పేదోడి ఆరోగ్యంతో ప్రైవేటు వ్యాపారం | Private Business with Poor People Health | Sakshi
Sakshi News home page

పేదోడి ఆరోగ్యంతో ప్రైవేటు వ్యాపారం

Published Sat, Sep 15 2018 4:11 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

Private Business with Poor People Health - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 7,683 ఆరోగ్య ఉప కేంద్రాల(సబ్‌ సెంటర్స్‌)ను టెలిమెడిసిన్‌ పేరుతో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. అతి త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 26 సేవలను ప్రైవేట్‌పరం చేసి ఏటా రూ.2 వేల కోట్లకు పైగా కాంట్రాక్టు సంస్థలకు పంచి పెడుతున్న సర్కారు తాజాగా సబ్‌సెంటర్లను సైతం అప్పగించడం ద్వారా ఏటా మరో రూ.276.58 కోట్లు వ్యయం చేసేందుకు సిద్ధమైంది. టెలిమెడిసిన్‌ కింద పట్టణాల్లో పేదల కోసం ఇప్పటికే 222 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆర్నెళ్లుగా వీటికి బిల్లులు కూడా సరిగా చెల్లించడం లేదు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టులు చూడటం లేదని ఫిర్యాదులు వచ్చాయి.

మౌలిక వసతులున్న చోటే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లోని సబ్‌సెంటర్లలో టెలిమెడిసిన్‌ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. టెలిమెడిసిన్‌ కింద ఒక్కో ఆరోగ్య కేంద్రానికి నెలకు రూ.4.08 లక్షలు చెల్లిస్తున్నా పర్యవేక్షణ లేదు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లే లేకపోయినా బిల్లులు చెల్లిస్తున్నారు. చంద్రన్న సంచార చికిత్స బాధ్యతలు నిర్వహిస్తున్న పిరమిల్‌ సంస్థ ఒక్క పేషెంట్‌ వచ్చినా ఆరుగురి ఆధార్‌ కార్డులు తీసుకుని వైద్యం చేసినట్టు చూపిస్తున్నారు. మండలానికి ఒకటి కూడా లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లను నియమించకుండా సబ్‌సెంటర్లకు ఎలా నిర్వహిస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ ఆరోగ్యమిషన్‌ / ప్రపంచ బ్యాంకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌కు పందేరం చేస్తోందని పేర్కొంటున్నారు.  

20 సెంటర్లకు ఇంటర్నెట్‌ లేదు..
ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్, ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డుల కింద ఒక్కో కేంద్రానికి నెలకు రూ.30 వేల వరకూ వ్యయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు రుణం కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సబ్‌సెంటర్లలో డాక్టర్లు ఉండనందున టెలిమెడిసిన్‌ యంత్రం ద్వారా రోగికి సూచనలు, సలహాలు అందచేస్తారు. రోగి వివరాలన్నీ ఎలక్ట్రానిక్‌ డేటాలో రికార్డు చేస్తారు. అయితే 20 సబ్‌సెంటర్లకు ఇప్పటివరకూ ఇంటర్నెట్‌ కనెక్షన్లే లేకపోవడం గమనార్హం.

ఏజెన్సీల్లో డాక్టర్లే లేరు..
గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరు. 80% మంది కాంట్రాక్టు వైద్యులే పని చేస్తున్నారు. తమను క్రమబద్ధీకరించాలని వారు విన్నవిస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. మరోవైపు సబ్‌సెంటర్లకు సొంత భవనాలే లేవు. ఈ అంశాలను పట్టించుకోకుండా టెలిమెడిసిన్‌ పేరుతో కోట్లు కుమ్మరించడం దుబారాకు పరాకాష్టని నిపుణులు అంటున్నారు.

ఆరోగ్య ఉపకేంద్రాల్లో సేవలు ఇవీ
- అంటువ్యాధులు ప్రబలినప్పుడు అవగాహన కల్పించడం
మాతాశిశు సంరక్షణపై సూచనలు ఇవ్వడం
జీవన శైలి వ్యాధులను గుర్తించి చికిత్సకు సహకరించడం
హెచ్‌ఐవీ బాధితులకు మందులు ఇప్పించడం
కుష్టు, అంధత్వ నివారణ లాంటి జాతీయ కార్యక్రమాల అమలు
వ్యాధి నిరోధకత, వ్యాధులపై అవగాహన కల్పించడం
సబ్‌సెంటర్‌ పరిధిలో గర్భిణులను గుర్తించి ప్రతినెలా పరీక్షలు చేయించడం

తమిళనాడులో సర్కారు నిర్వహణలోనే..
తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక వైద్యం అమలు తీరు అద్భుతంగా ఉందని టీడీపీ సర్కారుకు అధికారులు పలుదఫాలు నివేదిక ఇచ్చారు. రాజస్థాన్‌లో సైతం ప్రభుత్వమే నిర్వహిస్తోందని నివేదించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని సుమారు 140 గ్రామాలకు చెందిన ప్రజలు వైద్యం కోసం తమిళనాడు పీహెచ్‌సీలకే వెళుతుండటం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement