
పొడగరి గురించి పోలీసుల ఆరా
తన వద్దకు పిలిపించుకుని వివరాలు కనుక్కున్న ఎస్పీ
రాజాం: శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిళ్లానికి చెందిన పొడగరి ఇజ్జాడ షణ్ముఖరావు(24)గురించి పోలీసులు ఆరా తీశారు. 8 అడుగుల 3 అంగుళాల ఎత్తున్న ఈ యువకుడి పరిస్థితిపై సోమవారం సాక్షి మెయిన్ ఎడిషన్‌లో ‘అబ్బో..ఎంతెత్తున్నాడో..!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి స్పందించి ఆరా తీశారు. షణ్ముఖరావును తన వద్దకు తీసుకురావాలని సంతకవిటి ఎస్‌ఐ ఎస్.చిరంజీవిని ఆదేశించడంతో రేగిడి మండలం సంకిలి పారిస్ చక్కెర కర్మాగారం వద్దకు వచ్చిన ఎస్పీ ఎదుటకు తీసుకెళ్లారు.
తన పెరుగుదలతో పాటు ఆరోగ్యం, చదువు గురించి ఎస్పీ వాకబు చేశారని, ఎత్తు, బరువు వివరాలు సేకరించినట్టు షణ్ముఖరావు ‘సాక్షి’కి తెలిపారు. మరోసారి పిలుస్తామని, రావాలని ఎస్పీ చెప్పారన్నారు. ఈ పొడగరి గురించి ‘సాక్షి’లో కథనం రావడంతో వివిధ చానళ్ల ప్రతినిధులు బిళ్లానికి క్యూకట్టారు. వైద్య శాఖకు చెందిన అధికారులు కూడా ఇతని పెరుగుదలపై ఆరా తీశారు.