ఓ నాలుగేళ్ల చిన్నారి..రోజూ మంచి ఆహారమే తినిపిస్తారు కానీ వయసుకు తగిన ఎదుగుదల లేదు..ఆ వయసులోని పిల్లల్లో ఉండే చురుకుదనం లేదు..కంటి చూపు కూడా సరిగా ఉన్నట్టూ లేదు..ఏమిటి సమస్య.. ఉప్పు! అవును ఉప్పే.. అయోడిన్ లేని ఉప్పు..పిల్లలకు ఎదుగుదలకు, వికాసానికి కీలకమైన అయోడిన్ లేని ఉప్పు..
..ఆహారం ద్వారా తగిన అయోడిన్ అందని దేశం మనది. అందువల్లే ఉప్పులో తగిన మోతాదులో అయోడిన్ కలిపి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. తద్వారా అయోడిన్ లోపాన్ని ఎదుర్కొనేలా చర్యలు చేపట్టింది. కానీ తయారీదారుల నిర్లక్ష్యం, కొన్ని కంపెనీల కక్కుర్తి, పలు ప్రాంతాల్లో ఉప్పు తయారు చేసి నేరుగా విక్రయిస్తుండటంతో అయోడిన్ లేని ఉప్పు మార్కెట్లోకి వస్తోంది. మార్కెట్లో విక్రయిస్తున్న ఉప్పులో 30 శాతం వరకు అయోడిన్ ఉండటం లేదని, మరో 20 శాతంలో తక్కువ మోతాదులో ఉందని కేంద్ర ప్రభుత్వ సర్వేలోనే వెల్లడైంది. అయోడిన్ లోపం కారణంగా చిన్నారుల్లో ఎదుగుదల లోపం, బుద్ధి మాంద్యం, పెద్ద వయసు వారిలో థైరాయిడ్ సమస్యలు సమస్యలు తలెత్తుతున్నాయి.
కేంద్రం చర్యలు చేపట్టినా..
దేశంలో అయోడిన్ లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు దశాబ్దాల కిందే చర్యలు చేపట్టింది. దేశంలో ఆహార వినియోగం కోసం విక్రయించే ఉప్పులో తప్పనిసరిగా అయోడిన్ కలిపేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉప్పును విక్రయించే సంస్థలన్నీ అయోడిన్ కలిపి అమ్ముతున్నాయి. అయితే మన దేశంలో సంప్రదాయ పరిస్థితుల కారణంగా ఇప్పటికీ బస్తాలలో లభ్యమయ్యే ముడి ఉప్పును వినియోగిస్తున్నారు. అందులో తగిన మోతాదులో అయోడిన్ ఉండే అవకాశం లేదు. దీంతో పిల్లల్లో అయోడిన్ లోపం తలెత్తుతోంది.
- ఇటీవలి కాలంలో మారిన జీవన శైలి కారణంగా ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఇది కూడా అయోడిన్ లోపానికి కారణమవుతోంది.
- హోటళ్లు, రెస్టారెంట్లు, వీధుల్లో ఆహార పదార్థాలు విక్రయించేవారు తక్కువ ధరకు దొరికే ఉప్పును కొనుగోలు చేస్తుంటారు. అవి ‘అయోడైజ్డ్’కాకపోవడంతో
పిల్లల్లో ఎదుగుదల దెబ్బతింటుంది
పిల్లల ఎదుగుదలలో అయోడిన్ పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా ఐదు నుంచి 13 ఏళ్ల మధ్య వయసు వారికి ఇది చాలా అవసరం. లేకుంటే ఎదుగుదల సరిగా ఉండదు. యుక్త వయసులోనూ అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మహిళల్లో గర్భస్రావం, పురుషుల్లో బుద్ధి మాంద్యం సమస్యలు వస్తాయి. అయోడిన్ ఉప్పును వినియోగిస్తే ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు..
– మాగంటి శేషు మాధవ్, పిల్లలవైద్య నిపుణుడు, వరంగల్
కేంద్ర ప్రభుత్వ సర్వే మేరకు..
దేశంలో అయోడిన్ ఉప్పు వినియోగ కార్యక్రమం ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా నివేదికలు రూపొందిస్తుంది. దేశవ్యాప్తంగా విక్రయించే ఉప్పు శాంపిళ్లను సేకరించి అయోడిన్ శాతాన్ని పరిశీలిస్తుంది. ఇదే సమయంలో చిన్నారుల్లో అయోడిన్ లోపాలపై అధ్యయనం చేస్తుంది. ఈ మేరకు తాజాగా నిర్వహించిన సర్వేలో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలోని చిన్నారుల్లో అయోడిన్ లోపం ఆందోళనకర స్థాయిలో ఉందని తేలింది.
50 శాతం ‘ఉత్త’ఉప్పే!
కేంద్ర ప్రభుత్వ సర్వేలో భాగంగా రాష్ట్రంలో పాత జిల్లాల ప్రాతిపదికన మొత్తం 2,050 ఉప్పు నమూనాలను సేకరించి అయోడిన్ శాతాన్ని పరీక్షించారు. వాటిల్లో 30 శాతం నమూనాల్లో అయోడిన్ ఆనవాళ్లు ఏ మాత్రం లేవని తేలింది. మరో 20 శాతం నమూనాల్లో ఉండాల్సిన మోతాదు కంటే తక్కువగా అయోడిన్ ఉన్నట్లుగా నిర్ధారించారు. అంటే మొత్తంగా 50 శాతం ఉప్పు ప్రమాణాల మేరకు లేదని వెల్లడైంది. అయోడిన్ ఉప్పు వినియోగంపై అవగాహన లేకపోవడంతో ఈ సమస్య నెలకొందని గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో అయోడిన్ లేని ఉప్పు తీసుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉందని తేల్చారు.
లోపిస్తే సమస్యలు ఎన్నో..
అయోడిన్ లోపం వల్ల చిన్నారులలో గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి ఉబ్బడం), హైపోథైరాయిడిజం, కంటి చూపు దెబ్బతినడం, ఎదుగుదల లోపించడం, బుద్ధి మాంద్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. మహిళల్లో అయోడిన్ లోపం కారణంగా గర్భస్రావం జరిగే అవకాశా లు ఎక్కువ.రాష్ట్రంలోని చిన్నారుల్లో గాయిటర్, కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారు తొమ్మిది శాతం వరకు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంత మహిళల్లోనూ అయోడిన్ లోపం ఎక్కువగా ఉందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment