యాక్షన్ మొదలు !
జీవీఎంసీ అధికారుల్లో గుబులు
సూపరింటెండెంట్లు మార్పు ముగ్గురికి మెమోలు జారీ
విశాఖపట్నం సిటీ : జీవీఎంసీ అధికారుల్లో గుబులు మొదలైంది. మున్సిపల్ కమిషనర్ పర్యటనంటే హడలెత్తిపోతున్నారు. మురికివాడల్లో పర్యటనంటే తమపైనే ఫిర్యాదులుంటాయని గుర్తించిన ప్రజారోగ్య శాఖ ఉద్యోగులైతే ఆందోళన చెందుతున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లలో అయితే ఈ గుబులు మరీ ఎక్కువగా ఉంది. వార్డు పర్యటనంటే ప్రతీ దానికి తమపైనే భారం వేస్తుండడంతోపాటు చీవాట్లు, మెమోలు, సస్పెన్షన్‌లన్నీ తమకే వర్తిస్తున్నాయని వాపోతున్నారు. గత మూడు రోజుల్లో మూడు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మొదటి రోజు తప్పితే రెండు రోజులూ శానిటరీ ఇన్‌స్పెక్టర్లనే బాధ్యులను చే స్తూ మెమోలు ఇచ్చారు.
బుధవారం నాటి పర్యటనలో అయితే సహాయ మెడికల్ ఆఫీసర్‌తో పాటు శానిటరీ సూపర్‌వైజర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ముగ్గురికి గురువారం చీఫ్ మెడికల్ ఆఫీసర్ మెమోలు జారీ చేశారు. వారం రోజుల్లో మార్పు కనిపించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్న కమిషనర్ అందుకు తగ్గట్టుగానే ఫిర్యాదులొచ్చే ప్రాంతాలపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఈ పర్యటనలకు మీడి యాను దూరంగా ఉంచుతూనే వార్డుల్లో సమస్యలను తెలుసుకుంటున్నారు. సమీక్షలకు హాజరయ్యే అధికారులు ఆ తర్వాత ఆ పనులపై ఎంత వరకూ దృష్టి పెడుతున్నారో పసిగట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మీ సేవలో జనన, మరణ ధ్రువపత్రాలు
జనన, మరణ ధృవీకరణ పత్రాలను ఇకపై మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటి నమోదు, విచారణ, జారీ వంటి పనుల కోసం కొందరు జీవీఎంసీ సిబ్బంది అదే పనిగా ఉండిపోవడంతో కమిషనర్‌కు ఆగ్రహం తెప్పించింది. జనన, మరణ పత్రాల సంగతి మీసేవ సిబ్బంది చూసుకుంటే జీవీఎంసీ సిబ్బందికి పని ఒత్తిడి ఉండదని, ఆ కారణంగా మరి కొన్ని పనులు అయ్యే అవకాశం ఉంటుందని గుర్తించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చే యాల్సిందిగా ప్రజారోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జీవీఎంసీ సౌకర్యం ద్వారా రోజుకు 150 నుంచి 200 మందికి జనన మరణ ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నారు.
త్వరలో మరిన్ని బదిలీలు
ప్రజారోగ్య శాఖ సూపరింటెండెంట్ బాబూరావును రెవెన్యూ సెక్షన్‌కు బదిలీ చేశారు. రెవెన్యూ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న హెన్నాను ప్రజారోగ్యశాఖ సూపరింటెండెంట్‌గా నియమించారు. మరికొన్ని శాఖల్లోనూ త్వరలో సూపరింటెండెంట్ల సీట్లు మారే ఛాన్స్‌లున్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.