AP CM YS Jagan Review Meeting on Medical Health Department - Sakshi
Sakshi News home page

ఎక్కడా రాజీ పడొద్దు.. ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి ఏపీ ఆదర్శం కావాలి: సీఎం వైఎస్‌ జగన్‌

Published Fri, Jan 27 2023 2:27 PM | Last Updated on Fri, Jan 27 2023 6:20 PM

AP CM YS Jagan Review Medical Health Department Jan 2023 Updates - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని, ఏపీ సీఎస్‌ జవహార్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రజారోగ్యానికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఏపీలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌ అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే.. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలన్నారు. మార్చి 1వ తేదీ నుంచే.. గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

అప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్‌ నివారణా పరికరాలు, చికిత్సలతోపాటు, కాథ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా.. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతిగ్రామంలో క్లినిక్‌కు నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్‌ వెళ్తారని, జనాభా 4వేలు దాటి ఉంటే మూడోసారి కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.

సీఎం జగన్ స్పందిస్తూ.. అనుకున్నట్లు మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పూర్తి స్థాయిలో ప్రారంభించాలి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన కూడా అదే రోజు నుంచి ప్రారంభం అవుతుంది. దీనివల్ల ఆస్పత్రుల పనితీరుపై వారి వైపునుంచి కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే వారి నుంచి కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని వాటిని కూడా పరిష్కరించే చర్యలు చేపట్టాలి.  ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. 

అలాగే.. మార్చి 1వ తేదీ నుంచి కూడా.. గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్ట్‌ అందించాలన్నారు సీఎం జగన్‌. ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్‌ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. డబ్ల్యూహెచ్‌ఓ లేదంటే జీఎంపీ ఆధీకృత మందులు మాత్రమే ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాలను పటిష్టంగా  అమలు చేయాలి. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడది. ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలి అని ఆకాక్షించారు సీఎం వైఎస్‌ జగన్‌. 

► వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న సిబ్బందిని సంపూర్ణస్థాయిలో ఉపయోగించుకోవాలి. గ్రామ సచివాలయ స్థాయిలోనే ఎనీమియా లాంటి కేసులను గుర్తించి వారి ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే.. ఇప్పటికే ఎనిమీయా కేసులపై సర్వే చేయించామని అధికారులు బదులిచ్చారు.  వీరిలో రక్తహీనతను నివారించడానికి వైద్య పరంగా, పౌష్టికాహారం పరంగా అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. వైద్యారోగ్యశాఖ – స్త్రీ శిశుసంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని, డేటా అనుసంధానత ఉండాలన్న ఆయన.. స్కూల్స్, హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాలు అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలన్నారు.

విలేజ్ క్లినిక్స్‌ - ఎస్‌ఓపీ    
విలేజ్‌ క్లినిక్స్‌ ఎస్‌ఓపీలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం తదితర అంశాలను గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు చేర్చామని అధికారులు తెలిపారు. దానికి స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బంది నుంచి సంబంధిత సమస్యలను నివేదించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలని సూచించారు. మండలస్థాయి అధికారులు, జేసీ, కలెక్టర్‌ వీటిపై పర్యవేక్షణ చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, సమతుల్య ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని, 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రతిరోజూ ఈ అంశాలపై కూడా సమీక్షించాలని, కలెక్టర్లు కూడా నిరంతర పర్యవేక్షణ జరపాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బంది అవుట్‌ రీచ్‌ కార్యక్రమం నిర్వహించాలి. సిబ్బంది, ప్రతి కుటుంబాన్నీ కలుసుకుని విలేజ్‌ క్లినిక్స్‌ సేవలను వివరించాలి. తాము అందుబాటులో ఉంటున్న తీరు, అందుతున్న సేవలపై ప్రతికుటుంబానికీ వారి ద్వారా వివరాలు అందాలి. గ్రామ సచివాలయాల సిబ్బంది తరహాలోనే ఈ అవుట్‌ రీచ్‌ కార్యక్రమం నిర్వహించాలి. హైరిస్క్‌గా గుర్తించిన వారిని, ప్రసవం కోసం ముందస్తుగానే మంచి ఆస్పత్రులకు తరలించాలని సీఎం జగన్‌.. అధికారులకు సూచించారు. దీనికి స్పందించిన అధికారులు ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఎక్కడా రాజీ పడొద్దు
గుండెజబ్బులు, క్యాన్సర్, బీపీ, మధుమేహం లాంటి ఎన్సీడీ (నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌) నివారణ, చికిత్సలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. రక్తపోటు, మధుమేహం లాంటి ఎన్సీడీ వ్యాధులతో బాధపడే వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి. క్రమం తప్పకుండా అవుట్‌ రీచ్‌ ప్రోగ్రాం ద్వారా వీరిని కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించాలి. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధపెడుతున్నాం. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిని నివారించడానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చుపెడుతున్నాం​. అక్కడి సమస్యకు శాశ్వతంగా మన ప్రభుత్వం పరిష్కారాలు చూపుతోంది. అలాగే పాలకొండకు కూడా మరో సుమారు రూ.265 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ మరియు ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. దానికి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని నియమించాలి. ఎక్కడా రాజీ పడొద్దు అని సీఎం జగన్‌.. అధికారులను ఆదేశించారు. దానికి స్పందించిన అధికారులు.. తాగునీటి పథకం, ఆస్పత్రి ఈ రెండు కూడా మార్చికల్లా  పూర్తవుతాయని వివరించారు. అలాగే.. రాష్ట్రంలో క్యాన్సర్‌ వ్యాధిని ముందస్తుగానే గుర్తించి వారికి తగిన వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని, వైద్య సిబ్బందికి స్క్రీనింగ్, చికిత్సలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు, సీఎం జగన్‌కు వివరించారు.

ప్రతీ బోధనాసుపత్రిలో కూడా క్యాన్సర్‌ నివారణా పరికరాలు, చికిత్సలు ఉండాలి. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీల్లో కూడా ఈ పరికరాలు, చికిత్సలు ఉండాలి. ప్రతి బోధనాసుపత్రిలోనూ గుండెజబ్బుల చికిత్సా కేంద్రాలు ఉండాలి. అన్ని చోట్లా క్యాథ్‌ ల్యాబ్స్‌ పెట్టాలి. నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ కొత్త మెడికల్‌ కాలేజీల్లోనూ ఇవి ఏర్పాటు కావాలి. ఈ సౌకర్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా క్యాన్సర్‌, గుండెజబ్బులకు సంబంధించి మరిన్ని పీజీ సీట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలోనే సరిపడా వైద్య నిపుణులు తయారవుతారని సీఎం వైఎస్‌ జగన్‌.. అధికారులతో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: తెలుగు వారి హృద‌యాల్లో ఆమె చెర‌గని ముద్ర‌ వేసుకున్నారు: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement