Medical Health and Family Welfare Department
-
ఏపీలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం: మంత్రి విడదల రజిని
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయనగరం, నంద్యాల ,ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ చేస్తామని, సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. కొత్తగా ప్రారంభం అయ్యే 5 మెడికల్ కాలేజీలు నుంచి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రంలో వందల క్రితం విశాఖలో తొలి మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వందేళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే. మేము అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇది ఒక చరిత్ర’’ అని మంత్రి రజిని అన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ లక్ష్యం. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును తీసుకువచ్చాం. సీఎం జగన్ వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం భర్తీ చేసిన అన్ని ఖాళీలు ఏ ప్రభుత్వం భర్తీ చేయలేదు. వైద్య ఆరోగ్యశాఖలో నాలుగేళ్లలో 49 వేల పోస్టులను భర్తీ చేశాం’’ అనిమంత్రి విడదల రజిని తెలిపారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు పునాది -
‘వైద్య ఆరోగ్య రంగంలో దేశంలోనే ఏపీ రోల్ మోడల్’
విజయవాడ: ఎకో ఇండియా సంస్థతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుందని..ఎకో ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ.ఎం.టి.కృష్ణబాబు అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, సిబ్బంది సామర్థ్యం పెంచేలా ఎకో ఇండియా ఆధ్వర్యంలో ఎకో ప్రాజెక్టుపై నిర్వహించే రెండు రోజుల సదస్సును ఆయన విజయవాడ లెమన్ ట్రీ హోటల్ లో మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ..ఎకో ఇండియాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పలు వైద్య కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, బీపీ, షుగర్, క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా శిక్షణ ఉంటుందన్నారు. వార్డు బాయ్ నుంచి అత్యున్నత స్థాయి వైద్యాధికారి వరకు ఎకో ప్రాజెక్టుపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని..హెల్త్ కేర్ రంగంలో ఇలాంటి శిక్షణ చాలా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానంపై కూడా వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ప్రతీ ఆరు నెలలకి ఒకసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభించిన తర్వాత ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య డేటా డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. రోగులతో వైద్య సిబ్బంది మసులుకునే విధానం వల్ల కూడా వారి పరిస్థితుల్లో మార్పు తీసుకురావొచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో చాలామంది స్థానిక ఆస్పత్రులపైనే ఆధారపడతారని..అందుకే గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేలా వైద్య సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎకో ఇండియా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ప్రభావశీలంగా నిర్వహించటానికి దోహదపడుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎం, ఎంఎల్ఎచ్పీ తదితర సిబ్బందికి వివిధ విధానాల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఏపీలో మెరుగైన వైద్య సదుపాయాల ద్వారా ముందస్తు రోగ నివారణ జరుగుతోందని..గ్రామస్థాయిలోనే దాదాపు 80 శాతం రోగాలకి చికిత్స అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫిలియా వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడే వారి ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 48వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించామని..వారందరికీ ఎకో ప్రాజెక్టు ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మరింత పెంచామన్నారు. పలుచోట్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై కొన్ని అపోహలు ఉన్నాయని వాటిని తెలుసుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని గుర్తించాలన్నారు. వైద్య రంగంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని..కాలంతో పాటు ప్రజల జీవనశైలిలో మార్పు రావాలన్నారు. టెలీ మెడిసిన్, టెలీ కమ్యూనికేషన్, టెలీ లెర్నింగ్ వంటి అంశాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈ ఏడాది అయిదు మెడికల్ కళాశాలలు ప్రారంభించబోతున్నామని.. ఇప్పటికే విజయనగరం మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చాయన్నారు. ఎకో ఇండియా సంస్ధతో ఎంవోయూ ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థికభారం పడలేదని..వారే ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా ప్రజలు ఆస్పత్రులకు వచ్చే పరిస్థితులు తగ్గించాలనేది ప్రభుత్వ భావనన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించలేదన్నారు. రాష్ట్రానికి 20 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ కావాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని..జాతీయ రహదారుల పక్కనే 13 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ.ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ శ్రీ.జె.నివాస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో వైద్య ఆరోగ్య విభాగాన్ని బలోపేతం చేయడంలో భాగమే ప్రాజెక్ట్ ఎకో అన్నారు. ఎకో ఇండియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎకో ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. మాతా శిశు సంరక్షణ, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పెంచడం, వైద్యులు, సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం ఎకో ప్రాజెక్టులో భాగంగా జరుగుతుందన్నారు. ఈ ఎకో ప్రాజెక్ట్ ద్వారా రోగులకి మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లు, అధికారులు, తదితర సిబ్బంది ఉపయోగించుకోవాలని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ జె.నివాస్ సూచించారు. ఎకో ప్రాజెక్ట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డా.సందీప్ భల్లా మాట్లాడుతూ.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల అమలుకు, వాటిని బలోపేతం చేసేందుకు ఎకో ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందన్నారు. 180 దేశాల్లో ఎకో ప్రాజెక్టు సేవలు అందిస్తోందని..2008లో భారత్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. దేశంలో 20 రాష్ట్రాలతో ఎకో ఇండియా సంస్థ ఎంవోయూ చేసుకుని ఎకో ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఎకో ప్రాజెక్టు ద్వారా డాక్టర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, నర్సులు, డెంటిస్టులు, ఆశా, ఏఎన్ఎం, వైద్య సంబంధింత స్పెషలిస్టులు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు పరికరాలను ఉపయోగించడంలో నాణ్యమైన శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.బి.ఎస్.హెచ్.దేవి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాస్మిన్, నోడల్ ఆఫీసర్ ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ రమేష్, స్టేట్ నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మీ, నేషనల్ హెల్త్ మిషన్ ఎస్పీఎమ్ డాక్టర్ వెంకట కిశోర్, సీఏవో గణపతిరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, కన్సల్టెంట్స్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.. -
ఆ శాఖలో 1,610 కొత్త పోస్టుల సృష్టి.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: వైద్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,610 పోస్టులను కొత్తగా సృష్టిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఫ్యామిలి డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 88 పీహెచ్‌సీల కోసం 1,232 పోస్టులను కేటాయించింది. పీహెచ్సీ, సీహెచ్‌సీ ఉన్న 63 మండలాల్లో సీహెచ్‌సీ కేంద్రంగా వైద్యులు, వైద్య సిబ్బందితో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయడం కోసం మిగిలిన 378 పోస్టులను కేటాయించింది. కొత్తగా సృష్టించిన వాటిలో 302 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 264 స్టాఫ్ నర్స్, 151 ఎంపీహెచ్‌ఈవో/సీహెచ్‌వో, ఇతర పోస్టులు ఉన్నాయి. కాగా ఇప్పటికే వైద్య శాఖలో ప్రభుత్వం 48 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. కొత్తగా భర్తీ చేసే సిబ్బందితో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. చదవండి: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్.. -
ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి ఏపీ ఆదర్శం కావాలి
సాక్షి, తాడేపల్లి: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని, ఏపీ సీఎస్ జవహార్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ప్రజారోగ్యానికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే.. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలన్నారు. మార్చి 1వ తేదీ నుంచే.. గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్ పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్ నివారణా పరికరాలు, చికిత్సలతోపాటు, కాథ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతిగ్రామంలో క్లినిక్‌కు నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్ వెళ్తారని, జనాభా 4వేలు దాటి ఉంటే మూడోసారి కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. సీఎం జగన్ స్పందిస్తూ.. అనుకున్నట్లు మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో ప్రారంభించాలి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన కూడా అదే రోజు నుంచి ప్రారంభం అవుతుంది. దీనివల్ల ఆస్పత్రుల పనితీరుపై వారి వైపునుంచి కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే వారి నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని వాటిని కూడా పరిష్కరించే చర్యలు చేపట్టాలి. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ► అలాగే.. మార్చి 1వ తేదీ నుంచి కూడా.. గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్ట్ అందించాలన్నారు సీఎం జగన్. ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. డబ్ల్యూహెచ్ఓ లేదంటే జీఎంపీ ఆధీకృత మందులు మాత్రమే ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాలను పటిష్టంగా అమలు చేయాలి. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడది. ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలి అని ఆకాక్షించారు సీఎం వైఎస్ జగన్. ► వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న సిబ్బందిని సంపూర్ణస్థాయిలో ఉపయోగించుకోవాలి. గ్రామ సచివాలయ స్థాయిలోనే ఎనీమియా లాంటి కేసులను గుర్తించి వారి ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే.. ఇప్పటికే ఎనిమీయా కేసులపై సర్వే చేయించామని అధికారులు బదులిచ్చారు. వీరిలో రక్తహీనతను నివారించడానికి వైద్య పరంగా, పౌష్టికాహారం పరంగా అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు సీఎం వైఎస్ జగన్. వైద్యారోగ్యశాఖ – స్త్రీ శిశుసంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని, డేటా అనుసంధానత ఉండాలన్న ఆయన.. స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలన్నారు. విలేజ్ క్లినిక్స్ - ఎస్ఓపీ విలేజ్ క్లినిక్స్ ఎస్ఓపీలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం తదితర అంశాలను గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు చేర్చామని అధికారులు తెలిపారు. దానికి స్పందించిన సీఎం వైఎస్ జగన్.. విలేజ్ క్లినిక్స్ సిబ్బంది నుంచి సంబంధిత సమస్యలను నివేదించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలని సూచించారు. మండలస్థాయి అధికారులు, జేసీ, కలెక్టర్ వీటిపై పర్యవేక్షణ చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, సమతుల్య ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని, 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రతిరోజూ ఈ అంశాలపై కూడా సమీక్షించాలని, కలెక్టర్లు కూడా నిరంతర పర్యవేక్షణ జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ సిబ్బంది అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలి. సిబ్బంది, ప్రతి కుటుంబాన్నీ కలుసుకుని విలేజ్ క్లినిక్స్ సేవలను వివరించాలి. తాము అందుబాటులో ఉంటున్న తీరు, అందుతున్న సేవలపై ప్రతికుటుంబానికీ వారి ద్వారా వివరాలు అందాలి. గ్రామ సచివాలయాల సిబ్బంది తరహాలోనే ఈ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలి. హైరిస్క్‌గా గుర్తించిన వారిని, ప్రసవం కోసం ముందస్తుగానే మంచి ఆస్పత్రులకు తరలించాలని సీఎం జగన్.. అధికారులకు సూచించారు. దీనికి స్పందించిన అధికారులు ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎక్కడా రాజీ పడొద్దు గుండెజబ్బులు, క్యాన్సర్, బీపీ, మధుమేహం లాంటి ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) నివారణ, చికిత్సలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. రక్తపోటు, మధుమేహం లాంటి ఎన్సీడీ వ్యాధులతో బాధపడే వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి. క్రమం తప్పకుండా అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా వీరిని కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించాలి. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధపెడుతున్నాం. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిని నివారించడానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చుపెడుతున్నాం. అక్కడి సమస్యకు శాశ్వతంగా మన ప్రభుత్వం పరిష్కారాలు చూపుతోంది. అలాగే పాలకొండకు కూడా మరో సుమారు రూ.265 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. దానికి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని నియమించాలి. ఎక్కడా రాజీ పడొద్దు అని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. దానికి స్పందించిన అధికారులు.. తాగునీటి పథకం, ఆస్పత్రి ఈ రెండు కూడా మార్చికల్లా పూర్తవుతాయని వివరించారు. అలాగే.. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగానే గుర్తించి వారికి తగిన వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని, వైద్య సిబ్బందికి స్క్రీనింగ్, చికిత్సలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు, సీఎం జగన్‌కు వివరించారు. ప్రతీ బోధనాసుపత్రిలో కూడా క్యాన్సర్ నివారణా పరికరాలు, చికిత్సలు ఉండాలి. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో కూడా ఈ పరికరాలు, చికిత్సలు ఉండాలి. ప్రతి బోధనాసుపత్రిలోనూ గుండెజబ్బుల చికిత్సా కేంద్రాలు ఉండాలి. అన్ని చోట్లా క్యాథ్ ల్యాబ్స్ పెట్టాలి. నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఇవి ఏర్పాటు కావాలి. ఈ సౌకర్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా క్యాన్సర్, గుండెజబ్బులకు సంబంధించి మరిన్ని పీజీ సీట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలోనే సరిపడా వైద్య నిపుణులు తయారవుతారని సీఎం వైఎస్ జగన్.. అధికారులతో పేర్కొన్నారు. ఇదీ చదవండి: తెలుగు వారి హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు: సీఎం జగన్ -
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: టీనేజర్లకి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోసు,15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. 15-18 ఏళ్లు దాటిన వారికి జనవరి ఒకటి నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు గల వారికి 2022 జనవరి 3 నుంచి వాక్సినేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: పోలవరం పనులు భేష్ జనవరి 10వ తేదీ నుంచి రెండో డోసు వేసుకొని 9 నెలలు పూర్తయిన హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ వర్కర్స్, రెండు డోసులు పూర్తయిన వారికి డాక్టర్ల సూచనల మేరకు జనవరి 10వ తేదీ నుంచి బూస్టర్ డోసు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు,వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, కంటివెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. హెల్త్ క్లినిక్స్ పనులకు సంబంధించి ఇప్పటికే ఇవ్వాల్సిన నిధులు ఇచ్చామని అధికారులు తెలిపారు. చదవండి: Andhra Pradesh: 60 ఏళ్లకు కదలిక ►రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం ►ఇప్పటికే 8585 చోట్ల పనులు మొదలయ్యాయన్న అధికారులు ►పీహెచ్‌సీల్లో నాడు – నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయన్న అధికారులు ►డిసెంబర్ నాటికి మరమ్మతు పనులు పూర్తవుతాయన్న అధికారులు ►అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం మార్చి 2022 నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు ►వీటి నిర్మాణాలు కూడా మరింత వేగంగా పూర్తి చేయాలన్న సీఎం ►సీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు ►అత్యవసర పనులను ఇప్పటికే పూర్తిచేశామన్న అధికారులు ►మిగిలిన పనులుకూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం 16 కొత్త మెడికల్‌కాలేజీల్లో పనుల ప్రగతినీ సమీక్షించిన సీఎం ►ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహలను పూర్తిచేస్తున్నామని తెలిపిన అధికారులు ►కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖజిల్లా అనకాపల్లి మెడికల్ కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలు ►వీటిని త్వరగా పరిష్కరించేలా చూడాలని సీఎం ఆదేశాలు ►ఇవికాకుండా 9 చోట్ల జరుగుతున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనుల ప్రగతిపైనా సీఎం సమీక్ష గణనీయంగా పెరిగిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు: ♦2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీ కింద ఉన్న వైద్య ప్రక్రియలు 1059 ♦2019 జూన్ తర్వాత 2446 వైద్య ప్రక్రియలకు పెంపు ♦2019 జూన్‌కు ముందు ఆరోగ్యశ్రీ కింద ఉన్న కవరేజీ ఆస్పత్రులు 919, తర్వాత 1717 ఆస్పత్రులకు పెంపు. ♦కొత్తగా 3,18,746 మందికి ఆరోగ్యశ్రీ కింద లబ్ధి ♦2019 జూన్‌కు ముందు ఆరోగ్య శ్రీద్వారా సగటున రోజుకు లబ్ధి 1570 మందికి జరిగితే.. ప్రస్తుతం 3300 మందికి లబ్ధి. ♦బధిర, మూగ వారికి పూర్తి ఖర్చులతో శస్త్రచికిత్సలు. ♦ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజునే ఆరోగ్య ఆసరా కింద డబ్బు చెల్లింపు. ♦ఇప్పటివరకూ 7,82,652 మందికి ఆరోగ్య ఆసరా కింద రూ. 439.4 కోట్లు చెల్లింపు ♦శస్త్రచికిత్స చేయించుకున్నవారికి విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225లు ఇస్తున్న ప్రభుత్వం. ♦కాన్సర్ రోగులకూ పూర్తిస్థాయిలో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలన్న నిర్ణయం అమల్లోకి తెచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సీఎం. వైఎస్సార్ కంటి వెలుగుపైనా సీఎం సమీక్ష ♦ఇంతకుముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోనివారికి పరీక్షలు చేయించాలన్న సీఎం ♦కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించాలన్న సీఎం ♦కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ♦దీనికోసం ఒక వారంరోజులపాటు డ్రైవ్ నిర్వహించాలన్న సీఎం ♦ఇప్పటికే 66,17,613 మంది పిల్లలకు పరీక్షలు చేశామని, వారిలో 1,58,227 మంది కంటి అద్దాలు ఇచ్చామని తెలిపిన అధికారులు ♦60 ఏళ్ల పైబడ్డ వారికి 13,58,173 మందికి పరీక్షలు చేశామన్న అధికారులు ♦ఇందులో 7,60,041 మందికి కంటి అద్దాలు ఇవ్వాల్సి ఉండగా 4,69,481 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు, మరో 1,00,223 మందికి శస్త్రచికిత్సలు చేయించామన్న అధికారులు. మరో 26,437 మందికి కాటరాక్ట్ సర్జరీలు చేయించాలన్న అధికారులు ♦కోవిడ్ పరిస్థితులు కారణంగా కంటివెలుగు కార్యక్రమానికి అవాంతరాలు ఏర్పడ్డాయన్న అధికారులు. ♦కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు, 104కు అనుసంధానంచేసి.. నిరంతర ప్రక్రియగా కొనసాగించాలన్న సీఎం. హెల్త్ హబ్స్ ఏర్పాటుపైనా సీఎం సమీక్ష ♦వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులో అత్యాధునిక వైద్యం ♦జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ ♦మొత్తం 16 చోట్ల ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ ♦ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తింపు ♦జిల్లాలో స్పెషాల్టీ సేవల అవసరం మేరకు ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు ♦మొత్తం పాజిటివ్ కేసులు 3366 ♦పాజిటివిటీ రేటు 0.7 శాతం ♦పాజిటివిటీ రేటు 0 నుంచి 2 లోపు ఉన్న జిల్లాలు 12 ♦పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ♦2 కంటే పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లా 1 ♦అందుబాటులో ఉన్న మొత్తం ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 23,457 ♦అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ–టైప్ సిలిండర్లు 27,311 ♦ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు మొత్తం 140 ♦15 డిసెంబరు నాటికి పీఏస్ఏ ప్లాంట్లు ఏర్పాటు పూర్తిచేస్తామన్న అధికారులు వ్యాక్సినేషన్ ♦సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,17,71,458 ♦రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారు 2,17,88,482 ♦మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 3,35,59,940 ♦మొత్తం వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన డోసులు 5,53,48,422 ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జిఎస్ నవీన్‌కుమార్, ఏపీఎంస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవియన్ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రగతిపై చర్చించారు. కొత్త మెడికల్ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్‌పైనా సీఎం సమీక్ష కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ఉన్న పీహెచ్‌సీల్లో నాడు–నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు.. వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. వచ్చే ఏడాది జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమల్లోకి తీసుకురావడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని.. విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై దృష్టిపెట్టామని సీఎం జగన్ తెలిపారు. స్వేచ్ఛ ద్వారా బాలికల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నామని.. నెలకు ఒక్కసారి ఈ రకమైన కార్యక్రమం చేపట్టాలన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీఎం జగన్. ఆరోగ్య శ్రీ పై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్ పెట్టి.. దాని రిఫరెల్ మీద ప్రచారం ఉండాలని.. ఆరోగ్య మిత్రల ఫోన్‌నంబర్లను సచివాలయాల హోర్డింగ్స్‌లో ఉంచాలలని సీఎం ఆదేశించారు. ఎమ్‌పానెల్ ఆస్పత్రుల జాబితాలను అందుబాటులో ఉంచాలన్నారు. డిజిటల్ పద్ధతుల్లో పౌరులకు ఎమ్‌పానెల్ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచాలని అలానే 108 వెహికల్స్ సిబ్బందికి కూడా రిఫరెల్ ఆస్పత్రుల జాబితా అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు. ఏపీ డిజిటల్ హెల్త్‌పై సీఎం సమీక్ష హెల్త్‌కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలని సీఎం జగన్ తెలిపారు. పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా ప్రతి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలన్నారు. దీనివల్ల వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగావైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. బ్లడ్ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలన్న సీఎం జగన్ 104 ద్వారా వైద్యం అందించే క్రమంలో చేస్తున్న పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్‌కార్డుల్లో పొందుపర్చాలన్నారు. డిజిటిల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ కూడా హెల్త్‌ఐడీలు క్రియేట్‌చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు... ►రాష్ట్రంలో యాక్టివ్ పాజిటివ్ కేసులు 9,141 ►రికవరీ రేటు 98.86 శాతం ►ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 2201 ►కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు 313 ►హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు 6627 ►జీరో కేసులు నమోదైన సచివాలయాలు 11,997 ►పాజిటివిటీ రేటు 1.62 శాతం ►0 నుంచి 3 శాతం వరకు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 12 ►3 లోపు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లా 1 ►ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బెడ్స్ శాతం 92.27 శాతం ►ప్రైవేటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్ 69.70 శాతం ►104 కాల్‌సెంటర్‌కు వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ 649 థర్డ్ వేవ్ సన్నద్ధత ►మొత్తం అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 20,964 ►ఇంకా రావాల్సినవి 2,493 ►అందుబాటులో ఉన్న డి టైప్ ఆక్సిజన్ సిలెండర్లు 27,311 ►రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు 140 ►అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిగా అందుబాటులో రానున్న ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు వ్యాక్సినేషన్ ►సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,38,32,742 ►రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,44,94,731 ►మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 2,83,27,473 ►వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన మొత్తం డోసులు 4,28,22,204 వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి యస్ నవీన్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: AP: రాష్ట్రాభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ‘రైతుల ఆనందం చూడలేక టీడీపీ నేతలకు కడుపుమంట’ -
ఆస్పత్రుల నిర్వహణపై సీఎం సమీక్ష
-
వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకూడదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: హెల్త్‌హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభై శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్నారు. ఎవరెక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్‌హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై మంగళవారం సమీక్ష చేపట్టారు. అదే విధంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హెల్త్‌హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్‌హబ్స్ ద్వారా నెరవేరుతుందన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రమాణం కావాలని తెలిపారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్ హబ్స్‌లో ప్రత్యేక దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఇక ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. లాభాపేక్షలేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చెప్పారు. ఆస్పత్రుల నిర్వహణపై సీఎం సమీక్ష వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణా విధానాలను సీఎంకు అధికారులు వివరించారు. ఆస్పత్రుల నిర్వహణకోసం ప్రత్యేక అధికారుల నియమిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసులు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సేవలను అధికారులు నిర్వహించనున్నారు. సీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నిర్వహణ కోసం అధికారుల నియామకానికి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్మాణాలు ఉండాలని సీఎం ఆదేశించారు. అలాగే వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యమని తెలిపారు. రిసెప్షన్ సేవలు కూడా కీలకమని అన్నారు. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందినట్లేనని పేర్కొన్నారు. అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేయాలని, ఎవరి ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆకాక్షించారు. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణ స్థాయి బలోపేతంగా ఉండాలని, నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌కు సంబంధించి వివరాలు అందించిన అధికారులు ► ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు 2 సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు ► నవంబర్ 15 నుంచి 258 మండలాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు ► వచ్చే జనవరి 26 నుంచి పూర్తి స్ధాయిలో అమలు ► జనాభానుకూడా దృష్టిలో ఉంచుకుని ఆమేరకు 104 లను వినియోగించాలని సీఎం ఆదేశం ► అలాగే విలేజ్ క్లినిక్స్ విధివిధానాలను, ఎస్ఓపీలను ఖరారుచేయాలన్న సీఎం ► పీహెచ్సీలో కనీసం ఇద్దరు డాక్టర్లను ఉంచాలని, ఒక డాక్టరు పీహెచ్సీలో సేవలు అందిస్తుండగా, మరో డాక్టరు 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సేవలు అందించేలా చూడాలన్న సీఎం ► కొత్త పీహెచ్‌సీల నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. కోవిడ్ 19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలు అందించిన అధికారులు ► ఏపీలో మొత్తం యాక్టివ్ కేసులు 14,652 ► పాజిటివిటీ రేటు 2.23 శాతం ► రికవరీ రేటు 98.60 శాతం ► ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు 2699 ► కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 854 ► నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నవారి బెడ్స్ 91.66 శాతం ► ప్రైవైటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నవారి బెడ్స్ 71.04 శాతం ► 104 కాల్ సెంటర్‌కు వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ 753 ► ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 21 ఫీవర్ సర్వేలు పూర్తయ్యాయి ► రాష్ట్ర వ్యాప్తంగా జీరో కేసులు నమోదైన సచివాలయాలు 10,541 ► పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువ నమోదైన జిల్లాలు 9 ► పాటిజివిటీ రేటు 3శాతం కంటే ఎక్కువున్న జిల్లాలు 4 థర్డ్ వేవ్ సన్నద్ధత ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ టైప్ సిలిండర్లు 27,311 ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు 20,964 ► ఇంకా రావాల్సినవి 2493 ► 50 అంతకంటే ఎక్కువ బెడ్స్ ఉన్న 140 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు ఏర్పాటు ► 11 అక్టోబరు నాటికి 140 ఆస్పత్రుల్లో అందుబాటులోకి రానున్న పీఎస్ఏ ప్లాంట్లు వ్యాక్సినేషన్ ► ఇప్పటివరకు సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తైన వారు 1,33,30,206 ► రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైన వారు 1,08,54,556 ► మొత్తం వ్యాక్సినేషన్ (సింగిల్, డబుల్ డోసు కలిపి) పూర్తైన వారు 2,41,84,762 ► వ్యాక్సినేషన్ కోసం వినియోగించిన మొత్తం డోసులు 3,50,39,318 ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌పోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జే వి యన్ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: బహ్రెయిన్‌లో భారతీయ బాధితులను వెనక్కి తీసుకురండి -
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వద్దే టీకాలు..!
