ఏలూరు (టూటౌన్) : జిల్లాలోని బియ్యపుతిప్పలో రూ.12 కోట్ల వ్యయంతో మినీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మత్స్యశాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. కలెక్టరేట్‌లో మంగళవారం హైదరాబాద్ నుంచి మత్స్యశాఖ డెప్యూటీ డెరైక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో ఆయన సమీక్షించారు. అలాగే జిల్లాలోని ఏలూరు, ఆకివీడులో రూ.రెండు కోట్ల వ్యయంతో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో మత్స్యపరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతోందని, కోట్లాది రూపాయల మత్స్య ఉత్పత్తులను ఇక్కడ్నించి ఏటా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతున్న దృష్ట్యా ఆ ప్రాంతంలో రైతులకు సరైన సలహాలు, సూచనలు అందించే ఉద్దేశంతో ఈ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తులను పెద్దఎత్తున పెంచడానికి ఆయా జిల్లాలలో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా మత ్స్య ఉత్పత్తుల అభివృద్ధికి మంజూరు చేసిన నిధులు సకాలంలో ఖర్చు చేయకపోతే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సముద్ర తీర మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక ఉపకరణాలు అందించాలని ఆదేశించామని, వైర్‌లెస్ సెట్లు, లైఫ్ జాకెట్లు ఉపకరణాలను తక్షణమే మత్స్యకారులకు అందించాలని సూచించారు. మత్స్యశాఖ డీడీ లాల్ మహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రప్రథమంగా చేపల చెరువుల అనుమతులకు కలెక్టర్ కె.భాస్కర్ ఆన్‌లైన్‌లో అనుమతులు ఇవ్వడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసి మీసేవలో రైతులు దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారన్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు జడ్పీ సమావేశ మందిరంలో మండల, డివిజన్, జిల్లా స్ధాయి చేపల చెరువుల అనుమతుల కమిటీ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. సమావేశంలో మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు స్టీవెన్‌రాయ్, శ్రీనివాసనాయక్, తిరుపతయ్య, వెంకటేశ్వరరావు, ప్రతిభ, రమణారావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.
బియ్యపుతిప్పలో మినీ ఫిషింగ్ హార్బర్
Published Wed, Dec 24 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement
Advertisement