birth and death certificates
-
ఆన్లైన్ అక్రమాలకు అడ్డుకట్ట ఏదీ?
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం బర్త్, డెత్‌సర్టి ఫికెట్ల జారీలో ఆన్లైన్ అవకతవకలు గుర్తించి తెగ హడావుడి చేస్తున్న జీహెచ్ఎంసీ..ఐదేళ్లకు పూర్వం నుంచే ఆన్లైన్ ద్వారా వివిధ అంశాల్లో ఎన్నో అక్రమాలు వెలుగు చూసినా ఇప్పటి వరకు ఎవరిపైనా తగిన చర్యలు తీసుకోలేదు. అందువల్లే అక్రమాలకు ఫుల్స్టాప్ పడటం లేదని జీహెచ్ఎంసీ వర్గాలే చెబుతున్నాయి. బర్త్, డెత్ సర్టి ఫికెట్ల జారీలో చేతులు తడపనిదే పని కాని పరిస్థితి ఎన్నో ఏళ్లుగా వేళ్లూనుకుంది. దాన్ని నివారించేందుకని ఆన్లైన్ ద్వారా జారీ విధానాన్ని, ప్రజలకు మరింత సులభంగా సేవలందిచేందుకని ఇన్స్టంట్ అప్రూవల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన జీహెచ్ఎంసీ..కనీస పర్యవేక్షణను గాలికొదిలేసింది. దాంతో ఆన్లైన్ ద్వారా సర్టి ఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు జత చేయాల్సిన డాక్యుమెంట్ల స్థానే చిత్తుకాగితాలు జత చేసినా సర్టి ఫికెట్లు జారీ అవుతుండటంతోనే అక్రమాలు పెచ్చరిల్లాయి. మీసేవా కేంద్రాల ద్వారా అవి జారీ అయినందున జీహెచ్ఎంసీకి సంబంధం లేదని చెబుతున్నా..జీహెచ్ఎంసీ–మీసేవా కేంద్రాల సిబ్బంది మధ్య సంబంధం ఉంటుందనే ఆరోపణలున్నాయి. ఒకరి భవనం మరొకరికి.. ఈ పరిస్థితి ఒక్క బర్త్, డెత్ సర్టిఫికెట్లకే పరిమితం కాలేదు. ఆన్లైన్ ద్వారా భవనాల సెల్ఫ్ అసెస్‌మెంట్లలోనూ అదే ధోరణి కొనసాగింది. దాదాపు ఐదేళ్ల క్రితం కొందరి భవనాల్ని వేరే వారికి మ్యుటేషన్లు చేసిన ఘటనలు సైతం ఉన్నాయి. ఇలా ఎన్ని అవకతవకలు దృష్టికొచ్చినా, వాటిని నిలువరించేందుకు జీహెచ్ఎంసీ శ్రద్ధ చూపలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అక్రమాలు వెలుగుచూసినప్పుడే బాధ్యులపై కఠినచర్యలు తీసుకొని ఉంటే తిరిగి అక్రమాలు జరిగేవి కాదని పలువురు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో పేరుకు మాత్రం ఐటీ విభాగం ఉన్నా.. అన్నింటికీ సీజీజీ మీదే ఆధారపడుతోంది. జీహెచ్ఎంసీలో పనిచేసి వెళ్లినవారే సీజీజీలో చేరి మ్యుటేషన్ల అవకతవకలకు పాల్పడ్డారనే ప్రచారం జరిగినా జీహెచ్ఎంసీ పట్టించుకోలేదు. వేలకోట్ల బడ్జెట్ ఉన్న జీహెచ్ఎంసీకి తగిన విధంగా ఐటీ విభాగం లేదు. బయోమెట్రిక్ హాజరులోనూ ఎన్నో పర్యాయాలు నకిలీ వేలిముద్రలు పట్టుబడ్డా చర్యల్లేవు. చూసీ చూడనట్లు ఎందుకో..? దాదాపుగా అన్ని సేవలూ ఆన్లైన్ చేశాక.. తమకు పై ఆదాయం తగ్గినందున జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులే అక్రమాలు జరిగినా చూసీ చూడనట్లు ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. తద్వారా ఆన్‌లైన్‌ను ఎత్తివేస్తారనే యోచనతోనే ఇలా వ్యవహరించి ఉంటారని జీహెచ్ఎంసీ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా సెల్ఫ్ అసెస్మెంట్ వల్ల ప్రభుత్వ భవనాల్ని సైతం ప్రైవేట్ వ్యక్తులు సెల్ఫ్ అసెస్ చేసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వీటికి బదులేదీ..? ♦ కొద్దికాలం క్రితం బర్త్ సర్టి ఫికెట్లో పేరులో ఒక అక్షరం తప్పు పడితే దాన్ని సరిచేసుకునేందుకు మీసేవా కేంద్రాల్లో అవసరమైన పత్రాలన్నీ సమర్పించినా.. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని సర్కిల్ కార్యాలయాలకు రావాల్సిందిగా సమాచారమిచ్చేవారు. అలాంటి జీహెచ్ఎంసీ అధికారులే నాన్‌అవైలబిలిటికీ సంబంధించిన బర్త్, డెత్ సర్టి ఫికెట్ల జారీలో ఎందుకు కళ్లు మూసుకున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ♦ గతంలో ఏభవనానికి ఎంత ఆస్తిపన్ను బకాయి ఉందో ఎవరైనా తెలుసుకోగలిగేవారు. బకాయిల వివరాలు ఇతరులకు తెలియకుండా ఉండేందుకు భవన యజమాని ఫోన్‌కే ఓటీపీ వచ్చేలా ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ.. ఎంతో కీలకమైన సర్టి ఫికెట్లు ఎలాంటి పరిశీలన లేకుండానే జారీ అయ్యేలా ఎందుకు వ్యవహరించిందో అంతుబట్టడం లేదు. -