సాక్షి, హైదరాబాద్: కళాశాలలు తెరిచిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు కరోనా టీకాలు వేయడంపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గాను ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వద్దే మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దేశంలో థర్డ్‌వేవ్‌పై నిపుణుల హెచ్చరికలు కొనసాగుతు న్నాయి. మరోవైపు రాష్ట్రంలో విద్యాసంస్థలు బుధవారం నుంచి ప్రారంభమ య్యాయి. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ తదితర ఉన్నత విద్యా సంస్థల వద్ద విద్యార్థులకు టీకాలు అందు బాటులోకి తేనున్నారు. అలాగే అన్ని యూని వర్సిటీల్లోనూ ఈ మేరకు ఏర్పాట్లు చేయను న్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో 18 ఏళ్లు నిండిన వారు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. కాగా ఇప్పటివరకు టీకాలు తీసుకోనివారికి వీలైనంత త్వరగా టీకాలు వేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అన్ని వసతిగృహాల్లోనూ వ్యాక్సినేషన్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన హాస్టళ్లలోనూ టీకాలు వేయాలని నిర్ణయించారు. 20–30 మంది ఉన్న వసతిగృహాలు, ప్రైవేట్ హాస్టళ్లలోనూ టీకాలు వేస్తారు. ఏదైనా ప్రైవేట్ కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఉన్నా, సమాచారం ఇస్తే అక్కడకు కూడా మొబైల్ వాహనంలో వెళ్లి వ్యాక్సినేషన్ చేపడతారు. ఎక్కడ వీలైతే అక్కడ వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ తాజాగా జారీ చేసిన మరికొన్ని మార్గదర్శకాలు పాఠశాల, కాలేజీ బస్సు ఎక్కే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. వీలైతే ఒక సీటులో ఒకరు మాత్రమే కూర్చునేలా చూడాలి. హాస్టళ్లలో విద్యార్థులు గుమికూడకుండా, ఒకే రూములో ఎక్కువమంది ఉండకుండా చూడాలి. భోజనాలకు వేర్వేరు సమయాలు పెట్టాలి. తద్వారా విద్యార్థులు గుంపులుగా ఏర్పడకుండా చూడాలి. ప్రతిరోజూ అన్ని హాస్టళ్లలో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టాలి. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఏమాత్రం కన్పించినా తక్షణమే ఆయా హాస్టళ్లలోని ఐసోలేషన్ గదుల్లో ఉంచాలి. అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం ఇవ్వాలి. -
కొత్త కరోనా: ఏపీ సర్కార్ మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: యూకే స్ట్రెయిన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాస్క్ ధరించేలా చూడాలని, కంటైన్మెంట్ వ్యూహాలను అనుసరించాలని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ‘‘సంక్రాంతి దృష్ట్యా భారీ జనసమూహాలు లేకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న 1,519 నమూనా సేకరణ కేంద్రాలను వికేంద్రీకరించాలి. కరోనా టోల్ ఫ్రీ నంబర్ 104ను కొనసాగించాలి. కంటైన్మెంట్ జోన్లను నోటిఫై చేయడంతో పాటు ఫీవర్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని’’ వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. (చదవండి: కరోనా వ్యాక్సిన్.. అతి పెద్ద సవాల్) కాంటాక్ట్ ట్రేసింగ్, ఇంటింటి సర్వే చేపట్టాలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. కోవిడ్‌తో చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.15వేలు ఆర్ధిక సాయం అందించాలని, రాష్ట్రంలోని ప్రతి కోవిడ్ ఆస్పత్రికి నోడల్ అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాలి. ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందేలా చూడాలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. (చదవండి: మూఢ నమ్మకాలు.. కరోనా వ్యాక్సిన్ వద్దు) -
రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స
రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను తీసుకొస్తున్నాం. ఇందుకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఆస్పత్రుల్లో పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దు. జనరేటర్లు, ఏసీలు పని చేయడం లేదని, శానిటేషన్ సరిగా లేదనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా చేపడుతున్న నాడు–నేడు కార్యక్రమాలకు రూ.17,300 కోట్లు వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలకు జనవరిలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాడు –నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న 16 మెడికల్ కాలేజీలు, ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి, పునరుద్ధరణ పనులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ తదితర వాటి నిర్మాణాలు, అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండాలన్నారు. ప్రతి అంశానికీ బాధ్యులు ఉండాలని చెప్పారు. ఆస్పత్రిలో పరికరాల దగ్గర నుంచి ఏసీల వరకు ప్రతిదీ సక్రమంగా పని చేసేలా దృష్టి పెట్టాలన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాటి నిర్వహణ బాగోలేదనే మాట రాకూడదని హెచ్చరించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఉండాలి ఆస్పత్రుల నిర్మాణంలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను పరిశీలించి, వాటిని పాటించండి. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలకు నవంబర్ లోగా టెండర్లు పిలవాలి. అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నర్సాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్లలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు డిసెంబర్లో.. విజయనగరం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్ కాలేజీల నిర్మాణాలకు జనవరిలో టెండర్లు పిలవాలి. వీటి కోసం రూ.7,500 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడున్న మెడికల్ కాలేజీల్లో నాడు –నేడు పనులకు మరో రూ.5,472 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వీటికి అవసరమైన పరిపాలనా పరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలి. నిర్మాణ రీతిలో హరిత విధానాలు పాటించడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించాలి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సౌకర్యాలు ఉండాలి. ఆరోగ్యశ్రీ రిఫరల్ విధానం బాగుండాలి వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ వచ్చేంత వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమాచారం ఇవ్వండి. అక్కడున్న హెల్త్ అసిస్టెంట్/ఏఎన్ఎంల ద్వారా రిఫరల్ చేయించాలి. ఎంపానల్ అయిన ఆస్పత్రుల జాబితాను గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉంచండి. వైద్యం కావాలనుకున్న వారికి మార్గ నిర్దేశం చేయాలి. ఆరోగ్య శ్రీ కింద 2 వేల వ్యాధులకు ఇప్పటికే 7 జిల్లాల్లో చికిత్స అమలవుతోంది. నవంబర్ 13 నుంచి మిగిలిన 6 జిల్లాల్లో (శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం) చికిత్స అందుబాటులోకి వస్తుంది. అవసరం అనుకుంటే అదనంగా వైద్య ప్రక్రియలను ఈ జాబితాలో చేర్చండి. అంతిమంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలి. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలి
-
అనుమానితుల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు..
సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో అడ్మిషన్ల సమయంలో కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లు ప్రభుత్వం పంపించిందని, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి కరోనా రోగిని ఐసోలేట్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు వైద్యారోగ్యశాఖ సూచించింది.(ఏపీలో మరో 1919 కరోనా కేసులు) కరోనా లక్షణాలు కలిగి యాంటీజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే..అలాంటి వారికి మరోసారి రియల్ టైమ్‌లో ఆర్టీపీసీఆర్ చేయాలని, హైరిస్క్ కేసులున్న ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగిటివ్ ఫలితాలు వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో గర్భిణులు, శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులను పరీక్షించేందుకు కూడా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క్వారంటైన్ కేంద్రాల్లో 10 రోజుల అనంతరం డిశ్చార్జి అవుతున్నవారిని పరీక్షించవచ్చని, కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులందరికీ డిశ్చార్జి చేసేందుకు ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ
సాక్షి, విజయవాడ: వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని.. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వైద్యులు, సిబ్బందిపై కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని పేర్కొంది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రజలు సహకరిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ‘‘చిన్న చిన్న టైపింగ్ పొరపాట్లను పని గట్టుకుని ఎత్తి చూపి విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాం. వైద్య శాఖ ఇచ్చే సమాచారం పై ఎవ్వరికీ సందేహాలున్న సంప్రదించొచ్చు. పూర్తి పారదర్శకంగా కరోనా వైద్య పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 5 నాటికి రాష్ట్రాల్లో ఒక్క వైరల్ ల్యాబ్ కూడా లేదు.. అలాంటిది ఇప్పుడు రోజుకి 2300 పరీక్షల సామర్థ్యం గల వైరల్ ల్యాబ్ లను ఏర్పాటు చేసాం. ఇప్పటి వరకు 21450 మందికి కరోనా పరీక్షలు జరిపాం. రోజుకి 17, 500 టెస్టులు చేసే సామర్థ్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. ఇందుకోసం వైరల్ ల్యాబ్‌లతో పాటు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను సమకూర్చుకున్నాం. లక్ష ర్యాపిడ్ కిట్లు, 50 వేల టెస్టింగ్ కిట్ల కు కొనుగోలు ఉత్తర్వులు ఇచ్చామని’’ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. -
ఆ పనులు చరిత్రాత్మకం కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాలపై సమీక్షించారు. ఆసుపత్రుల నాడు-నేడు కింద చేపట్టే పనులకు జూన్ మొదటివారంలో టెండర్లకు వెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు కింద వైద్య రంగంలో అభివృద్ధి పనులు, కొత్త నిర్మాణాల కోసం దాదాపు రూ.16వేల కోట్లు ఖర్చువుతుందని సీఎం తెలిపారు. (కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష) ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం.. నాడు – నేడు కింద చేపట్టే పనులు ఇప్పటివారికే కాదని.. భవిష్యత్తు తరాలకూ సంబంధించిందని సీఎం పేర్కొన్నారు. వీటి వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. ప్రజలను రక్షించడానికి ఉపయోగపడతాయని.. అందుకే నాడు-నేడు కింద చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని.. మంచి వ్యూహాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పనులు చరిత్రాత్మకం కావాలన్నారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజారోగ్య వ్యవస్థ గురించి ఆలోచించడం లేదని.. రూ.16వేల కోట్లు ఖర్చుచేయబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాల కింద చేపట్టే పనులకు ప్రజలు, ఈ దేశం మద్దతుగా నిలబడుతుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. (పురోహితులను ఆదుకోండి) -
‘కరోనా’పై అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి : చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధి.. అక్కడ నుండి వస్తున్న వారి ద్వారా ఇక్కడ కూడా వ్యాపించే అవకాశం ఉన్నందున జిల్లాల వైద్యాధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై 13 జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యలపై ఇప్పటికే రాష్ట్రస్థాయిలో విధివిధానాలు జారీచేశామని, జిల్లా స్థాయి అధికారులు కూడా వాటిని అనుసరించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల డీఎంహెచ్వోలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారనే విషయమై ఆరా తీశారు. కాగా, చైనా నుండి తిరిగివచ్చిన 28 రోజుల్లోపు ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వారు వెంటనే మాస్క్ ధరించి సమీప ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లను సంప్రదించాలని జవహర్‌రెడ్డి సూచించారు. ఇతర సమాచారం కోసం 1100, 1102 టోల్‌ఫ్రీ నంబర్లకు గానీ లేదా 7013387382 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం తదితర ఓడరేవుల అధికారులను సంప్రదించి విదేశాల నుంచి ఓడల ద్వారా వచ్చిన వారి వివరాలు సేకరించాలని కూడా ఆదేశించారు. -
‘అమ్మ’కు హైబీపీ శాపం
సాక్షి, హైదరాబాద్: ప్రసవ సమయంలో బీపీ పెరగటం కారణంగానే మాతృత్వపు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సంభవించిన మాతృత్వపు మరణాలను ఆ శాఖ విశ్లేషించింది. ఆ వివరాలతో కూడిన నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ మధ్య కాలంలో రాష్ట్రంలో 313 మాతృత్వపు మరణాలు సంభవించాయని నివేదిక వివరించింది. అందులో బోధనాసుపత్రుల్లో 120 మంది, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 28 మంది, ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలోని ఆసుపత్రిలో ఒకరు, ఇంటి వద్ద జరిగిన ప్రసవాల్లో 31 మంది, ప్రయాణ సమయాల్లో 39, ఇతరత్రా కారణాలతో 12 మంది మరణించారు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో 82 మంది మృతిచెందారు. పెద్దాసుపత్రుల్లో పరిశీలిస్తే అత్యధికంగా గాంధీ ఆసుపత్రిలో 49 మంది, ఉస్మానియా ఆసుపత్రిలో 21 మంది, వరంగల్ ఎంజీఎంలో 12 మంది చనిపోయారు. మరణాల్లో గర్భిణిగా ఉన్నప్పుడు 58 మంది చనిపోగా, ప్రసవ సమయంలో 63 మంది చనిపోయారు. ప్రసవమయ్యాక వారం రోజుల వ్యవధిలో అత్యధికంగా 124 మంది చనిపోవడం గమనార్హం. ఇక 7 నుంచి 42 రోజుల వ్యవధిలో 68 మంది చనిపోయారు. బీపీ, రక్తస్రావం, షుగర్లతో.. మాతృత్వపు మరణాలకు గల కారణాలను వైద్య ఆరోగ్యశాఖ విశ్లేషించింది. ప్రసవ సమయంలో బీపీ పెరగడం, దాన్ని నియంత్రించలేని పరిస్థితుల్లో అధికంగా 81 మంది చనిపోవడం గమనార్హం. ఆ తర్వాత రక్తస్రావంతో 55 మంది చనిపోయారు. మధుమేహం తదితర కారణాలతో 45 మంది చనిపోయారు. ఇన్ఫెక్షన్లతో 44 మంది చనిపోయారు. గుండె సంబంధిత జబ్బుల కారణంగా 40 మంది మృతిచెందారు. తెలియని కారణాలతో 27 మంది, రక్తహీనత, మెదడులో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులపైన ప్రభావం చూపడం, సిజేరియన్ వికటించడం వంటి తదితర కారణాలతో మిగతా వారు మృతి చెందారు. హైదరాబాద్‌లో అత్యధిక మరణాలు... ఈ ఏడు నెలల కాలంలో జరిగిన మరణాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే సంభవించాయి. నగరంలోనే 32 మంది చనిపోయారు. ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో 18 మంది, రంగారెడ్డి జిల్లాలో 17 మంది, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 16 మంది చొప్పున మాతృత్వపు మరణాలు సంభవించాయని నివేదిక తెలిపింది. ఈ మాతృత్వపు మరణాల్లో బోధనాసుపత్రుల పరిధిలోనే 38 శాతం సంభవించాయి. ఇక ఇటీవల కేంద్రం విడుదల చేసిన 2015–17 ఎస్ఆర్ఎస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షకు 76 మాతృత్వపు మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఈ సంఖ్య 2001–03లో ఏకంగా 195 ఉండటం గమనార్హం. -
కొండ కోనల్లోనూ ఆరోగ్య భాగ్యం
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఫీడర్ (బైక్) అంబులెన్స్‌లు మరిన్ని రానున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ఇటీవల జరిపిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈమేరకు ఆదేశించారు. దీంతో ఈ ప్రతిపాదనకు కదలిక వచ్చింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల ద్వారా వైద్యసేవలు మరింత అందుబాటులోకి తీసుకురానున్నారు. 108, 104లతో పాటు ఫీడర్ అంబులెన్స్‌ల సంఖ్య పెంచాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. దీంతో ఇప్పటి వరకు 15 ఉన్న బైక్ అంబులెన్స్‌లు రెట్టింపు కానున్నాయి. సీతంపేట, కొత్తూరు, పాలకొండ, వీరఘట్టం, పాతపట్నం, మందస పీహెచ్‌సీల పరిధిలో 108 అంబులెన్స్‌లు 6 ఉండగా వీటి అనుసంధానంగా ఫీడర్ అంబులెన్స్‌లు 15 ఉన్నాయి. ఎం.సింగుపురం, ఎంఎస్‌పల్లి, ఎస్జే పురం, భామిని, బుడంబోకాలనీ, అల్తి, సిరిపురం, బాలేరు, నేలబొంతు, పాలవలస, లబ్బ, కరజాడ, చిన్నబగ్గ, శంబాం, పెద్ద పొల్ల గ్రామాల్లో బైక్ అంబులెన్స్‌లు నడుస్తున్నాయి. వీటితోపాటుగా మరో 15 కొత్తవి కావాలని వైద్యాధికారులు ప్రతిపాదించారు. అలాగే మరో రెండు 108 వాహనాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇవి వస్తే మారుమూల గ్రామాలన్నింటికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇదీ పరిస్థితి... ప్రస్తుతం ఉన్న బైక్ అంబులెన్స్‌లు గతేడాది డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు 6,072 మందికి వైద్యసేవలు అందించాయి. ఎపిడమిక్ సీజన్లో డయేరియా, మలేరియా కేసులు నమోదవుతుంటాయి. ఇంకా అనుకోని ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటాయి. గర్భిణులకు అత్యవసర వైద్య సేవలు అవసరం. ఈ తరుణంలో అపర సంజీవినిగా పేరుగాంచిన 108లు మారుమూల కొండలపై ఇరుకు రహదారులకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అత్యవసర సమయాల్లో రోగులను పీహెచ్‌సీలకు తరలించడానికి ఫీడర్ అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. కొండ ప్రాంతాల మారుమూల ప్రాంతాల్లో అంబులెన్స్‌లు వెళ్లలేని గ్రామాలకు వెళ్లి రోగులను నేరుగా ఆసుపత్రులకు గాని 108 అందుబాటులో ఉండే ప్రదేశానికి తీసుకువస్తాయి. గర్భిణులకు ఫీడర్ అంబులెన్స్‌లో సుఖ ప్రసవం అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్‌లు అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్‌లు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పటికే 15 నిర్వహిస్తున్నాం. మరో 15 కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది. కొత్తవి వచ్చిన వెంటనే సేవలు ప్రారంభిస్తాం. బైక్ అంబులెన్స్‌లు సకాలం లో సంబంధిత పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో రోగులను చేర్చడానికి ఉపయోగకరంగా ఉంటాయి. –ఈఎన్‌వీ నరేష్కుమార్, డిప్యూటీ డీఎఅండ్‌హెచ్‌వో మాలాంటి మారుమూల గిరిజనులకు ఉపయోగం మాలాంటి మారుమూల గిరిజన గ్రామాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గర్భిణులకు పురిటి నొప్పులు వంటివి వచ్చినపుడు ఏదో ఒక అంబులెన్స్ రావాలని ఫోన్లు చేస్తుంటాం. వాటి రాక కోసం ఎదురు చూస్తుంటాం. వాటికి ముందే బైక్ అంబులెన్స్‌లు వస్తే సకాలంలో వైద్యం అందుతుంది. –ఎస్.రజిని, కోసిమానుగూడ -
కంటి ఆపరేషన్లు ఎందుకు వికటించాయి?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు వికటించిన అంశంపై మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తీవ్రంగా స్పందించింది. ఆ çఘటనకు సంబంధించి వివరణ కోరుతూ వైద్య ఆరోగ్యశాఖకు నోటీసులు జారీచేసింది. ఆపరేషన్లు వికటించడంలో బాధ్యత ఎవరిది? ఆస్పత్రిలో ఎక్కడ లోపం జరిగింది? అందులో ప్రభుత్వ బాధ్యత ఎంత? వైద్యుల నిర్లక్ష్యం ఉందా? వంటి అంశాలపై ప్రశ్నించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. బాధితుల పరిస్థితెలా ఉంది? వారికెలాంటి చికిత్స అందిస్తున్నారు? వంటి వివరాలనూ పంపాలని ఆదేశించి నట్లు తెలిసింది. ఇటీవల వరంగల్ జయ ఆస్పత్రిలో 17 మందికి కంటి ఆపరేషన్లు వికటించిన సంగతి తెలిసిందే. వారందరినీ హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అందులో 13 మందిని డిశ్చార్జి చేయగా.. మిగిలిన నలుగురికి చికిత్స జరుగుతోంది. ఆస్పత్రిదే బాధ్యత: కంటి ఆపరేషన్లు వికటించిన çఘటనలో వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రిదే బాధ్య తని వైద్యారోగ్యశాఖ నిర్ధారణకు వచ్చింది. దీన్నే హెచ్చార్సీకి విన్నవించాలని నిర్ణయించింది. హెచ్చార్సీకి వివరిస్తూ సమగ్ర నివేదికను ఆ శాఖ తయారు చేసింది. ఆపరేషన్ చేసిన వైద్యులూ బాధ్యులేనని స్పష్టం చేసింది. ఆపరేషన్ థియేటర్‌ను ప్రొటోకాల్ ప్రకారం నిర్వహించకపోవడం, రోగులకు శస్త్రచికిత్స సమయంలో నిర్లక్ష్యం కనిపించిందని వివరించింది. అవి కంటి వెలుగు కింద చేసిన ఆపరేషన్లు కావని హెచ్చార్సీకి విన్నవించనుంది. తద్వారా కంటి వెలుగు పథకంపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూడాలన్నదే సర్కారు ఉద్దేశం. ఆస్పత్రి సీజ్..? ఘటన జరిగిన వెంటనే తాము ఉన్నతస్థాయి వైద్య నిపుణుల బృందాన్ని వరంగల్‌కు పంపినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెచ్చార్సీకి పంపే నివేదికలో ప్రస్తావించింది. ఆస్పత్రిదే బాధ్యతగా నిర్ధారణకు వచ్చామని సర్కారు వెల్లడించింది. దీంతో ఆస్పత్రిపైనా, వైద్యం చేసిన డాక్టర్లపైనా చర్యలు తీసుకుంటామని విన్నవించేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. వైద్య బృందం సిఫార్సుల మేరకు ఆస్పత్రి లైసెన్సు రద్దు చేయడమా? లేదా ఆస్పత్రిని సీజ్ చేయడమా? లేదా ఆస్ప త్రిలో కంటి వైద్య విభాగాన్ని సీజ్ చేయడమా అన్నది పరిశీలన చేస్తున్నట్లు హెచ్చార్సీకి ఇచ్చే వివరణలో తెలిపింది. అలాగే వైద్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
నా చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలి
సాక్షి, అమరావతి: ఉద్యోగులు సమస్యలపై కోర్టుకెళ్లడం చూశాం.. భూ తగాదాల విషయంలో కోర్టును ఆశ్రయించిన వారినీ చూశాం.. కానీ ఓ అరుదైన వ్యాధి బాధితుడు తనకు ప్రభుత్వం వైద్య చికిత్స అందించేలా ఆదేశించాలంటూ ఇటీవల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. బాధితుడికి అందించే వైద్యం అత్యంత ఖరీదైనది కావడం, చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వెళితే సదుపాయాలు లేకపోవడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. విజయనగరం జిల్లా నల్లబిల్లికి చెందిన ఓ అరుదైన వ్యాధిగ్రస్థుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులను బాధ్యులుగా పేర్కొంటూ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అరుదైన వ్యాధితో అవస్థలు కోర్టును ఆశ్రయించిన బాధితుడు కొన్నేళ్లుగా ‘గాచర్స్’ (ఎంజైమ్ లోపంతో పుట్టడం)తో బాధపడుతున్నాడు. ఇలాంటి వ్యాధిగ్రస్థులు 50 లక్షల మందిలో ఒకరు కూడా ఉండరు. కాలేయం, మూత్రపిండాల మార్పిడి తరహాలోనే ఈ జబ్బుకు ఎంజైమ్ మార్పిడి చేయాలి. లేదంటే ఖరీదైన మందులు వాడాలి. బాధితుడు విజయనగరం జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదించగా అంత ఖరీదైన మందులు తమ వద్ద లేవని చెప్పారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేక బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. చికిత్స ఖర్చు ఏటా కోటి రూపాయలు... హైకోర్టు ఆదేశాలతో సర్కారు దీనిపై నివేదిక రూపొందించింది. ఇది జన్యుపరమైన వ్యాధి అని, గ్లూకోసెరిబ్రోసైడస్ ఎంజైము లోపంతో ఈ వ్యాధి సోకడం వల్ల పలు అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు నిర్ధారించారు. దీనికి చికిత్స కోసం ఏటా కోటి రూపాయలకు పైగా వ్యయం అవుతుందని తేల్చారు. దీనికోసం వాడే ఖరీదైన సెరిటైజం ఇంజెక్షన్ దేశంలో అందుబాటులో లేదు. 400 యూనిట్లు ఉన్న ఈ ఇంజెక్షన్ వైల్ (బాటిల్) ధర రూ.1,10,000 ఉంటుంది. వ్యక్తి బరువును బట్టి కిలోకు 60 యూనిట్లు (50 కిలోలు ఉంటే 3000 యూనిట్లు) చొప్పున వాడాలని వైద్యులు తెలిపారు. భారీ వ్యయంపై సర్కారు తర్జనభర్జన చికిత్సకు ఏటా కోటి రూపాయలకుపైనే వ్యయం కానుండడంతో బాధితుడికి వైద్యమందించేందుకు ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఓ పేషెంట్‌కు ఇంత వ్యయంతో వైద్యం అందించడం కష్టమని అభిప్రాయపడుతోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పలువురు స్పెషలిస్టుల అభిప్రాయాలు సేకరించారు. దేశంలో ఈ వైద్యం అందుబాటులో లేనందున తామేమీ చేయలేమని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించనున్నట్లు ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. బాధితుడు ప్రస్తుతం విజయనగరంలో ఉంటున్నాడు. కింగ్‌జార్జి ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరితే అందుబాటులో ఉన్న వైద్యం అందించేందుకు తమకు అభ్యంతరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యాధి లక్షణాలు ఇలా... –గాచర్స్ వ్యాధినే గ్లూకోసెరిబ్రోసైడస్ అని కూడా అంటారు –ఎంజైము లోపం వల్ల కాలేయం పెరుగుతూ ఉంటుంది –ప్లేట్లెట్స్ ఉండాల్సిన మోతాదు కంటే తక్కువగా ఉంటాయి –ఎర్రరక్త కణాలను గాచర్స్ వ్యాధి ధ్వంసం చేస్తూ ఉంటుంది –గాయమైతే రక్తం గడ్డకట్టకుండా స్రవిస్తూనే ఉంటుంది –గాచర్స్ కణాలు ఎముకల్లో మూలుగను కూడా పీల్చేస్తూ ఉంటాయి –ఎర్రరక్త కణాలు తక్కువ కావడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది –ఇనుప ధాతువు మోతాదు రోజు రోజుకూ పడిపోతూ ఉంటుంది –రక్తహీనత సమస్య ఉత్పన్నమవుతుంది –ఊపిరితిత్తుల సమస్యతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది –ఎముకలు, కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయి –ఈ వ్యాధిని బెటా–గ్లూకోసైడస్ లుకోసైట్ (బీజీఎల్) అనే రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చు. -
3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. కంటి వెలుగు కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 34.08 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 3.77 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సిన అవసరాన్ని వైద్యులు నిర్ధారించారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. అందులో అత్యధికంగా 2.42 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయాల్సిన అవసరముందన్నారు. 16,265 మందికి కరోనా, 68,788 మందికి ఇతరత్రా కంటి శస్త్రచికిత్సలు చేయాలని నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే అత్యధికంగా 41 వేల మందికి ఆపరేషన్లు చేయాలని గుర్తించారు. అంచనాలను మించి..: కంటి వెలుగుకింద రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మందికి మాత్రమే ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్యారోగ్యశాఖ మొదట్లో అంచనా వేయగా ఇప్పుడు పరిస్థితి మారింది. అంచనాలకు మించి ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మొదటి అంచనాలు కాస్తా నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. ఈ కార్యక్రమం ఆరు నెలలపాటు సుదీర్ఘంగా నిర్వహిస్తారు. ఒక అంచనా ప్రకారం కోటిన్నర మంది ప్రజలు కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకుంటారని భావిస్తున్నారు. నాలు గు రెట్లు ఆపరేషన్లు పెరిగే అవకాశమున్నందున ఆ మేరకు ఆపరేషన్లు చేసే ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పటివరకు 70 ఆసుపత్రులకు అనుమతిచ్చారు. అదనంగా మరో 41 ఆసుపత్రులను గుర్తించారు. ఇలా మొత్తం 111 ఆసుపత్రుల్లో కంటి ఆపరేషన్లు చేస్తారు. వారందరికీ ఆయా ఆసుపత్రుల్లో ఆప రేషన్లు చేయాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. 60 రకాల ఆపరేషన్లు ఉచితంగా.. కంటి వెలుగు కింద 60 రకాల ఆపరేషన్లను ఉచితంగా చేస్తారు. ఆరోగ్యశ్రీలో కేవలం 25 వరకు మాత్రమే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుంటే, ఇప్పుడు ‘కంటి వెలుగు’లో 60 వరకు చేస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అంటే కంటికి సంబంధించిన అన్ని ఆపరేషన్లు ఇందులోనే కవర్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఒక్కో కంటి ఆపరేషన్‌కు కనిష్టంగా రూ.2 వేలు, గరిష్టంగా రూ.35 వేల వరకు ప్రభుత్వం సంబంధిత ఆసుపత్రికి చెల్లిస్తుంది. కంటి పరీక్షలు, ఆపరేషన్లు ఉచితంగా చేసే పరిస్థితి రావడం తో రాష్ట్రంలో ప్రైవేటు కంటి ఆసుపత్రులు రోగులు లేక వెలవెల పోతున్నాయి. మరోవైపు కంటి అద్దాల దుకాణాలకు కూడా గిరాకీ తగ్గినట్లు చెబుతున్నారు. -
పేదోడి ఆరోగ్యంతో ప్రైవేటు వ్యాపారం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 7,683 ఆరోగ్య ఉప కేంద్రాల(సబ్ సెంటర్స్)ను టెలిమెడిసిన్ పేరుతో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. అతి త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 26 సేవలను ప్రైవేట్‌పరం చేసి ఏటా రూ.2 వేల కోట్లకు పైగా కాంట్రాక్టు సంస్థలకు పంచి పెడుతున్న సర్కారు తాజాగా సబ్సెంటర్లను సైతం అప్పగించడం ద్వారా ఏటా మరో రూ.276.58 కోట్లు వ్యయం చేసేందుకు సిద్ధమైంది. టెలిమెడిసిన్ కింద పట్టణాల్లో పేదల కోసం ఇప్పటికే 222 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆర్నెళ్లుగా వీటికి బిల్లులు కూడా సరిగా చెల్లించడం లేదు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టులు చూడటం లేదని ఫిర్యాదులు వచ్చాయి. మౌలిక వసతులున్న చోటే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లోని సబ్సెంటర్లలో టెలిమెడిసిన్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. టెలిమెడిసిన్ కింద ఒక్కో ఆరోగ్య కేంద్రానికి నెలకు రూ.4.08 లక్షలు చెల్లిస్తున్నా పర్యవేక్షణ లేదు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లే లేకపోయినా బిల్లులు చెల్లిస్తున్నారు. చంద్రన్న సంచార చికిత్స బాధ్యతలు నిర్వహిస్తున్న పిరమిల్ సంస్థ ఒక్క పేషెంట్ వచ్చినా ఆరుగురి ఆధార్ కార్డులు తీసుకుని వైద్యం చేసినట్టు చూపిస్తున్నారు. మండలానికి ఒకటి కూడా లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లను నియమించకుండా సబ్‌సెంటర్లకు ఎలా నిర్వహిస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ ఆరోగ్యమిషన్ / ప్రపంచ బ్యాంకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌కు పందేరం చేస్తోందని పేర్కొంటున్నారు. 20 సెంటర్లకు ఇంటర్నెట్ లేదు.. ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల కింద ఒక్కో కేంద్రానికి నెలకు రూ.30 వేల వరకూ వ్యయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు రుణం కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సబ్సెంటర్లలో డాక్టర్లు ఉండనందున టెలిమెడిసిన్ యంత్రం ద్వారా రోగికి సూచనలు, సలహాలు అందచేస్తారు. రోగి వివరాలన్నీ ఎలక్ట్రానిక్ డేటాలో రికార్డు చేస్తారు. అయితే 20 సబ్‌సెంటర్లకు ఇప్పటివరకూ ఇంటర్నెట్ కనెక్షన్లే లేకపోవడం గమనార్హం. ఏజెన్సీల్లో డాక్టర్లే లేరు.. గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరు. 80% మంది కాంట్రాక్టు వైద్యులే పని చేస్తున్నారు. తమను క్రమబద్ధీకరించాలని వారు విన్నవిస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. మరోవైపు సబ్‌సెంటర్లకు సొంత భవనాలే లేవు. ఈ అంశాలను పట్టించుకోకుండా టెలిమెడిసిన్ పేరుతో కోట్లు కుమ్మరించడం దుబారాకు పరాకాష్టని నిపుణులు అంటున్నారు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో సేవలు ఇవీ - అంటువ్యాధులు ప్రబలినప్పుడు అవగాహన కల్పించడం - మాతాశిశు సంరక్షణపై సూచనలు ఇవ్వడం - జీవన శైలి వ్యాధులను గుర్తించి చికిత్సకు సహకరించడం - హెచ్ఐవీ బాధితులకు మందులు ఇప్పించడం - కుష్టు, అంధత్వ నివారణ లాంటి జాతీయ కార్యక్రమాల అమలు - వ్యాధి నిరోధకత, వ్యాధులపై అవగాహన కల్పించడం - సబ్‌సెంటర్ పరిధిలో గర్భిణులను గుర్తించి ప్రతినెలా పరీక్షలు చేయించడం తమిళనాడులో సర్కారు నిర్వహణలోనే.. తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక వైద్యం అమలు తీరు అద్భుతంగా ఉందని టీడీపీ సర్కారుకు అధికారులు పలుదఫాలు నివేదిక ఇచ్చారు. రాజస్థాన్‌లో సైతం ప్రభుత్వమే నిర్వహిస్తోందని నివేదించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని సుమారు 140 గ్రామాలకు చెందిన ప్రజలు వైద్యం కోసం తమిళనాడు పీహెచ్‌సీలకే వెళుతుండటం గమనార్హం. -
రెండువేలైతే కుదరదు!
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కింద క్యాటరాక్ట్ ఆపరేషన్లకు ప్రభుత్వమిచ్చే సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేటు ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి. ఒ క్కో క్యాటరాక్ట్ ఆపరేషన్‌కు రూ. 2వేలు ఇస్తుండటంతో గిట్టుబాటు కావడంలేద ని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీం తో పలుచోట్ల ఆపరేషన్లు ఆలస్యం అవుతున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఏం చేయాలో అర్థంగాక అధికారులు తల పట్టుకుంటున్నారు. 11 శాతం మందికి.. ప్రభుత్వం గత నెల 15న ప్రారంభిం చిన కంటి వెలుగు కార్యక్రమంలో సోమ వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 22.13 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9.52 లక్షల మంది పురుషులు, 12.60 లక్షల మంది స్త్రీలున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన కంటి పరీక్షల అనంతరం 4.26 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. మరో 5.13 లక్షల మందికి ఇతర దృష్టిలోపం కారణంగా సంబంధిత అద్దాలివ్వాలని నిర్ణయించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 11 శాతం మందికి క్యాటరాక్ట్ అవసరమని నిర్ధారించినట్లు సమాచారం. మరో 4 శాతం మందికి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. పెరుగుతున్న ఆపరేషన్లు కంటి వెలుగు ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 3 లక్షల మందికే ఆపరేషన్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ పరిస్థితి చూస్తుంటే 12 లక్షల మందికి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. దీంతో ఆపరేషన్లు చేసే ఆస్పత్రుల సంఖ్యనూ పెంచారు. ఇప్పటివరకు 70 ఆస్పత్రులకు అనుమతివ్వగా.. మరో 41 ఆస్పత్రులను గుర్తించారు. వీరి ఆపరేషన్లకు కనీసం ఏడాదిన్నర పడుతుందని వైద్యారోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీలో 25 వరకే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుండగా కంటి వెలుగులో 60 వరకు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో కంటి ఆపరేషన్‌కు కనిష్టంగా రూ. 2 వేలు, గరిష్టంగా రూ. 35 వేల వరకు సంబంధిత ఆస్పత్రికి ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏదైనా ఆస్పత్రి అంతకు మించి వసూలు చేస్తే జాబితా నుంచి ఆస్పత్రిని తీసేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. క్యాటరాక్ట్‌వే ఎక్కువ కంటి ఆపరేషన్లలో ఎక్కువగా క్యాటరాక్ట్‌వే ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో క్యాటరాక్ట్ ఆపరేషన్ల ధర లేకపోవడంతో ఆపరేషన్‌కు రూ. 2,000లను ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇతర ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ ధరల ప్రకారం ఇస్తోంది. అయితే కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్‌భవలో క్యాటరాక్ట్‌కు రూ. 6 వేలు ఇస్తున్నారని.. ఇక్కడ కనీసం రూ. 5,000 అయినా ఇవ్వాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. లేదంటే మున్ముందు ఆపరేషన్లను నిలిపేసే ప్రమాదముందని కొన్ని యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. -
నిమ్స్‌లో మరణ మృదంగం
హైదరాబాద్: ఏపీలోని కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువుల మరణాలు పెరుగుతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన విషయం మరువక ముందే తెలంగాణలోని నిమ్స్ వైద్యశాలలో 19 మంది మరణించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నిమ్స్‌లో వైద్యుల ఆందోళన నేపథ్యంలో సోమవారం 10 మంది, మంగళవారం 9 మంది మరణించారు. అవినీతి ఆరోపణలున్న ఆర్.వి.కుమార్‌ను నిమ్స్‌కు నూతన డీన్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 8 నుంచి రెసిడెంట్ వైద్యులు, వైద్య బోధకులు విధుల్ని బహిష్కరించి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 2 రోజుల్లోనే 19 మంది మరణించారు. ఇక బుధవారం నాటి మృత్యు గణాంకాలు నిమ్స్ రికార్డుల్లోకి ఎక్కలేదు. లిఖితపూర్వక హామీకి డిమాండ్.. ప్రభుత్వం ముందస్తు ఎన్నికల హడావుడిలో పడిపోవడంతో వైద్యుల సమ్మె గురించి పట్టించుకునే నాథుడు లేకపోయాడు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకారుల బృందం బుధవారం మంత్రి లక్ష్మారెడ్డిని కలసి వినతిపత్రం అందించిం ది. మంత్రితోపాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సుశీల్ శర్మను కలసి తమ సమస్యల సాధన కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే సమస్యల్ని పరిష్కరిస్తామని వారు మౌఖిక హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని వైద్యులు తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని పట్టుబట్టగా.. అందుకు వారు నిరాకరించారు. విదేశీ పర్యటన ఏర్పాట్లలో బిజీ.. నిమ్స్‌లో ఈ విధమైన దయనీయ పరిస్థితులు నెలకొంటే.. నిమ్స్ డైరెక్టర్ గురువారం (13న) విదేశీ పర్యటన ఏర్పాట్ల హడావుడిలో ఉన్నారు. గెస్ట్ లెక్చర్ ఇచ్చే నిమిత్తం అమెరికా వెళ్తున్న ఆయన ఈ నెల 18న వస్తారు. ఈలోగా వైద్యుల ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నాలు చేసే వారు ఉండకపోవచ్చని, ఇదే పరిస్థితి కొనసాగితే రోగుల పరిస్థితి దారుణం అవుతుందని రోగుల బంధువులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ పర్యవేక్షణ కీలకం.. ఆపద్ధర్మ పాలన ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య అంశాలపై గవర్నర్ పర్యవేక్షణ చాలా కీలకం అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గవర్నర్ కూడా గతంలో మాదిరిగానే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దలకు, మంత్రి వర్గానికి వదిలేస్తే.. ఇంతవరకూ ఉన్నట్టుగానే ప్రభుత్వమూ తమకే సంబంధం లేదన్నట్లుగా ఉన్న పక్షంలో హైకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని రోగులు చెబుతున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లలో బిజీ.. నిమ్స్‌లో మరణ మృదంగం మోగుతుంటే ఏ మాత్రం పట్టని పాలక పెద్దలు ప్రారంభోత్సవాలకు సిద్ధం అవుతున్నారు. నిమ్స్‌లో గురువారం కేన్సర్ వైద్య విభాగం రెండో అంతస్తు ప్రారంభోత్సవానికి మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్ హాజరుకానున్నారు. వీరి రాక సందర్భంగా ఏర్పాట్లు చేయడంలో నిమ్స్ అధికారులు నిమగ్నమయ్యారు.