వైద్య ఆరోగ్య శాఖకు ఉన్నత విద్యా మండలి లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలను జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ద్వారా చేపడతారా లేదా తెలంగాణ ఎంసెట్ ద్వారా చేపడతారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి మంగళవారం లేఖ రాసింది. ఈ నెల 27న ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో ఆలోగా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరింది. ఆయుష్ పరిధిలోని ఆయుర్వేద (బీఏఎంఎస్), హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్), నేచురోపతి, యోగా కోర్సుల్లో ప్రవేశాలను నీట్ ద్వారా చేపడితే ఎంసెట్‌లో వాటిని తొలగించి అగ్రికల్చర్ బీఎస్సీ, వెటర్నరీ, బీఫార్మా తదితర కోర్సులకే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని లేఖలో ఉన్నత విద్యా మండలి పేర్కొంది.
2017–18 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 7న నీట్ నిర్వహించేందుకు సీబీఎస్‌ఈ నోటిఫికేషన్ జారీ చేసిందని, కానీ అందులో ఈ కోర్సులు లేవని గుర్తుచేసింది. అయితే ఆయుష్ ప్రవేశాలనూ నీట్ ద్వారానే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం గత నెల 25న రాష్ట్రాలకు లేఖ రాసిందని వివరించింది. ఈ నేపథ్యంలో నీట్ పరిధిలోకి తెచ్చే కోర్సులపై సీబీఎస్‌ఈ నుంచి ఉన్న ఆదేశాలేమిటి... ఎంసెట్ పరిధి లోంచి వాటిని తొలగించాలా వద్దా... ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహించా లా అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంది.
యునానిపై మరింత స్పష్టత అవసరం
యునాని కోర్సులో ప్రవేశాలకు ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తోంది. ఇంటర్‌లో ఉర్దూ ద్వితీయ భాషగా చదువు కున్న వారే దానికి అర్హులు కావడంతో ప్రత్యేక పరీక్ష ద్వారానే యునానిలోని 175 సీట్లను భర్తీ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో యునానిని నీట్‌లో చేరుస్తారా లేదా అనే అంశంపైనా మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలను నీట్ నీట్ నోటిఫికేషన్‌లో చేర్చడమే మిగిలింది. సీబీఎస్‌ఈ ఈ దిశగా చర్యలు చేపడితే గందరగోళం ఉండదు.
ఆయుష్ ప్రవేశాలెలా?
Published Wed, Feb 22 2017 2:54 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement