సర్కారీ బడులపై ప్రై‘వేటు’
ఏలూరు సిటీ :పురపాలక, నగరపాలక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలలన్నీ కార్పొరేట్ విద్యాసంస్థల హస్తాల్లోకి వెళ్లనున్నాయి. వీటిని ఎయిడెడ్ పాఠశాలల తరహాలో నిర్వహిం చేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే పాఠశాలలను ప్రైవేటీకరించే యోచనలో సర్కారు ఉన్నట్టు భోగట్టా. ఈ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు ఇస్తున్నట్టుగానే ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుంది. నిర్వహణ బాధ్యతలు మాత్రం కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు చేపడతాయి. దీనివల్ల పురపాలక, నగరపాలక పాఠశాల భవనాలు, స్థలాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళతాయి. పిల్లలకు ఉచితంగానే విద్య అందిస్తారు కాబట్టి పాఠశాలల స్థలాల్లో వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు వాటికి కల్పిస్తారని తెలుస్తోంది. ఇలా ప్రభుత్వ విద్యాసంస్థలను, ఆస్తులను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధారాదత్తం చేసేం దుకు రంగం సిద్ధమవుతోంది.
ముంబై తరహా విధానమట
ముంబై మహానగరంలో పురపాలక, నగరపాలక సంస్థల యూజమాన్యాల్లోని పాఠశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని, రాష్ట్ర సర్కారు సైతం అదే పద్ధతిని అవలంభించబోతోందని సమాచారం. ఒక్క ఏలూరు నగరంలోనే 50 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 7 ఉన్నత పాఠశాలలు కాగా, 5 ప్రాథమికోన్నత పాఠశాలలు, 38 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 8వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలన్నిటికీ అత్యంత విలువ చేసే భవనాలు, ప్రాంగణాలు ఉన్నాయి. అక్కడ వాణిజ్య భవనాలు నిర్మిం చేందుకు అనువైన పరిస్థితులున్నారుు. ఇప్పటికే అధికార నేతలు కొన్ని పాఠశాలల ఆవరణలలో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించేందుకు ప్రయత్నించి వ్యతిరేకత రావటంతో విరమించుకున్నారు. ఏలూరు నగరంతోపాటు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం మునిసిసాలిటీలలోని పాఠశాలలనూ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
విద్యా వ్యాపారానికి ఊతం
పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్(పీపీపీ) విధానంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు మునిసిపల్ స్కూళ్లను అప్పగించేందుకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవటం సరికాదు. దీనివల్ల విద్యా వ్యాపారానికి ప్రభుత్వమే ఊతమిస్తున్నట్టవుతుంది. దీనివల్ల విలువైన స్థలాలు సైతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళతాయి. కార్పొరేట్ స్కూళ్లలో బట్టీపట్టే విధానం తప్ప పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదం చేసే కార్యక్రమాలు ఉండవు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంటే మంచిది.
- షేక్ సాబ్జి, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ జిల్లా శాఖ
అభివృద్ధి చేయడం మానేసి...
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి. విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా ఉపాధ్యాయులను నియమించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా మునిసిపల్ స్కూళ్లను కార్పొరేట్ శక్తులకు అప్పగించాలనే నిర్ణయం తీసుకోవడం సరికాదు. పేద వర్గాలకు విద్యను దూరం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తప్పకుండా మా సంఘం ఉద్యమిస్తుంది. ప్రభుత్వ విద్యరంగాన్ని కాపాడుకునేందుకు శాయశక్తులా పోరాడతాం.
- గగ్గులోతు కృష్ణ, కార్యదర్శి, ఏపీటీఎఫ్ 1938
కార్పొరేట్‌కు అప్పగించటం దారుణం
పురపాలక, నగరపాలక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలలను ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదవర్గాల పిల్లలకు ఇప్పటికే సరైన విద్య అందని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల వారికి పూర్తిగా విద్య అందకుండా పోతుంది. పాఠశాల స్థలాలపై కన్నేసిన కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు అభివృద్ధి పేరుతో వాటిని దోచుకోవాలని చూస్తున్నాయి. దీనిని ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అడ్డుకోవాల్సిందే. - జి.సుధీర్, అధ్యక్షులు, వైఎస్సార్ టీఎఫ్, జిల్లా శాఖ