Commissioner Praveen Kumar
-
ఫలించని చివరి ప్రయత్నం...
డ్రైనేజీలను జల్లెడ పట్టిన జీవీఎంసీ అంతుచిక్కని అదితి ఆచూకీ నిరాశపరచిన సీసీ కెమెరాల ఫుటేజి ఎంవీపీ కాలనీ: ఐదు రోజులు... 120 గంటలు... 300మంది జీవీఎంసీ సిబ్బంది... ఐదు నేవీ బోట్లు... రెండు హెలికాప్టర్లు... డేగ కళ్లతో అదితి కోసం వెదికినా ఫలితం లేకపోయింది. ఎంత గాలించినా సోమవారం కూడా చిన్నారి జాడ అంతుచిక్కడం లేదు. చివరి ప్రయత్నంగా గెడ్డల మార్గాన్ని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ జల్లెడ పట్టించారు. ఎంవీపీకాలనీ సెక్టార్-1లోని డ్రైనేజ్ లోపల వంద ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి మూడు మోటార్లతో కాలువలో నీరు తోడించారు. పూర్తిగా డ్రై చేసి 100మంది సిబ్బంది అణువణువూ గాలించారు. జోన్-2 కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు డ్రైనేజీలను 25సార్లు సిబ్బంది వెతికినప్పటికీ కనిపించలేదని చెప్పారు. నేవీకి చెందిన జెమినీ బోట్లతో సముద్రంలోని 20 కిలోమీటర్ల వరకు వెతికామన్నారు. ఇంకా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరి మీదా అనుమానం లేదు... అదితిని కిడ్నాప్ చేశారన్న అనుమానాలేవీ లేవని పాప బంధువు శాస్త్రి చెప్పారు. అయితే కాలువలో కొట్టుకుపోతూ ఎవరికైనా దొరికి ఉంటుందన్న ఆశ మాత్రం ఇంకా మిగిలేవుందన్నారు. పాప బతికి ఉంటుందని అనుకుంటున్నాం. పాప బెంగళూరులో జన్మించి రెండు సంవత్సరాలుగా తాత వద్ద పెరుగుతోందని తెలిపారు. గురువారం సాయంత్రం ఏం జరిగిందని ట్యూషన్ టీచర్‌ను పోలీసులు విచారించినట్లు సమాచారం. సంఘటన స్థలానికి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజిని వెదికినా ఏమీ కనిపించకపోవడంతో పోలీసులు నిరాశకు లోనయ్యారు. -
ప్లాస్టిక్ వాడితే రూ.500 పెనాల్టీ
అధికారులకు కమిషనర్ ఆదేశం విశాఖపట్నం సిటీ: ప్లాస్టిక్ నిషేధం మార్చి నుంచీ అమల్లోకి వచ్చినందున ఇక ఎవరు దాన్ని వాడినా రూ. 500 పెనాల్టీ వేయాలని కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన రోడ్డు పక్కన ఉండే హోటళ్లపై దృష్టి సారించారు. హోటళ్లలో టీ కప్‌లు, చట్నీలు కట్టే ప్లాస్టిక్ కవర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీశారు. తోపుడు బండిపై టిఫిన్లు అమ్ముతున్న ఓ వ్యక్తికి రూ. 500 జరిమానా వేశారు. ఆయన వద్ద నుంచి పెద్ద సంఖ్యలో లభించిన ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ వాడేవారిని వదలవద్దని అధికారులకు కమిషనర్ సూచించారు. ప్రతీ దుకాణం దగ్గరా ఉండి పరి శీలించాలని, ఎవరైనా ప్లాస్టిక్ కవర్లతో వెళుతుంటే ఆ దుకాణ యజమానిని నిలదీయాలని, భారీ పెనాల్టీలు వసూలు చేసే వరకూ వెనకాడవద్దని సూచించారు. పెనాల్టీలను చూసి ఆ జోలికి వెళ్లకుండా చేయాలన్నారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ డాక్టర్. వై.శ్రీనివాసరావు, ఏఎంఓహెచ్ డా క్టర్ రామ్మోహన్, ఇఇ కృష్ణారావు, దామోదర్ పాల్గొన్నారు. సానుభూతితో కాంట్రాక్టర్ల సమస్యలు సానుభూతితోనే కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరిస్తానని కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అ న్నారు. పాత కౌన్సిల్ హాల్లో సోమవారం కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులతో సమావేశమై స్మార్ట్ సిటీ అభివృద్దికి సహకరించాలన్నారు. కాంట్రాక్టర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు డి. నారాయణ రెడ్డి, అధ్యక్షుడు రొంగలి జగన్నాథం, ఆర్గనైజింగ్ కార్యదర్శి సనపల వర ప్రసాద్‌తో పాటు 150 మంది పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ : ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడమే ల క్ష్యంగా పలు వార్డులను దత్తత తీసుకోవడానికి పేర్లను నమోదు చేసుకోవాలని కమిషనర్ అన్నారు. కౌన్సిల్ హాల్లో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ వార్డుల అభివృద్ధిపై ఆసక్తి కలిగిన అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. ప్రజలందరికీ ఇల్లు, స్వయం సంఘాలకు మార్కెట్ నిపుణత, బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి 20 అంశాలపై పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. -
యాక్షన్ మొదలు !
జీవీఎంసీ అధికారుల్లో గుబులు సూపరింటెండెంట్లు మార్పు ముగ్గురికి మెమోలు జారీ విశాఖపట్నం సిటీ : జీవీఎంసీ అధికారుల్లో గుబులు మొదలైంది. మున్సిపల్ కమిషనర్ పర్యటనంటే హడలెత్తిపోతున్నారు. మురికివాడల్లో పర్యటనంటే తమపైనే ఫిర్యాదులుంటాయని గుర్తించిన ప్రజారోగ్య శాఖ ఉద్యోగులైతే ఆందోళన చెందుతున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లలో అయితే ఈ గుబులు మరీ ఎక్కువగా ఉంది. వార్డు పర్యటనంటే ప్రతీ దానికి తమపైనే భారం వేస్తుండడంతోపాటు చీవాట్లు, మెమోలు, సస్పెన్షన్లన్నీ తమకే వర్తిస్తున్నాయని వాపోతున్నారు. గత మూడు రోజుల్లో మూడు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మొదటి రోజు తప్పితే రెండు రోజులూ శానిటరీ ఇన్‌స్పెక్టర్లనే బాధ్యులను చే స్తూ మెమోలు ఇచ్చారు. బుధవారం నాటి పర్యటనలో అయితే సహాయ మెడికల్ ఆఫీసర్‌తో పాటు శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ముగ్గురికి గురువారం చీఫ్ మెడికల్ ఆఫీసర్ మెమోలు జారీ చేశారు. వారం రోజుల్లో మార్పు కనిపించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్న కమిషనర్ అందుకు తగ్గట్టుగానే ఫిర్యాదులొచ్చే ప్రాంతాలపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఈ పర్యటనలకు మీడి యాను దూరంగా ఉంచుతూనే వార్డుల్లో సమస్యలను తెలుసుకుంటున్నారు. సమీక్షలకు హాజరయ్యే అధికారులు ఆ తర్వాత ఆ పనులపై ఎంత వరకూ దృష్టి పెడుతున్నారో పసిగట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీ సేవలో జనన, మరణ ధ్రువపత్రాలు జనన, మరణ ధృవీకరణ పత్రాలను ఇకపై మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటి నమోదు, విచారణ, జారీ వంటి పనుల కోసం కొందరు జీవీఎంసీ సిబ్బంది అదే పనిగా ఉండిపోవడంతో కమిషనర్‌కు ఆగ్రహం తెప్పించింది. జనన, మరణ పత్రాల సంగతి మీసేవ సిబ్బంది చూసుకుంటే జీవీఎంసీ సిబ్బందికి పని ఒత్తిడి ఉండదని, ఆ కారణంగా మరి కొన్ని పనులు అయ్యే అవకాశం ఉంటుందని గుర్తించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చే యాల్సిందిగా ప్రజారోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జీవీఎంసీ సౌకర్యం ద్వారా రోజుకు 150 నుంచి 200 మందికి జనన మరణ ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నారు. త్వరలో మరిన్ని బదిలీలు ప్రజారోగ్య శాఖ సూపరింటెండెంట్ బాబూరావును రెవెన్యూ సెక్షన్‌కు బదిలీ చేశారు. రెవెన్యూ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న హెన్నాను ప్రజారోగ్యశాఖ సూపరింటెండెంట్‌గా నియమించారు. మరికొన్ని శాఖల్లోనూ త్వరలో సూపరింటెండెంట్ల సీట్లు మారే ఛాన్స్‌లున్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. -
బియ్యపుతిప్పలో మినీ ఫిషింగ్ హార్బర్
ఏలూరు (టూటౌన్) : జిల్లాలోని బియ్యపుతిప్పలో రూ.12 కోట్ల వ్యయంతో మినీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మత్స్యశాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. కలెక్టరేట్లో మంగళవారం హైదరాబాద్ నుంచి మత్స్యశాఖ డెప్యూటీ డెరైక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో ఆయన సమీక్షించారు. అలాగే జిల్లాలోని ఏలూరు, ఆకివీడులో రూ.రెండు కోట్ల వ్యయంతో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో మత్స్యపరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతోందని, కోట్లాది రూపాయల మత్స్య ఉత్పత్తులను ఇక్కడ్నించి ఏటా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతున్న దృష్ట్యా ఆ ప్రాంతంలో రైతులకు సరైన సలహాలు, సూచనలు అందించే ఉద్దేశంతో ఈ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తులను పెద్దఎత్తున పెంచడానికి ఆయా జిల్లాలలో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా మత ్స్య ఉత్పత్తుల అభివృద్ధికి మంజూరు చేసిన నిధులు సకాలంలో ఖర్చు చేయకపోతే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సముద్ర తీర మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక ఉపకరణాలు అందించాలని ఆదేశించామని, వైర్లెస్ సెట్లు, లైఫ్ జాకెట్లు ఉపకరణాలను తక్షణమే మత్స్యకారులకు అందించాలని సూచించారు. మత్స్యశాఖ డీడీ లాల్ మహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రప్రథమంగా చేపల చెరువుల అనుమతులకు కలెక్టర్ కె.భాస్కర్ ఆన్లైన్లో అనుమతులు ఇవ్వడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసి మీసేవలో రైతులు దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారన్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు జడ్పీ సమావేశ మందిరంలో మండల, డివిజన్, జిల్లా స్ధాయి చేపల చెరువుల అనుమతుల కమిటీ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. సమావేశంలో మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు స్టీవెన్‌రాయ్, శ్రీనివాసనాయక్, తిరుపతయ్య, వెంకటేశ్వరరావు, ప్రతిభ, రమణారావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.