనంతపురం జిల్లాలోని కోనపురం, వెంకటరెడ్డిపల్లిని కలిపి పెనుగొండ పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ని 2020 జనవరిలో ఏర్పాటు చేశారు. ఇదే నెలలో పలు జిల్లాల్లోని మరికొన్ని గ్రామాలు కూడా మునిసిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ► చిత్తూరు జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న కుప్పంలో సమీపంలోని ఏడు గ్రామ పంచాయతీలను కలిపి మునిసిపాలిటీగా మార్చారు. ఇదే జిల్లాలో జనాభా పరంగా పెద్దదైన బి.కొత్తకోట కూడా యూఎల్‌బీగా మారింది. ► గుంటూరు జిల్లాలోని గురజాల, జంగమహేశ్వరపురం పంచాయతీలు కలిసి గురజాల మునిసిపాలిటీగా, దాచేపల్లి, నడికుడి గ్రామాలు కలిసి దాచేపల్లి మునిసిపాలిటీగా ఆవిర్భవించాయి. ► కృష్ణా జిల్లాలోని కొండపల్లి, ఇబ్రహీంపట్నం కలిసి కొండపల్లి మునిసిపాలిటీగా, తాడిగడప, కానూరు, యనమలకుదురు, పోరంకి గ్రామాలు కలిసి వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీగా ఏర్పాటయ్యాయి. ► కర్నూలు జిల్లాలోని బేతంచర్ల, బుగ్గనపల్లి కలిపి బేతంచర్ల యూఎల్‌బీగా ఏర్పాటు చేశారు. ► ప్రకాశం జిల్లాలోని పొదిలి, కంబాలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం గ్రామాలు కలిసి పొదిలి యూఎల్‌బీగా, దర్శి గ్రామ పంచాయతీ ఒక్కటీ మరో యూఎల్‌బీగా ఏర్పాటయ్యాయి. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అల్లూరు, సింగంపేట, నార్త్ మోపూరు గ్రామాలు కలిసి అల్లూరు మునిసిపాలిటీగా, ఇదే జిల్లాలోని అవ్వేరు, కట్టుబడిపాలెం, ఇసకపాలెం, పల్లిపాలెం కలిసి బుచ్చిరెడ్డిపాలెం మునిసిపాలిటీగా ఆవిర్భవించాయి. ► పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, చింతలపూడి గ్రామ పంచాయతీలు వేర్వేరు పట్టణ స్థానిక సంస్థలుగా మారాయి. ► వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం గ్రామ పంచాయతీ సైతం యూఎల్‌బీగా మారింది. ► రాష్ట్రంలో కమలాపురం, ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, దర్శి, బేతంచర్ల, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, కుప్పం, పెనుగొండ మునిసిపాలిటీలు 2020 జనవరిలో ప్రభుత్వ ఉత్తర్వులు ద్వారా ఏర్పాటయ్యాయి. చింతలపూడి, అల్లూరు, పొదిలి, వైఎస్సార్ తాడిగడప, బి.కొత్తకోట మునిసిపాలిటీలను 2021లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పలు గ్రామాలు విలీనం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 డిసెంబర్లో ప్రభుత్వ ఉత్తర్వులు ద్వారా, 2021లో ప్రత్యేక చట్టం ద్వారా రాష్ట్రంలో 23 మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో సమీపంలోని గ్రామాలను విలీనం చేసి ఆయా పంచాయతీల స్థాయి పెంచింది. శ్రీకాకుళం మునిసిపాలిటీలో ఏడు పంచాయతీలు, రాజమహేంద్రవరం కార్పొరేషన్లో పది పంచాయతీలు, భీమిలి మునిసిపాలిటీలో ఐదు పంచాయతీలు, ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్లో ఏడు పంచాయతీలను విలీనం చేశారు. అదేవిధంగా పాలకొల్లు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీల్లో ఐదు పంచాయతీల చొప్పున, తణుకు, భీమవరం మునిసిపాలిటీల్లో మూడు పంచాయతీల చొప్పున కలిపారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ మునిసిపాలిటీలో ఆరు పంచాయతీలు, జగ్గయ్యపేట మునిసిపాలిటీలో మూడు పంచాయతీలను విలీనం చేశారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మునిసిపాలిటీలో మూడు పంచాయతీలు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మునిసిపాలిటీలో రెండు పంచాయతీలు, నాయుడుపేట మునిసిపాలిటీలో రెండు పంచాయతీల్లోని కొంత భాగాలు, మరో పంచాయతీని కలిపారు. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్లో 21 గ్రామాలు విలీనం గుంటూరు జిల్లాలోని మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్లో అత్యధికంగా 21 గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. బాపట్ల మునిసిపాలిటీ సమీపంలో వెలసిన కొన్ని కొత్త ప్రాంతాలు, ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని కొన్ని గ్రామాలను కలిపి దాని స్థాయిని పెంచారు. అదేవిధంగా పొన్నూరు, కందుకూరు, కావలి, గూడూరు మునిసిపాలిటీల్లోనూ పదుల సంఖ్యలో గ్రామాలను, సమీప కాలనీలను విలీనం చేశారు. కర్నూలు కార్పొరేషన్లో సైతం మూడు సమీప పంచాయతీలను కలిపారు. నంద్యాల మునిసిపాలిటీలో కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని కొంత భాగాన్ని విలీనం చేశారు. ఇక పుంగనూరు మునిసిపాలిటీలో రెండు పంచాయతీల్లోని కొంత భాగాన్ని, శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో ఆరు పంచాయతీలను కలిపారు. -
పట్టణాల్లో ఫిర్యాదులపై ప్రత్యేక వ్యవస్థ!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ప్రజలకు సకాలంలో సేవలు అందించడంపై రాష్ట్ర మునిసిపల్ పాలనా విభాగం దృష్టి సారించింది. ఏ స్థాయిలోనూ ‘పెండింగ్’ అనేది లేకుండా నిబంధనల ప్రకారం వెంటనే సమస్యలను పరిష్కరించనుంది. ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్ కుమార్ మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 123 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందించాల్సిన సేవలపై పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి మంగళ లేదా బుధవారాల్లో మునిసిపల్ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అలాగే ప్రతినెలా మూడు లేదా నాలుగు మున్సిపాలిటీల్లో సీడీఎంఏ స్వయంగా పర్యటించనున్నారు. ఏ లోపం ఉన్నా కమిషనర్లదే బాధ్యత ప్రభుత్వ పథకాలు సకాలంలో ప్రజలకు అందుతున్నాయా? లేదా అనే అంశంపై మునిసిపల్ శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో సిబ్బంది, కమిషనర్లపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఆన్లైన్లో ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ఒక బృందాన్ని కూడా నియమిస్తోంది. మునిసిపాలిటీలో ఏ స్థాయిలో అవినీతి జరిగినా, ప్రజలకు అందించాల్సిన సేవల్లో లోపం కనిపించినా అందుకు స్థానిక కమిషనర్లనే బాధ్యులను చేయనుంది. 4,136 వార్డులపై ప్రత్యేక దృష్టి వార్డు సచివాలయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఎలాంటి ఫిర్యాదులు ఉండవని మునిసిపల్ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అన్ని మునిసిపాలిటీల్లో ఉన్న 4,136 వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బందిపై దృష్టి పెట్టింది. దీంతో రాష్ట్ర స్థాయి నుంచి ఎప్పుడు ఏం ప్రశ్న వస్తుందోనని మునిసిపల్ కమిషనర్లు జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పటిదాకా వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తుల దుమ్ముదులిపే పనిలో నిమగ్నమయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి మునిసిపాలిటీలో ఇటీవల పర్యటించిన సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ కొత్తపేట–2 సచివాలయంలో సిబ్బంది లేకపోవడం, ఉన్నవారు యూనిఫామ్ ధరించకపోవడాన్ని గుర్తించారు. వార్డు కార్యాలయాల్లో సిబ్బంది పేర్లు, వారు అందించే సేవల బోర్డులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో సిబ్బంది పనితీరుని మునిసిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ పర్యటనలో ఆయన గుర్తించిన లోపాలను అన్ని మునిసిపాలిటీలు సరిచేసుకోవాలని 123 మంది కమిషనర్లకు నోటీసులు పంపించారు. కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే.. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో సకాలంలో సేవలు అందలేదని ఫిర్యాదులు వస్తే సహించేది లేదు. కిందిస్థాయి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలి. కమిషనర్లు పట్టణంలో పర్యటిస్తుంటే సమస్యలు తెలుస్తాయి. ఫిర్యాదులు, పెండింగ్ సమస్యలు ఎక్కడా లేకుండా చర్యలు తీసుకోవాలి. మునిసిపాలిటీల్లో 4,136 వార్డులు ఉన్నాయి. వాటిలో 317 సేవలు అందించాలి. ఎవరు ఎలాంటి సేవలు అందిస్తారనేది వార్డు సచివాలయాల్లో బోర్డులు పెట్టాలి. కొన్ని వార్డుల్లో ఇప్పటిదాకా బోర్డులు పెట్టనిచోట చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చెడ్డపేరొచ్చేలా ప్రవర్తించినా, ప్రభుత్వ సేవలు, పథకాలు సకాలంలో ప్రజలకు అందకున్నా బాధ్యులపై చర్యలు తప్పవు. – ప్రవీణ్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ -
కేంద్రం సంస్కరణలకు అనుగుణంగానే ఆస్తి పన్ను
సాక్షి, అమరావతి: మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల లో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం కూడా పెంచుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఆర్థిక వ్యవస్థలో క్రమశిక్షణను నెలకొల్పడం, ప్రభుత్వ నిధుల నిర్వహణను మెరుగుపరచడంతోపాటు ద్రవ్య లోటును తగ్గించడం వంటి లక్ష్యాలను చేరుకునేందుకు ‘ఫిస్కల్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం)’ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. దీన్ని గతేడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం సంస్కరణలను సైతం అమలు చేయాలని సూచించింది. దీనికనుగుణంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ లెక్కల ప్రకారం.. ఆస్తి మార్కెట్ విలువ ఎంతుందో లెక్కించి పన్ను విధించాలని మార్గదర్శకాలను సైతం నిర్దేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగా ణతోపాటు మరో 9 రాష్ట్రాలు ఈ పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఆస్తి విలువ ఆధారంగా పన్ను చట్ట ప్రకారం.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి విలువను ప్రతి ఐదేళ్లకు ఒకసారి మదింపు చేపట్టి అందుకనుగుణంగా ఆస్తి పన్ను పెంచాలి. కానీ వివిధ కారణాలతో పెంపు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో నివాసయోగ్య ఆస్తులు, 2007లో నివాసేతర ఆస్తుల (కమర్షియల్) పన్నును మదింపు చేశారు. అప్పట్లో ఆస్తుల వార్షిక అద్దె ప్రాతిపదికగా పన్ను విధానం అమలులో ఉండేది. దీనివల్ల ఒకే ప్రాంతంలో పన్ను విధింపులో అసమానతలు ఉండేవి. దీన్ని సరిచేసేందుకు ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం.. పన్ను ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. -
‘టౌన్’ బండి.. డౌన్
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సిబ్బంది కొరత, సమస్యలకు చిన్న ఉదాహరణ ఇది. పంచాయతీలుగా ఉన్నప్పటి నామమాత్రపు సిబ్బందితోనే చాలా మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. సరిపడా అధికారులు, సిబ్బంది లేకపోవడం.. ఉన్నా ఇన్చార్జులే కావడంతో కొత్త పురపాలక సంస్థల్లో పాలన సరిగా జరగని దుస్థితి నెలకొంది. దీనితో అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోందని, వివిధ అనుమతులు, పారిశుధ్యం వంటి సేవలు సరిగా అందడం లేదని.. పన్నుల వసూళ్లు కూడా జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సమస్యపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. సాక్షి, హైదరాబాద్: పెరిగిన జనాభా, నివాస ప్రాంతాల విస్తరణ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పలు మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలి టీలుగా, కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేసింది. కొత్తగా 77 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇది జరిగి దాదాపు మూడేళ్లు అవుతున్నా వాటికి అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకం జరగలేదు. పేరుకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా మారినా.. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటి పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కొత్తవి ఏర్పాటైన మొదట్లో.. ఆయా జిల్లాల్లో అప్పటికే ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరిని సీనియారిటీ ఆధారంగా కొత్త మున్సిపాలిటీలకు కమిషనర్లు, మేనేజర్లుగా డిప్యుటేషన్లపై నియమించారు. కొందరికైతే రెండేసి మున్సిపాలిటీలకు ఇన్చార్జి కమిషనర్‌గా, మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో గ్రామపంచాయతీలుగా ఉన్నప్పటి సిబ్బంది నుంచే.. శానిటేషన్ ఇంజనీర్లు, ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లను ఎంపిక చేసి వెళ్లదీసుకొస్తున్నారు. అక్రమాలను అడ్డుకునేదెలా? మున్సిపాలిటీకి ఆదాయం సమకూరేది టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల నుంచే. గ్రామపంచాయతీ నుంచి ఇళ్ల అనుమతి పొంది, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఘటనలు వెలుగులోకి రావడంతో.. కొత్త మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణాలకు టీఎస్‌బీపాస్ అనుమతి తప్పనిసరని పురపాలక శాఖ ప్రకటించింది. అయితే కొత్తగా అనుమతులు మంజూరు చేయడానికిగానీ, పంచాయతీలు ఇచ్చిన అనుమతులు చెల్లవని చెప్పడానికిగానీ టౌన్ ప్లానింగ్ అధికారులు లేని దుస్థితి. కేవలం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న హైదరాబాద్ శివార్లలోని కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మాత్రం డిప్యుటేషన్ మీద టౌన్ ప్లానింగ్ సిబ్బందిని నియమించడంతో.. వారు అక్రమ నిర్మాణాలపై దృష్టిపెట్టగలుతున్నారు. ఇతర చోట్ల చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. పన్నుల ఆదాయానికీ గండి ఇంటిపన్నుతో పాటు ఇతర పన్నుల వసూలు చేసే రెవెన్యూ సిబ్బంది లేకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది. అభివృద్ధి పనులతోపాటు టౌన్ ప్లానింగ్ విభాగానికి అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలనకు ప్రతి మున్సిపాలిటీకి ఇంజనీర్లు ఉండాలి. కానీ కొత్త మున్సిపాలిటీల్లో ఇంజనీర్ల కొరత నెలకొంది. సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు, ఏయే ప్రాంతాల్లో ఏ విధమైన అభివృద్ధి చేయాలన్న నివేదికలు రూపొందించేందుకు అధికారులు లేరు. ఏదైనా అంశంపై మున్సిపాలిటీకి వచ్చే ప్రజలకు సమాధానం చెప్పేవారు కూడా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదిన్నర క్రితమే ప్రకటించినా..: రాష్ట్రంలోని కొత్త, పాత మున్సిపాలిటీల్లో కమిషనర్, మేనేజర్ నుంచి శానిటరీ జవాన్ వరకు 4 వేల పోస్టులు అవసరమని పురపాలక శాఖ గతంలో లెక్కతేల్చింది. జనాభా ప్రాతిపదికన ఏయే మున్సిపాలిటీకి, కార్పొరేషన్‌కు ఏయే స్థాయిలోని అధికారులు, సిబ్బంది ఎంద మంది అవసరమనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 2020 జూలై 14న మంత్రి కేటీఆర్ పురపాలకశాఖ అధికారులతో సమావేశమై.. తొలివిడతగా 2 వేల పోస్టుల భర్తీకి కసరత్తు చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటివరకు నియామకాలు జరగలేదు. తాజాగా 129 మున్సిపాలిటీల్లో 3,700 మంది వార్డు ఆఫీసర్లను నియమించాలని అధికారులు నిర్ణయించారు. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న పోస్టుల భర్తీని కూడా పూర్తి చేయాలనేది ఆలోచన. ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప కొత్త మున్సిపాలిటీల్లో అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ఇబ్బంది తప్పదని స్థానికులు అంటున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గ్రామపంచాయతీలుగా ఉన్న అలంపూర్, వడ్డేపల్లిలను మున్సిపాలిటీలుగా మార్చారు. మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన నిత్యానంద్.. ఈ రెండు మున్సిపాలిటీలకు ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో మేనేజర్, అకౌంటెంట్, బిల్ కలెక్టర్, ఏఈ, టౌన్‌ప్లానింగ్ ఏఈ పోస్టులకు ఇన్చార్జి అధికారులే ఉన్నారు. ఆర్ఐ, శానిటరీ ఇన్స్పెక్టర్, వర్క్ ఇన్స్పెక్టర్, జూనియర్ అకౌంటెంట్ వంటి కీలక పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. శానిటేషన్, ఇతర సిబ్బంది అయితే పూర్తిగా ఔట్ సోర్సింగే. వడ్డేపల్లి మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. పది కీలక పోస్టులకుగాను ఏడింటిలో ఇన్చార్జులే ఉన్నారు. ► మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలి టీలో కమిషనర్‌తోపాటు టీపీవో పోస్టులకు ఇన్ చార్జులను నియమించిన ప్రభుత్వం.. మేనేజర్, జూనియర్ అసిస్టెంట్లను మాత్రమే డిప్యుటేషన్ మీద పంపించింది. ఇక ఏ పోస్టుకూ అధికారులు లేరు. శానిటరీ ఇన్స్పెక్టర్ సహా పారిశుధ్య సిబ్బందిని ఔట్ సోర్సింగ్‌లో తీసుకొని బండి నడిపిస్తున్నారు. ► బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కొరత ఉంది. డిప్యూటీ సిటీ ప్లానర్ (డీసీపీ) మాత్రమే ఉన్నారు. ఆయన కూడా ఇన్చార్జినే. నలుగురు సూపర్వైజర్లు, ఒక ఏసీపీ పోస్టులకు సంబంధించి ఎవరూ లేరు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ముగ్గురు ఏఈలు అవసరం. ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ఇద్దరు ఈఈ ఉండాల్సి ఉన్నా.. ఎవరూ లేరు. ► రామాయంపేట మున్సిపాలిటీలో అంతా ఇన్ చార్జుల పాలనే. 20 మందికిగాను.. మున్సిపల్ కమిషనర్, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు. గతంలో మేజర్ పంచాయతీగా ఉన్నప్పటి సిబ్బందితోనే పాలన కొనసాగుతోంది. ళీ చిట్యాల మున్సిపాలిటీలో ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్, మేనేజర్, జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్, రెవెన్యూ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లుగా ఇన్చార్జులే ఉన్నారు. ► కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కమిషనర్, ఏఈ, టీపీవో ఇన్చార్జులే. ఏఈ, ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ , అకౌంట్స్ విభా గంలో ఏవో, జేఏవో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ టీపీ, టీపీఎస్, శానిటర్ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్, రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బిల్ కలెక్టర్లు నలుగురికి ఒక్కరే, జూనియర్ అసిస్టెంట్లు నలుగురికి ఇద్దరే ఉన్నారు. పలు కొత్త మున్సిపాలిటీల్లోని పరిస్థితి ఇదీ.. ► కొత్త మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బంది లేకపోవడంతో అంతకు ముందున్న గ్రామ పంచాయతీ పరిస్థితికి ఇప్పటికి తేడా లేని దుస్థితి. ► మున్సిపాలిటీల్లో గెలిచిన పాలక మండళ్లు తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా అమలు కావడం లేదు. ► కొందరు కమిషనర్లు, కీలక అధికారులు రెండేసి మున్సిపాలిటీలకు ఇన్చార్జులుగా ఉంటుండటంతో పాలన కుంటుపడుతోంది. ► టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది లేకపోవడం వల్ల కొత్త మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలకు అనుమతులు రావడం లేదు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే యంత్రాంగం లేదు. ► గ్రామ పంచాయతీ పర్మిషన్ పేరుతో కొత్త మున్సిపాలిటీల్లో ఇప్పటికీ భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని కొత్త మున్సిపాలిటీల్లో మాత్రం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి.. ఇతర మున్సిపాలిటీలు, రెవెన్యూ శాఖల నుంచి సిబ్బందిని తెప్పించి మరీ అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. కానీ జిల్లాలో ఈ పరిస్థితి లేదు. ► పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగం లేదు. కమిషనర్లుగా వ్యవహరిస్తున్న అధికారులు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించి చెత్త తొలగింపు, ఇతర పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. ► హైదరాబాద్ శివార్లలోని జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్, పీర్జాదిగూడ వంటి కొత్త కార్పొరేషన్లలో పాలకమండళ్ల హడావుడే తప్ప అధికారులు చేపట్టిన కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు. భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ఆలస్యం జరుగుతోందన్న ఫిర్యాదులు ఉన్నాయి. అడుగడుగునా సమస్యలే.. అధికారులు, సిబ్బంది లేకుంటే మున్సిపాలిటీలు ఎందుకు? పౌరులకు మౌలిక సదు పాయాలు కల్పించడమ నేది స్థానిక సంస్థల బాధ్యత. మున్సిపాలిటీ, కార్పొరేషన్ నుంచి సౌకర్యాలు ఆశిం చడం ప్రజల హక్కు. కొత్త మున్సి పాలిటీలు ఏర్పాటు చేసి.. కమిషనర్లను, సిబ్బందిని నియమించకపోవడం వల్ల స్థానిక సంస్థల ఉద్దేశం దెబ్బతింటుంది. అధికారులను నియ మించకపోవడం శోచనీయం. పట్టణాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కావాలి. ప్రభుత్వం ఇప్పటికైనా రెగ్యులర్ స్టాఫ్‌ను నియమిస్తే మంచిది. – ఆర్వీ చంద్రవదన్, రిటైర్డ్ ఐఏఎస్, ఎంసీహెచ్ మాజీ అదనపు కమిషనర్ -
మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు!
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలకు కొత్త జవసత్వాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వార్డుస్థాయిలో పాలనావికేంద్రీకరణ జరిగే విధంగా కొత్త విధానాన్ని తీసుకు రావడానికి అడుగులు వేస్తోంది. కొత్తగా వార్డు ఆఫీసర్లను నియమించాలని ఉన్నతస్థాయిలో జరిగిన పలు సమావేశాల అనంతరం నిర్ణయించింది. అందులో భాగంగా మొత్తం 142లో 13 మునిసిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లోని డివిజన్లు/వార్డుల్లో ఈ అధికారులను నియమించాలని సర్కార్ యోచిస్తోంది. ప్రజాప్రతినిధులతో వార్డు కమిటీలున్నా, వారిని సమన్వయం చేసుకోవడంతోపాటు వార్డుస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి ఈ అధికారులను వినియోగించనున్నారు. దాదాపు 3,700 మంది అధికారులను ఇందుకోనం వినియోగించనున్నట్లు సమాచారం. పట్టణ ప్రగతిలో కీలకమైన హరితహారం, పారిశుధ్యం, నందనవనం, మహిళాసంఘాలను బలోపేతం చేయడం, కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ వార్డు అధికారులను వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం వార్డు స్థాయిలో అధికారులు లేరు. జీహెచ్ఎంసీ ప్రాంతంలో మాత్రం కొన్నిచోట్ల వార్డు కార్యాలయాలు ఉన్నాయి. కొత్తగా వార్డు ఆఫీసర్లను నియమించడం ద్వారా ప్రజలకు మరింతగా పాలన చేరువ కావడానికి వీలుంటుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. కొత్తగా ఏర్పాటైన వాటికి స్టాఫ్ కూడా.. మూడేళ్ల కిందట రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 84 మున్సిలిటీలు, కార్పొరేషన్లకు సరిపడా సిబ్బందిలేరు. సిబ్బంది నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం. బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, అకౌంట్స్, మేనేజర్లు, కమిషనర్లు ఈ విధంగా దాదాపు 4 వేల పోస్టులకు పురపాలకశాఖ చాలా కాలక్రితమే ప్రభుత్వ అనుమతి కోసం పంపించింది. అవి కూడా త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు ఉన్నతస్థాయివర్గాలు తెలిపాయి. ఈ పోస్టుల భర్తీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో జారీ చేసే నోటిఫికేషన్ల సమయంలోనే ఇస్తారా? లేక మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నట్లు సమాచారం. కొత్త పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా, కనీస సిబ్బంది లేకపోవడం వల్ల ఆశించినస్థాయిలో ఫలితాలు లేవని, మేనేజర్లు, అకౌంటెంట్లను కమిషనర్లుగా నియమించడం, కొన్నిచోట్ల ఒకటి రెండు మున్సిపాలిటీలకు కలిపి అధికారులు పనిచేస్తుండటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల ఆకాంక్షలు పెరిగిపోతున్నాయని.. అందుకు అనుగుణంగా పనిచేయాలంటే తగిన సిబ్బంది అవససరం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
కూలుతున్న అక్రమ కట్టడాలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయతీలలో సరైన అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలపై సర్కారు కన్నెర్ర చేసింది. వాటిని కూల్చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరు చెప్పి కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గత మూడేళ్లుగా భారీ ఎత్తున నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. నెలక్రితం దుండిగల్‌లో పంచాయతీ అనుమతితో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడం విషయం వెలుగుచూడడంతో పురపాలక శాఖ సీరియస్ అయింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ ఇతర అధికారులు సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ నుంచి గతంలో నిర్మాణ అనుమతి పొందినప్పటికీ, మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లుగా మారాక ఆయా ప్రాంతాల్లో తిరిగి సంబంధిత విభాగాల అనుమతి పొందాలని, లేని పక్షంలో కూల్చివేస్తామని ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే పురపాలక శాఖ అధికారులు అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు ప్రారంభించారు. ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు సోమవారం నుంచే భవన నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్ శివార్లలోని జిల్లాల్లో ముందుగా 600 చదరపు గజాల విస్తీర్ణానికి మించి ఉన్న అక్రమ నిర్మాణాలపై ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలకు దిగాయి. కూల్చివేతలను మంగళవారం సైతం కొనసాగించారు. ఇతర జిల్లాల్లో సైతం భారీగా అక్రమ కట్టడాలు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో రెండేళ్ల కాలంలో నిర్మించిన, నిర్మిస్తున్న కట్టడాల డేటాను అధికారులు సేకరించారు. ఈ మేరకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు వాటికి ఆనుకొని ఉన్న కొత్త మున్సిపాలిటీల్లో కూడా గ్రామ పంచాయతీ అనుమతి పేరిట భారీగా నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. వ్యక్తిగత నివాస భవనాలతో పాటు కళాశాలలు, హాస్టళ్లు, స్కూళ్లను బహుళ అంతస్తుల్లో నిర్మించినట్లు కనుగొన్నారు. వీటిలో స్థానిక పట్టణ అథారిటీ, డీటీసీపీ అనుమతి లేకుండా సాగిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు.