ఏలూరు : మునిసిపాలిటీల్లో శుక్రవారం నుంచి సమ్మె సైరన్ మోగనుంది. జిల్లాలోని మునిసిపల్ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనబాట పట్టేందుకు సమాయత్తమయ్యూరు. అపరిష్కృత డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు దిగగా.. అప్పట్లో ప్రభుత్వం చర్చలు జరిపి ఆందోళనను తాత్కాలికంగా విరమింపచేసింది. అప్పటినుంచీ హామీ లు నెరవేర్చకపోవడం, ఆ తరువాత ప్రభుత్వం మారటం, ఈనెల 11 మునిసిపల్ ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పడుతున్నారు.
డిమాండ్లు ఇవీ
నగరపాలక, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మధ్యంతర భృతి, రూ.13 వేల కనీస వేతనం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, స్కూల్ స్వీపర్లను ఫుల్‌టైమ్ వర్కర్స్‌గా గుర్తిం చడం, 010 పద్దు ద్వారా జీతాలు చెల్లింపు, ట్రైసైకిళ్లతో చెత్త సేకరించే వారికి కనీసం వేతనం రూ.6,700 చెల్లింపు, ఉద్యోగులు, కార్మికులకు పీఆర్‌సీ ప్రకారం వేతనాలు నిర్ణయించి అమలు చేయాలన్న 14 డిమాండ్లతో సమ్మె చేపడుతున్నారు.
ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం
మునిసిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం కుంటిసాకులతో కాలయాపన చేస్తూ వారిని పట్టించుకోవడం లేదని ఏపీ మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయూస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బి.సోమయ్య, ఏఐటీయూసీ నాయకుడు బండి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగులు, కార్మికుల డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, స్కూల్స్, లైబ్రరీల్లో పనిచేస్తున్న స్వీపర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
మునిసిపాలిటీల్లో సమ్మె సైరన్
Published Fri, Aug 1 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM
Advertisement