స్వైన్‌ఫ్లూపై విస్తృత ప్రచారం
వైద్యాధికారులకు సీఎస్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూపై ప్రజల ను అప్రమత్తం చేసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, నిమ్స్ సూపరింటెండెంట్ మనోహర్, గాంధీ ఆస్ప త్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రజా రోగ్య సంచాలకుడు లలిత తదితరులు పాల్గొ న్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్ మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని... నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)తో పాటు ఫీవర్ ఆసుపత్రిలోనూ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రారంభించాలని ఆదేశించారు.
నిమ్స్ సూపరింటెండెంట్‌ను నోడల్ అధికారిగా నియమించాలని... గాంధీ ఆసుపత్రిని నోడల్ ఆసుపత్రిగా చికిత్సలు అందించాలని సీఎస్ ఆదేశించారు. స్వైన్ ప్లూపై ప్రతి రోజు సమీక్షించాలని, పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో స్వైన్ ప్లూ లక్షణాలతో చేరిన వారికి వెంటనే తగు పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన పక్షంలో తదుపరి చికిత్సకు గాంధీ ఆసుపత్రికి తరలించాలని సీఎస్ సూచించారు. రాజేశ్వర్ తివారి మాట్లాడుతూ అన్ని జిల్లా ఆస్పత్రు ల్లోనూ... హైదరాబాద్ లోని ప్రధాన ఆస్పత్రు ల్లోనూ మందులు, కిట్లు సరిపడినంత ఉన్నా యన్నారు.
గాంధీ ఆసుపత్రిలో 60 పడకలను ఇందుకోసం ప్రత్యేకంగా కేటాయించామన్నా రు. అక్కడ 20 వెంటిలేటర్లు ఉన్నాయని... 24 గంటలూ పల్మనాలజిస్టు సేవలు అందు బాటులో ఉన్నాయని సీఎస్‌కు వివరించారు. జిల్లాల నుంచి... ప్రధాన ఆసుపత్రుల నుంచి వచ్చే నమూనాలను ఐపీఎం ద్వారా 24 గంటల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తివారీ వివరించారు. 2015 నవంబర్‌లో 9, అదే ఏడాది డిసెంబర్‌లో 31 , గత ఏడాది జనవరిలో 99 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు ఆందోళన పడేంత పరిస్థితులు లేవని ఆయన వివరించారు.