
భర్త హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న మృతురాలు.. జైలుకు వచ్చిన వారంలోనే బలవన్మరణం
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జైలులో ఒక రిమాండ్ మహిళా ఖైదీ ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల కిందటే జైలుకు వచ్చిన ఆమె ఆదివారం ఉదయం చున్నీతో బ్యారక్‌లోని కిటికీకి ఉరి వేసుకుని మృతిచెందడం కలకలం సృష్టించింది. వివరాలు... ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసు (31)తో తెలంగాణలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శాంతికుమారి(29)కి 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. బోసుపై మార్చి 18న గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ఖమ్మం కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 19న మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. శాంతికుమారి తన ప్రియుడు సొంగా గోపాల్‌తో కలిసి భర్త బోస్ హత్యకు కుట్ర చేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమెను మార్చి 24న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, జడ్జి రిమాండ్ విధించారు. మరోవైపు తన భర్తను చంపేస్తామని కొంతమంది రాజకీయ నాయకులు హెచ్చరించారని, ఆయనపై దాడి జరిగిన రోజే శాంతికుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త మృతికి, తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా పోలీసులు తనను కేసులో ఇరికించారని శాంతికుమారి బాధపడుతున్నట్లు ఆమె బంధువులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం జైలు బ్యారక్‌లో కిటికీకి తన చున్నీతో ఉరి వేసుకుంది. వెంటనే జైలు సిబ్బంది ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించగా, వైద్యులు మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌లోని మార్చురీలో ఉంచారు. ఏలూరు జిల్లా జైలు అధికారుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, శాంతికుమారి ఆత్మహత్య నేపథ్యంలో మహిళా బ్యారెక్ వద్ద విధులు నిర్వహించిన హెడ్ వార్డర్ ఎల్.వరలక్ష్మి, వార్డర్ నాగమణిలను సస్పెండ్ చేస్తూ జైలు సూపరింటెండెంట్ సీహెచ్‌ఆర్‌వీ స్వామి ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.