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఇక ఆఫీసుల చుట్టూ తిరగొద్దు!
ఖమ్మం మయూరిసెంటర్: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఇక ఎక్కడెక్కడో తిరగాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఆస్పత్రులు, పురపాలికలు అంటూ ఎంతో కొంత ఖర్చు చేసి ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. ఇక నుంచి అలాంటి అవసరమే లేకుండా ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాల జారీని సులభతరం చేసింది. ఇప్పటివరకు వాటి కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా అనేక కొర్రీలతో అధికారులు జారీ చేసేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాల జారీలో మార్పులు తీసుకొచ్చి అమలు చేస్తుంది. పుట్టిన వెంటనే రికార్డు నమోదయ్యేలా కీలక మార్పులు చేసింది. అలాగే మరణించిన వ్యక్తి వివరాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంది. జన్మించిన, మరణించిన చోటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకొచ్చింది. ఆస్పత్రిలోనే.. శిశువు జన్మిస్తే ధ్రువీకరణ పత్రం కోసం ఇంతకుముందు ఆస్పత్రి వారు పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలు, సమయం నమోదు చేసి మున్సిపల్ కార్యాలయానికి పంపించేవారు. అక్కడ ఆస్పత్రి వారు పంపించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసే వారు. ఫామ్ 1,2 మున్సిపల్ అధికారులే రిజిస్ట్రేషన్ చేసేవారు. ఈ విధానాన్ని మార్చిన ప్రభుత్వం ఫామ్ 1,2 రిజిస్ట్రేషన్‌ను ఆస్పత్రులకే అప్పగించింది. శిశువు జన్మించగానే ఆన్లైన్లో తమ ఆస్పత్రి కోడ్‌తో ఫామ్ 1,2 రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఒకట్రెండు రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రం ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. జనన ధ్రువీకరణ పత్రంలో సవరణలు ఉంటే నేరుగా మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు ఆన్లైన్లో సవరణల దరఖాస్తును పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. మరణించిన వెంటనే.. మరణ ధ్రువీకరణ పత్రాన్ని సులువుగా పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఎవరైనా ఆస్పత్రిలో మరణిస్తే అక్కడే వ్యక్తి ఆధార్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆస్పత్రిలో రిజిస్ట్రేషన్ చేయని పక్షంలో వైకుంఠధామంలో మున్సిపల్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడతారు. ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్ద మరణించినా.. సంబంధిత వ్యక్తి వివరాలను ఇంటి వద్ద లేదా దహన సంస్కారాల ముందు వైకుంఠధామంలో రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ అనంతరం మున్సిపల్ అధికారులు సంతకం చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. వ్యక్తి బంధువులు దానిని ఆన్లైన్లో పొందవచ్చు. ఇక ఇంటి వద్ద మరణించిన వ్యక్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కార్పొరేషన్ అధికారులు ఇంటి వద్దనే పూర్తి చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు. కీలక మార్పులు.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా జరిగేందుకు ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఆస్పత్రిలో జన్మించినా, మరణించినా అక్కడే సంబంధిత వివరాలను ఆస్పత్రి సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ వివరాల ప్రకారం ధ్రువీకరణ పత్రం మంజూరవుతుంది. ఒకవేళ సవరణలు చేసుకునేందుకు మీ సేవల్లో దరఖాస్తు చేసుకుంటే మున్సిపాలిటీ నుంచి సవరణ చేసి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తారు. జనన, మరణ రిజిస్ట్రేషన్ల కోసం మున్సిపాలిటీలకు రావాల్సిన అవసరం లేదు. – ఆదర్శ్ సురభి, కేఎంసీ కమిషనర్ -
దళారుల దందా..!
► జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ► ఉచితంగా ఆసుపత్రుల్లోనే పంపిణీ ► తెలియని వారి నుంచి సొమ్ము దండుకుంటున్న వైనం ప్రస్తుతం జనన, మరణ ధ్రువీకరణ పత్రాల అవసరం ప్రతి ఒక్కరికి సర్వ సాధారణమైంది. విద్యాభ్యాసం నుంచి ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకునేంత వరకు అవసరం ఏదైనా జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయగా... చనిపోయిన వారి మరణాన్ని ధ్రువీకరిస్తూ అధికారికంగా జారీ చేసే ధ్రువపత్రానికి అంతే విలువ పెరిగిపోయింది. ఈ రెండు పత్రాలు పొందే ప్రక్రియ తెలియని వారు దళారుల వలలో పడి మోసపోతున్నారు. విజయనగరం మున్సిపాలిటీలో ఇదే అదునుగా చేసుకుంటున్న పలువురు మున్సిపల్ సిబ్బందితో పాటు వారి అనుచరులుగా వ్యవహరిస్తున్న దళారులు అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజుకుంటున్నారు. ఉచితంగానే ఇచ్చే ధ్రువీకరణ పత్రాల కోసం జేబులు గుల్ల చేసుకుంటున్నారు. విజయనగరం: విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో నిత్యం జననలతో పాటు మరణాలు పదుల సంఖ్యలోనే జరుగుతుంటాయి. జిల్లా కేంద్రం కావటం... పేరొందిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇక్కడే ఉండటంతో గర్బిణులు ప్రసవంతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి చికిత్సలు చేయిస్తుంటారు. ఇలా వైద్య సేవల కోసం వచ్చిన వారిలో నూతనంగా జన్మించిన పిల్లలు, పరిస్థితి చేయిదాటి మరణించిన వారు ఉంటారు. వీరికి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. అయితే ఈ రెండు పత్రాల జారీకి సంబంధించి దళారుల అడ్డుగోళ్ల వసూళ్లపై స్పందించిన ప్రభుత్వం గతేడాది డిసెంబర్ ఒకటి అనంతరం జన్మించిన జననాలు, మరణాల ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా ఆయా ఆసుపత్రులు, మున్సిపాలిటీలు నుంచి పొందే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. విషయం తెలియని పలువురు దళారుల పాలిట పడి చేతి చమురు వదిలించుకుంటున్నట్లు సర్వత్రా వినిపిస్తోంది. ఇందుకు గతంలో అమల్లో విధానం ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. జనన, మరణాలకు సంబంధించిన ధ్రువీకరణలను మున్సిపాలిటీ ధ్రువీకరరించిన తరువాత మీసేవా కేంద్రాల ద్వారా పొందే వారు. అయితే ఈ ప్రక్రియలో దళారులు కీలక పాత్ర పోషించే వారన్న అపవాద లేకపోలేదు. దీంతో నూతన విధానం ద్వారా దళారుల ఆగడాలకు చెక్ పెట్టారు. అధికారిక లెక్కల ప్రకారం విజయనగరం మున్సిపాలిటీలో నూతన విధానం అమలు తరువాత ఇప్పటి వరకు 400 మరణాలు, 920 జననాలు జరిగినట్లు మున్సిపల్ అధికారుల సమాచారం. వీరిలో 300 జననాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను మున్సిపాలిటీ నుంచి సదరు పిల్లల తల్లిదండ్రులు పొందారు. అయితే జనన ధ్రువీకరణకు సంబంధించి ఆయా ఆసుపత్రుల్లోనే ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రుల్లో చికిత్స కోసం వెళ్లి మరణిస్తే సదరు ధ్రువీకరణ పత్రం కూడా అక్కడే పొందవచ్చు. అదే ఇంటి వద్దనే సాధారణ మరణం సంభవిస్తే వివరాలను మున్సిపల్ కార్యాలయంలో నమోదు చేయించుకోవటం ద్వారా ధ్రువీకరణ పత్రం తీసుకోవచ్చు. విషయం తెలియని చాలా మంది దళారుల చేతికి చిక్కి ఇబ్బందులు పడుతున్నట్లు కార్యాలయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా.... 2016 సంవత్సరం డిసెంబర్ ఒకటి అనంతరం మున్సిపాలిటీ పరిధిలో జరిగే జనన, మరణాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఉచితంగానే అందజేస్తున్నట్టు చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న వారు సదరు ఆసుపత్రి నుంచే పొందవచ్చని, ఇంటి వద్ద జరిగే వాటికి సంబంధించి మున్సిపాలిటీలో నమోదు చేయించుకుని ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుందన్నారు. -
ఆసుపత్రుల్లోనే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: జనన మరణ ధ్రువీకరణ పత్రాలను ఇక నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ జారీ చేయనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి, సుల్తాన్ బజారులోని ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి, పేట్లబుర్జు మోడ్రన్ ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి, నిలోఫర్ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, ఈఎన్టీ ఆసుపత్రి, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, మానసిక ఆరోగ్య కేంద్రం, చెస్ట్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ఎంఎన్‌జె కేన్సర్ ఆసుపత్రి, నిమ్స్, రైల్వే ఆసుపత్రి, ఆర్టీసీ ఆసుపత్రి, గోల్కొండలోని మిలటరీ ఆసుపత్రి, తిరుమలగిరి మిలటరీ ఆసుపత్రి, వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి, సీకేఎం మెటర్నిటీ ఆసుపత్రి, కంటి ఆసుపత్రి, టీబీ ఆసుపత్రి, నిజామాబాద్, మహబూబ్నగర్ల్లోని జనరల్ ఆసుపత్రులు, ఆదిలాబాద్ రిమ్స్, అన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లోని సివిల్ సర్జన్ హోదా కలిగిన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు (ఆర్ఎంవో) ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడానికి అవకాశం కల్పించారు. అలాగే సీహెచ్ఎస్ డిప్యూటీ సివిల్ సర్జన్లు, పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లు ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. వీళ్లకు జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు వీలుగా రిజిస్ట్రార్ హోదా కల్పిస్తారు. అలాగే జనన మరణ ధ్రువీకరణ పత్రాల్లో ప్రస్తుతం పురుషులు, మహిళలు అనే కాలమ్ మాత్రమే ఉంది. ఈ రెండు కాకుండా మరో మూడో వర్గం కోసం కాలమ్‌ను కొత్తగా ఉంచుతారు. మరణానికి కారణమేంటో చెప్పాలి.. ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతికి కారణాలను వైద్యం చేసిన డాక్టరే ప్రతీ నెల ఐదో తేదీ నాటికి రాష్ట్రస్థారుు కమిటీకి తెలపాలి. ఇక మరణాలపై గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మండలాల్లో ఎంపీడీవోలు విచారణ చేసి జిల్లా డీఎంహెచ్‌వోలకు నివేదిక అందించాలి. -
ఇక ఆస్పత్రుల్లోనే ఆధార్ నమోదు
♦ పీహెచ్‌సీల్లో సిబ్బందికి శిక్షణ ♦ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి సన్నాహాలు ♦ జిల్లా వ్యాప్తంగా త్వరలో ప్రారంభం ఒంగోలు: ఇక నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆధార్ నమోదుతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేసేందుకు వైద్యశాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఇప్పటికే అవసరమైన సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసింది. పీహెచ్‌సీలను మరింత బలోపేతం చేసేందుకు ప్రజలు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు. గతంలో బిడ్డ పుట్టిన వెంటనే ఆయా గ్రామాల్లో, లేదా మున్సిపాల్టీల్లో సమాచారం అందించాల్సి ఉంది. అప్పుడు సంబంధిత అధికారులు బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేవారు. ఇప్పుడు ప్రజలకు సేవలు చేరువ చేసేందుకు ఆసుపత్రిలో ప్రసవం జరిగిన వెంటనే జనన ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు. అలాగే ఆసుపత్రిలో మరణించినా వారికి కూడా మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ఈ పథకం అమలు చేయనున్నారు. మరి కొద్ది రోజుల్లో పీహెచ్‌సీల్లో ప్రసవం అయిన వెంటనే శిశువుకు ఆధార్ నమోదుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ఇటీవల 56 మండలాల్లోని పీహెచ్‌సీల్లోని స్టాఫ్‌నర్స్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన సామగ్రి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియను కూడా ప్రజలు అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి చిన్నారి కూడా ఆధార్ కార్డు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు కేవలం 60 శాతం లోపు ఆధార్ నమోదులున్నాయని వీటిని పెంచేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని అధికారులంటున్నారు. ప్రత్యేక శిక్షణనందించాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరుగుతున్న కాన్పులకు వెంటనే జనన ధ్రువీకరణ పత్రాలు అందిస్తున్నాం. వీటితో పాటు ఆధార్ నమోదుకు కూడా పీహెచ్‌సీల్లోని స్టాఫ్ నర్సులకు జిల్లా కేంద్రాల్లో శిక్షణనిచ్చారు. త్వరలో వాటికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది. పీహెచ్‌సీల్లో బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్ నమోదు చేయడం వలన ఉపయోగంగా ఉంటుంది. - డాక్టర్ కె.రమాదేవి, దగ్గుబాడు -
ఆ పత్రాల జారీ ఇలాగేనా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ తీరును కేంద్రం ఆక్షేపించింది. జనన నమోదు లేదా మృతి చెందిన వారి తరఫు బంధువులకు పెన్షన్ లేదా భూముల బదలాయింపు తదిత రాలకు అవసరమైన డెత్ సర్టిఫికెట్లకోసం వస్తే వారిని కార్యాలయాల చుట్టూ తిప్పడం దారుణమని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ (బర్త్స్ అండ్ డెత్స్)...రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పంచాయితీలు, మున్సిపాలిటీల్లో జారీ చేస్తారు. అయితే వాటికోసం సామాన్యులు వారంరోజులపాటు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఈ పత్రాల జారీలో తీవ్ర జాప్యంపాటు, ప్రతి పత్రానికి ఓ ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. వాస్తవానికి జనన లేదా మరణ నమోదు జరిగాక తొలి కాపీని ఆర్బీడీ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఉచితంగా ఇవ్వాలి. అయితే ఎక్కడా అలా జరగడం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో సామాన్యులు డబ్బు చెల్లించి అవసరమైన పత్రాలను తెచ్చుకుంటున్నారు. ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు పత్రాల జారీలో అవకతవకలపై రాష్ట్రం నుంచి ఫిర్యాదులందడంతో ప్రధాని కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఇది సామాన్యుడి సేవకు సంబంధించిన అంశమని, సవ్యంగా జరగకపోతే సంబంధితులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. సామాన్యుడిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని పేర్కొంది. జాప్యం కాకుండా చూడండి రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీ కార్యాలయాలు లేదా మున్సిపాలిటీల్లో ధ్రువీకరణ పత్రాలు జారీలో జాప్యం కాకుండా చూడాలని చీఫ్ రిజిస్ట్రార్ (బర్త్స్ అండ్ డెత్స్) ఆయా విభాగాలకు లేఖ రాశారు. బర్త్ రిజిస్ట్రేషన్ల విభాగంలో ఒకే పోస్టులో మూడేళ్లకు మించి ఉద్యోగి పనిచేస్తుంటే బదిలీ చేయాలని, పత్రాల జారీకి డబ్బు అడిగితే ఆర్బీడీ చట్టంలోని సెక్షన్ 23(2) ప్రకారం జరిమానా విధించాలని లేదా చర్యలు తీసుకోవచ్చని సదరు లేఖలో పేర్కొన్నారు. సామాన్యులకు తక్షణమే అవసరమైన పత్రాలను జారీచేయాలని సూచించారు. -
యాక్షన్ మొదలు !
జీవీఎంసీ అధికారుల్లో గుబులు సూపరింటెండెంట్లు మార్పు ముగ్గురికి మెమోలు జారీ విశాఖపట్నం సిటీ : జీవీఎంసీ అధికారుల్లో గుబులు మొదలైంది. మున్సిపల్ కమిషనర్ పర్యటనంటే హడలెత్తిపోతున్నారు. మురికివాడల్లో పర్యటనంటే తమపైనే ఫిర్యాదులుంటాయని గుర్తించిన ప్రజారోగ్య శాఖ ఉద్యోగులైతే ఆందోళన చెందుతున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లలో అయితే ఈ గుబులు మరీ ఎక్కువగా ఉంది. వార్డు పర్యటనంటే ప్రతీ దానికి తమపైనే భారం వేస్తుండడంతోపాటు చీవాట్లు, మెమోలు, సస్పెన్షన్లన్నీ తమకే వర్తిస్తున్నాయని వాపోతున్నారు. గత మూడు రోజుల్లో మూడు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మొదటి రోజు తప్పితే రెండు రోజులూ శానిటరీ ఇన్‌స్పెక్టర్లనే బాధ్యులను చే స్తూ మెమోలు ఇచ్చారు. బుధవారం నాటి పర్యటనలో అయితే సహాయ మెడికల్ ఆఫీసర్‌తో పాటు శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ముగ్గురికి గురువారం చీఫ్ మెడికల్ ఆఫీసర్ మెమోలు జారీ చేశారు. వారం రోజుల్లో మార్పు కనిపించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్న కమిషనర్ అందుకు తగ్గట్టుగానే ఫిర్యాదులొచ్చే ప్రాంతాలపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఈ పర్యటనలకు మీడి యాను దూరంగా ఉంచుతూనే వార్డుల్లో సమస్యలను తెలుసుకుంటున్నారు. సమీక్షలకు హాజరయ్యే అధికారులు ఆ తర్వాత ఆ పనులపై ఎంత వరకూ దృష్టి పెడుతున్నారో పసిగట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీ సేవలో జనన, మరణ ధ్రువపత్రాలు జనన, మరణ ధృవీకరణ పత్రాలను ఇకపై మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటి నమోదు, విచారణ, జారీ వంటి పనుల కోసం కొందరు జీవీఎంసీ సిబ్బంది అదే పనిగా ఉండిపోవడంతో కమిషనర్‌కు ఆగ్రహం తెప్పించింది. జనన, మరణ పత్రాల సంగతి మీసేవ సిబ్బంది చూసుకుంటే జీవీఎంసీ సిబ్బందికి పని ఒత్తిడి ఉండదని, ఆ కారణంగా మరి కొన్ని పనులు అయ్యే అవకాశం ఉంటుందని గుర్తించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చే యాల్సిందిగా ప్రజారోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జీవీఎంసీ సౌకర్యం ద్వారా రోజుకు 150 నుంచి 200 మందికి జనన మరణ ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నారు. త్వరలో మరిన్ని బదిలీలు ప్రజారోగ్య శాఖ సూపరింటెండెంట్ బాబూరావును రెవెన్యూ సెక్షన్‌కు బదిలీ చేశారు. రెవెన్యూ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న హెన్నాను ప్రజారోగ్యశాఖ సూపరింటెండెంట్‌గా నియమించారు. మరికొన్ని శాఖల్లోనూ త్వరలో సూపరింటెండెంట్ల సీట్లు మారే ఛాన్స్‌లున్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఇదేనా.. ఈ- పంచాయ(యి)తీ
అమలుకు ఆమడదూరం కొన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం నిల్ సర్టిఫికెట్లు ఇవ్వలేని తీరు ప్రస్తుతం అకౌంట్ల నమోదుకే పరిమితం 970కు గానూ... 344 పంచాయతీలకే.... జనన మరణ ధ్రువీకరణ పత్రాలను సకాలంలో ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో...ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘ఈ పంచాయతీ’ బాలారిష్టాలు దాటలేదు. నాలుగు నెలల క్రితమే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినప్పటికీ... మొదటి దశ పంచాయతీలే ఇంకా పూర్తి స్థాయిలో సేవలందించలేకపోతున్నాయి. ప్రతి పత్రం ఆన్లైన్ ద్వారా అందిస్తామని చెప్పిన అధికారులు... ఇప్పటి వరకు కొన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యమే కల్పించలేదు. దీంతో ఆపరేటర్లు ఖాళీగా ఉంటూ వేతనాలందుకుంటున్నారు. గుడివాడ : గ్రామ పంచాయతీల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈపంచాయతీలు అలంకార ప్రాయంగా మారాయి. ఈ పంచాయతీ ద్వారా ధ్రువీకరణ పత్రాల జారీకి కావాల్సిన సాఫ్టు వేర్‌ను ఇంతవరకు రూపొందించలేదని తెలుస్తోంది. ఒక్కో పంచాయతీకి రూ.1.50లక్షల వ్యయంతో కంప్యూటర్, స్కానర్, ప్రింటర్, యూపీఎస్, బ్రాడ్‌బ్యాండు సౌకర్యం కల్పించారు. అయితే కొన్ని చోట్ల బీఎస్ఎన్ఎల్ బ్రాండ్ బ్యాండు అందుబాబులో లేకపోవటంతో పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లకు పని లేకుండాపోయింది. జిల్లాలో 546 ఈ-పంచాయతీలు... సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు మేలైన పాలన అందించే పేరుతో ఈఏడాది జూలైలో ఈ- పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లాలో 970 గ్రామ పంచాయతీలుండగా... వాటిలో క్లష్టర్ పంచాయతీలుగా ఉన్న 546 గ్రామ పంచాయతీల్లో ఈ- పంచాయతీ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అయితే 362 గ్రామ పంచాయతీల్లోనే కంప్యూటర్లు ఏర్పాటు చేసి తాత్కాలిక పద్ధతిపై ఆపరేటర్లను నియమించారు. ఇంకా 184 క్లష్టర్ పంచాయతీల్లో ఇందుకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయని పంచాయతీ సర్పంచులు చెబుతున్నారు. ఇంటర్నెట్ బ్రాండ్ బ్యాండ్ ఇక్కట్లు.... ఈ- పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు ఏర్పాటుచేసిన 362 గ్రామ పంచాయతీల్లో దాదాపు 20చోట్ల ఇంటర్నెట్ సౌకర్యంలేక కంప్యూటర్లు పనిచేయడంలేదు. క్లష్టర్ పంచాయతీకి దగ్గర్లో ఉండి నెట్ సౌకర్యం ఉన్న పం చాయతీల్లోకి కంప్యూటర్లు మార్చుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులు సూచించారు. దీంతో గుడివాడ రూరల్ మండలంలోని సీపూడి, రామనపూడి పంచాయతీల్లోని కంప్యూటర్లును వేరో పంచాయతీకి మారుస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ధ్రువీకరణ పత్రాల సాఫ్ట్వేర్ ఏదీ?... ఈ- పంచాయతీల నిర్వాహణ పంచాయతీరాజ్ ఇనిస్టిట్యూషనల్ అకౌంటింగ్ (పీఆర్ఐఏ) సాఫ్ట్వేర్ ద్వారా కొనసాగుతోంది. ప్రస్తుతం అన్ని పంచాయతీల్లో 2011నుంచి ఉన్న అకౌంట్స్‌ను ఆన్లైన్ చేస్తున్నారు. జమా ఖర్చులు బిల్లులు వంటివి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ద్వారా ఏఏ పంచాయతీ ఏపనికి ఎంత బిల్లు చెల్లించిందో ఆన్లైన్ ద్వా రా తెలుస్తుంది. ఈ- పంచాయతీ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి విలువ పత్రాలు, ఆస్తిపన్ను వసూళ్ల ఎంట్రీలు, వివిధ శాఖల డేటా ఎంట్రీలు, చేయాల్సి ఉంది. నాలుగు నెలలు దాటినా ఈ తర హా సేవలు ఎక్కడా ప్రారంభించలేదు. నెలరోజుల్లో అన్ని సేవలు అందిస్తాం.. మరో నెల రోజుల్లో ఈ-పంచాయతీల్లో అన్ని సేవ లూ అందిస్తాం. ఇప్పటికే కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి వారికి శిక్షణ ఇచ్చాం. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ అందుబాటులో లేని చోట్ల వేరే ప్రాంతానికి కం ప్యూటర్లు మారుస్తున్నాం. ఇకపై ప్రపంచంలో ఎక్క డ ఉన్నా వారి జనన మరణ ధ్రువీకరణ పత్రాలు పొందే అవకాశం ఉంది. రెండవ ఫేజ్‌లో అన్ని పంచాయతీలను ఈ-పంచాయతీలుగా మారుస్తాం. - వరప్రసాద్, డీఎల్పీవో, గుడివాడ. -
‘మీ సేవ’ కష్టాలు
జనన, మరణ ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం వేధిస్తున్న డిజిటల్ సిగ్నేచర్ సమస్య రెండునెలలుగా జనం అవస్థలు అనకాపల్లి : అనకాపల్లి జోనల్ పరిధిలో జనన, మరణ ధ్రువపత్రాల కోసం మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే జారీ కావడం లేదు. జీవీఎంసీ ద్వారా విడుదలయ్యే ధ్రువపత్రాలకు మీసేవా కేంద్రం హెడ్‌క్వార్టర్ ద్వారా డిజిటల్ సిగ్నేచర్ కీ సౌకర్యం ఉండాలి. మీసేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకుంటే వారికి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే వ్యవస్థ అనకాపల్లి జోనల్లో లేకుండా పోయింది. హైదరాబాద్‌లోని ఎన్ఐసీ మీసేవ కేంద్రాల ద్వారా వచ్చే దరఖాస్తులకు స్థానిక కార్యాలయంలో డిజిటల్ సిగ్నేచర్ సౌకర్యం కల్పిస్తేనే పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలుగుతుంది. మూడురోజుల నుంచి అనకాపల్లి జోనల్ కార్యాలయంలో సర్టిఫికెట్లు మాన్యువల్ పద్ధతిలో అందించడంతో కొద్దిగా వత్తిడి తగ్గినప్పటికీ పెండింగ్ దరఖాస్తులు రెండువేలకు పైగానే ఉన్నాయి. అన్ని ధ్రువీకరణ పత్రాలతో పాటు పలు సేవలను మీసేవా కేంద్రం ద్వారా పొందవచ్చని ప్రభుత్వం గొప్పలు చెబుతూంటే అనకాపల్లి జోనల్లో మాత్రం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు మీసేవా సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం. అనకాపల్లి అంటే అలుసే అనకాపల్లి జోనల్ అంటే జీవీఎంసీ అధికారులకు అలుసుగానే కనిపిస్తోంది. గతంలోనూ హెల్త్ ఆఫీసర్ పోస్టుకు ఇన్‌ఛార్జినే నియమించి కాలం వెళ్లదీసిన జీవీఎంసీ అధికారులు రెండు నెలలుగా హెల్త్ ఆఫీసర్ లేకపోయినా పట్టించుకోవడం లేదు. తాజాగా గాజువాక జోనల్ హెల్త్ ఆఫీసర్‌కు అనకాపల్లి జోనల్ హెల్త్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో మళ్లీ ఇన్చార్జి పాలనలోనే పబ్లిక్ హెల్త్ విభాగం కొనసాగనుంది. కీలకమైన పారిశుద్ధ్య వ్యవస్థ నిర్వహణతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆహారోత్పత్తులపై పర్యవేక్షణ వంటి అధికారాలు ఉన్న హెల్త్ ఆఫీసర్ నియామకం విషయంలో ఉన్నతాధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ సిగ్నేచర్ కీ లేకే జాప్యం : జోనల్ కమిషనర్ ఈ సమస్యపై అనకాపల్లి జోనల్ కమిషనర్ డి.చంద్రశేఖరరావును వివరణ కోరగా డిజిటల్ సిగ్నేచర్ కీ సౌకర్యం ఉన్న జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయని, మీ సేవా కేంద్రానికి ఆ సౌకర్యం లేకపోవడం వల్లే జాప్యం అవుతోందని చెప్పారు. డిజిటల్ సిగ్నేచర్ కీ కోసం ఇప్పటికే దరఖాస్తు చేశామని, ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిలో ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు.