సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ తీరును కేంద్రం ఆక్షేపించింది. జనన నమోదు లేదా మృతి చెందిన వారి తరఫు బంధువులకు పెన్షన్ లేదా భూముల బదలాయింపు తదిత రాలకు అవసరమైన డెత్ సర్టిఫికెట్లకోసం వస్తే వారిని కార్యాలయాల చుట్టూ తిప్పడం దారుణమని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ (బర్త్స్ అండ్ డెత్స్)...రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు.
జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పంచాయితీలు, మున్సిపాలిటీల్లో జారీ చేస్తారు. అయితే వాటికోసం సామాన్యులు వారంరోజులపాటు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఈ పత్రాల జారీలో తీవ్ర జాప్యంపాటు, ప్రతి పత్రానికి ఓ ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. వాస్తవానికి జనన లేదా మరణ నమోదు జరిగాక తొలి కాపీని ఆర్‌బీడీ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఉచితంగా ఇవ్వాలి. అయితే ఎక్కడా అలా జరగడం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో సామాన్యులు డబ్బు చెల్లించి అవసరమైన పత్రాలను తెచ్చుకుంటున్నారు.
ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు
పత్రాల జారీలో అవకతవకలపై రాష్ట్రం నుంచి ఫిర్యాదులందడంతో ప్రధాని కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఇది సామాన్యుడి సేవకు సంబంధించిన అంశమని, సవ్యంగా జరగకపోతే సంబంధితులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. సామాన్యుడిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని పేర్కొంది.
జాప్యం కాకుండా చూడండి
రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీ కార్యాలయాలు లేదా మున్సిపాలిటీల్లో ధ్రువీకరణ పత్రాలు జారీలో జాప్యం కాకుండా చూడాలని చీఫ్ రిజిస్ట్రార్ (బర్త్స్ అండ్ డెత్స్) ఆయా విభాగాలకు లేఖ రాశారు. బర్త్ రిజిస్ట్రేషన్ల విభాగంలో ఒకే పోస్టులో మూడేళ్లకు మించి ఉద్యోగి పనిచేస్తుంటే బదిలీ చేయాలని, పత్రాల జారీకి డబ్బు అడిగితే ఆర్‌బీడీ చట్టంలోని సెక్షన్ 23(2) ప్రకారం జరిమానా విధించాలని లేదా చర్యలు తీసుకోవచ్చని సదరు లేఖలో పేర్కొన్నారు. సామాన్యులకు తక్షణమే అవసరమైన పత్రాలను జారీచేయాలని సూచించారు.
ఆ పత్రాల జారీ ఇలాగేనా?
Published Thu, Jun 18 2015 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement