ఆసుపత్రుల్లోనే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: జనన మరణ ధ్రువీకరణ పత్రాలను ఇక నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ జారీ చేయనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి, సుల్తాన్ బజారులోని ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి, పేట్లబుర్జు మోడ్రన్ ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి, నిలోఫర్ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, ఈఎన్‌టీ ఆసుపత్రి, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, మానసిక ఆరోగ్య కేంద్రం, చెస్ట్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ఎంఎన్‌జె కేన్సర్ ఆసుపత్రి, నిమ్స్, రైల్వే ఆసుపత్రి, ఆర్టీసీ ఆసుపత్రి, గోల్కొండలోని మిలటరీ ఆసుపత్రి, తిరుమలగిరి మిలటరీ ఆసుపత్రి, వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి, సీకేఎం మెటర్నిటీ ఆసుపత్రి, కంటి ఆసుపత్రి, టీబీ ఆసుపత్రి, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ల్లోని జనరల్ ఆసుపత్రులు, ఆదిలాబాద్ రిమ్స్, అన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లోని సివిల్ సర్జన్ హోదా కలిగిన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు (ఆర్‌ఎంవో) ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడానికి అవకాశం కల్పించారు. అలాగే సీహెచ్‌ఎస్ డిప్యూటీ సివిల్ సర్జన్లు, పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లు ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. వీళ్లకు జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు వీలుగా రిజిస్ట్రార్ హోదా కల్పిస్తారు. అలాగే జనన మరణ ధ్రువీకరణ పత్రాల్లో ప్రస్తుతం పురుషులు, మహిళలు అనే కాలమ్ మాత్రమే ఉంది. ఈ రెండు కాకుండా మరో మూడో వర్గం కోసం కాలమ్‌ను కొత్తగా ఉంచుతారు.
మరణానికి కారణమేంటో చెప్పాలి..
ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతికి కారణాలను వైద్యం చేసిన డాక్టరే ప్రతీ నెల ఐదో తేదీ నాటికి రాష్ట్రస్థారుు కమిటీకి తెలపాలి. ఇక మరణాలపై గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మండలాల్లో ఎంపీడీవోలు విచారణ చేసి జిల్లా డీఎంహెచ్‌వోలకు నివేదిక అందించాలి.