సరోగసీ వ్యాపారానికి అడ్డుకట్ట | Trade barrier to Sarogasi | Sakshi
Sakshi News home page

సరోగసీ వ్యాపారానికి అడ్డుకట్ట

Published Mon, Feb 20 2017 2:20 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

సరోగసీ వ్యాపారానికి అడ్డుకట్ట - Sakshi

సరోగసీ వ్యాపారానికి అడ్డుకట్ట

కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో సరోగసీ బోర్డు
ఫైలును సిద్ధం చేసిన వైద్యారోగ్యశాఖ
అద్దె గర్భం ఇచ్చే వారికి, సంతానం కోరుకునే వారికి బంధుత్వం తప్పనిసరి
రిజిస్టర్డ్‌ క్లినిక్‌లలో మాత్రమే సరోగసీకి అనుమతి
నిబంధనలు కట్టుదిట్టం.. దుర్వినియోగానికి చెక్‌


సాక్షి, హైదరాబాద్‌: పిల్లలు పుట్టే అవకాశం లేని దంపతులకు వరంగా ఉండాల్సిన సరోగసీ దుర్వినియోగం అవుతుండడంతో.. దానికి అడ్డుకట్ట వేసేలా సరోగసీ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి అనుగుణంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఫైలును సిద్ధం చేసింది. త్వరలోనే సరోగసీ బోర్డు ఏర్పాటు ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారి, న్యాయ శాఖ ప్రతినిధి, పేరెన్నికగన్న మహిళా సంఘానికి చెందిన ప్రతినిధి, ప్రముఖ వైద్యులు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు. సరోగసీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడానికి బోర్డు కృషి చేస్తుంది. తెలంగాణలో దాదాపు 20 వరకు సరోగసీ క్లినిక్‌లు పనిచేస్తున్నాయని అంచనా. అందులో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కానీ వాటిపై వైద్య ఆరోగ్యశాఖకు నియంత్రణ లేకుండా పోయిందనే ఆరోపణలున్నాయి.

మహిళల పేదరికాన్ని అడ్డుపెట్టుకొని..
పిల్లలు పుట్టనివారు, పిల్లలను కనడానికి సమయం కేటాయించలేని కొందరు సెలబ్రిటీలు సరోగసీ పద్ధతిలో తల్లిదండ్రులు అవుతున్నారు. పిల్లలు కలగనివారి కోసం టెస్ట్‌ట్యూబ్‌ బేబీ పద్ధతి ఉన్నా.. అందులో సక్సెస్‌ రేటు తక్కువ కావడంతో సరోగసీ వైపు మొగ్గుతున్నారు. కానీ ఇది తీవ్ర స్థాయిలో దుర్వినియోగానికి గురవుతోంది. పేద మహిళలకు గాలం వేసి సరోగసీ తల్లులుగా వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సరోగసీ విధానం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది.

కేంద్ర చట్టంలోని కీలక అంశాలు..
► వ్యాపారపరమైన సరోగసీపై నిషేధం. సరోగసీ తల్లికి, పిల్లల తల్లిదండ్రులకు మధ్య బీమా, వైద్య ఖర్చులు తప్ప ఇతర ఆర్థిక లావాదేవీలేవీ ఉండకూడదు.
► దేశంలో సరోగసీ ద్వారా బిడ్డను కనాలనుకునేవారు భారతీయులై ఉండాలి. సంతానం కావాలనుకునే దంపతుల వయసు మహిళలైతే 23 నుంచి 50 ఏళ్లు, పురుషులైతే 26 నుంచి 55 ఏళ్లు ఉండాలి. వారికి వివాహమై కనీసం ఐదేళ్లు నిండి ఉండాలి. వారికి అప్పటివరకు ఎటువంటి సంతానం ఉండకూడదు. దత్తత కూడా తీసుకుని ఉండకూడదు.
►  పిల్లలు కలిగే అవకాశం లేదని, సరోగసీ అవసరమని జిల్లా మెడికల్‌ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి.
► సరోగసీ ద్వారా పుట్టే బిడ్డకు సాధారణ పిల్లల్లాగే సర్వహక్కులూ ఉంటాయి.
► సరోగసీ ద్వారా సంతానం కోరుకునేవారికి, అద్దె గర్భం దాల్చేందుకు సిద్ధమయ్యే వారికి మధ్య దగ్గరి బంధుత్వం ఉండాలి.
► అద్దె గర్భం దాల్చే మహిళ వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. ఆమెకు అంతకుముందు సంతానం ఉండాలి. ఆమెకు ఒక్కసారికి మాత్రమే ఆమె అద్దె గర్భం దాల్చడానికి అనుమతిస్తారు. సరోగసీకి ఆమె ఆరోగ్యం సహకరిస్తుందన్న ధ్రువీకరణ పత్రం సైతం తప్పనిసరి.
► సరోగసీ క్లినిక్‌లు తప్పనిసరిగా రిజిస్టరై ఉండాలి. ప్రమాణాల మేరకు సరైన చికిత్స, వసతి, పరికరాలు ఉన్నాయా లేదా అని తనిఖీలు చేశాకే అనుమతివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారం కోసం వాటిని నడపకూడదు.
► సరోగసీ క్లినిక్‌లు సంబంధిత రికార్డులను 25 ఏళ్లపాటు తప్పనిసరిగా దాచిపెట్టాలి.
► సరోగసీ పద్ధతిలో పుట్టిన బిడ్డను అమ్మటం గానీ, విదేశాల వారికి అప్పగించడంగానీ నేరం.

ఎన్నో చిక్కులు.. సందేహాలు
కొందరు విదేశీయులు భారత దేశంలోని పేద మహిళలను సరోగసీ కోసం వినియోగించుకుని పిల్లలను కంటున్నారు. అయితే ఇలా కన్న బిడ్డను తమ దేశానికి తీసుకెళ్లాక సరిగా చూసుకుంటున్నారా, ఎవరికైనా అమ్మేస్తున్నారా? అన్న సందేహాలు ఉన్నాయి. సరోగసీ తల్లి ప్రసవించిన తర్వాత పుట్టిన బిడ్డ అనారోగ్యంతో ఉన్నా, ఏవైనా శారీరక లోపాలు ఉన్నా వదిలేసి పోతున్న సంఘటనలూ జరుగుతున్నాయి. ఇక ఒకే మహిళ పలుమార్లు సరోగసీ విధానంలో గర్భాన్ని మోస్తుండడంతో.. ఆమె ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోంది. పలుమార్లు సరోగసీ తల్లులు 9 నెలలు కడుపులో మోసి, కన్న పిల్లలను ఇవ్వడానికి మానసికంగా సంఘర్షణ పడుతున్నారు. దాంతో న్యాయపరమైన చిక్కులూ వస్తున్నాయి. మరోవైపు దళారులు, పలు సరోగసీ కేంద్రాలు దీనిని ఓ వ్యాపారంలా నిర్వహిస్తున్నాయి. ఒక్కో జంట నుంచి మూడు నాలుగు లక్షలకుపైగా వసూలు చేస్తున్నాయని ఆరోపణలున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement